“తపన” ఆధునిక కవిత్వ సంకలనం – ఒక అవలోకన

“The purpose of poetry is to make life complete itself” -Wallace Stevens

జీవితానికి ప్రతిబింబం కవిత్వం. జీవితానికి పర్యాయపదం కవిత్వం అని ఎంతోమంది ఎన్నోరకాల వ్యాఖ్యానాలు చేసినా…ఇప్పటివరకు కవిత్వం గురించి పూర్తిగా ఎవ్వరూ నిర్వచించలేదనేది వాస్తవం. ఇప్పటికీ కవిత్వం అంటే ఒక అనిర్వచనీయమైన అనుభూతిగానో, అనుభవంగానో భావిస్తున్నాం. ఈ “తపన” కవిత్వగేయ సంకలనంలోని కవితల్ని కాదు.. జీవితాల్ని తిరగేస్తే ఇందులోని కవులు ఎంతో లోతైన జీవనానుభవాల్ని తమదైన ప్రత్యేక శైలిలో కవిత్వీకరించారనేది స్పష్టమవుతుంది.
_____________

కవిత్వ సృజనలో అనుభూతి..ప్రధాన అంశమే కానీ అనుభూతిని అక్షరీకరించే క్రమంలో సదరు కవి అనుభవాన్ని అనుభూతితో క్రోడీకరించి కవిత్వ పరిభాషలో ఆవిష్కరించినప్పుడే ఆ కవిత్వం పాఠకుల గుండెల్లో పదికాలాలు నిలబడుతుంది. ఏ కవైనా తన కవిత్వ శక్తితో, నిద్రాణమై ఉన్న సమాజాన్ని మేల్కొల్పి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనే సంఘటిత శక్తిని ప్రజలకిచ్చి వారి న్యాయమైన హక్కుల్ని సాధించుకునే దిశగా వాళ్ళను నడిపించాలంటే ఆ కవి..తనను తాను ఫీనిక్స్ పక్షిలా దహింపచేసుకుని, కొత్త ఆలోచనలను మేళవించి సామాజిక సమస్యలను కవిత్వంలో సృజియించినప్పుడే ఆ కవి సృజియించిన సాహిత్యానికి విశ్వజనీనత (universality) ఉంటుంది.
___________________

వాస్తవానికి కవిత్వంలోని తాత్వికత అందరు పాఠకుల్ని మార్చకున్నా కనీసం కొందరినైనా ఆలోచింపచేసినా ఆ కవిత్వం యొక్క ప్రభావం సమాజం మీద ఉన్నట్లే. The ultimate aim of any art is to change or recreate the society with its artistic expression. ఒక పాట, ఒక కవిత, ఒక కథ అది ఏ కళారూపమైనా కావొచ్చు ఆ కళారూపం సమాజం మీద ఏ విధమైన ప్రభావం చూపుతుందనేది ముఖ్యం.

అందుకే Poet may be mortal but the poetry which is created by the poet is immortal అంటారు. కళాకారులు ఆశాశ్వతం కావొచ్చు కానీ ఆ కళల్ని సృజియించిన కవులు అజరామరం. కవి గొప్పతనం గురించి గుర్రం జాషువా ఇలా అన్నారు.. “రాజు జీవించే రాతివిగ్రహములందు/ సుకవి జీవించె ప్రజల నాల్కలందు”. ఉత్తమ కవిత్వం చదివిన పాఠకుడు తనచుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకొని ఒక ఉదాత్తమైన పౌరునిగా మలుచుకోవడానికి దోహదం చేస్తుంది.

ఎంతోమంది ఉత్తమశ్రేణి కవులకు, కళాకారులకు నిలయమైన జనగామ ప్రాంతం నుంచి వెలువడిన ఈ కవితా సంకలనం తప్పకుండా సాహితీప్రియులను ఆకట్టుకుంటుందనే నా ప్రగాఢ విశ్వాసం. ఈ “తపన” కవితా సంకలనం తిరగేస్తే ఇందులో చోటు సంపాదించుకున్న కవులు కానీ, గేయకవులు కాని తమ అనుభవాలకు సామాజిక తాత్వికతను జోడించి రాసినట్లుగా అర్ధం అవుతుంది.

కవిత్వం కోసం తపించే కవులందరూ రకరకాల విషయాల్ని తమదైన పరిభాషలో కవిత్వీకరించిన తీరు పాఠకుల్ని ఆకట్టుకొని ఆలోచింపచేసేదిగా ఉంది. కవిత్వ శీర్షికలు కూడ వస్తువుకు తగినట్లుగా, విషయ ప్రాధాన్యత కలిగిన కవిత్వం రాశారు. ఇందులో కవులు తమ మాతృమూర్తి గురించి రాసిన అయిదారు కవితలు ఉన్నాయి. ఏ కవైనా తన జీవితకాలంలో ఒక్క కవితైనా తన తల్లి..తనకు అందించిన ప్రేమ గురించి రాయకుండా ఉండడు. అమ్మగురించి రాసిన కవితలలో ఈ కింది వాక్యాలు చూడండి:

‘అమ్మ ఎవరికైనా అమ్మే/ తన రక్తాన్ని చనుబాలు చేసి/ స్తన్యమిచ్చి ఆకలి తీర్చు

అమృతానందమయి/ ఆ అమ్మ శారదమ్మైనా గౌరమ్మైనా /అమ్మా నీ కమ్మనైన పాదాలకు పరిపరివందనాలు’. అమ్మ గురించి ఎంత రాసినా…ముగింపు లేనిదే అమ్మ పంచే ప్రేమ. అందుకే నా ‘అనంతం’ అనే కవితలో నేను ఇలా రాశాను. ఎంతరాసినా పూర్తి కాని కావ్యం

అమ్మంటే అనంతం… (పర్యాయపదం సంపుటి )

నాన్న గురించి రాసిన కవితలు కూడా కవితా హృదయుల్ని కట్టిపడేస్తాయి.. ‘మానాన్న యాదికొస్తుండు’ అనే కవిత నాన్న ప్రేమను హృద్యంగా ఆవిష్కరించిన కవితగా చెప్పుకోవచ్చు.
‘మబ్బుచాటున చంద్రుడిలా/ పువ్వులో మకరందంలా/దాగి ఉన్న నాన్న ప్రేమ/

కనిపించేది ఎప్పుడో కనుక్కునేది ఎవ్వరో’

కష్టాలు, కన్నీళ్లు, బాధలు, భయాలు సంతోషం, దుఖం అనేవి మనిషి రోజువారీ జీవితంలో అనుభవంలోకి వచ్చే భావోద్వేగ అనుభవాలు. అటువంటి సున్నితమైన, హృదయంలో సుళ్ళుతిరిగే భావప్రకంపనల్ని అతి ఒడుపుగా కవిత్వంలో అల్లినతీరు అద్భుతం. ఇక్కడ కవి దుఖాన్ని కూడా చాలా ఆశాజనకంగా కవిత్వీకరించిన తీరు ఆకట్టుకుంటుంది.

“దుఖాన్ని నేను స్వాగతిస్తాను/ దుఃఖంలోంచి వచ్చే /కన్నీటిచుక్కల్తో /ఒక విత్తనం మొలకెత్తవచ్చు”.

సమాజ శ్రేయస్సును కోరి ప్రజల పక్షాన నిలబడ్డ సామాజికవేత్తలనైనా, సాహితీకారులనైనా రాజ్యం నిర్బంధిస్తుందనేది అక్షర సత్యం. అలాంటి కవులు అక్షరాలతో ప్రజల్ని చైతన్యం చేస్తూ అహరహం ఆరాటపడుతుంటారు. అవసరమైతే కొవ్వొత్తుల్లా కరిగిపోతూ సమాజానికి వెలుగునిస్తారు.

‘చీకటి కాలం’ అనే కవితలో కవుల ధిక్కార స్వరాన్ని ఇలా వినిపిస్తున్నాడు ఈ కవి.

“కొత్త ప్రపంచాన్ని కలలు కనడాన్ని/ కటకటాలు ఆపలేవు/తెగిపడిన రెక్కలకు ఊపిరిపోసే అక్షరాలకు/ప్రాణమిచ్చే మునివేళ్ళను/ నిర్భంధాల సంకెళ్ళు ఆపలేవు”.

దళితవాదం, స్త్రీవాదం మైనారిటీ వాదాలతో పాటు బహుజన వాదాన్ని బి.సి.వాదాన్ని వెనుకబడిన కులాల కవులు కులవృత్తుల నేపథ్యంతో తమ తాతతండ్రుల వృత్తిజీవిత పోరాటాల్లోంచి వాళ్ళ కడగండ్లను ఆలోచింపచేసే కవిత్వంతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారనుటలో సందేహం లేదు.

ఈ సంకలనంలోని కవులు కూడా తమవంతు బాధ్యతగా చాలా ఆలోచనాత్మకమైన కవిత్వం రాశారు. పద్మశాలీల బతుకులు, బహుజన బతుకులు బానిస బతుకులౌతున్న వైనాన్ని నూలుపోగు అనే కవితలో ఈ‌ కవి ఎలా బొమ్మకట్టాడో చూడండి.

“పట్టుపురుగునుంచి నూలుపోగును తీసి/

పుట్టినప్పటినుంచి మగ్గానికి బానిసై/

మగ్గ పరికరాలకు ఆసనానివై/ నీ పనే శ్వాసై/నీ జీవితపు యుద్ధానికి చేనేత వస్త్రమై/ ఓ అస్త్రమై/బతుకు పోరాటం చేస్తున్న పద్మశాలీ/ నువ్వు ధైర్యశాలి”.

తెలంగాణ గురించి, స్నేహం, మాయమైపోతున్న మానవత్వం, కరోన మొదలైన ఎన్నో సమాజంలోని మరియు జీవితంలోని పార్శ్వాల్ని తడుముతూ రాసిన కవితలు, గేయాలు జనగామ ప్రాంత సాహిత్యకారులు రాసినప్పటికీ ఈ సాహిత్యం ప్రాంతేతరులకు కూడా ఒక మార్గదర్శకంగా నిలుస్తుందనుటలో సందేహంలేదు.

అందుకు ఈ “తపన” కవితా సంకలనంలో భాగస్వాములైన కవులందరిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

పుడమి తపన పడితేనే
విత్తనం మొలకెత్తేది
మది మథన పడితేనే
నూతన ఆవిష్కరణ జరిగేది
జీవిత లక్ష్యం ఉంటేనేగా
ఉన్నత శిఖరాలను అధిరోహించేది

ఈ “తపన” ను అద్వితీయమైన కవిత్వ సంకలనంగా తీసుకొచ్చేందుకు ప్రధాన బాధ్యులు అందరికీ యోగా గురువైన మా గురువుగారు ఈ గ్రంథానికి ప్రధాన సంపాదకుడు ప్రొ. తాటికొండ వెంకట రాజయ్య గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముందు ముందు మరో సంకలనంతో తెలుగు సాహితీ వినీలాకాశంలో జనగామ కవిత్వ జెండా ఎగరేయాలని ఆశిస్తూ…నాకు ఈ నాలుగు మాటలు రాయటానికి అవకాశం ఇచ్చిన మా గురువు గారికి సదా కృతజ్ఞుడను…

 

 

-ప్రొ. బాణాల శ్రీనివాసరావు
94404 71423

(ఈ “తపన” సంకలనం కోసం ఎంతో తపించి గ్రంథావిష్కరణ చూడకుండానే అకస్మాత్తుగా కన్నుమూసిన సంపాదకుడు డా. తాటికొండ వెంకటరాజయ్య గారికి నివాళిగా…)