పేగు బంధం కన్నా పెంచుకున్న మూగజీవి ప్రేమే మిన్న

1951లో అమెరికన్ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే ‘ద ఓల్డ్ మాన్ అండ్ ద సి’ అనే నవల వ్రాసి, 1952లో ప్రచురించాడు. అది పులిట్జర్ బహుమతిని పొంది ప్రపంచవ్యాప్తంగా పాఠకులను విశేషంగా ఆకర్షించింది.

దాని ప్రేరణతో తెలుగులో డా౹౹ పి.కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ అనే నవల వ్రాశారు. అది 1984లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా ప్రచురించబడి పాఠకులను విశేషంగా ఆకర్షించింది. 1985లో మొదటిసారి పూర్తి నవలగా వెలువడింది.

హెమింగ్వే..సముద్రం నేపథ్యంతోను, కేశవరెడ్డి..అడవి నేపథ్యంతోనూ తమ నవలలు వ్రాశారు. అందులోనూ ఇందులోనూ ప్రధానపాత్ర ఒక్కటే వుంటుంది. ఇదంతా నిన్నటి చరిత్ర అయితే, కరోనా కాలంతో తిని, ఇంట్లో కూర్చోనూ లేక మనుషులతో దూరంగానూ వుండలేక, తనను బాల్యం నుండీ సమ్మోహన పరుస్తూ వస్తున్న తన ప్రాంతలోని లంకమల అడవుల్ని జల్లెడ పట్టినట్టుగా తిరిగాడు వివేక్. ఆ అనుభవాల నేపథ్యంతో యాత్రాకథనాల్ని, కథల్ని, వ్యాసాల్ని విస్తృతంగా వ్రాసిపెట్టుకున్న వాటితో 2024లో ‘లంకమల దారుల్లో’ అనే పుస్తకాన్ని వెలువరించాడు.

ఆ పుస్తకం పాఠకులను ఎంతగా ఆకర్షించిందంటే! తల్లిదండ్రులు పెట్టిన ‘లోమాటి వివేకానంద రెడ్డి’ అనే పేరు కాస్తా ‘వివేక్ లంకమల’ గా స్థిరపడి పోయేటంతగా. అట్లా చిన్న వయసులోనే పెద్ద పేరు సంపాదించుకున్న వివేక్ లంకమల ఈ సంవత్సరం (సెప్టెంబర్, 2025) లో నేరుగా ఈ ‘పొట్టేలు’ నవలను వెలువరించారు. ఈ రెండు రచనల మధ్య తనది ‘వలపటెద్దు’ అనే కథాసంపుటి కూడా వెలువడింది.

ఈ నవలను చదివిన పాఠకులు వివేక్ ని పైన పేర్కొన్న ఇద్దరు విశిష్ట నవలాకారుల సరసన ఉటంకించడాన్ని ఒప్పుకుంటారో లేదో తెలియదుగాని, తను మాత్రం వారి నవలల స్పూర్తితోనే పుట్టి పెరిగిన గ్రామీణ జీవన నేపథ్యంతో, తనదైన కథన శైలితో, ఓ కన్నతల్లిని ప్రధాన పాత్రగా తీసుకుని ఎంతో అద్భుతంగాను, పాఠకులు ఒక్కసారి పుస్తకాన్ని చేతపట్టుకుంటే చివరికంటా విడవకుండా చదివించే జలపాత వేగం పఠనీయతతోను, ఆసక్తిగానూ చదివించే స్వభావంతో వుండడం నిజంగా విశేషమనే చెప్పుకోవాల్సివుంటుంది.

నవల ‘జ్యేష్ట మాసపు పడమటి గాలికి మనుషుల శరీరాలకు పట్టిన చెమట ఆరదు. చెట్ల మీది పండుటాకులు రాలిపడుతుంటాయి. చెదురు మదురుగా వచ్చిపోయే వానలకు అప్పుడే కొమ్మలకు పుట్టుకొచ్చే లే చిగుళ్ళు అల్లాడి పోతుంటాయి’ ఈతరం యువతీ యువకుల్లో దాదాపుగా తెలిసివుండే అవకాశమే లేని ఋతుధర్మ విశ్లేషణతో ఆరంభమవుతుంది. మూడు వాక్యాల్లో ముగిసిపోయే ఈ ఆరంభ పేరాతోనే వివేక్ పాఠకులను రేగడి బంకలా పట్టేసుకుంటాడు.

అటువంటి తీవ్రమైన ఎండలో నడి వయసుకు ముందే ఒడిపిల్ల, ఎడపిల్లవాడు వుండగ, రైతు చావుకు సవాలక్ష కారణాల్లో ఒక కారణమైన పిడుగుపాటుకు భర్తను, కష్టపడి పెంచి పెళ్ళిచేసి అత్తవారింటికి పంపిన పదిహేను రోజులకే రోడ్డు ప్రమాదానికి బిడ్డను పోగొట్టుకుంటుంది.

కడుపు నాయగట్టుకొని చదివించిన కొడుకు ఇంజనీరై, వున్నింటి అల్లుడై డబ్బులు బాగా సంపాదించాలన్న యావతో తనను వదిలిపెట్టి అమెరికా ఎగిరిపోయిన కొడుకును అనుక్షణం తలపుల్లో నిలుపుకుంటుంది. ఉన్న కాస్త భూమిని సాగుచేసుకుంటూ చేను, ఇల్లు మధ్య గానుగెద్దు జీవితాన్ని గడుపుతుంటుంది. ఓరోజు చేలోనే ఎండ దెబ్బకు స్పృహతప్పి పడిపోయిన సత్యాన్ని పొరుగింటి వ్యక్తి తీసుకుపోయి ఆస్పత్రిలో చేరుస్తాడు.

ఈ ఆరంభాన్ని బట్టి పాఠకులు ఈ పాటికే ఈ నవల ‘ఫ్లాష్ బాక్’ తో మొదలవుతుందని అర్ధం చేసుకుంటారు. డబ్బు మీది యావ వల్ల ఒకప్పటి తన కొడుక్కి, ఇప్పటి అమెరికా కొడుక్కీ మధ్య పరాయివాళ్ళెవ్వరికీ కనిపించని ఓ మాయాపొర సత్యానికి మాత్రమే కన్పిస్తూ తనను నిరంతర వ్యధావశిష్ఠురాలిని చేస్తుంటుంది.

కొడుకు, కోడలు అమెరికాలో ఇద్దరు ఆడపిల్లల్ని కంటారు. వాళ్ళల్లో పెద్ద పిల్ల బడికి కూడా పోతుంటుంది. అయినప్పటికీ కొడుకు ఇంటికి రాకపోవడంతో “వాడు అమెరికా నుండి వచ్చిన వెంటనే దేవునికి మొక్కు చెల్లించాలి” అన్న వుద్దేశంతో పొట్టేలు పిల్లల్ని తెచ్చి పెంచడం, తను ఎంతకూ రాకపోవడంతో ముదిరిపోయిన ఆ పొట్టేళ్లను అమ్మివేయడం చేస్తుండడం చేస్తుంటుంది సత్యం. ఆ సందర్భంగానే తనలో తను “మనిషి జీవనయాత్ర మొదలైనప్పుడు ఉక్కిరి బిక్కిరిచేసే అనుబంధాలన్నీ ఆయువు తీరే గడువు దగ్గరపడుతున్నా కొద్ది పల్చబడిపోతాయి” అనుకుంటూ తనకు తెలియకుండానే భవబంధాలను గురించి నిరంతరం తలపోస్తుంటుంది సత్యం.

అటువంటి సందర్భంలో ఒకసారి జీవితం పట్ల విసుగొచ్చిన సత్యం యాత్రకు వెళుతుంది. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా నాలుగు రోజులు గడవగానే తనకు తెలియకుండానే భవిష్యత్తుకు సంబంధించి తీవ్రమైన భయానికి లోనవుతుంది.

ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక దశలో ఇటువంటి భయాందోళనలు సర్వసాధారణంగా వస్తూనే వుంటాయి. వాటి నుండి ఏవిధంగా బయటపడాలో సత్యం పాత్ర మాధ్యమంగా పాఠకులకు తెలియజేయడంలో ఒక రచయితగా వివేక్ తన భాధ్యతను సరిగానే నిర్వర్తించాడని చెప్పవచ్చు.

కొడుకు, కోడలు మనుమరాళ్ళ ప్రేమ రాహిత్యానికి వగచి వగచి వగుడాకై పోతున్న సత్యానికి, దేవుని కోసం పెంచుతున్న పొట్టేలు పిల్ల తనపట్ల చూపిస్తున్న ప్రేమకు నయనాలు చెమ్మగిల్లి పోతుంటాయి. పొట్టేలుపిల్ల పట్ల ఆవిడలో తల్లి ప్రేమ ఉల్లం నిండా మోసులు వారుతుంటుంది.

ఐదున్నర ఏండ్ల నిరీక్షణ తరువాత కొడుకు, కోడలు, మనవరాళ్ళు సత్యం దగ్గరి కొస్తారు. వచ్చిన వాళ్ళతో, కోడలి పుట్టింటివాళ్ళతో సత్యానికి ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి? పొట్టేలు పి‌ల్లలో తన కొడుకును చూసుకున్న సత్యం దాన్ని అనుకున్న ప్రకారం దేవరకు బలి ఇచ్చిందా? తల్లీ కొడుకుల మధ్య, నాయనమ్మ మనుమరాళ్ళ మధ్య అనుబంధం పూపొదలా అందంగా బలంగా అల్లుకుందా? లేక హోరుగాలిలో పిట్ట గూడులా పిగిలిపోయిందా?

అసలు సత్యం జీవితం చివరికి ఏమలుపు తీసుకుంది? ప్రారంభంలో పేర్కొన్న రెండు నవలల్లో మాదిరిగా ఈ నవల ముగింపు కూడా విషాదాంతమా? లేక ఏదైనా విశేషాంతమా?! అన్న పలు ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ప్రతి పాఠకుడూ తప్పకుండా ఈ పుస్తకాన్ని కొని, చదివి తెలుసుకుంటేనే బావుంటుంది.

లేకుంటే, ఫలితం ముందే తెలిసిన ‘టీ ట్వంటీ’ క్రికెట్ మ్యాచ్ రికార్డింగ్ చూసినట్టుగా వుంటుంది. పుస్తకానికి పాఠకులు చెల్లించే మూల్యానికి తగిన ప్రతిఫలం మాత్రం తప్పకుంటా వుంటుందని నేను నమ్ముతున్నాను.

భవిష్యత్తులో కూడా వివేక్ కలం నుండి తన ప్రాంత ప్రజల సమస్యల మీద, ఆ ప్రజల భాషలో, యాసలో మరిన్ని ఉత్తమ రచనలు వెలువడుతాయని బలంగా విశ్వసించవచ్చు. పేగు బంధం కన్నా పెంచుకున్న మూగజీవి ప్రేమే మిన్న అనుకున్న ఓ అమ్మ కథ – వివేక్ లంకమల ‘పొట్టేలు’ నవల.

(ప్రచురణ: ఝాన్సీ పబ్లికేషన్స్ , పేజీలు: 107 (క్రౌన్ సైజ్ లో), వెల: రూ.150/- లు. ఫోన్: 95819 39039)

 

 

-శిరంశెట్టి కాంతారావు,
98498 90322.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry