కొత్త ఉత్సాహాన్నిచ్చిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

సాహిత్యం హోమ్

తెలుగు సాహితీ పత్రికలు ప్రతి ఇంటా ఉండాలి!- తెలుగు & సంస్కృత అకాడమీ అధ్యక్షులు ఆర్.డి. విల్సన్
కవులు, రచయితలు, కళాకారుల సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలు
కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించడంలో భాగస్వాములు కండి
జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
సమకాలీన సమస్యలపై గొంతెత్తిన కవులు – అలరించిన కవితాగానం, సాంస్కృతిక ప్రదర్శనలు
వివిధ రాష్ట్రాల నుండి తరలి వచ్చిన ప్రతినిధులు – ఉత్సవాల్లో వడ్డించిన విందు భోజనంపై ప్రశంసలు
రెండు రోజులపాటు జరిగిన నాలుగు సదస్సుల్లోనూ సంస్కృతి, కళలు, భాషా సాహిత్యాలపై ఆలోచింపజేసిన ప్రముఖుల ప్రసంగాలు
‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాల’ ప్రత్యేక సంచికతో పాటు పలు కవితా, కథా సంపుటాల ఆవిష్కరణ
ముగింపు సభలో దాదాపు రెండు గంటలపాటు ఓర్పుతో ప్రతినిధులు, కవులు, కార్టూనిస్టులందర్నీ సత్కరించిన జిల్లా కలెక్టర్

విజయవాడ: (ప్రతినిధి) కవులు, రచయితలు, కళాకారులు అందిస్తున్న సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలని, భారత సంస్కృతి, సంప్రదాయాలు భావితరానికి తరుగని వనరులవంటివని, కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించడంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కొహాన్స్ సంస్థ సహకారంతో విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నవంబరు 22, 23 తేదీలలో రెండు రోజులపాటు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను 22వ తేదీ శనివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు.

అనంతరం పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ… కవులు, రచయితలు, కళాకారులు, కార్టూనిస్టులు అందించిన సాంస్కృతిక రచనలు, కళా సంపదలు భావితరానికి తరగని వనరులలాంటివి అన్నారు. రచయితలు, కళాకారులు, కళలను ఆదరించిన ప్రదేశం ఎప్పటికీ ప్రజ్వరిల్లుతుందన్నారు. ఆధునిక జీవనశైలిలో మసకబారుతున్న కళలు, సాంస్కృతిక కళాసంపదను పరిరక్షించుకుంటూ వాటిని భావితరాలకు అమూల్యమైన వారసత్వ సంపదగా అందించేందుకు కవులు, రచయితలు, కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మొబైల్ ఫోన్ వచ్చింది కూడా పుస్తకాల నుండి లభించిన జ్ఞానం ద్వారానేనన్నారు. అలాంటి మొబైల్ మోజులో పుస్తకాలకు దూరమవుతున్న యువతను మళ్ళీ పుస్తకాల వైపు మళ్ళించే ప్రయత్నంలో భాగంగానే ఈ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కవులు, రచయితలు, కళాకారులు, కార్టూనిస్టులను ప్రోత్సహించేందుకు కథలు, కవితలు, కార్టూన్ల పోటీలను నిర్వహించి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ కన్వీనర్ కలిమిశ్రీని, ఇతర సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.

మొదటి సభకు ముఖ్యఅతిథిగా హాజరైన అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ… ఏ దేశ గొప్పతనమైనా అప్పటి సమకాలీన సాహిత్యమే తెలియజేస్తుందన్నారు. తెలుగుభాషకు 2500 సంవత్సరాల ఘన చరిత్ర ఉందన్నారు. మనకి, కర్ణాటకకి ఒకేసారి రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ కన్నడ రాజ్యోత్సవాలు ఎంతో వైభవోపేతంగా జరుగుతాయన్నారు. కర్ణాటక ప్రభుత్వ కార్యాలయాల్లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల ఫొటోలుంటాయని, ఆ విధంగా రాజకీయ నాయకుల కంటే కవులకు, స్వామీజీలకు ఆ రాష్ట్రం ప్రత్యేక గౌరవం ఇస్తుందన్నారు. డా. లక్ష్మీశ గారు కర్ణాటకకు చెందిన వారు కాబట్టి ఆ దిశలోనే కవుల్ని, రచయితల్ని, కళాకారుల్ని, కార్టూనిస్టుల్ని ప్రోత్సహిస్తున్నారని భావిస్తూ, వారికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ప్రపంచ నాట్యంగా గుర్తింపు పొందిన కూచిపూడి కృష్ణాజిల్లాలో జన్మించిందన్నారు. తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణది విజయవాడేనన్నారు. తెలుగునాట పత్రికలన్నీ విజయవాడ నుండే వెలువడేవని, అంత గొప్ప చరిత్ర విజయవాడకు ఉందన్నారు. తర్వాత్తర్వాత విజయవాడకు వేరే రకమైన పేరు వచ్చిందని, ఆ పేరును తుడిచిపెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విజయవాడకు ఘనకీర్తిని తేవడమంటే కేవలం మౌలికంగా అభివృద్ధి చేయడం ఒక్కటే కాదు… ఇలాంటి సాహిత్య సాంస్కృతిక ఉత్సవాల్ని నిర్వహించడం కూడా అందులో ప్రధాన భాగమని లక్ష్మీశ గారు భావించారు కాబట్టే మల్లెతీగకు ఈ అవకాశమిచ్చారని నేను భావిస్తున్నానన్నారు. నేడు పాఠశాలల్లో తెలుగు ఏ విధంగా ఉందో మూల్యాంకనం జరగాల్సిన అవసరం ఉందన్నారు. అక్షరాలు నేర్వని జాతిని తయారుచేశామన్న అపవాదు ఏ ప్రభుత్వానికి ఉండకూడదన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి సాంస్కృతిక రంగానికి ప్రాధాన్యతనిచ్చి కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేశారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సాంస్కృతిక శాఖకు మరిన్ని నిధులను కేటాయించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కళా రంగానికి మరింత వైభవాన్ని తీసుకువచ్చేలా తనవంతు కృషిచేస్తానన్నారు. తెలుగు భాషను పరిరక్షించేందుకు బడిలో ఏలుబడిలో తెలుగు భాషను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

మరో అతిథి ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ… కవిత్వం, కథ, నాటకం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం ఇవన్నీ కూడా మన సంస్కృతిని అభివ్యక్తం చేసే కళారూపాలు. మన జీవితమే మన సంస్కృతి అని చాలామంది పెద్దలు చర్చోపచర్చలు చేసి తేల్చిన అంశమన్నారు. మనం ఎలా జీవించాము, ఎలా జీవిస్తూ ఉన్నాము, ఎలా జీవించాలి అనే ఈ మూడు దశల్ని అభివ్యక్తం చేసే కళారూపాలు ఈ సాంస్కృతిక ఉత్సవాలన్నారు. సంస్కృతి అనే పదాన్ని పాశ్చాత్య దేశాలవాళ్ళు మొదట అగ్రికల్చర్ అనే అర్థంలో వాడారు. ఇవాళ సంస్కృతి అంటే అగ్రికల్చర్‌లో భాగంగా మారిపోయిందన్నారు. సంస్కృతి అంటే మన ఆహారం, మన విహారం, భాష, మన వేషం. ప్రాచ్య సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి అంటున్నాం… అంటే సంస్కృతికి ఒక దిశ, ఒక దిక్కు ఉన్నాయని అర్థం. భూస్వామ్య సంస్కృతి, పెట్టుబడిదారీ సంస్కృతి, సామ్యవాద సంస్కృతి, ప్రజాస్వామ్య సంస్కృతి అనే మాటల్ని ఉపయోగిస్తున్నాం. అంటే సంస్కృతికి ఒక వ్యవస్థ ఉన్నది, ఒక సిస్టం ఉన్నదీ అని అర్థం. ఈ దిశలో ఆలోచిస్తే సంస్కృతికి అనేక అరలున్నాయి, పొరలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన సంస్కృతి ఏది అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి సంచాలకులు రేగుళ్ళ మల్లికార్జునరావు మాట్లాడుతూ… కళలపట్ల అభిమానం, మమకారం, కళాకారుల సృజనాత్మకతను గుర్తించే గొప్ప మనస్తత్వం గల వ్యక్తి రాజధాని నగరంలో కలెక్టరుగా ఉండి ఇంత ప్రోత్సాహాన్నిస్తున్న జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ఇలాంటి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్న మల్లెతీగకు, కలిమిశ్రీకి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. కొత్తతరాన్ని ప్రోత్సహించడం కోసం పోటీలు పెట్టి, ఆ పోటీ రచనల్ని ఒక సంకలనంగా ముద్రించడం నేటి సాహితీ సమాజానికి ఎంతో అవసరమన్నారు.

మానసిక వైద్య నిపుణులు, ప్రసిద్ధ రచయిత డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ… నేటితరంలో సంస్కృతి విచ్చలవిడితనం అయిపోయిందన్నారు. పిల్లల్ని సెల్ఫోన్ ఎడిక్షన్ నుండి పుస్తకాల గదుల్లోకి చేర్చడానికి మనందరం కలిసికట్టుగా కృషిచేయాల్సిన అవసరముందన్నారు.

ఆకాశవాణి పూర్వ సంచాలకులు ముంజలూరి కృష్ణకుమారి మాట్లాడుతూ… పిల్లలు భాషకు వారధులు, నిన్న, నేడు, రేపు భాష నిలబడాలంటే పిల్లల నోట్లో భాష ఉంటేనే అది నిలబడుతుంది. పిల్లల చేత పుస్తకాలు చదివించాలి. ఆ పుస్తకాలపై మాట్లాడించాలి. అప్పుడే వాళ్ళల్లో భాష పట్ల సాధికారత ఏర్పడుతుంది, అభిమానం ఏర్పడుతుంది, వాళ్ళ భావజాలం కూడా మారడానికి అవకాశం ఉంటుందన్నారు. వాళ్ళలో సృజనాత్మకత కూడా ఏర్పడుతుందన్నారు.

కార్యక్రమంలో చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్ ఛైర్మన్ చిన్ని నారాయణరావు, ప్రసిద్ధ కవి పుట్టా సురేంద్రబాబు, ఏపీ నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొని మాట్లాడారు.

మొదటి రోజు రెండవ సభ నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షుడు బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి. విల్సన్ మాట్లాడుతూ… సమాజాన్ని సజీవంగా ఉంచేది సాహిత్యమేనని అన్నారు. తెలుగు పత్రికలు మూత పడితే మానవ నాగరికతే ధ్వంసమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో తెలుగు పత్రికలు కనపడాలన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక మాతృభాషేనని, దాని పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలన్నారు. తెలుగు అకాడమీ ద్వారా భవిష్యత్తులో ఒక పత్రిక తీసుకొస్తున్నామన్నారు. సాహిత్యం, విజ్ఞానం కలపోతగా పత్రిక ఉంటుందన్నారు. మంచి సాహిత్యాన్ని బ్రతికించుకోవడానికి మన పూర్వీకులైన రచయితల సాహిత్యం ముద్రించి భావితరాలకు అందిస్తామన్నారు. ప్రముఖ రచయితల మోనోగ్రాఫ్ తాము ముద్రిస్తాం అన్నారు. తనకు బాధ్యత అప్పగించిన సంస్కృత అకాడమీ ద్వారా సంస్కృతం పరివ్యాప్తి కోసం తాను కృషి చేస్తానని, సంస్కృత పుస్తకాలు కూడా ముద్రిస్తామని అన్నారు. మల్లెతీగ పోటీల్లో పర్యావరణ పరిరక్షణ, సోషల్ మీడియా ప్రభావంపై మంచి కార్టూన్స్ గీయడం ముదావహం అన్నారు. పోటీల్లో గెలుపొందిన కార్టూనిస్టులకు విల్సన్ చేతులు మీదుగా నగదు బహుమతులు అందజేశారు నిర్వాహకులు.

సభాధ్యక్షుడు, ప్రముఖ కవి బిక్కి కృష్ణ మాట్లాడుతూ… విడగొట్టే సంస్కృతిలో నలుగుర్ని ఒక చోట చేరేందుకు జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ గారిని, సహకరించిన కొహాన్స్ సంస్థ వారికి, మల్లెతీగకు అభినందనలు తెలిపారు.

మరో అతిథి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ ఉపకులపతి ఆచార్య డి. మునిరత్నం నాయుడు మాట్లాడుతూ… మలేసియా, అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ వంటి ఎన్నో దేశాల్లోని విద్యాలయాల్లో తెలుగు బోధన జరుగుతోందన్నారు. 2014 నుండి ఇప్పటివరకు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా లక్షా ఇరవై వేలమంది తెలుగు చదువుకున్నారన్నారు. కంప్యూటర్ రంగంలో ఉన్నవారు కూడా ఈ వేదికపై కవితలు చదవడం ఆనందాన్ని కలిగించిందన్నారు.

కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డా. జీవీ పూర్ణచందు మాట్లాడుతూ… 55 సంవత్సరాలుగా విజయవాడలో సాహితీ చైతన్యానికి కారకులైన సాహితీమూర్తుల జ్ఞాపకాలను గుర్తుచేశారు. విశ్వనాథ సత్యనారాయణ దగ్గర నుండి మొదలు పెట్టి, మహీధర రామమోహనరావు, పింగళి దశరథరామ్, తెన్నేటి హేమలత, తుర్లపాటి కుటుంబరావు వరకు ఆ తర్వాత తరం కురుమద్దాలి విజయలక్ష్మి, పి. సత్యవతి, వాణీ రంగారావు, ఎస్.ఎస్. లక్ష్మి, యలమర్తి అనురాధ, మందరపు హైమావతి, శ్రీవాత్సవ, పన్నాల భట్టు, నండూరి సుబ్బారావు, సుత్తి వీరభద్రరావు, అజంతా వంటి ఎందరో సాహితీవేత్తల్ని గుర్తు చేశారు. పాంచజన్య, కాటూరి రవీంద్ర త్రివిక్రమ్, వేగుంట మోహన్ ప్రసాద్, వట్లూరి నారాయణరావు, అట్లూరి పురుషోత్తమరావు, ఓంకార్, కావూరి సత్యవతి, కొల్లూరి, సింగంపల్లి అశోక్ కుమార్ వంటి ఎందరో సాహితీ సారధుల్ని గుర్తు చేశారు.

రెండవ రోజు మొదటి సభ సృజనక్రాంతి దినపత్రిక అసోసియేట్ ఎడిటర్ విల్సన్ రావు కొమ్మవరపు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో వర్ధమాన కవి పుప్పాల శ్రీరామ్ సభకు హాజరైన విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ… మనం ఏ సబ్జెక్టులో చదువుకుంటున్నప్పటికీ దానితో సంబంధం లేకుండా కవిత్వం చదివే అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే కవిత్వం మనల్ని మనిషిని చేస్తుందన్నారు. కవిత్వం మనల్ని ఆలోచింపజేస్తుంది. చారిత్రక దృష్టి ఏర్పరుస్తుందన్నారు. చరిత్రలో ఏం జరిగింది, వర్తమానంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ప్రాచీన సాహిత్యం చదవాలన్నారు. కవిత్వం చదవడం వల్ల మన భాష పట్ల మనకి ఎరుకను కలిగిస్తుందన్నారు. మనం జీవించే ప్రాంతాల్లో మనం భాషను బతికించాల్సిన బాధ్యతను కవిత్వం గుర్తు చేస్తుందన్నారు.

ఆచార్య చల్లపల్లి స్వరూపరాణి మాట్లాడుతూ… పాలసీమేకర్స్ సాహితీవేత్తలైతే అక్కడున్న ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారన్నారు. నాగరికత నిర్మాతలు ముగ్గురేనన్నారు. వారిలో ఒకరు శ్రమజీవులు, ఒకరు శాస్త్రవేత్తలు, ఒకరు సాహితీవేత్తలని గోర్కీ ఏనాడో చెప్పారన్నారు. గొప్ప సాహిత్యాన్ని చదివినవారు గొప్పగా ప్రవర్తిస్తారన్నారు. మానవత్వం మీద ప్రేమలేని వారు మంచి కవిత్వాన్ని అసలు రాయలేరన్నారు.

సభలో ఆచార్య జీవీ రత్నాకర్, ప్రసిద్ధ కథా రచయిత నక్కా విజయరామరాజు, నెల్లూరుజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పాతూరి అన్నపూర్ణ, ప్రసిద్ధ కవి సరికొండ నరసింహరాజు పాల్గొన్నారు.

రెండవ రోజు రెండవ సభకు సుప్రసిద్ధ కవి ఖాదర్ మొహియుద్దీన్ అధ్యక్షత వహించారు. ఆయన తొలిపలుకుల్లో మాట్లాడుతూ… సాంస్కృతికంగా విముక్తిని సాధించని జాతి ఏ రంగంలో కూడా విముక్తిని సాధించడం సాధ్యం కాదన్నారు. పౌరసమాజం కూడా తన బాధ్యతను విస్మరించకుండా ఒక బలమైన సాంస్కృతిక పునాదుల్ని నిర్మించడానికి కావలసిన ప్రయత్నాలు మనంగా సాంస్కృతిక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మన రాష్ట్రానికి ఉందన్నారు. భవిష్యత్తు ఆంధ్రరాష్ట్రానికి అవసరమైన సాంస్కృతిక పునాదుల్ని నిర్మించడానికి సంబంధించిన ఒక బ్లూప్రింట్ ని సంసిద్ధం చేసుకోవడానికి మనందరం చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. పాపినేని శివశంకర్ – కవిత్వం అంటే కేవలం మంచి భావాలు చెప్పడమే కాదు… ఆ భావాలను మరింత మెరుగ్గా చెప్పడానికి, ఎవరూ చెప్పలేని విధంగా చెప్పడానికి ఎలాంటి సాధనాలు వాడాలి అనే విషయాన్ని కవులు తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. కవులందరూ నిజానికి మానవత్వపు ప్రేమికులేనన్నారు. కవిత్వంతోపాటు సంస్కృతీ నిర్మాణంలో కవులు కీలకపాత్ర పోషించాల్సిన అవసరముందన్నారు. దురదృష్టవశాత్తూ నేడు రచయితల సమూహాలు కూడా చిన్న చిన్న గ్రూపులుగా మారిపోయాయన్నారు. వాటిమధ్య రకరకాల వైరుధ్యాలు, రకరకాల శత్రుత్వాలు కూడా బలపడుతున్నాయన్నారు. ఇలాంటి వేదికల మీదైనా వారందరూ కలిసికట్టుగా పాల్గొని కవులు, రచయితల మధ్య వైషమ్యాలు లేవని నిరూపించాల్సిన అవసరముందన్నారు.

సాహిత్య ప్రస్థానం వర్కింగ్ ఎడిటర్ సత్యాజీ మాట్లాడుతూ… వివిధ రాష్ట్రాలలో ఉన్న తెలుగు రచయితలందర్నీ ఒక వేదిక మీదికి తెచ్చి ఒక చర్చ జరపాలి అని అభిలషించడం, దానికి ఒక పరిపుష్టమైన కార్యాచరణని రూపొందించడం అభినందనీయమన్నారు. సాహితీవేత్తలు తమ సృజనాత్మక ప్రక్రియను ఒక బలమైన సాధనంగా, ఆయుధంగా సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పటి సాహిత్యమైనా సమాజంలో బలమైన కదలికను తీసుకురావడానికి కారణమౌతుంది కాబట్టి మరొక బలమైన సాంస్కృతిక, సాహిత్య, కళారంగాల వారసత్వాన్ని కొనసాగిస్తూ, అవసరమైనచోట సవరించుకుంటూ మరింత ముందుకెళ్ళడానికి ఇలాంటి ఉత్సవాలు, వేదికలు దోహదం చేస్తాయన్నారు.

మూడు గిన్నీస్ వరల్డ్ రికార్డులు పొందిన డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ… మన భాషే మన ఉనికి అన్నారు. మనం ముందు ఇంటినుండే తెలుగు భాషకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. కార్యక్రమంలో సుప్రసిద్ధ నవలా రచయిత శ్రీరామకవచం సాగర్, పొట్లూరి హరికృష్ణ ఫౌండేషన్ ఛైర్మన్ పొట్లూరి హరికృష్ణ, సీనియర్ జర్నలిస్టు డా. ఘంటా విజయ్ కుమార్, బీరం సుందరరావు పాల్గొని ప్రసంగించారు.