ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి నారా లోకేశ్ నివాళులు
హైదరాబాద్: నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్, ఎంపీ పురందేశ్వరి నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఆయన సమాధిపై పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. లోకేశ్‌తో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, అభిమానులు అక్కడికి తరలివచ్చారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు సినీనటుడు కల్యాణ్‌రామ్ చేరుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘాట్‌ను పూలతో తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవిత విశేషాలతో చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో బతికే ఉన్నారు: దగ్గుబాటి పురందేశ్వరి
బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ మరణించి 30ఏళ్లు అయినా ఆయన ప్రజల హృదయాల్లో బతికే ఉంటారన్నారు. తెలుగు చిత్రసీమలో అనేక రకాల పాత్రలు పోశించి అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు. నాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడి గానూ నటించి మెప్పించారన్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరవాత కేవలం అధికారం కోసమే రాజకీయాలు కాదని ప్రజాసంక్షేమం కోసమే రాజకీయాలు అని చాటిచెప్పేలా చేశారన్నారు. ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికీ అమలు అవుతున్నాయన్నారు. కాస్త మార్పులు జరిగినా ఆ పథకాలను ఎవరూ తీసివేయలేదన్నారు. రూపాయికే కిలో బియ్యం, రైతులకు రూ.50కి విద్యుత్, మాండలిక వ్యవస్థ, మహిళలకు చదువు లాంటి పథకాలన్నీ ఎన్టీఆర్ గట్టిగా సంకల్పించి ప్రవేశపెట్టారన్నారు. ఈ ప్రథకాలు ప్రజల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు.
సూర్యచంద్రులు ఉన్నన్నాళ్లూ ఎన్టీఆర్ బతికే ఉంటారు: నందమూరి బాలకృష్ణ
సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని ఆయన కుమారుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘‘మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ, దీక్ష అవసరం..అవి ఎన్టీఆర్‌లో ఉండేవి. సూర్యచంద్రులు ఉన్నన్నాళ్లూ ఆయన బతికే ఉంటారు. సినిమాల్లో ఎవరూ చేయని పాత్రలు ఎన్టీఆర్ చేశారు. ప్రతిపాత్రలోనూ పరకాయ ప్రవేశంతో నటనలో ఎన్నో ప్రయోగాలు చేశారు. తెదేపాను స్థాపించి సంచలనం సృష్టించారు. కొంతమందికే పరిమితమైన రాజకీయ రంగాన్ని అందరికీ చేర్చారు. బడుగు, బలహీనవర్గాలకు చేయూత అందించారు. నేను తెలుగువాడినని ప్రతి ఒక్కరూ గర్వించేలా చేశారు. పేదల ఆకలి బాధ తెలిసిన నాయకుడు ఆయన. అప్పట్లో ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి. ప్రజల వద్దకు పాలనను చేరువ చేశారు. తెలుగు గంగ, గాలేరు నగరిలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఆయన స్ఫూర్తిని టీడీపీ కొనసాగిస్తోందని బాలకృష్ణ అన్నారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి గుండెచప్పుడు, కళామతల్లి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ అని కొనియాడారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన ఎన్నో సేవలు అందించారన్నారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారని చెప్పారు..
భూమి ఉన్నంత వరకు ఎన్టీఆర్ బతికే ఉంటారు : సినీ నటుడు బాబు మోహన్
భూమి ఉన్నంత వరకు ఎన్టీఆర్ బతికే ఉంటారని సినీ నటుడు బాబు మోహన్ అన్నారు. ఎన్టీఆర్ తన దేవుడు అని, తనను ఎన్టీఆర్ తమ్ముడు అని సంభోదించేవాడని చెప్పారు. ఆయన పరమవదించారని చెప్పడానికి కూడా నోరు రాదన్నారు. . ఆయన మళ్లీ పుట్టి నటుడుగా ఓ వెలుగు వెలగాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ తిరిగి వస్తాడని తాను నమ్ముతానని, ఆయన శకపురుషుడని వ్యాఖ్యానించారు.
పేదవాడి ఆకలిని గుర్తించిన మహనీయుడు ఎన్టీఆర్ : మోత్కుపల్లి నర్సింహులు
ఎన్టీఆర్ ఎన్ని ఏళ్లు అయినా ప్రజల గుండెల్లో జీవించే ఉంటారని మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. పేదవాడి ఆకలిని గుర్తించిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన గతంలో ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటికీ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రులు మారినా పథకాలు మారడం లేదన్నారు. మరణించి వంద సంవత్సాలు అయినా ఆయన జీవించి ఉన్నట్టే అని చెప్పారు.
ఏపీకి మళ్లీ మంచి రోజులు వస్తాయ్ : లక్ష్మీపార్వతి
నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నేళ్లు గడిచినా మహనీయులు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారని చెప్పడానికి ఎన్టీఆర్ సాక్ష్యం అన్నారు. ఊరికే మహానుభావులు కాలేదని వాళ్ళు చేసిన మంచి పనుల వల్లనే మహానుభావులు అయ్యారని అన్నారు. ఎన్టీఆర్ కు మరణంల లేదని చెప్పారు. నమ్ముకున్న ఆశయం కోసం, తనను నమ్ముకున్న స్త్రీ కోసం పదవిని కూడా వదిలేయడానికి సిద్ధపడ్డారని అన్నారు. వెన్నుపోటు రాజకీయాలకు ఆయన తలవంచకుండా తన ఆశయాన్నికొనసాగిస్తానని చెప్పేవారన్నారు. అంతే కాకుండా సింహం ఎప్పుడూ పచ్చగడ్డితినదు..సింహం ఎప్పుడూ పోరాడి సాధించుకుంటుందని ఎన్టీఆర్ చెప్పేవారన్నారు. తాను కూడా వెన్నుపోటుదారులపై యుద్ధం చేసి పదవిని దక్కించుకుంటానని చెప్పేవారన్నారు. కానీ ఆయన శపతం నెరవేరకముందే కన్నుమూయాల్సి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాన్ని నెరవేర్చేవాళ్లు చాలా మంది వస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ చివరికోరిక సగం తీరిందని, కొన్నిసార్లు కారు మబ్బులు వస్తాయని అన్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు మంచిరోజులు రావాలని కోరుకుంటున్నామన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్నం ఇవ్వడంపై డ్రామా జరుగుతుందన్నారు.















