తులజాడల కవిత్వతత్వం

ఇక నన్ను అంటిపెట్టుకొని ఉండే కళ్ళు లేవనీ, కన్నీటి చుక్క అంతర్ధానం కోసం చోటు వెతుక్కుంటుంటే, ‘ఆమె తడి కన్నులు కొంత కన్నీటిని కొసరగా వేస్తుంటే’ చూసి నా ఆనవాళ్లు ఇంకా ఉన్నాయని సంబరపడే కన్నీటి చుక్క తాలూకు పుట్టినిల్లు ఈ “పచ్చబొట్టు”. పేరుకే ఇది పచ్చబొట్టు గానీ, కవి కన్నీటి బొట్టుతో అల్లిన దుఃఖపు తాడు. ఏ దిష్టి తాకకూడదని నాన్న కట్టిన కాశీ దారం; ఏ మాయ కన్ను బిడ్డపై పడకూడదని అమ్మ కట్టిన మొలతాడు. గుప్పెడే ఉంది కదా ఈ దారపు ఉండ అనుకుంటే ఎలా? విప్పి చూస్తే ఆకాశాన్ని అల్లుకునేంత పొడవు! తుల కవిత్వం గుప్పెడు కన్నీరు కాదు, హృదయానికి పట్టిన కారుమబ్బులు కురిపించే ధారాపాత వాన; చీకటిని నిత్యం తరిమే అఖండ దీపం. ఇంకా కన్నీళ్లు ఉన్నాయని, ఇంకా మనిషి ఉన్నాడని, ఇంకా ప్రేమలు ఉన్నాయని తుల కవిత్వం చెబుతుంది.

____________________

కళ్ళ ముందే కవిత్వం పెట్టుకొని ప్రపంచమంతా తిరిగే కవులకు తుల కవిత్వం ఒక నమూనా (Model). మంచి కవిత్వం రాయాలంటే ఆకాశాన్ని చిమ్మాల్సిన పనిలేదని, సూర్యుడికి వేలాడి సొమ్మసిల్లాల్సిన అవసరం అసలే లేదని, వస్తువు కోసం పస్తులుండాల్సిన పరిస్థితి లేదని తుల కవిత్వం చాటిచెబుతుంది.

_____________________

తన కంటికి చిక్కేవాటిని, హృదయంలో కవిత్వాన్ని రాజేసేవాటినీ, తాను దాటి వచ్చిన వాటిని, తనతో పెనవేసుకున్న వాటినే ఆయన కవిత్వ వస్తువులుగా చేసుకున్నాడు. తనలో వెలిగిన వెన్నెలనే పచ్చబొట్టుగా పొడుచుకున్నాడు. తనలో కురిసిన కన్నీరునే పచ్చబొట్టుగా దిద్దుకున్నాడు. ‘ఎవల్లినా జస్నూరా’ అనే శీర్షికతో మొదలయ్యే ఈ సంపుటి నిజంగా తుల వెలిగించిన కవిత్వ కుంపటి. ఊరు పోయిందని, తప్పిపోయిందని కాదు… తప్పించారని! పసుపు పచ్చగా, నులివెచ్చగా, హాయిగా, నీటి చెలమలా, కన్నీటి చెమ్మలా, నాన్న కండువాలా, అమ్మ చీర కొంగులో తెచ్చిన కొబ్బరి ముక్కలా భలేగా ఉండే నా ఊరు, నేను నడిచిన దారి ఎడబాసెనే అని సాగే అక్షరాల నడుమ, చదివే పాఠకుడి మెడ చుట్టూ దుఃఖం పేరుకుపోతుంది. పాఠకుడు తనని తాను వెతుక్కుంటాడు. పచ్చబొట్టు దారి పొడుగునా పూసిన కన్నీటి చుక్కల నీడన ఆత్మిక నడకలు నడుస్తాడు. జీవితం కోసం పొర్లుదండాలు పెడుతూ తిరిగే మనకు ఈ “పచ్చబొట్టు” ఊరట కలిగిస్తుంది. కవిత్వం అసలు ఎలా ఉండాలి అనే దానికి ఒక్కొక్కరికి ఒక్కో అంచనా, నియమం ఉంటుంది. ఇలానే కవిత్వం ఉండాలి అనే దానికి ఖచ్చితమైన నిర్వచనం లేదు. జీవితం లాంటిదే కవిత్వం. జీవితం ఇలానే ఉంటుందని ఎలా చెప్పలేమో, కవిత్వాన్ని కూడా ఇలానే ఉండాలని శాసించడం కుదరదు. ఎందుకంటే ఒక్కో కవికీ ఒక్కో జీవితం ఉంటుంది. ఒక్కో జీవితానికి ఒక్కో నిర్మాణం, సారం, లక్ష్యం ఉంటాయి.

“పచ్చబొట్టు” ఎటువంటి కవిత్వం అంటే… తుల శ్రీనివాస్ జీవితం లాంటి కవిత్వం. మరి తుల శ్రీనివాస్‌ది ఎటువంటి జీవితం అంటే… దానికి సాక్ష్యమే అతని కవిత్వం. జీవితంలోంచి కవిత్వం పుడితే, అది కూడా జీవితంతో పోరాడిన వాడి అనుభవాల నుండి పుడితే ఇలానే ఉంటుంది. ఈ కవిత్వం ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే—ప్రేమ దివిటీని పట్టుకొని తిరిగే బైరాగి చేయిలా ఉందని అనాలా? అమ్మ చేతి మీద కాలం పొడిచిన కన్నీటి పచ్చబొట్టులా ఉందని అనాలా? ఆలింగనం కోసం అర్రులు చాచిన మనిషి దుఃఖంలా ఉందని అనాలా? మొత్తంగా మనిషిని ప్రేమించే మామూలు మనిషిలా ఈ కవిత్వం ఉందని అనాలి. చదివి అనుభూతి చెందడమే మంచి కవిత్వం అనుకుంటే, తులది నిఖార్సైన మంచి కవిత్వమే. తెలంగాణ మాండలిక సొగసు తుల కవిత్వానికి అదనపు ఆకర్షణ.

“పచ్చబొట్టు” నిండా కళ్ళకు అంటుకునే భావచిత్రాలే—చెమట రంగు పతాకం, గొర్రె గిట్టల గంధం, దృష్టి పరిమళం, పాడె తప్పిన పద్యం. ‘ఏకాంత గమనం’ వంటి శీర్షికలన్నీ తుల కవిత్వంలో మనల్ని మనం చూసుకునేందుకు పనికొచ్చే పద్యాలు. ఈ కవితలు మన హృదయాన్ని తడుపుతాయి.

వస్తువు ఎంపికతో పాటు ఆ వస్తువుని కళ్లకు కట్టినట్టు చూపించే భాషలో తుల శ్రీనివాస్‌ది ప్రత్యేకమైన ముద్ర. కేవలం మాండలికాన్ని అడ్డుపెట్టుకొని “మేము కొత్తగా కవిత్వం రాస్తున్నాం” అని భావించేవారు ఈ “పచ్చబొట్టు”ను పరిశీలిస్తే వాస్తవం తెలుస్తుంది. తెలంగాణ మాండలికాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఆ యాస ఎంత సౌందర్యాత్మకంగా ఉంటుందో ఇక్కడ అర్థమవుతుంది. ఏమాత్రం చెక్కుడు లేకుండా, అద్దినట్టు, అతికించినట్టు కాకుండా సహజంగా, హాయిగా చెట్టు నీడన సేదతీరినట్టు, ఎండలో నడిచి కుండ నీరు తాగినట్టు తుల కవిత్వం ఉంటుంది. ఈ వాక్యాన్ని నేను రుజువు చేయవలసిన పనిలేదు; కవిత్వం మీ చేతుల్లో విరబూసినప్పుడు మీకే తెలుస్తుంది.

ఊహల వానలకు వాసన ఉంటే అది, కలల జలలకు వాసన ఉంటే అది “పచ్చబొట్టు”. కన్నీళ్లకు కమ్మటి వాసన ఉంటే అది కూడా “పచ్చబొట్టే”. జ్ఞాపకాల గ్రంథుల లోపల జారిపడే స్వప్నాల భాష, రక్తంలో ప్రవహిస్తూ తూలి త్రుళ్లి గలగలా పారే జీవితపు వాసన ఈ “పచ్చబొట్టు”. పల్లె జీవనం మీద మొలిచిన వెన్నపూస వాసన కూడా చివరికి “పచ్చబొట్టే”. పువ్వులు పువ్వులుగా రాలిపడుతున్న సూర్యుడ్ని చూడటానికి ఎంత సమయం పడుతుంది? మిణుగురు మిణుగురులుగా జారిపడుతున్న చంద్రుడ్ని వీక్షించడానికి ఎంత కాలం పడుతుంది? పుట్టడానికి, మరణించడానికి ఎంత కాలం పడుతుంది? ఒక నిమిషం (Minute) చాలు కదా! అదే ‘వన్ మినిట్ విస్డమ్’. ఈ కవి అంతే… ఒక్క నిమిషంలో కలని కళగా మారుస్తాడు. ఇట్టే కవితను అల్లి చలి పొడి భావాన్ని కలిగిస్తాడు.
______________________

‘చింతల తొవ్వ’తో కవిత్వంలోకి అడుగుపెట్టి సాహిత్యంలో కళ్లు చాపి కూర్చున్నాడు. చక్కని మునుం లాంటి వాక్యాలతో, చల్లని పంట లాంటి పద్యాలతో, చిక్కని మట్టి జిగురును కవిత్వంలో పోసిన వడ్ల రాశి వంటి కవి. చదవగానే హృదయానికి అంటుకుపోయే కవి. చల్లని వేడిని, చీకటి వెన్నెలను, దుఃఖపు నవ్వులను జీవితపు కొమ్మల్లోంచి రాల్చగల కవి తుల శ్రీనివాస్.
_______________________

తులాల లెక్కన బంగారాన్ని పొదిగి పద్యానికో కేజీ ఇచ్చినా సరిపోని కవి. ఇతని కళ్లు కవిత్వ పొదలు; ఇతని కాళ్లు కవిత్వ సాళ్లు; ఇతని గుండె కవిత్వ గర్భసంచి; ఇతని రెక్కలు కవిత్వ కొమ్మలు; ఇతని చర్మం కవిత్వ మర్మం. ఇతనంటే కవిత్వం… ఇతనంతా కవిత్వమే. ఇతని ఎత్తులో వెడల్పు, వెడల్పులో ఎత్తు అంతా కవిత్వమే. గతాన్ని భవిష్యత్తులో చూస్తూనే, భవిష్యత్తును ప్రస్తుతంతో, ప్రస్తుతాన్ని మళ్ళీ గతంతో గుణించి, హెచ్చవేసి, తీసివేసి… చివరికి కవిత్వ బద్ధతతో, వ్యక్తిత్వ నిబద్ధతతో సమం చేస్తాడు. ఆకులో ఆకై, పువ్వులో పువ్వై, జీవితంలో జీవితమై ఇతను పొడుచుకున్న పచ్చబొట్టే ఈ కవిత్వం.

అన్నింటా దేవుడ్ని చూసే రమణ మహర్షి ఇతనిలో ఉన్నాడు; ఖాళీ చేతులతో వెళ్ళిన అలెగ్జాండరూ ఇతనిలో మేల్కొంటాడు; పిట్ట పట్టుకున్న గడ్డిపోచలో ప్రపంచాన్ని ప్రేమించగల గోరటి ఇతనిలో ఉన్నాడు. ఇందరు ఇతనిలో ఉన్నా ఇతను ఇతనే… కానీ ఇతను సృష్టించిన కవిత్వం మాత్రం మనదే!

కొన్ని కవితలు సూక్ష్మ శైలిలో (Minimalist style), మరికొన్ని విస్తృత శైలిలో (Maximalist style) ఉంటాయి. అవసరం అనుకున్న చోట సాగాడు, అనవసరం అనుకున్న చోట ఆగాడు. ప్రతి కవితను దృశ్యమానం చేయడానికి కవి ప్రయత్నం చేసినట్టు కాకుండా, అది సహజంగా జరిగినట్టు అనిపిస్తుంది. తన కవిత్వాన్ని తాను ఎడిట్ చేసుకునే విషయంలోనూ చాలా కఠినంగా (Ruthless) ఉన్నాడు. ఈ గుణాల వల్లనేమో తుల శ్రీనివాస్ తనదైన స్వరాన్ని (Own voice) సృష్టించగలిగాడు.

“I celebrate myself, and sing myself, And what I assume you shall assume, For every atom belonging to me as good belongs to you…”అని పాడి, నమ్మి, పాటించిన ప్రపంచ కవి వాల్ట్ విట్మన్ (Walt Whitman) కూడా ఇతనే. ఇతనే అంటే… ఇతని కవిత్వం అని, ఇతని కవిత్వ ప్రయాణం అని అర్థం. ‘పొదిచ్చుకున్న పుట్టింటి గడప’ అన్నాడు అనుకోండి… అది విని, చదివి మనం ఆడపిల్ల కళ్లలో తిరిగే నీటి కవ్వాలం అవుతాం. పోనీ ఇతను ‘సముద్రం’ అన్నాడు అనుకోండి… మనం ఆ సముద్రంలో పొర్లి నక్షత్రాన్ని కోసుకొచ్చుకుంటాం. ఇతను ‘అమ్మా’ అన్నాడు అంటే మనకు లాలిపాట వినబడుతుంది. తన పల్లె గురించి తను రాస్తే మన పల్లె మనకు యాదికొస్తుంది. ఎందుకంటే అది అంతే… అది అతని కవిత్వ శక్తి. తుల శ్రీనివాస్ కవిత్వం ఒక ‘పాలిండ్రోమిక్’ (Palindromic) పదం లాంటిది; ఎటు నుంచి చూసినా ఆయన పంచిన ప్రేమ, రాసిన కవిత్వం ఒక్కటే.

-పెద్దన్న మారాబత్తుల

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry