వర్తమానంలో భూమికంటే బరువుగా, ఆకాశంకంటే విశాలంగా, బాంబులకంటే భయంకరంగా, కాలకూటవిషంకంటే కర్కశంగా, దురదృష్టకరమైన శాపంకంటే ఘోరంగా వ్యవస్థ నిండా విస్తరిస్తున్న సంపాదన దోపిడీ వాస్తవరూపాలను ప్రజలందరికీ ఒక విజ్ఞాన పాఠంలా అందించేందుకు తన పేజీలను తెరుచుకొని ఆహ్వానిస్తున్న కథల సంపుటి ‘ది గ్రేట్ డిక్లైన్’ కథలు.
__________________
ఆర్థిక శాస్త్రాన్ని సంపూర్ణంగా జీర్ణించుకొని సమకాలీన ఆర్థికనేరాల లోతులను, సామాన్యుల అవస్థలను, చట్టాల లోపాలను, దుర్గంధ రాజకీయ వికృతాలను, వాస్తవాల రంగులతో కథనాన్ని జోడించి, ఆసక్తికర చిత్రాలను చిత్రీకరించిన సాహితీవేత్త ‘వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి’. మధ్యతరగతి వ్యయసాయ కుటుంబంలో జన్మించిన ఆచార్య రెడ్డప్పరెడ్డి, గ్రామీణ ప్రాంతాలను తన పరిశోధన, పరిశీలనా క్షేత్రాలుగా మార్చుకొని, సమాజానికి శాశ్వత ప్రయోజనకర మార్పును అందించటం కోసం, సాహిత్యాన్ని ఒక గొప్ప పనిముట్టుగా పదును పెడుతున్న క్రమంలో పురుడు పోసుకున్న ఓ సాహిత్య రూపం ‘ది గ్రేట్ డిక్లైన్’ కథలు.
_____________________
ఇవి సాధారణ స్థాయిలో కాలంతో పాటు రెప్పపాటులో కనుమరుగయ్యే కథలు కాదు. దోపిడీ వేటకొడవళ్ళకు గొంతులు తెగుతున్నప్పుడు జనం అరచిన ఆఖరి కేకల ఆర్తనాదాలివి. మోసాలు ఉరిత్రాళ్లుగా వెంటబడినప్పుడు భయంతో అమాయకుల గుండెలు కార్చిన చెమట చుక్కల రోదన ఈ కథలు. సంపాదన దోపిడీకోసం నేరుగా దేశ దేహాన్ని బహిరంగంగా వేలం వేసినప్పుడు ఈ నేల మట్టికణాలు రోదించిన విషాదగీతాల ఆలాపన ఈ కథలు. సిగ్గు సైతం సిగ్గుపడే తత్వంతో నేరప్రవృత్తి తలపాగాలతో మోసం రథాలమీద పెద్దలు ఊరేగుతున్న చప్పుళ్లను, జనానికి హెచ్చరికలుగా అందిస్తున్న డప్పుల శబ్దం ఈ కథలు. ఆకాశం భోరుమని రోదిస్తున్న సమయంలో ఆ కన్నీళ్లను తుడువటానికి నేలనుండి నింగిదాకా చేతుల్ని విస్తరించుకున్న సాహిత్య స్వరూపమే ఈ కథలు.
కోట్లు సంపాదించటమే నీతిగా తమ నేరాల వ్యాకరణానికి ప్రేక్షకుల్ని పేజీలుగా ఎన్నుకున్న సినీ నిర్మాతల మోసాన్ని తెరమీద అర్థవంతంగా ప్రదర్శింపజేసిన కథ ‘తెర తగలబడుతోంది’. ‘ప్రజలకోసం పోరాటం సాగించిన వీరులంతా ప్రజల శక్తుల్ని కూడగట్టి, ప్రజాశక్తితో మాత్రమే విజయాలు సాధించారు. మరి మీ సినిమాలలో హీరో అందుకు విరుద్ధంగా ఒక్కడే ఎలా అన్ని విజయాలు సాధిస్తాడు? ఇది అవాస్తవం కాదా? ప్రజల్ని భ్రమల్లో బ్రతికేలా చేయడం నేరం కాదా? సొమ్ము కోసమని నిజజీవిత సంఘటనల్ని నిలువునా నేలలో పాతేయడం పరమ నీచమైన మోసం కాదా?…’ అంటూ సినిమా వర్గాలను గురించి ఈ కథలో ఒక పాత్ర సంధించిన ప్రశ్నలు సామాన్యజనం గొంతుల్లో సైతం మారుమ్రోగాలని ఈ కథ అంతరాత్మ కోరుకుంటోంది.
‘కట్టని కంతు’ కథలోని ప్రతి దృశ్యం ఆదాయ దోపిడీ, వస్తువును వినియోగదారుడికి అంటగట్టే సమయంలో మోసం ఎలా జరుగుతుందో వివరిస్తోంది. పల్లెటూర్లో మోటరు సైకిళ్ల మీద మోజును పెంచిన కంపెనీమోసాలు తెలియక, కంతుల మీద వాహనం కొని, అప్పు తీర్చలేక చివరకు చెట్టుకు ఉరేసుకొని వ్రేలాడిన కొడుకు దొడ్డప్ప శవాన్ని చూసి నాన్న వన్నూరప్ప, తల్లి ఇరగమ్మలు, కొడుకులేని బాధతో తాము కూడా ఉరేసుకోవటానికి సిద్ధపడి, ఒక మోటరు సైకిల్ అప్పుకోసం మూడు ప్రాణాలు పోవడం సరికాదని, కంపెనీ మోసాలను ఊరూర ప్రచారం చేయటానికి ఆ ఇద్దరు దంపతులు సిద్ధపడిన సన్నివేశం, ఓ గొప్ప చైతన్యాన్ని ఒక పతాకంలా ఎగురవేస్తోంది.
సంపాదన దోపిడీ చురకత్తుల వేటుకు నిలువునా చేధించబడి, పెద్దమనుషుల మోసం మంటల్లో కాలి, బొగ్గుగా మారి, చివరకు ఆ బొగ్గే అగ్నికణంలా జ్వలించటానికి సిద్ధపడిన ‘మల్లి’ పాత్ర ‘సిగ్గులేని జలమ’ కథలో హృదయాలను ద్రవింపజేస్తుంది. తాగుబోతు మొగుడు ప్రమాదంలో చనిపోయి, అప్పటికే గర్భవతిగా వున్న మల్లి కాన్పును ఒక మెడికల్ కాలేజీ వాళ్లు తమ విద్యార్థులకు దాన్ని ఒక ప్రాక్టికల్ క్లాసుగా ఏర్పాటు చేస్తారు. తన పిల్లల ఆకలిని తీర్చటం కోసం అందుకు మల్లి ఒప్పుకుంటుంది. ఆమె స్త్రీత్వం హాలులో వున్న అందరికీ కనపడేలా చేసినప్పుడు ఆమె పడిన మనోవేదనకు శిలలు సైతం కరిగి నీరైపోతాయి. కళాశాల ఒప్పందం ప్రకారం 20 వేలు రావలసిన చోట 10 వేలు మాత్రమే రాలుతాయి. ఆదరిస్తానని ముందుకు వచ్చినవాడ్ని తమ్ముడిలా భావిస్తే, చివరకు వాడే పశువుగా మారి తన కోరికకు తనను, తన పెద్ద కూతుర్ని బలితీసుకోవటానికి సిద్ధపడుతాడు. వాడి మర్మాంగాన్ని స్కాల్పెల్తో తెగకోసి తిరుగులేని బుద్ధి చెప్తుంది మల్లి. ఆమె తెగువకు, ధైర్యానికి జాతిమొత్తం సెల్యూట్ చేసే సందర్భమిది.
‘ప్రజాస్వామ్యం అమ్మబడును’, ‘మహిళా సాధికారి కథ’, ‘మంత్రి-పేద’ మొదలైన కథలను సంపాదనే ధ్యేయంగా జరిగే ఎన్నికల మాయాజాలాన్ని, గెలవటానికి నాయకులు అనుసరించే బూటకపు నాటకాలను రచయిత ఆవిష్కరించిన తీరు మనల్ని తీవ్రంగా ఆలోచింపజేసే దారుల్లో చేయిపట్టి నడిపిస్తుంది.
అస్తవ్యస్తంగా తయారయిన సామాజిక అనాగరిక స్థితిని గొప్పగా చిత్రీకరించిన కథ ‘నల్లరంగు ఇల్లు’. ప్రతి ఆస్తి కొనుగోలులోనూ, నల్లడబ్బును ప్రజల ముంగిటికి చేర్చిన ప్రభుత్వాల గురించి, అందుకు కారకులైన అధికారుల గురించి, కనీసం ఈ అంశాలపై చర్చలు జరుపలేని మంత్రివర్గాల తీరును గురించి ప్రస్తావిస్తూ… “వీటిని పాఠాలుగా పిల్లలకు తప్పక చెప్పాలి…” అంటూ ఓ గొప్ప సూచనతో ఈ కథ ముగుస్తుంది. ఆలోచిస్తే ఇవి సాధారణమైన మాటలు కాదు. భవిష్యత్తు తలరాతలకు తప్పనిసరిగా అవసరమైన శ్వాసకణాలివి.
పంటలు పండించటం కోసమే జీవిస్తున్న రైతు, ఈ దోపిడీ సమాజ పద్మవ్యూహంలో అభిమన్యుడిలా, మోసపు ఆయుధాల దాడికి ఆశల అవయవాలు తెగిపోయి, చివరకు కుటుంబం మొత్తం ఆత్మహత్యల చెరువుల్లో శవాలుగా తేలుతున్న వాస్తవ దృశ్యాలతో మనముందు నిలిచిన కథ ‘తన్నొక్కడిని జేసి’. ఈ కథను చదువుతున్నప్పుడు భోరున విలపిస్తున్న పొలం మట్టికణాల గుండె రోదనలు యుద్ధంలో మరణించిన వీరుడి తల్లి శోకాన్ని మనకు గుర్తుకు చేస్తున్నాయి.
సాహిత్యం, సమాజహితంకోసం సాగిన సందర్బాలన్నీ ఆ సాహిత్య సృజనకారుడి బాధ్యతకు ఒక కితాబుగా నిలుస్తూ వుంటాయి. ఈ రచయితను ఆ స్థానంలో నిలబెట్టిన కథ ‘నీడకు పట్టిన చీడ’. ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశం మొత్తం మీద భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థ తీరులో సగటు విద్యార్థుల మనస్తత్వ విశ్లేషణను వైవిధ్యమైన రీతిలో ఆసక్తికరంగా అందించిన ఈ కథలో సందర్భానుసారంగా చోటు చేసుకున్న పద్యాలు పాఠకుల్ని ఆకర్షిస్తాయి. వాటిలో దాగివున్న అర్థాలకోసం మనం కూడా వెతకటం ప్రారంభిస్తాం. దేశంలోని న్యాయ, పాలక, పోలీసు వ్యవస్థలన్నీ తమకు రాజ్యాంగం నిర్దేశించిన విధులను నిర్వహించక రాజకీయాంగం జారీచేసే పనులు చేసుకుంటూ దేశాన్ని ఒక దిష్టిబొమ్మలా మారుస్తున్న ఈ దుర్మార్గపు వర్గం ఆలోచనల్ని బట్టబయలు చేసిన కథ ‘బ్యాంకింగ్ భిక్షాందేహీ’. ‘రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్’ క్రింద రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిని బ్యాంకు దొంగతనాలకు సంబంధించిన సమాచారాన్ని అడిగిన నేరానికి ఒక యువకుడు ఎదుర్కొన్న హింస ఎంత క్రూరంగా అతడి మీద దాడిచేసిందో వివరించిన ఈ కథలోని దృశ్యాలనిండా మండిన ఎన్నో గుండెల నీడలు స్పష్టంగా కనపడుతున్నాయి.
క్యాన్సర్ కంటే భయంకరమైన దోపిడీ రోగాలతో కుళ్లిపోతున్న సమాజ ప్రక్షాళనకు కంకణం కట్టుకున్న ఈ రచయిత తపన ఈ కథల్లో స్పష్టంగా కనపడుతోంది. ఒక నూతన చైతన్యదీప్తి ప్రతికథలో ఒక నినాదంలా వినిపిస్తోంది. దేశంలో జరుగుతున్న సామాజిక మార్పులు, ఆర్థిక సంక్షోభాలు, ఎంతకీ తెరపడని రైతుల దీనావస్థలు, సంపాదన దోపిడీకి బలైపోతున్న సామాన్యజనం తలరాతలు, దశా దిశా నిర్దేశాన్ని కోల్పోయేలా యువత జీవితచిత్రాల మీద విషసంస్కృతుల దాడులు మొదలైన వాటిని హృద్యంగా చిత్రీకరిస్తూ, సమస్యలను జయించే ఒక చైతన్యవంతమైన ముగింపును కథలకు జోడించటంలో రెడ్డప్పరెడ్డి చూపిన నేర్పు అద్వితీయంగా పలకరిస్తోంది.
ప్రతి కథలోనూ అనంతపురం జిల్లా వాడుకలో వున్న సామాన్యజనం భాష విశేషంగా పాఠకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఖాద్రి నరసింహస్వామి గుడికి ప్రసిద్ధమైన ‘కదిరి’ పట్టణ ప్రజలు మాట్లాడే తెలుగును పాత్రలపరంగా ప్రవేశపెట్టి, ఒక క్రొత్త అనుభూతిని పాఠకులు ఆస్వాదించి ఆనందించేందుకు రచయిత చేసిన ప్రయత్నం చాలాకాలం గుర్తుండిపోతుంది.
___________________
దేశవ్యాప్తంగా జరుగుతున్న నిలువుదోపిడీ వ్యవహారాన్ని మానవ సంబంధాలతో, మానసిక సంఘర్షణలతో, అమాననీయ చేష్టలతో, మోసం, దగాల వికృత రూపాలతో, విలువలు మరచిన మానవ నైజాలతో ముడిపెట్టి ఒక కళాత్మకమైన రీతిలో నడిపించిన కథనాలు రెడ్డప్పరెడ్డిని ఒక విలక్షణ రచయితగా ప్రకటిస్తున్నాయి.
____________________
ఆధునిక మనిషి దురదృష్టానికి ప్రతీకలుగా నిలుస్తున్న ఈ కథలను పాఠకులు చదవడమే కాకుండా, ఆయా కథలవెంట ఇష్టంగా నడుస్తారు. కథల్లో కనిపించే చాలా నీడల్లో తన చిరునామాలను వెతుక్కుంటారు. టెర్రరిస్టులకంటే పెట్టుబడిదారీ దోపిడీ భయంకరమని ఈ కథల్లో ఎన్నో ప్రమాద సూచికలు తమ గొంతులను గట్టిగా వినిపిస్తున్నాయి.
దిగుళ్లతో నిండిపోయిన సామాన్య జనం భవిష్యత్తు వైపు దీనంగా చూస్తున్నారు. మౌనం మీ బాధ్యత కాదు, ముందుండి మమ్మల్ని నడిపించటం మీ జన్మకు సార్థకమంటూ మేధావుల ముందు సాగిలపడుతున్నారు. ఎంతో లోతైన అంశాలను తేలికైన భాషలో ఎంతో సమర్థవంతంగా కథల రూపంలో అపురూపంగా తెలుగు నేలకు అందించిన ఆచార్య వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డికి అభినందనలు.
సాహిత్య ప్రపూర్ణ డాక్టర్ కె.జి. వేణు
98480 70084











