నదిలాంటి తడిస్పర్శ పాణిరావు కవిత్వం

సహజత్వం, సరళత్వం సమంగా మిళితమై, మంచి జ్ఞాపకాలు రెక్కలు తొడిగితే నదిలాంటి తడిస్పర్శ కలిగిన కవితలు పుడతాయి. ఎర్రగుంట్ల పాణిరావు “నీరెళ్ళి పోతున్నా… నది నాతోనే” కవితా సంపుటిలోని కవిత్వం చదివినప్పుడు పాఠకులకు ఒకలాంటి మనో సంభ్రమం కలుగుతుంది. ఆయా సందర్భాల్లో భావాలలో కలిగిన సంఘర్షణ, ఇంకా మనుషుల్ని చదివిన అనుభవం తోడై ఈ కవితలు పురుడు పోసుకున్నాయి.
__________________

కవి తన ‘మనవి’లో చెప్పుకున్నట్లు అడవిలో ఎన్నో రకాల చెట్ల వంటివి, పూదోటలోని పలు రంగుల పూల వంటివి ఈ కవితలు. అక్షరాల మూటతో ఆరంభమైన అరవై అయిదు కవితల పరంపర, కొసరుగా కొన్ని మినీ కవితలు మరింత పరిమళాన్ని, హుషారును ఇస్తాయి కొసరు మాదిరిగానే.
___________________

ఈ సంపుటిలోని కవితలలోంచి కొన్ని కవితాత్మక వాక్యాలను పరిశీలిద్దాము.

‘అక్షరాలమూట’ కవితలో ఒక కవి సృజన ప్రక్రియ ఎలా మొదలవుతుందో, శూన్యం నుండి అక్షరాలు ఎలా పుడతాయో ఈ క్రింది కవితా వాక్యాలు అద్దం పడుతున్నాయి. ‘ఓ చల్లని సమీరం గుండె వాకిలి తడుతుంది/ ఓ జ్ఞాపకం అలలా తాకుతుంది/ ../ కాగితంపై కవిత్వం పంటకాలువై నర్తిస్తుంది’ అని తన అక్షరాల మూటను విప్పడం ఎంతో హృద్యంగా ఉంది. ఈ వాక్యాల్లోని సౌందర్యం ఎక్కడ ఉందంటే.. ‘స్తబ్దత’ (Static) తో మొదలై ‘చలనం’ (Motion) తో ముగియడంలో ఉంది. గడ్డకట్టిన మెదడు నుండి నర్తించే కవిత్వం వరకు సాగిన ఈ ప్రయాణం, ఒక సృజనకారుడికి మాత్రమే సాధ్యమయ్యే అద్భుతమైన మానసిక పరిణామం.

ప్రేమ లేని జీవితం నలుపు-తెలుపు లాంటిదని, జీవితం అంటే కేవలం బ్రతకడమే కాదు, అందులో రంగులు ఉంటాయని, ఆ రంగులకు ఒక అర్థం ఉంటుందని ప్రేమికులు భావిస్తారు. ఆ స్పృహ ‘సహచరి’ కవితలో ‘నువ్వు రాకపోతే../రంగులకర్థం నాకెవరు చెప్పేవారు!’ అన్నప్పుడు కలుగుతుంది. ఇక్కడ ‘రంగులు’ అంటే జీవితంలోని విభిన్న అనుభూతులు మరియు ఉత్సాహం. అవతలి వ్యక్తి రాకతోనే ఈ ప్రపంచం ఇంత అందంగా ఉంటుందని కవి భావిస్తున్నారు. అలాగే ఇదే కవితలో “కళ్ళలో గులాబీలు పూస్తాయని/నవ్వుల్లో పరిమళం ఉంటుందని/ నాకెట్లా తెలిసేది!” అన్నప్పుడు కవి చాలా చాకచక్యంగా ఇంద్రియాలను ఒకదానితో ఒకటి ముడిపెట్టారు. కళ్ళు చూడటానికి మాత్రమే కాదు, ప్రేమలో అవి గులాబీల్లా విచ్చుకుంటాయని, నవ్వు అనేది కేవలం పెదవుల కదలిక మాత్రమే కాదు, అది ఒక పరిమళంలా వెదజల్లుతుందని చెప్పడం ద్వారా ప్రేమలోని పారవశ్యాన్ని చాటి చెప్పారు. గులాబీని కళ్ళకు, పరిమళాన్ని నవ్వుకు ఆపాదించడం చాలా గొప్ప ఊహ. ఈ కవితలో ‘కృతజ్ఞతా భావం’ పరిమళిస్తుంది. ఎదుటి వ్యక్తి పట్ల ఉన్న గౌరవం, వారి వల్ల తన జీవితం ఎంత పరిపూర్ణమైందో చెప్పే తపన ఈ కవితలో స్పష్టంగా కనిపిస్తుంది. సరళమైన పదాలతోనే అత్యంత లోతైన భావాన్ని పండించిన ఇలాంటి వాక్యాలు గుండెను హత్తుకునేలా ఈ కవితలో ఉన్నాయి.

చాలా బరువైన భావాన్ని అతి తక్కువ పదాల్లో పలికించిన అద్భుతమైన వాక్యాలను ‘ఇసుక గడియారం’ కవితలో గమనించవచ్చు. ఈ కవితలో ఒకచోట “కాలాన్ని తప్పించుకోటానికి…/కాలం మీద నుంచోటానికి…/ ఎన్నో విఫల ప్రయత్నాలు చేస్తుంటాను” అంటారు కవి. ఇది ఈ కవితలో అత్యంత కీలకమైన భాగం. ఇక్కడ ​‘తప్పించుకోవడం’ అంటే వృద్ధాప్యం నుంచో, చావు నుంచో లేదా గడిచిన చేదు జ్ఞాపకాల నుంచో పారిపోవాలని చూడటం. ‘కాలం మీద నిలబడటం’ అంటే కాలాన్ని శాసించాలని, చరిత్రలో తనకంటూ ఒక శాశ్వత ముద్ర వేయాలని ప్రయత్నించడం. ఈ కవితలో ఒక రకమైన ‘నిస్సహాయత’ ఉన్నా, అందులో గొప్ప ‘సత్యం’ ఉంది. కాలం కురుస్తున్న వర్షం అయితే, మనం తడవకుండా ఉండాలని చూసే బాటసారులం. కాలంతో పోటీ పడలేమని తెలిసినా, ఆ ప్రయత్నం చేయడమే మనిషి నైజం అనే తాత్త్విక సత్యాన్ని తెలియజేసే కవిత ఇది.

భౌతిక సంపద కంటే మానవీయ సంబంధాలే మిన్న అని చాటిచెప్పే మంచి కవిత “ఎన్ని ఉన్నా”. ఆధునిక కాలంలో మనిషి వస్తువుల మధ్య జీవిస్తున్నాడే తప్ప మనుషుల మధ్య కాదనే చేదు నిజానికి ఈ కవిత ఒక దర్పణం. అందుకు ఈ కవితాత్మక వాక్యాలు నిదర్శనం. “ఇంటి నిండా ఎన్ని కుర్చీలు సోఫాలు ఉన్నా/ నలుగురు మిత్రులు/../ కాసిన్ని పలకరింపుల పన్నీరు జల్లకుంటే/ ఆ ఇల్లు ఇల్లే కాదు”. ఇక్కడ కుర్చీలు, సోఫాలు అనేవి కేవలం గృహోపకరణాలు మాత్రమే కాదు, అవి మనిషి పోగుచేసుకున్న ఆస్తికి, విలాసానికి చిహ్నాలు. ఇల్లు వస్తువులతో నిండి ఉండవచ్చు, కానీ ఆ వస్తువులు మనిషికి సౌకర్యాన్ని ఇస్తాయే తప్ప సంతోషాన్ని ఇవ్వలేవు. ఇల్లు ‘నిండుగా’ కనిపించడానికి వస్తువులు సరిపోవు అని కవి ఇక్కడ సున్నితంగా గుర్తుచేస్తున్నారు. ఇక్కడ పలకరింపును ‘పన్నీరు జల్లు’తో పోల్చడం చాలా గొప్ప ప్రయోగం. పన్నీరు ఎలాగైతే మనసుకి హాయిని, పరిమళాన్ని ఇస్తుందో, ఆత్మీయుల పలకరింపు కూడా అలసిపోయిన మనిషికి అటువంటి ఉత్తేజాన్నే ఇస్తుంది. మంచి మిత్రులు వచ్చి కూర్చున్నప్పుడే ఆ కుర్చీలకు, సోఫాలకు ఒక సార్థకత ఏర్పడుతుంది. ఆ మాటల వల్ల కలిగే సందడి ఇంటికి జీవకళను తెస్తుంది. “ఆ ఇల్లు ఇల్లే కాదు” అనడం గోడలు, పైకప్పు, ఖరీదైన సామాగ్రి ఉంటే అది కేవలం ఒక ‘కట్టడం’ మాత్రమే. కానీ ఎక్కడైతే ప్రేమలు, పలకరింపులు, స్నేహాలు ఉంటాయో అప్పుడే అది ఒక ‘ఇల్లు’ అవుతుంది. మనుషులు లేని ఇల్లు ఒక ప్రదర్శనశాల లాంటిదే తప్ప, నివసించదగ్గ ప్రదేశం కాదని కవి భావం. ఈ కవితలో యాంత్రికమైపోతున్న నేటి జీవనశైలిలో స్నేహానికి, ఆత్మీయతకు పట్టం కట్టిన కవి హృదయం నిజంగా అభినందనీయం.

మూడే మూడు ఆవృతాలతో, క్లుప్తత పాటిస్తూ ముగిసిన “ఉషోదయపు వేళ” కవిత పరిమాణంలో చిన్నదే కావచ్చు కానీ, అది పండించిన భావం మాత్రం అనంతం. ప్రకృతి నేపథ్యంతో, ఒక అద్భుతమైన ఎత్తుగడతో సాగిన ఈ కవితా నిర్మాణం పాఠకుడిని ఆలోచనలో పడేస్తుంది. ​ “అస్తమయం నిశ్చయమని తెలిసి/ వెలుగులీను మోము/ నది అద్దంలో చూడ/ కొండలు కోనలు/ దూకి వస్తున్న సూర్యునిది/ ఎంత ఆత్రుత…” అంటూ కవి ఉషోదయాన్ని వర్ణించిన తీరు అనితరసాధ్యం. సాయంత్రానికి తాను అస్తమించక తప్పదని సూర్యుడికి తెలుసు. అయినా, ఆ కఠిన సత్యానికి వెరవకుండా, ఉదయాన్నే ఎంతో ఉత్సాహంతో వెలుగులు విరజిమ్ముతూ..నది అనే అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ పయనిస్తున్నాడు అనే భావాన్ని పలికించారు. ముగింపు సిద్ధమని తెలిసినా, ఉన్నంత కాలం తన కర్తవ్యాన్ని అత్యంత ప్రకాశవంతంగా నిర్వహించాలనే ‘జీవన తత్వాన్ని’ ఈ వాక్యాలు ప్రతిబింబిస్తున్నాయి.

​ ఈ కవిత కేవలం బాహ్య ప్రకృతి వర్ణన మాత్రమే కాదు; నిరంతరాయంగా సాగే జీవన గమనాన్ని గుర్తుచేసే ఒక అంతర్మథనం. జీవితం చిన్నదైనా, మరణం తథ్యమని తెలిసినా.. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, ఇతరులను ప్రేమిస్తూ సాగిపోవడమే పరమార్థమని కవి ఇక్కడ బోధిస్తున్నారు.

​ ఇందులో కవితాత్మ సకల చరాచర సృష్టిని ఒకే కుటుంబంగా దర్శిస్తోంది. ముఖ్యంగా, నది ప్రయాణాన్ని ‘మాతృ ప్రేమ కథ’ తో పోల్చడం ద్వారా ప్రకృతిని ఒక కన్నతల్లిలా కవి ఆరాధించారు. ప్రకృతిలోని ప్రతి మార్పులోనూ ఒక ఆవేదనను, ఒక అనురాగాన్ని పట్టుకోగలిగే సున్నితత్వం కవి అంతరంగంలో నిండి ఉండటం వల్లే ఇటువంటి అద్భుత సృజన సాధ్యమైంది.

“సూర్యతాపం, హిమపాతం వంటివి ఈ భూమికి పరితాపం కలిగించవు కానీ, ఘనీభవించిన మేధావుల పోరాటం వాటికంటే మిక్కిలి పరితాపం”అంటారు ఒక కవితలో. మేధావుల మౌనం, వాళ్ల కినుక, సమాజాన్ని అధోగతి పాలు చేస్తాయి. సమస్యల మీద పోరాడే మేధావి వర్గం ఏ కారణం చేతనైనా తటస్థంగా ఉంటే, వాళ్లు సమాజానికి ఎంతో నష్టం కలిగించిన వారవుతారు (దుఃఖభూమి)
___________________

ఒక కవితకు ఎత్తుగడ అనేది ‘ఆకర్షణ’ లాంటిది. అది ఎంత బలంగా ఉంటే పాఠకుడు అంతగా కవితలోకి లీనమవుతాడు. అలాగే, ముగింపు అనేది కూడా కవితలోని సారాన్ని ఒకే ఒక మెరుపులా పాఠకుడి గుండెల్లో నాటాలి. అనవసరమైన పదజాలం లేకుండా చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పడమే కవిత్వానికి అసలైన అందం. తక్కువ పదాల్లో ఎక్కువ భావాన్ని పండించడం వల్ల కవితకు ‘గాఢత’ పెరుగుతుంది. ఈ లక్షణాలు ఈ సంపుటిలోని చాలా కవితలలో మనం గమనించవచ్చు.
___________________

కొన్ని కవితలు చదవగానే తికమక, కొన్ని కవితల్లో భావ సంక్లిష్టత, ఎందుకు రాసారో తెలియనంత గాఢతతో కూరుకుపోయి ఉంటాయి. అలాకాకుండా సరళ అభివ్యక్తితో, పాఠకుల మనసును తాకే కవితలు అందించారు పాణిరావు గారు.

ఎలాంటి వివాదాలు, అస్తిత్వ వాదాలు సోకని స్వచ్ఛమైన కవిత్వమిది. ఆగకుండా చదివిస్తూ పోవడమే ఈ కవిత్వ సంపుటి ప్రత్యేకత‌.

-రాజేశ్వరరావు లేదాళ్ళ
లక్షెట్టిపేట, 94418 73602