మధ్యతరగతి జీవన వ్యథలే విహారి కథలు

తెలుగు కథా సాహిత్యంలో గురజాడ అప్పారావు నుండి నేటి తరం రచయితల వరకు ఎంతోమంది మధ్యతరగతి వర్గానికి తమ కథలలో సముచిత స్థానాన్ని కల్పించారు. చాసో, రావిశాస్త్రి, కొడవగంటి కుటుంబరావు, గోపీచంద్, కాళీపట్నం రామారావు వంటి దిగ్గజాలు ఈ వర్గపు జీవన చిత్రాలను అద్భుతంగా ఆవిష్కరించారు. అయితే, మధ్యతరగతి వర్గానికి తెలుగు కథా సాహిత్యంలో అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి, వారి జీవితాలను ఒక ప్రత్యేక అధ్యయనంగా మార్చిన అగ్రశ్రేణి కథా రచయితలలో శ్రీ విహారి గారు ప్రముఖంగా నిలుస్తారు. మధ్యతరగతి కుటుంబ జీవితాలలోని సంక్లిష్టతలు, వ్యక్తిగత సంబంధాలలోని సున్నితత్వం, మమకారాలు, ఆశానిరాశల పట్ల విహారికి ఉన్న లోతైన అవగాహన ఆయన కథల్లో అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తుంది.
__________________
మధ్యతరగతి జీవితాలు చాలా చిత్రమైనవి. ఆదాయం పరిమితంగా ఉన్నా, అవసరాలు, ఆప్యాయతలు, అనుబంధాలు మరియు బాధ్యతలు మాత్రం అపరిమితంగా ఉంటాయి. ఈ సమస్యల ప్రవాహాన్ని ఒడిసిపట్టి, సామాన్యుడి మనసులోని ఆవేదనను అక్షర రూపంలో కూర్చినవే విహారి కథలు.
____________________

మధ్యతరగతి వర్గం అంటే ఒక రకమైన ‘త్రిశంకు వర్గం’. అనివార్య పరిస్థితులు నెట్టుకుపోతే ఆ పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయి, నిరంతర పోరుతో సతమతమై, చివరకు ఆ పోరాటంలోనే సమసిపోతున్న ఈ వర్గానికి విహారి తన కథానికల్లో అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఆయన దృష్టిలో మధ్యతరగతి మనిషి అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక సామాజిక సంక్షోభానికి నిలువుటద్దం.

జీవితంలోని ప్రతి అడుగులోనూ నిరాశ నిస్పృహలకు లోనయ్యే పాత్రలు విహారి కథల్లో దర్శనమిస్తాయి. అయితే, ఒక రచయితగా విహారి తన కథను ఎప్పుడూ నిరాశతో ముగించరు. కథ చివర్లో సమస్యకు ఒక సానుకూల పరిష్కారాన్ని లేదా ఆ దిశగా ఒక సానుకూలమైన ఆలోచనను పాత్రకు కల్పిస్తూ ముగించడం ఆయన ప్రత్యేకత.

విహారి కథలు జీవితం పట్ల ఆశను, భరోసాను కలిగిస్తాయే తప్ప అశాంతిని కలిగించవు. కథల్లోని వాతావరణ కల్పన, పాత్రల స్పందనలు, ప్రతిస్పందనలు ఆయా కథలకు ఒక కొత్త జీవకళను చేకూరుస్తాయి. మధ్యతరగతి మనుషుల వ్యక్తిత్వాలను ఆయా కథల పరిధిలోనే స్పష్టంగా తీర్చిదిద్దగలగడం విహారి రచనా కౌశలానికి ఒక గొప్ప తార్కాణం. మధ్యతరగతి వ్యవస్థకు సంబంధించిన మౌలిక సూత్రాలను కథలుగా మలిచిన వాళ్ళు తెలుగు సాహిత్యంలో అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు, వారిలో విహారి అగ్రగణ్యులు.

“చేతిలో వెన్న” కథలో అనేక బాధ్యతల నడుమ జీవితాన్ని వెళ్ళదీస్తున్న రామారావు పాత్ర మనకు కనిపిస్తుంది. ఈ పాత్ర నేటి సమాజంలోని అనేక కుటుంబాల్లోని తండ్రికి ప్రతిరూపం. కథ మొత్తంలో రామారావు ‘నేను’ అనే పదాన్ని పదే పదే స్మరించుకుంటాడు. ఈ ‘నేను’ అనే పదం వారి జీవితంలో కోల్పోయిన సంతోషాలకు, వారి అస్తిత్వ వేదనకు సంకేతం. పిల్లలు అడిగే చిన్న చిన్న కోరికలు తీర్చలేక, వారికి సరైన భవిష్యత్తును అందించలేక తల్లడిల్లే ఒక మధ్యతరగతి తండ్రి ఆవేదన ఈ కథలో రామారావు ద్వారా వ్యక్తమవుతుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనను ధైర్యంగా అందుకోవడానికి సిద్ధపడాలనే సందేశాన్ని రచయిత ఇందులో అందించారు. అవకాశం వచ్చినప్పుడే దాన్ని స్వీకరించాలి, లేదంటే అది ‘చేతిలో వెన్న’లా కరిగిపోతుందని రచయిత హెచ్చరిస్తారు. మధ్యతరగతి జీవులకు అవకాశాలు కూడా అటువంటివేనని, సమయం వచ్చినప్పుడే వాటిని అందుకోవాలని విహారి సూచించారు.

“స్పృహ” కథలో జీవితంలో అడుగడుగునా నిరాశనే ఎదుర్కొంటూ, తనను తాను దురదృష్టవంతుడిగా భావించే ఒక వ్యక్తి మనస్తత్వాన్ని చిత్రించారు. అయితే, తనకన్నా దుర్భరమైన స్థితిలో ఉన్న మరొక వ్యక్తి జీవితంతో పోల్చుకున్నప్పుడు అతని ఆలోచనా విధానంలో వచ్చే మార్పు ఈ కథలో ప్రధానాంశం. జీవితాన్ని నిశితంగా పరిశీలించిన విహారి లాంటి రచయితలు మాత్రమే ఇటువంటి కథలు వ్రాయగలరు. ఈ కథలో ఒక రకమైన మధ్యతరగతి జీవన వేదాంతం కనిపిస్తుంది. ఎదురీత లేనిదే సంసార సాగరాన్ని దాటడం కష్టమన్న నిజాన్ని రచయిత పాఠకులకు గుర్తు చేస్తూ, ప్రతి సంఘర్షణను ధైర్యంగా ఎదుర్కోవాలన్న ‘స్పృహ’ను కలిగిస్తారు.

మధ్యతరగతి ఆర్థిక దుస్థితికి, వారి జీవితాల మందగమనానికి ప్రతీకగా “చక్రనేమి క్రమం” కథ నిలుస్తుంది. విలువలు వేగంగా మారుతున్న ఈ స్వార్థ సమాజపు ప్రవాహంలో మధ్యతరగతి మనిషి కొట్టుకుపోకుండా ఉండాలంటే ఎవరో ఒకరి ఆసరా అవసరమని విహారి వివరించారు. గడియారంలోని అన్ని చక్రాలు సమన్వయంతో తిరిగితేనే సమయం సరిగ్గా తెలుస్తుంది. అలాగే, కుటుంబంలో నలుగురు కష్టపడితేనే ఆర్థిక సుస్థిరత లభిస్తుంది. మనిషి ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే సమాజంలో హోదా, గౌరవం లభిస్తాయని ఈ కథ ద్వారా రచయిత తెలిపారు. కేవలం డబ్బు మాత్రమే కాకుండా, విలువలతో కూడిన సుస్థిరత వల్ల వచ్చే గౌరవం చాలా గొప్పదని రచయిత ఇందులో స్పష్టం చేశారు. జీవితంలో డబ్బుకి ఎంతవరకు ప్రాముఖ్యమివ్వాలో తెలియజేసిన కథ ఇది.

“విగతం” కథలో మానసిక ప్రశాంతతకు మనసే పుట్టిల్లు అని విహారి గారు చక్కటి సందేశం ఇచ్చారు. ఆర్థిక అవసరాల నేపథ్యంలో మధ్యతరగతి జీవితాల్లో మానవ సంబంధాలు ఎలా పల్చబడుతున్నాయో విహారి ఎత్తి చూపారు. మనిషి ప్రశాంతత కోసం దేశమంతా తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా అందరిదీ అదే సమస్య అని గ్రహిస్తాడు. మధ్యతరగతి జీవితాలన్నీ ఒకే దారంలో గుచ్చిన పూసల్లాంటివని, ఆర్థిక సూత్రమే ఆ పూసలకు ఆధారమని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. మనిషి దేని కోసం బతకాలి, ఏం కోరుకోవాలి, ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది వంటి ప్రశ్నలకు ఈ కథలో సమాధానాలు వెతికారు రచయిత.

మధ్యతరగతి జీవితాల్లో డబ్బు చేసే గారడీని “నెత్తుటి కన్నా చిక్కనిది” కథలో ఎంతో హృద్యంగా చిత్రించారు. బడ్జెట్ బతుకుల లీలలు ఏ విధంగా ఉంటాయో ఈ కథ చదివితే తెలుస్తుంది. అవసరాలకు మాత్రమే గుర్తొచ్చే ఆప్యాయతలను, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఊగిసలాడే మనస్తత్వాన్ని ఈ కథలో చూడవచ్చు. అలాగే “జానకి” పాత్ర ద్వారా ఎన్నో కష్టాలను ఓర్చి నిలబడిన ఒక ధైర్యవంతురాలైన స్త్రీని విహారి గొప్పగా తీర్చిదిద్దారు. పెళ్లి అయిన నాటి నుండి ఆమెకు అడుగడుగునా ఇబ్బందులే. చాలీచాలని జీతంతో బతుకుతూ, తన కలలను రెప్పల కింద ఆలోచనల పాతరలో నిల్వ చేసుకునే జానకి కథను రచయిత ఒక ప్రశ్నతో ముగించారు. ఆమె కుటుంబ బంధానికి ప్రాధాన్యతనిచ్చి భార్యగా ఉండాలా లేక జీవితంలో పోరాడిన ఆత్మస్థైర్యం గల స్త్రీగా నిలబడాలా అన్న ప్రశ్నను పాఠకుల ముందుంచి వారిని తీవ్రంగా ఆలోచింపజేశారు.

మధ్యతరగతి జీవితంలోని అనుబంధాలు, ఆప్యాయతలు తామరాకు మీద నీటి బిందువుల్లా ఉంటాయని తెలిపే అద్భుతమైన కథ “నిరీక్షణ”. పిల్లలను ప్రయోజకులను చేసిన తర్వాత, చివరి దశలో నిస్సహాయతతో సేవ చేసేవారు లేక తపన పడే ఒక తండ్రి ఆవేదన ఇందులో కనిపిస్తుంది. మధ్యతరగతి జీవితం దూరపు కొండల నునుపులా కనిపిస్తుంది కానీ దగ్గరకు వెళ్లి చూస్తే జీవితమంతా అడవులు, కొండలేనని విహారి వర్ణించారు. అందుకే ఈ జీవితాన్ని అనుభవిస్తున్న వారు గుండెలు కూడా రాతిమయం చేసుకోవలసిన స్థితి ఏర్పడింది. మారుతున్న కాలంతో పాటు మానవీయ విలువలు ఎలా అంతరించిపోతున్నాయో ఈ కథ స్పష్టం చేస్తుంది.

ఉన్నదానితో సంతృప్తి చెందక, లేనిపోని భేషజాలకు పోయి మిధ్యాడంబరాన్ని ప్రదర్శించి ప్రాణాల మీదకు తెచ్చుకునే శంకరయ్య పాత్ర ద్వారా “కొత్త పాఠం” కథలో మధ్యతరగతి బలహీనతలను విహారి విమర్శనాత్మకంగా చూపారు. ఎదుటివారి దగ్గర తమ గొప్పలు చెప్పుకోవాలనే కోరికతో బతుకుతూ, అప్పుల పాలై చివరకు చెడ్డ పేరు తెచ్చుకునే వ్యక్తుల మానసిక స్థితిని ఈ కథలో రచయిత కళ్ళకు కట్టినట్లు చూపించారు.

చిన్న చిన్న సుఖ సంతోషాలు సైతం జారిపోతున్నాయని మదనపడే మురళి పాత్ర “మిస్టర్ ఆక్రోషం” కథలో కనిపిస్తుంది. వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలకు మధ్యతరగతి మనిషి కేవలం నిశ్శబ్ద సాక్షిగా ఉండిపోతున్నాడని, విలువలు మంటగలిసిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ వర్గం ఉందని రచయిత చిత్రించారు.

ఇక నగర జీవనంలోని ఆర్థిక ఇబ్బందులను “ఉభయకుశలోపరి” కథలో ఎంతో వాస్తవికంగా చూపారు. తాగునీరు, ట్రాఫిక్, మురికి రోడ్లు, స్కూల్ ఫీజుల వంటి సమస్యల మధ్య చిరుద్యోగుల బతుకు కత్తి మీద సాములా ఉంటుంది. పెరుగుతున్న ధరలు చూసి ‘వెధవ ఉద్యోగాలు చేసే కంటే పేవ్ మెంట్ మీద బజ్జీలు అమ్ముకోవడం బెటర్’ అన్న మాటల్లో మధ్యతరగతి కసీ, ఆవేదనా ధ్వనిస్తున్నాయి. ‘మధ్యతరగతి వాళ్లు శ్లేష్మంలో ఈగల్లా కొట్టుకు చస్తున్నారు’ అన్న రచయిత మాటలు ఈ వర్గపు వేదనను అద్దంలో చూపిస్తాయి. సిటీ లైఫ్ అంతా రంగుల చిత్రమని, అంతా స్వార్థమేనని, డబ్బున్నవాడే గొప్పవాడనే భావజాలం మధ్య సామాన్యుడి ఒత్తిడిని ఈ కథ ప్రతిబింబిస్తుంది.
__________________
ముగింపుగా చెప్పాలంటే, మధ్యతరగతి జీవన వ్యథలను కథలుగా మలిచిన విహారి, ఆ వర్గాన్ని ఒక ఇంటి పేరుగా మలిచి తెలుగు సమాజానికి సరికొత్తగా పరిచయం చేశారు. కుటుంబ వ్యవస్థల సాధక బాధకాలను విహారి చెప్పినంత లోతుగా మరెవ్వరూ చెప్పలేరనడంలో అతిశయోక్తి లేదు. కథలోని వస్తువు మనకు తెలిసిందే అయినా, దాన్ని కొత్త కోణంలో నడిపించడం విహారి ప్రత్యేకత. డబ్బు సృష్టించిన అనేక రంగుల వలయాల మధ్య మధ్యతరగతి మనిషి అల్లుకుపోవడం ఆయన కథల్లో ప్రధానాంశం.
_____________________

మధ్యతరగతి జీవితాన్ని అనుభవించిన వ్యక్తిగా, ఆ జీవిత పరమార్థాన్ని ఆకళింపు చేసుకున్న జ్ఞానిగా విహారి చిత్రించిన ఈ కథలు అటు పాఠకుల హృదయాల్లోనూ, ఇటు సాహితీ విమర్శకుల ఆలోచనల్లోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి.

 

-డా. బి.విజయేశ్వర రావు
94905 44551