అనువాదాలలో పదాల ఎంపిక

కొంతమందికి (లేక చాలామందికే కావచ్చు) పక్కకు జరగకుండా చేసే అనువాదాలు నచ్చవు. కానీ ఆ మాటను వారు బాహాటంగా అనరు. అంటే, వారికి స్వేచ్ఛానువాదం లేదా అనుసృజన నచ్చుతుందని అర్థం. ఇందులో ఆక్షేపించతగింది ఏమీ లేదు. ఈ రెండు రకాల తర్జుమాలు కూడా మంచివే. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది సుప్రసిద్ధ రచయితలు, అనువాదకులు మూలానికి పూర్తిగా విధేయంగా ఉంటూ చేసే అనువాదాలనే సిఫార్సు చేస్తారు, చేశారు అనడంలో సందేహం లేదు. అటువంటి అనువాదాలను ప్రమాణం (benchmark) గా పెట్టుకుని రాస్తున్న వ్యాసం ఇది.
___________________

ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేస్తున్నప్పుడు మూలంలో cruelty అనే మాట వస్తే అనువాదకుడు ఏ పదాన్ని ఎన్నుకోవాలి? “క్రూరత్వాన్ని లేదా క్రౌర్యాన్ని,” అని జవాబిస్తే, “కాదు, కటుత్వాన్ని,” అని వాదించవచ్చు ఎవరైనా. కటుత్వాన్ని ఎంచుకోవాలని కొందరికి ఎందుకనిపిస్తుందంటే క్రూరత్వం, క్రౌర్యం తత్సమ శబ్దాలు కాగా కటుత్వం దేశ్యం.
___________________

మొదటి రెండు పదాలలో సంయుక్తాక్షరాలున్నాయి కనుక, అవి సరళమైనవి కావన్నది కూడా కారణం కావచ్చు. అసలు అవి సంస్కృతం నుండి వచ్చినవి అన్నది అతిపెద్ద నెపం! కానీ క్రూరత్వంలోని తీక్ష్ణత లేదా తీవ్రత (intensity) కటుత్వంలో లేదు. కటుత్వం harshness కు బాగా సరితూగే, పొసగే పదం. కాబట్టి, క్రూరత్వానికి బదులు కటుత్వాన్ని వాడితే మూలంలోని భావం వంద శాతం తర్జుమాలోకి దిగదు. నిజానికి అది blunted – అంటే పదును కోల్పోయిన మొండిది – అయిపోతుంది. మరోవిధంగా చెప్పాలంటే, cruelty వేరు harshness వేరు అన్నదాంట్లో అనుమానమే లేదు. కక్కసం, కటికితనం లాంటి కొన్ని అచ్చమైన తెలుగు పదాలున్నాయి కానీ అవి ‘కామన్ కరెన్సీ’ (వ్యవహారం) లో లేవు. కాబట్టి కచ్చితమైన (accurate) తర్జుమా చేయాలనుకున్నప్పుడు, సంస్కృత పదాల మీద ఉండే ద్వేషాన్ని త్యాగం చేయక తప్పదు. అలా చేయకపోవడం స్వతంత్ర రచనలలో కొంతవరకు సబబే.

కొన్ని సంవత్సరాల క్రితం నేను రాసిన కరకు వాస్తవం అనే కవిత తెలుగువెలుగు పత్రికలో అచ్చైంది. కొంతమంది కవిమిత్రులు ఆ శీర్షిక సబబుగా లేదనీ, ‘కఠిన వాస్తవం’ సరిగ్గా ఉంటుందనీ అన్నారు. అయితే నేను ఆంగ్లంలోని harsh truth ను మనసులో పెట్టుకొని దాన్ని నిశ్చయించుకున్నాను. అది ఇంగ్లీషులో చాలా విరివిగా కనిపించే పదబంధం. అప్పుడు harsh truth కు కచ్చితంగా అతికే పదం ‘కరకు’నే అవుతుంది. కొందరు కఱకు అని రాస్తారు. దానికి ఆక్షేపణ తెలుపలేం. కానీ అట్లా ముందే ఇంగ్లీషు శీర్షికను ఫిక్స్ చేసుకోవడంలో విజ్ఞత, సమంజసత్వం లేవు. పైగా అది అనువాదం కాదు. అందుకే దాన్ని ‘కఠిన వాస్తవం’గా మార్చి, నా ‘ఉర్రూత’ సంపుటిలో చేర్చుకున్నాను. కానీ కఠిన వాస్తవం hard truth తో ఎక్కువగా పొసగుతుంది. అయినా కవిత లోపలి భావంతో అన్వయించి చూసుకుంటే అది బాగానే నప్పింది.

మూడున్నర దశాబ్దాల క్రితం నేను ఆదిలాబాద్ జిల్లాలో పని చేసినప్పుడు సామల సదాశివ మాస్టారు గారు కిషన్ సింగ్ చావ్డా రాసిన ‘అంధేరీ రాత్ కే తారే’ అనే పుస్తకాన్ని నాకు ఇచ్చి, అందులోని ఒకటి రెండు వ్యాసాలను తెలుగు చేసే పని అప్పజెప్పారు. నేను చేసిన అనువాదాలు వారికి నచ్చాయి. కచ్చితంగా జ్ఞాపకం లేదు కానీ, అందులో నేనొక సంస్కృత పదం వాడాను. ఛందోబద్ధ పద్యాలలో, గ్రాంథిక వచనంలో సంస్కృత పదాలు ఉండవచ్చునని నమ్మే సదాశివ గారు వచన కవిత్వంలో, వర్తమాన వచనంలో అవి తక్కువగా ఉండాలని తరచుగా అనేవారు. అయినా “డాక్టరు గారూ, ఇక్కడ మీరు వాడిన సంస్కృత పదం చాలా బాగా అతికింది. వేరే ఏ అచ్చమైన తెలుగు పదాన్ని వాడినా ఇంత కచ్చితంగా సరిపోయేది కాదు,” అన్నారు సారు. అనువాదంలో భావం ఎప్పుడూ మూలంలోని భావానికి అతి దగ్గరగా ఉండటం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. దాని తర్వాతనే మిగతావి అన్నీ.

మరొక ఉదాహరణ: మా అన్నయ్య నాగరాజు రామస్వామి రాసిన ఉద్భ్రాంత పాంథుడు అనే కవితను నేను ఆంగ్లంలోకి అనువదించినప్పుడు, శీర్షికకు సమానార్థకంగా A Befuddled Wayfarer అనే పదబంధాన్ని వాడాను. అది బరువైన పదబంధం అన్నది వాస్తవం. మూలంలోని ఉద్భ్రాంత పాంథుడు కూడా బరువైనదే మరి. ఒకవేళ ఆ శీర్షిక ‘తికమక యాత్రికుడు’ అయివుంటే, నేను దాన్ని అంతే బరువున్న Confused Traveller అని అనువదించేవాడిని. ప్రతి మాటను ఇంత కచ్చితంగా అనువదించాలని అనడం లేదు. ‘కీలకమైన’ అన్ని పదాల విషయంలో ఇదే పద్ధతిని అవలంబిస్తే, మూలంలోని శైలిని కూడా చాలా వరకు కాపాడినవాళ్లమౌతాం. మనకు ఇష్టమైన మాటలను, ఊతపదాలను, స్వతంత్ర రచనలలో మనం తరచుగా వాడే పదాలను ఉపయోగిస్తే, మూలరచయిత శైలి కాకుండా మన (అనువాదకుని) శైలి ప్రతిబింబించి, అంతిమ లక్ష్యానికి గండి కొడుతుంది.

అదేవిధంగా, ఒక ఆంగ్ల కవితకు శీర్షిక Equinox. ఈ పదానికి అర్థం రాత్రీ పగలూ సమానంగా (సరిగ్గా 12 గంటలు) ఉండే రోజు. కానీ కవితా శీర్షిక సాధ్యమైనంత వరకు అంత పొడవుగా ఉండకూడదు కనుక, అది పనికి రాదు. మూలంలోని శీర్షికలో ఒకే పదం ఉంది కాబట్టి, అనువాదంలో కూడా సాధ్యమైనంత వరకు ఏకపద శీర్షికను పెట్టడం సమంజసం. అచ్చమైన తెలుగులో అటువంటిది దొరకదు. ఇక్కడ విషువత్ అనే మాట సరిగ్గా పొసగుతుంది. కానీ అది కఠినమైన పదం అని అభ్యంతరం చెప్పవచ్చు. మరి Equinox సరళమైన పదమా? విషువత్ సంస్కృత శబ్దం అనే మిషతో దాన్ని తిరస్కరిద్దామా? వీలైన ప్రతి సందర్భంలో మాటలను యథాతథం (as it is) గా తర్జుమా చేయాలని చెప్పడాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. ‘యథాతథంగా’ను ‘మక్ఖీకి మక్ఖీ’గా పొరబడకూడదు. పైకి, లిటరల్ గా ఈ రెండు మాటలు ఒకటే అనిపించవచ్చు గానీ, మొదటిదాన్ని పాజిటివ్ సందర్భాలకు, రెండవదాన్ని నెగెటివ్ సందర్భాలకు ఉపయోగించాలి. అంటే ఏ ఎబ్బెట్టుతనం లేకుండా, నవ్వు తెప్పించకుండా, సహజంగా, సమంజసంగా ఉన్నప్పుడు యథాతథంను; ఎబ్బెట్టుతనంతో, నవ్వు తెప్పించే విధంగా, అసహజంగా, అసమంజసంగా ఉన్నప్పుడు మక్ఖీకి మక్ఖీని అన్వయించుకోవాలి. ఈ రెండవ పదం చాలా వరకు జాతీయాలను (idioms ను) అనువదించేటప్పుడు దొర్లుతుంది.

ఈ చర్చ ఎవరిలోనైనా సందేహానికి, తికమకకు తావిస్తే నేను చింతిస్తాను. ఏ అనువాదకులైనా స్వేచ్ఛానువాదాన్నో, అనుసృజననో ఇష్టపడితే వారు దాన్నే అనుసరించవచ్చు.

 

– ఎలనాగ
98669 45424