కవి ఎప్పుడూ స్వేచ్ఛా విహారిగా ఉంటాడు. తన మనసులో ఉప్పొంగే అపరిమితమైన భావాలకు అక్షరాలతో రెక్కలను తొడుగుతాడు. ఈ దుఃఖమయమైన మానవ ప్రపంచానికి కొత్త ఆశలను బహూకరిస్తాడు. వర్తమానంలోని ఇబ్బందులు కేవలం తాత్కాలికమేనని ఉద్బోధిస్తాడు. భరోసానిచ్చే కవితా వాక్యాలతో మనలను పలకరిస్తూ, నీవొక్కడి బాధ నీది మాత్రమే కాదని, అది మనందరిదని చాటుతాడు. కవిత్వమంటే కేవలం కమ్మని ఊహాగానం మాత్రమే కాదు, అది సామూహిక చైతన్యానికి ఒక బావుటా అని నిరూపిస్తాడు.
___________________
ఆధునిక తెలంగాణ తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులైన కవి పసునూరి శ్రీధర్‌బాబు ‘అనేక వచనం’ (1999), ‘నిదురపోని మెలకువ చెప్పిన కల’ (2021) కవితా సంపుటాల ద్వారా కవిత్వంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా ఆయన తన మూడో కవితా సంపుటి ‘ఏకాంతం ఒక అతిథి’ని వెలువరించారు. సమకాలీన అంశాలపై పాత్రికేయులుగా ఎంతో పరిశోధించి స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తారు శ్రీధర్‌బాబు.
_____________________
గత నాలుగు దశాబ్దాలుగా ఆయన అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కవిత్వం రాస్తూనే ఉన్నారు. మానవ జీవితాలను ప్రభావితం చేస్తున్న అన్ని రకాల భావజాలాలను సునిశితంగా గమనిస్తూనే, అత్యంత మానవీయమైన కోణంలో పసునూరి తన కవిత్వాన్ని సృజిస్తున్నారు.
‘కవిత్వంలో ఏముంది?’ అనే కవిత ద్వారా ఆయన అనేక లోతైన విషయాలను మనకు బోధపరుస్తున్నారు. కవి జీవనయానానికి కవిత్వం ఎటువంటి ఊపిరిని అందిస్తుందో ఈ కింది వాక్యాల ద్వారా మనం తెలుసుకోవచ్చు:
‘అందుకే/ నన్ను కవిత్వంలో చూసుకో/ అదే నా అసలైన జీవితం/ నా ప్రాణానికి మరో దేహం/ మిగిలినదంతా/ నిచ్చెనమెట్లు/ పాకుడురాళ్ళు/ ఉరితాళ్ళు/ ఖాళీ కళ్ళు దోసెళ్ళు/ ఉనికిని విలువలతో వడబోసుకుంటే/ మిగిలిన మట్టి’
ఈ కవితా వాక్యాలు కవి ఆలోచనలకు ప్రతీకలుగా నిలిచాయి. కవిత్వం పట్ల ఆయనకు ఉన్న తిరుగులేని నిబద్ధత ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనిషి జీవితం అనేది బహుచిత్రమైనది. నిరంతరమైన ఆలోచనా స్రవంతిలో మనిషి తన మనుగడ కోసం అనేక మార్గాలను అన్వేషిస్తుంటాడు. తనకు అనువైన ప్రాంతం కోసం, అనువైన మనుషుల కోసం నిరంతరం తండ్లాడుతుంటాడు. బయటి ప్రపంచానికి సర్దుబాటుకు లొంగిపోయినట్లుగానే కన్పిస్తాడు కానీ, తన అస్తిత్వం విషయంలో ఎవరికీ లొంగడు. తనదైన ప్రత్యేక పాదముద్రలతో జీవితంలో చలిస్తుంటాడు. అందుకనే మనం సాధారణంగా ఒకరిని మరొకరితో పోల్చుకుంటాము తప్ప, పూర్తిగా అచ్చుకాగితంలా ఎవరు ఉండరు.
ప్రతి కవికి, రచయితకు ఒక పాఠకుడు కావాలి. కేవలం చదివేవాడే కాదు, స్పష్టంగా తన అభిప్రాయాల్ని వెల్లడించే అచ్చమైన పాఠకుడు కావాలి. సహృదయతతో కూడిన పాఠకుని కోసం కవి నిరంతరం అన్వేషిస్తూనే ఉంటాడు. అట్లాంటి పాఠకుడి కోసం ‘ఓ పాఠకుడా..!’ అనే కవితను రాశారు. ఆ పాఠకుడితో ఆయన ఎలా మాట్లాడుతున్నారో ఈ వాక్యాల ద్వారా గమనించవచ్చు:
‘కానీ, ఒక్క మాట/ ఎదురైన ప్రతి మనిషినీ పలకరిద్దాం/ పరిచయం చేసుకుందాం/ పూలు పరిమళంతో పరిచయం చేసుకున్నట్లు/ ముల్లు గాయంతో పరిచయం చేసుకున్నట్లు/ ఎలాగోలా ఎంతో కొంత మాట్లాడుకుందాం’
మనం ఎంతగానో అభిమానించిన వాళ్లు మరణంతో దూరమైతే తట్టుకోవడం చాలా కష్టం. మరి మనకు జన్మనిచ్చిన తండ్రి దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. తండ్రితో తనకున్న జ్ఞాపకాలు అనంతమైనవి. కవి జీవన ప్రస్థానంలో తండ్రితో కలిసి తిరిగిన రోజులు, ఆయన చెప్పిన మాటలు, ఆయన జీవన పయనం ఎంతో స్ఫూర్తివంతమైనవి. అందుకనే శ్రీధర్ బాబు తన తండ్రితో పెనవేసుకున్న జీవన అనుబంధానికి గుర్తుగా ఈ సంపుటిని తన తండ్రికి అంకితమిచ్చారు.
ఈ కవితా సంపుటిలో తన బాపును గుర్తు చేసుకుంటూ ‘చివరి రోజు’, ‘ఈత ముళ్ళు’, ‘బాపూ..నీ చివరి కౌగిలింత’, ‘బాపూ నీ మాయ’, ‘గుండె నొప్పెడుతుంది బాపూ’, ‘బాపూ నీ లోపలి గదిలో’ అనే కవితలను రాసారు. ఇవన్నీ తండ్రితో తనకున్న అనుబంధాన్ని చాటే స్మృతి కవితలు. ఈ కవితల్ని చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి, దిగులుతో మనసంతా అల్లకల్లోలమవుతుంది. అయినా మన జీవనం ఆగదు కదా, ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూనే ముందుకు సాగుతూ ఉండాలి.
ముఖ్యంగా ‘చివరి రోజు’ కవితలో మరణంతో పోరాడుతున్న బాపును గూర్చిన కవితా వాక్యాలను చదువుతుంటే మనసు వికలమవుతుంది. ఆ దుఃఖభరితమైన స్థితిలోనే కవి ఎంతో గాఢమైన కవిత్వాన్ని రాశారు. ఒడవని దుఃఖానికి ఈ కవితావాక్యాలే నిదర్శనం:
‘నిను ఓదార్చిన నీ చివరి నిద్రలో/ నేనొక కలగా, కన్నీటిలా చీల్చుకుపోవడం/ నీవు చూశావు/ నీవు కాంతివత్సరాల వేగంతో వెళ్లిపోతుంటే/ నేను క్షణమొక యుగంలా గడగడలాడాను/ నీ ముఖాన్ని నా అరిచేతులతో పువ్వులా పట్టుకున్నప్పుడు/ నెలబాలుడిలా నీ పెదాల మీద/ వెలిగిన నవ్వు నన్ను నీకు తండ్రిని చేసింది’
సామాజికపరమైన, కుటుంబపరమైన బంధాలు మనల్ని నిత్యం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. సామాజిక చైతన్యం కోసమే కాకుండా, మెరుగైన అనుబంధాల్ని పెంపొందించడానికి కవిత్వాన్ని ఒక వారధిగా నిర్మిస్తాడు కవి.
ఈ కవితా సంపుటి నిండా కవి తనకు తాను చెప్పుకున్నట్లుగా అనిపించినా కూడా, నిజానికి మనందరికీ ఆ అనుభవసారాన్ని పంచుతున్నారు. అందుకనే మనుషులుగా మనమంతా వేరు కావచ్చు, విభిన్న పరిస్థితుల్లో జీవిస్తూ ఉండవచ్చును, కానీ అంతిమంగా అందరి కష్టసుఖాలు ఒకటేనని మనం గ్రహిస్తాము. మనకు మనమే ఆత్మస్థైర్యాన్ని నింపుకొని మునుముందుకు సాగాలనే ప్రేరణ ఈ కవిత్వం మనకు అందిస్తుంది.
ఏకాంతం అంటే కేవలం ఒంటరితనమే కాదు, అది సామూహిక జీవితానికి ఒక పునాదిగా నిలుస్తుంది. మనల్ని పలకరించే ప్రతి అనుభవం, ఆలోచన, నిర్ణయం, అవమానం, అభినందన.. ఇవన్నీ కూడా మనకు అతిథులే. వాటి నుండి మనం జీవిత పాఠాలను, గుణపాఠాలను కూడా అందిపుచ్చుకోవచ్చు. ‘ఏకాంతం ఒక అతిథి’ కవిత ద్వారా ఈ విషయాలన్నీ మనం గ్రహించవచ్చు:
‘వద్దంటే వస్తున్నాయి ఈ సీతాకోకచిలుకలు/ ఈ అర్ధరాత్రి పూట/ నా ఏకాంతంలోకి అలికిడి లేకుండా/ మెత్తగా వాలుతున్నాయి/ చేతుల మీద/ చెంపల మీద/ పెదాల మీద/ వస్తూ వస్తూ అడవుల్ని తీసుకొస్తున్నాయి/ లేదు/ నన్ను అడవుల్లోకి తీసుకుపోతున్నాయి/ అవి నన్ను అంత తేలికగా/ ఎలా మోసుకుపోతున్నాయి/ ఏకాంతంలో ఉన్నాననుకుంటాను/ కానీ ఏకాంతమే ఒక అతిథి/ మహారణ్యం లాంటి అతిథి/ పర్ణశాలలో నేనొక శబరి’
___________________
విశ్వజనీన వేదనను, మట్టి పరిమళాన్ని మేళవించి..అంతరించిపోతున్న మానవత కోసం అడవిలోని పోరాటాన్ని, ఆత్మీయ తెలంగాణ జీవితాన్ని అక్షరాల్లో ఆవిష్కరించిన స్వప్న యాత్రికుడు శ్రీధర్ బాబు.
__________________
వర్తమాన సమాజంలోని మనుషుల ప్రవర్తనకు అద్దం పడుతున్న కవిత ‘మై డియర్ జోకర్’. ఈ కవితలోని ప్రతి వాక్యం మనల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుంది:
‘నిజానికి, ఇవన్నీ నువ్వు చేశావ్/ ఒక్క కన్నీటి చుక్కలో ముంచి/ నాకు సప్త సముద్రాల్ని చూపించావ్/ నువ్వూ నేనూ అప్పుడు వెండి చేప పిల్లల్లా అల్లరల్లరి చేయలేదూ?/ ఒక చిన్ని దీపంలోకి నన్ను చేయి పట్టుకుని తీసుకువెళ్ళి/ రాత్రి నేత్రంలోని గగనకాంతుల్లో ఈత కొట్టించావ్/ నువ్వూ నేనూ అప్పుడు బంగారంతో తడిసిన రెక్కలతో/ మిలమిలా మెరిసిపోలేదూ పుడమి అంచున చెరోవైపూ!’
ఈ కవితా సంపుటికి ప్రసిద్ధ కవి సిద్ధార్థ గారు ‘స్వజీవ సోయగం.. అనేక వాస్తవికతలు’ అంటూ విశ్లేషణాత్మకమైన ముందుమాట రాసారు. శ్రీధర్ బాబు కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక దారిదీపంలా ఉంది. అనేక కోణాల్లో ఆయన కవిత్వాన్ని వివరిస్తూ.. ‘ఈ సంపుటిలో నేను రి-కాప్ చేస్తున్న కవిత్వ సంగతులన్నీ.. కవికి స్వీయ అనుభవంలో దక్కిన కవిత్వ ధారలోని పాయలే. లోయలోని ఎగిరే దీపాల ముచ్చట్లే. నిశ్శబ్ద సంచార గమనాలే. కవిత్వానికి ఇవన్నీ అత్యవసరమైన స్వజీవ సాంగత్య శకల సమూహాలే. ఏకాంతంలోని అతిథుల ఆగమనాలే’ అని పేర్కొన్నారు. ఈ మాటలు అక్షరసత్యాలుగా నిలిచాయి.
ఒక స్వాప్నికుడి ఏకాంత గానంలో మనమంతా పరవశిస్తాం. పరవళ్ళు తొక్కే ప్రవాహంలో స్థిమితంగా ఉండి ఆలోచిస్తాం.
ఒక ఉదయ కాలమో, ఒక సాయంత్రమో లేదా ఒక ప్రశాంతమైన వాతావరణంలోనో ఈ కవితల్ని ఆస్వాదించాలి. “పోల్చుకోలేక తికమక పడ్తుంటాం కానీ/ తేల్చుకోలేక తెంపుకోలేక చిక్కుబడి పోతుంటాం కానీ/ ఉన్నారున్నారు గోడల్ని కూలగొట్టుకొని/ గుండెలతో నిలబడ్డ మనుషులు/ ఉన్నారున్నారు” అని ‘ఉన్నారున్నారు కొందరు మనుషులు’ అనే కవితలో అన్నట్లుగానే, ప్రజల కోసం నిలబడ్డ వాళ్లందర్నీ స్మరించుకుంటారు కవి. ఆయన కవిత్వంతో మమేకమవుతూ మనమూ ఆ అనుభూతిని ఆస్వాదిద్దాం.

– గోపగాని రవీందర్
94409 79882











