అనువాద సాహిత్యాల ఆణిముత్యం: డా. ఎల్.ఆర్. స్వామి

తెలుగు, తమిళ, మలయాళ భాషాసాహిత్యాలలో విలక్షణమైన, విశిష్టమైన సాహితీవేత్తగా, అనువాదకునిగా కొన్ని దశాబ్దాలపాటు కొనసాగిన డా. ఎల్. ఆర్. స్వామిగారి పూర్తిపేరు డా. లక్ష్మణ్ అయ్యర్ రామస్వామి. ఈయన 1944 అక్టోబరు 16వ తేదీన కేరళ రాష్ట్రంలోని తిరుచ్చూర్ లో జన్మించారు. వీరి తల్లి టి.జి. రాజమ్మాళ్, తండ్రి టి.కె. లక్ష్మణ్ అయ్యర్. తమిళనాడు నుంచి కేరళ సరిహద్దు ప్రాంతంలోకి వలస వచ్చిన ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబం వీరిది.

రసాయనశాస్త్రంలో ఎమ్.ఎస్సీ డిగ్రీ, ఆ తరువాత ఎమ్.బి.ఎ. డిగ్రీ, అనంతరం ఎన్విరాన్మెంటల్ కోర్సులో డిప్లమా విద్యార్హతలు సాధించిన వీరు, మొదట విశాఖలోని కోరమండల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కంపెనీలో, ఆ తరువాత ఆంధ్ర పెట్రోకెమికల్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసి సీనియర్ మేనేజర్ గా ఉద్యోగవిరమణ చేశారు.

ఎల్.ఆర్. స్వామి హైస్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడే మలయాళంలోకి అనువదించబడిన కాళిదాసుని ‘అభిజ్ఞాన శాకుంతలం’, ‘మేఘసందేశం’ వంటి గ్రంథాలను కంఠస్థం చేశారు. వీటితోపాటు మలయాళంలోని అనేక సుప్రసిద్ధ గ్రంథాల అధ్యయనాన్ని కూడా ఆ వయసులోనే పూర్తి చేశారట. ఆ గ్రంథాలన్నీ సాధారణంగా గుడి పురాణంతో మొదలై, చివర్లో ఒక ఏనుగు ఉదంతంతో పూర్తయ్యేవి. 1000 శ్లోకాలు గల ‘శ్రీకృష్ణ చరితం’ అనే సంపుటిని ఎవరైనా పూర్తిగా చదివితే, వారు ‘అర్ధకవి’ అవుతారని ఒక నానుడి ఉంది. ఆ రోజుల్లో ఎల్.ఆర్. స్వామి ఆ సంపుటిని పూర్తిగా చదవటమే కాకుండా, ప్రతి శ్లోకానికి అర్థాలు వివరించి అందరినీ ఆశ్చర్యపరిచేవారట.
______________________

డా. స్వామి తనకు ఊహ తెలిసినప్పటి నుంచే సాహిత్యం పట్ల విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నారు. ఆ రోజుల్లో మలయాళ శిరోమణి పండిత్ గోవిందన్ నాయర్ గారి ప్రభావం తనపై చాలా ఉందని, ఆ తరువాత డిగ్రీ చదివే రోజుల్లో ప్రొఫెసర్ వి. విజయన్ గారి ప్రభావం తగినంత స్థాయిలో పనిచేసిందని ఆయన చెప్పుకునేవారు.
_______________________

మొట్టమొదటగా “ఆకలి” అనే కవితను మలయాళంలో రాస్తే, ఆ కవిత సుప్రసిద్ధ వారపత్రిక ‘మాతృభూమి’ లో ప్రచురితమైంది. అది మొదలు ఆ వారపత్రికలో స్వామి గారివి దాదాపు వంద కవితలు ప్రచురించబడ్డాయి. ఆయన ఎక్కువగా సంస్కృత ఛందస్సులో కవితలు రాసేవారు. పదవ తరగతి చదివే నాటికే భగవద్గీత, ఖురాన్, బైబిల్ గ్రంథాలను అధ్యయనం చేశారు. 1960లో బైబిల్ లోని ‘ఫర్బిడన్ ఫ్రూట్’ అంశం ఆధారంగా సరికొత్త విధానంలో ఒక నాటకాన్ని రాస్తే, మలయాళ వారపత్రిక ‘మాతృభూమి’ నిర్వహించిన నాటక రచనల పోటీలో ఆ నాటకానికి ప్రథమ బహుమతి లభించింది.

1967లో ఉద్యోగరీత్యా విశాఖపట్నం వచ్చిన ఎల్. ఆర్. స్వామి, తెలుగులో మొట్టమొదటిసారిగా 1988 ఫిబ్రవరి 20న “జవాబులేని ప్రశ్న” అనే కథను రాశారు. ఆ కథ ఆంధ్రజ్యోతి దీపావళి కథల పోటీలో ప్రథమ బహుమతిని గెలుచుకుంది. ఆ తరువాత ఆయన 200లకు పైగా వైవిధ్యమైన కథలు రచించారు. 1992లో ‘కథాస్వామ్యం’, 2002లో ‘గోదావరి స్టేషన్’, 2003లో ‘సామెత కథలు’ – మిని కథలు, 2008లో ‘లోగుట్టు పెరుమాళ్లుకెరుక’, 2013లో ‘కథాకాశం’, 2018లో ‘అలా గే… అలా గే’.. మొదలగు తెలుగు కథల సంపుటాలను వెలువరించారు. 1910 నుంచి 2010 వరకు వచ్చిన వందమంది కథకుల కథలలో డా. ఎల్. ఆర్. స్వామి కలం నుంచి వెలువడిన “షకీలా” కథ కూడా చోటుచేసుకోవడం విశేషం. వీరి ‘గోదావరి స్టేషన్’ అనే కథ దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన కథన శైలి సరళంగా ఉండి, పాఠకుడికి లోతైన భావాలను పరిచయం చేస్తుంది.

డా. ఎల్. ఆర్. స్వామి నేరుగా రాసిన తెలుగు కథలలో మానవ సంబంధాల విలువలు పుష్కలంగా ఉంటాయి. మానవత్వాన్ని మరిచిన మనిషి జీవితం మరణంతో సమానమన్న సందేశం ఆయన రచనల్లో అంతర్లీనంగా కనిపిస్తుంది. బాల్యంలో తాను చదువుకుంటున్న పాఠశాలలో మధ్యాహ్న భోజనం లేక పస్తులతో ఉన్న ఒక పిల్లాడిని, తన టీచరు తల్లిలా ఆదుకుని అన్నం తినిపించిన సంఘటనతో ఎల్.ఆర్. స్వామికి ‘మానవత్వం’ అంటే ఏమిటో ఆ వయసులోనే అర్థమైంది. ఆనాడు ఆ పిల్లాడు, ఆ టీచరమ్మ కళ్ళ నుంచి రాలిన కన్నీటి చుక్కలే ఆ తరువాత ఎల్. ఆర్. స్వామి కలంలో సిరాచుక్కలుగా మారాయి. దీనజనుల బాధలను కథలుగా రాయటంలో ఆయన సిద్ధహస్తులు.

అవి ఆయన 9వ తరగతి చదువుతున్న రోజులు. కేరళలో విపరీతమైన కరువు విలయతాండవం చేస్తున్న సమయమది. పదిరోజులుగా ఎడతెరిపి లేని తుఫాను వర్షం వల్ల కూలీలెవరికీ పని దొరకలేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక కూలి కుటుంబంలో తిండిలేక చనిపోయిన ఒక పిల్లాడి శవాన్ని చూశాక, ఎల్. ఆర్. స్వామికి మొదటిసారి ‘ఆకలి’ అంటే ఏమిటో అర్థమైంది. అర్థమైన ఆ విషయాన్ని సాహిత్యంలోకి సమర్థవంతంగా తర్జుమా చేసి ఉత్తమ కథారచయితగా శిఖరాగ్ర స్థాయికి చేరుకున్నారు.

తెలుగు భాషను అమితంగా ప్రేమించి, తెలుగు అమ్మాయినే వివాహమాడి, తెలుగు సాహిత్యానికి అంకితమైన ఎల్.ఆర్. స్వామి కేవలం కవి, కథకుడు మాత్రమే కాదు. ఇతర భాషల్లోని విలువైన సాహిత్య సంపదలను తెలుగువారికి పరిచయం చేయాలన్న తపన వారిని అనువాదాల వైపు నడిపించింది. మలయాళం నుంచి ‘మలయాళ జానపద గేయాలు’, ‘శరీరం ఒక నగరం’, ‘ఇరవయ్యో శతాబ్దపు ఇతిహాసం’, ‘కథా కేరళం’, ‘కథా వారధి’, ‘కథాదౌత్యం’, ‘ముద్రలు’, ‘ఎక్కడెక్కడో పడేసిన వస్తువులు’, ‘శ్యామ మాధవీయం’, ‘బ్రహ్మశ్రీ శ్రీనారాయణగారు’, ‘నేను భారతీయుడ్ని’, ‘రామచిలుక’ మొదలైన గ్రంథాలను ఉన్నత ప్రమాణాలతో తెలుగులోకి అనువదించారు.

గిరిజనుల బ్రతుకులో చోటుచేసుకున్న మార్పులని ఆ మార్పుల వల్ల వారు అనుభవించిన మానసిక సంక్షోభాన్ని చక్కగా చిత్రించిన ‘కొండదొరసాని’ నవల అనువాదంలో సహజ సుందరమైన గ్రామీణ వాతావరణం, వర్గ-లింగ అసమానతలు ప్రధాన భూమిక పోషిస్తాయి. వ్యక్తిత్వం కోల్పోయి బ్రతకటమా లేక ఆధునికతని నిరాకరించి సంస్కృతికి అంగ రక్షకుడిగా నిలవటమా అనేది కొండదొరసాని నవలలో ప్రశ్నించబడింది.

కె.పి. రామునుణ్ణి రచించిన ‘సూఫీ పరంజ’ను “సూఫీ చెప్పిన కథ” గా అనువాదం చేసినప్పుడు, మూలకథలోని సూఫీ తత్వం అదే స్థాయిలో తెలుగు పాఠకులను ఆకట్టుకోవడం విశేషం. తమిళం నుంచి ఆటవిక రాజ్యం, అర్ధనారీశ్వరుడు, సంఘ సాహిత్యం మొదలైనవి విశిష్ట అనువాద గ్రంథాలుగా గుర్తింపు పొందాయి.

అదేవిధంగా ఆచార్య గోపీ ‘నిద్రపోనివ్వను’, శివారెడ్డి ‘మోహనా, మోహనా’, గురజాడ కథలు, చాసో కథలు, కాళీపట్నం రామారావు గారి ఎంపిక చేసిన 9 కథలు, కేతు విశ్వనాథరెడ్డి కథలు, సలీం ‘రాణీగారి కథలు’, జయంతి పాపారావు కథలు, శ్రీ శ్రీ మోనోగ్రాఫ్, దివాకర్ల వెంకటావధాని ‘ఆంధ్రవాఙ్మయ చరిత్ర’, చక్రపాణి మోనోగ్రాఫ్, పాపినేని శివశంకర్ ‘రజనీగంధ’, కల్పనారెంటాల నవల- ఇలా ఎంతో ఉత్తమ తెలుగు సాహిత్యాన్ని మలయాళంలోకి అనువదించారు.

తెలుగులో రెండు లక్షల కాపీలు పైగా అమ్ముడైన ముని ప్రశాంత్ రాసిన ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ నవలను ఇటీవలే మలయాళంలోకి అనువదించగా, ఆ గ్రంథం మలయాళ సాహిత్య సంబరాల్లో విడుదలయ్యి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. కేరళ, తమిళ సంస్కృతులను, అక్కడి జీవనశైలిని తెలుగు ప్రజలకు తన అనువాదాల ద్వారా దగ్గర చేసి, ఈ మూడు భాషల మధ్య ఒక సాహిత్య, సాంస్కృతిక వారధిగా డా. ఎల్.ఆర్. స్వామి నిలిచిన తీరు అద్వితీయం.

ఆయన కథా సాహిత్యం మీద ఆంధ్ర యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీలలో పిహెచ్.డి మరియు ఎమ్.ఫిల్ పరిశోధనలు జరిగాయి. ఈ సాహితీవేత్త ఎన్నో విశ్వవిద్యాలయాల అకడెమిక్ స్టాఫ్ కాలేజీలలోను, జాతీయ సదస్సులలోనూ తులనాత్మక సాహిత్య అంశాలపై ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు.

‘నల్లి దిసై’ పురస్కారం, ‘పురిపండా’ పురస్కారం’, ‘పరుచూరి’ పురస్కారం, ‘కవిసంధ్య’ పురస్కారం, కృష్ణాజిల్లా రచయితల సంఘం ‘విశిష్ట అనువాదకుడు’ పురస్కారం, ‘గోదావరి’ పురస్కారం వంటి అసంఖ్యాకమైన సత్కారాలు, సన్మానాలు, పురస్కారాలను వారు పొందారు. 2015 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ ‘అనువాద’ పురస్కారాన్ని అందుకున్నారు. గీతం యూనివర్సిటీ వారు ఆయన అపూర్వ సాహిత్య సేవలకు గాను ‘గౌరవ డాక్టరేట్’ను ప్రదానం చేశారు.
______________________

ఉన్నతమైన సాహిత్య సృజనే కాకుండా, మచ్చలేని విలక్షణమైన వ్యక్తిత్వం ఆయనది. విశాఖలో ‘సహృదయ సాహితి’ మరియు ‘మొజాయిక్’ సాహిత్య సంస్థలకు చాలాకాలం అధ్యక్షులుగా ఉండి ఎన్నో విశిష్ట కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో ప్రతి నెలా 4వ బుధవారం జరిగే సహృదయ సాహితి సమావేశాలలో ‘కథా కచేరి’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, ఔత్సాహిక రచయితల చేత కొత్త కథలు రాయించి, వారిని పోటీలలో బహుమతులు పొందే స్థాయికి చేర్చిన సాహిత్య సహృదయుడు డా. ఎల్. ఆర్. స్వామి.
_____________________

82 సంవత్సరాల వయసులో, శరీరం సహకరించకపోయినా మలయాళ సాహిత్య దిగ్గజాలను తెలుగు వారికి, తెలుగు దిగ్గజాలను మలయాళులకు పరిచయం చేస్తూ నిత్యం సాహిత్య సేవకు అంకితమైన డా. ఎల్.ఆర్. స్వామి ఏప్రిల్ 25,2026వ తేదీ తెల్లవారుజామున కన్నుమూశారు.

భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన సృజించిన అద్భుతమైన సాహిత్యం ఒక గొప్ప అక్షర సంపదగా నిరంతరం ఎందరికో సాహిత్య మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది.

-సాహిత్య ప్రపూర్ణ డాక్టర్ కె.జి. వేణు
98480 70084

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry