భాష పతనం మొదలైందంటే ఆ జాతి సంస్కృతి పతనం కూడా ప్రారంభమైనట్టే. మాతృభాష లేని సంస్కృతి ఇతర సంస్కృతులకు బానిసగా మిగిలిపోవాల్సిందే. ‘ఒక వ్యక్తి తనకు తెలిసిన భాషలో మాట్లాడితే అది అతని మెదడుకు మాత్రమే చేరుతుంది. అదే అతని మాతృభాషలో మాట్లాడితే అది నేరుగా అతని హృదయాన్ని తాకుతుంది’ అంటారు నెల్సన్ మండేలా.
నిజమే! కానీ, అటువంటి భాష ఎంత పరిశుభ్రంగా ఉండాలి? ఎంత స్వచ్ఛంగా ఉండాలి? అది కూడా ముఖ్యమే కదా. సందేహం లేదు, పర్యావరణ కాలుష్యం కంటే భాషా కాలుష్యాన్ని అరికట్టడం నేడు అత్యంత ఆవశ్యకం.
కీకరకాయ అనకూడదు కదా!?: “బహుమతి ప్రధానం – విధ్యార్థులు – ఆవిశ్కరణ – ముఖ్య అతిది – శన్మానం – గ్రంధం – కధ – పెల్లి సుభలేఖ…” అయ్యో! ఏంటీ భాష అనుకుంటున్నారా? నేటి తెలుగు సమాజంలో ఇవన్నీ ‘సరైన’ పదాలుగా చలామణీ అవుతున్నాయి. దీనికి సాక్ష్యం కావాలంటే తెల్లారితే కుప్పలుతెప్పలుగా వచ్చిపడే తెలుగు ఆహ్వాన పత్రికలు, ఫ్లెక్సీలను ఒక్కసారి పరిశీలించండి.
తెలుగు భాష అంతరించిపోతుందనే ఆందోళన ఒక ఎత్తయితే, ఉన్న భాషను సరిగ్గా వాడకపోవడం అంతకంటే పెద్ద సమస్య. అక్షర దోషాలు, ఉచ్చారణ లోపాలు తెలుగు భాషను బతికుండగానే నిర్జీవం చేస్తున్నాయి. ఈ తప్పులు విద్యార్థులు చేస్తే నేర్చుకుంటారులే అని సర్దిచెప్పుకోవచ్చు. కానీ, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, భాషాశాఖల అధిపతులే ఇలాంటి తప్పులు చేస్తుంటే వారికి అక్షరాలు దిద్దించేది ఎవరు? ఇటువంటి దోషాలే సరైనవన్నట్టు కరపత్రాల్లోనూ, ఆహ్వాన పత్రికల్లోనూ నిత్యం దర్శనమివ్వడం దారుణం. దురదృష్టవశాత్తూ కొన్ని రచయితల సంఘాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే, తన పేరులో ఉన్న అక్షర దోషాన్ని కూడా నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లే ధైర్యం అతిథి చేయలేకపోతున్నాడు. అలా అడిగితే ఎక్కడ తనను మరోసారి పిలవరోనని భయం. పైగా అతనికి ‘చాదస్తుడు’ అనే బిరుదు ఇచ్చి ప్రచారం చేస్తారనే ఆందోళన.
మరో ప్రధానాంశం – ఆహ్వాన పత్రికలు ముద్రించే వారు అతిథుల హోదాల గురించి కనీస అవగాహన కలిగి ఉండటం లేదు. ‘పద్మశ్రీ’ గ్రహీతను ‘పద్మవిభూషణ్’ అని రాయడం, ‘డాక్టర్’, ‘ఆచార్య’ ఉండవలసిన చోట కేవలం ‘శ్రీ’ అని వేయడం, ‘శ్రీ’కి ‘శ్రీమతి’కి తేడా గమనించకపోవడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. మాజీ పదవిలో ఉన్నవారిని ఇంకా పదవిలో ఉన్నట్టే రాయడం, యూపీఎస్సీ సభ్యులను చైర్మన్ అని సంబోధించడం వంటివి భాష పట్ల శ్రద్ధ లేకపోవడమే కాదు, మితిమీరిన నిర్లక్ష్యం కూడా.
చిత్రమేమిటంటే, ఆ తప్పుల్ని ఆయా అతిథులు కూడా చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఫలితంగా సామాజిక మాధ్యమాల్లోనూ, మీడియాలోనూ అవే తప్పులు వార్తలుగా వస్తున్నాయి.
సాధారణంగా సాహిత్య కార్యక్రమాల నిర్వహణ ఎలా ఉంటుందంటే – కార్యదర్శి చూసుకుంటాడులే అని అధ్యక్షుడు, విభాగాధిపతి చూసుకుంటాడులే అని ప్రిన్సిపాల్, పరిశోధక విద్యార్థులు చూస్తారులే అని హెడ్.. ఇలా బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టేస్తున్నారు. బాధ్యతను అప్పగించడం తప్పు కాదు, కానీ పర్యవేక్షణ లోపించడం క్షమించరాని తప్పు. చివరికి పరిస్థితి “ఎవరికి పుట్టిన బిడ్డని ఎక్కెక్కి ఏడవడానికి” అన్నట్టు తయారైంది. ఇందులో తెలియనితనం ఎంత, అజ్ఞానం ఎంత, నిర్లక్ష్యం ఎంత అనేది విజ్ఞులకే వదిలేద్దాం.
నేడు అన్ని రంగాల్లోనూ విలువల పతనం కనిపిస్తోంది. నైతికత లోపిస్తోంది, ఖచ్చితత్వం కరువవుతోంది. సమగ్రత అనే పదాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఈ ప్రభావం సాహిత్యం మీద కూడా పడింది. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా పేరొందిన సుందర తెలుగు నేడు అందవికారంగా మారుతోంది. దీనికి సర్దుకుపోదామా? వదిలేద్దామా? వదిలేయడానికి కాదు ఈ వ్యాసం రాసింది. మన పిల్లలు మన భుజాల మీద ఎక్కి చరిత్రను చూస్తారు.
చరిత్ర సరిగ్గా లేకపోతే సంస్కృతి రాణించదు.
ఒక జాతి సాంస్కృతిక వైభవం పరిఢవిల్లాలంటే భాష దానికి పునాది. అందుకే ఇప్పుడు భాషను కాపాడుకోవడం కంటే, భాషలోని కాలుష్యాన్ని నిర్మూలించుకోవడం చాలా ముఖ్యం. “భాష చచ్చిపోతే జాతి చచ్చిపోతుంది. భాషను కాపాడుకోవడం అంటే మన అస్తిత్వాన్ని కాపాడుకోవడమే” అని హితవు పలికిన గిడుగు రామ్మూర్తి గారి మాటలను స్మరిస్తూ, భాషా శుద్ధి కోసం మనమందరం కలిసి నడుం బిగిద్దాం.
– డాక్టర్ బండి సత్యనారాయణ
99890 35136











