తెలుగు కథా సాహిత్యంలో ఒకానొక దశలో రాయలసీమ అంటే కేవలం ఫ్యాక్షన్ రాజకీయాలకు, రక్తపాతానికి చిరునామా అనే ముద్ర ఉండేది. కానీ, సీమ అంటే కేవలం బాంబుల మోత కాదని, అది ఆకలి కేకల వేదన అని, వర్షాభావ పరిస్థితులతో అల్లాడే రైతన్న ఆవేదన అని, అన్నింటికీ మించి అంతులేని ఆత్మాభిమానం కలిగిన మనుషుల జీవన పోరాటమని లోకానికి చాటిచెప్పిన మహనీయుడు డా. కేతు విశ్వనాథరెడ్డి. కడప జిల్లా కమలాపురం తాలూకా రంగశాయిపురంలో 1939లో జన్మించిన ఆయన, తన కలం ద్వారా సీమ కరువును, కడగండ్లను ప్రపంచ యవనికపై ప్రతిష్టించారు. ఆయన కథ కేవలం ఒక ఊహాజనిత చిత్రం కాదు, అది రాయలసీమ సామాజిక చరిత్రను అక్షరీకరించిన ఒక సజీవ సామాజిక పత్రం.
మాండలికం – భాషకు దక్కిన సాహిత్య గౌరవం: కేతు గారి సాహిత్య ప్రస్థానంలో అతిపెద్ద విజయం రాయలసీమ మాండలికానికి, ముఖ్యంగా కడప జిల్లా వ్యావహారిక భాషకు సాహిత్య గౌరవాన్ని తీసుకురావడం. అప్పటి వరకు తెలుగు సాహిత్యంలో మాండలికాన్ని కేవలం హాస్య పాత్రలకో లేదా ప్రతినాయకుల సంభాషణలకో పరిమితం చేసే ధోరణి ఉండేది. కానీ, కేతు గారు ఆ అపోహను పటాపంచలు చేస్తూ, మాండలికాన్ని కథా వస్తువులో అంతర్భాగం చేశారు.
ఆయన దృష్టిలో మాండలికం అంటే కేవలం పదాల కూర్పు కాదు, అది ఆ ప్రాంత ప్రజల సంస్కృతి, జీవన విధానం, అస్తిత్వం. మాండలికంలో రాస్తే ఇతరులకు అర్థం కాదు అనే వాదనను తప్పు అని నిరూపిస్తూ, ఆ భాషలోని మాధుర్యాన్ని, శక్తిని తన కథల ద్వారా పండించారు. ఆయన కథల్లోని సంభాషణలు వింటుంటే సీమ పల్లెల్లో రచ్చబండ మీద కూర్చుని మనుషులు ఆత్మీయంగా మాట్లాడుకుంటున్న అనుభూతి కలుగుతుంది. ‘జప్తు’, ‘ఇచ్ఛాగ్ని’ వంటి కథల్లో ఆయన వాడిన పదజాలం ఆ ప్రాంతపు అస్తిత్వాన్ని కాపాడడమే కాకుండా, భాషా శాస్త్రవేత్తలకు సైతం ఒక నిఘంటువులా ఉపయోగపడింది.
సామాజిక దృక్పథం – కథ ఒక చైతన్య ఆయుధం: కేతు విశ్వనాథరెడ్డి గారు కేవలం కథకుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప సామాజిక విశ్లేషకుడు, సిద్ధాంతకర్త. తన అభ్యుదయ భావజాలం ప్రతి కథలోనూ నిక్షిప్తమై ఉంటుంది. సమాజంలో జరుగుతున్న మార్పులను, ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థలో వస్తున్న పరిణామాలను ఆయన నిశితంగా గమనించారు. పాత భూస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోవడం, దాని స్థానంలో పెట్టుబడిదారీ శక్తులు ప్రవేశించి పల్లెటూరి ఆర్ధిక వ్యవస్థను ఎలా చిన్నాభిన్నం చేస్తున్నాయో ఆయన కథలు కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి.
సీమలో కరువు రావడం వల్ల బతుకుతెరువు కోసం ముంబై వంటి సుదూర నగరాలకు వలస వెళ్లే రైతుల ఆర్తనాదాలను ఆయన అద్భుతంగా చిత్రించారు. ముఖ్యంగా ‘వేర్లు’ వంటి కథల్లో, మనిషి తన సొంత నేల నుండి వేరు చేయబడినప్పుడు అనుభవించే మానసిక వేదనను, మూలాలు తెగిపోతున్న ఆవేదనను హృద్యంగా ఆవిష్కరించారు. ఆయన కథల్లో స్త్రీ పాత్రలు కేవలం బాధితులుగానో, అబలలుగానో మిగిలిపోవు; అణచివేతను ఎదిరించే చైతన్యాన్ని, ఎదురు నిలిచే ధైర్యాన్ని ప్రదర్శిస్తాయి. సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న బహుముఖ సమస్యలను ఆయన ఎంతో సహానుభూతితో చిత్రించారు.
అక్షర సంపద – ప్రముఖ రచనల పరిశీలన: విశ్వనాథరెడ్డి గారి రచనలు తెలుగు కథా సాహిత్యంలో గ్రామజీవితం, రాయలసీమ మట్టివాసనలు, సామాజిక సంబంధాలు, మానవ అంతర్మథనాలను ప్రతిబింబించే విలువైన నిధులు.
కథా ప్రపంచాన్ని నిలబెట్టిన కొన్ని ముఖ్యమైన రచనలు: ‘జప్తు’ (1974): ఆర్థిక దౌర్భాగ్యం, అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతు జీవితంలోని అసహాయతను హృదయానికి హత్తుకునేలా చెప్పిన ప్రముఖ కథ. చట్టం పేరుతో జరిగే అన్యాయాలను, అధికారుల నిరంకుశత్వాన్ని ఈ కథ ఎంతో బలంగా వినిపిస్తుంది.
‘వేర్లు – బోధి’ (1994) కథ మనిషి మూలాలు, సంస్కృతి, జీవన తాత్వికత మధ్య ఉన్న బంధాన్ని పరిశీలించే లోతైన రచన అయితే “ఇచ్ఛాగ్ని” (1996) అంతర్మనస్సులో మండే కోరికలు, ఆవేదనలు, వ్యక్తి మరియు సమాజ సంఘర్షణల ప్రతీకాత్మక చిత్రణగా సాహితీ చరిత్రలో భాసిల్లింది.
కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998–2003): 1960ల నుండి రాయలసీమలో వచ్చిన సామాజిక, రాజకీయ మార్పులను, గ్రామీణ మానవ సంబంధాలను ప్రతిబింబించే కథల సమాహారం. రచయిత ఆలోచనా పరిపక్వతకు ఇది మకుటం. “అనాదివాళ్లు” కథ అట్టడుగు వర్గాల జీవన పోరాటాన్ని, తరతరాలుగా కొనసాగుతున్న సామాజిక అసమానతల్ని ఆవిష్కరించే రచన. అలాగే, “దృష్టి, దీపదారులు” సమాజాన్ని చూసే కోణం, విలువలపై ప్రశ్నిస్తూనే, చీకటిలో దారి చూపే సామాజిక చైతన్యాన్ని ఈ రచనలు ప్రతిపాదిస్తాయి.
“పరిచయం, సంగమం” కథలు మనుషుల మధ్య సంబంధాల సున్నితత్వం, విభిన్న జీవన ప్రవాహాలు, భావాలు కలిసే మానవ సంబంధాల చిత్రణలు కాగా “పాత్రికేయం, మన కొడవటిగంటి” కథలు జర్నలిజం ప్రపంచంలోని వాస్తవాలను ఒక కథ చెబితే, ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య-సామాజిక ప్రభావాన్ని మరో వ్యాసం పరిచయం చేస్తుంది.
కడప జిల్లా గ్రామనామాలు: ఇది ఆయన చేసిన అసాధారణ పరిశోధనా గ్రంథం. ఒక గ్రామం పేరు వెనుక ఆ ప్రాంత చరిత్ర, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు ఎలా దాగి ఉంటాయో నిరూపించిన ఈ గ్రంథం, తెలుగు భాషా పరిశోధన రంగంలో మైలురాయిగా నిలిచింది.
సాహిత్య విమర్శ – సంపాదకత్వ ప్రతిభ: కేతు విశ్వనాథరెడ్డి గారు కేవలం సృజనాత్మక రచయిత మాత్రమే కాదు, అంతకు మించిన గొప్ప విమర్శకులు, సంపాదకులు. ‘సాహిత్యం – సమాజం’ వంటి గ్రంథాల ద్వారా సాహిత్యం సమాజానికి ఏ విధంగా జవాబుదారీగా ఉండాలో ఆయన తార్కికంగా నిరూపించారు. తెలుగు అకాడమీలో ఉన్నప్పుడు పాఠ్యపుస్తకాల రూపకల్పనలో, పరిభాష కోశాల తయారీలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిది. ముఖ్యంగా మన సంస్కృతిలో అంతర్భాగమైన జానపద కళలను, గ్రామీణ వృత్తులను సామాజిక కోణంలో విశ్లేషించిన తీరు అద్భుతం. ఆయన దృష్టిలో విమర్శ అంటే కేవలం తప్పులు ఎంచడం కాదు, ఒక రచన ఏ సామాజిక పునాదుల మీద నిర్మితమైందో విడమర్చి చెప్పడం. అందుకే ఆయన రాసిన పీఠికలు కూడా ఒక ప్రత్యేకమైన విజ్ఞాన సర్వస్వాలుగా భాసిల్లాయి.
విద్యావేత్తగా ప్రస్థానం – మార్గదర్శకత్వం: కేతు గారు వృత్తిరీత్యా అధ్యాపకులుగా పని చేస్తూనే, వేలాది మంది విద్యార్థులలో సామాజిక స్పృహను రగిలించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టర్‌గా సేవలందిస్తున్న సమయంలో, విద్యను సామాన్యుడి ముంగిట చేర్చడానికి ఆయన ఎంతో కృషి చేశారు. దూరవిద్య ద్వారా పల్లెల్లో ఉన్న వారు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆయన ఆశయం వెనుక అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న అచంచలమైన ప్రేమ కనిపిస్తుంది.
అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. కొత్తగా కలం పట్టిన యువ రచయితలకు ఆయన ఒక తండ్రిలా, గురువులా తోడుండేవారు. ఒక కథ రాసినప్పుడు అందులో వాస్తవికత ఎంత ఉంది, అది సమాజానికి ఏం సందేశం ఇస్తోంది అనే విషయాలను ఆయన ఎంతో సున్నితంగా, శాస్త్రీయంగా విశ్లేషించి చెప్పేవారు.
దళిత, బహుజన స్పృహ – కథా శిల్పం: రాయలసీమలోని కుల వివక్షను, సామాజిక అసమానతలను కేతు గారు తన కథల్లో ఎక్కడా నాటకీయత లేకుండా, అత్యంత సహజంగా చిత్రించారు. ఆయన కథల్లోని దళిత పాత్రలు ఆత్మగౌరవంతో మాట్లాడతాయి. భూమి లేని పేదవాడు భూస్వామ్య శక్తులతో పోరాడే క్రమంలో పడే ఇబ్బందులను ఆయన పచ్చిగా రాశారు.
కథా శిల్పం విషయంలో ఆయన పాటించిన జాగ్రత్తలు అనన్యసామాన్యం. వస్తువు ఎంత బలంగా ఉంటుందో, దాని రూపం కూడా అంతే కళాత్మకంగా ఉండాలని ఆయన నమ్మేవారు. అందుకే ఆయన కథలు చదువుతున్నప్పుడు ఒక డాక్యుమెంటరీ చూస్తున్నంత స్పష్టత కనిపిస్తుంది. సీమ కరువు కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు, అది పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన మానవ నిర్మిత విపత్తు అని ఆయన గొంతెత్తి చాటారు.
పురస్కారాలు – జాతీయ గుర్తింపు: కేతు గారి సాహిత్య కృషికి గుర్తింపుగా అనేక గౌరవాలు దక్కాయి. ఆయన రాసిన ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’ సంపుటికి 1996లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇది రాయలసీమ మాండలికానికి, సీమ కథా సాహిత్యానికి దక్కిన జాతీయ గుర్తింపు. దీనితోపాటు భారతీయ భాషా పరిషత్ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం (విమర్శ, కథా రంగాల్లో చేసిన కృషికి), ప్రతిష్టాత్మక రాజ్యలక్ష్మి ఫౌండేషన్ పురస్కారం, మరియు అభ్యుదయ సాహిత్య స్ఫూర్తికి గుర్తింపుగా కొండేపూడి శ్రీనివాసరావు సాహిత్య పురస్కారాలు ఆయనను వరించాయి.
చిరస్మరణీయ సాహితీ మూర్తి: డా. కేతు విశ్వనాథరెడ్డి గారు తెలుగు సాహిత్యానికి అందించిన ‘మాండలిక సొగసు’ నేడు ఒక ఉద్యమంగా మారింది. ఆయన చూపిన బాటలో నేడు ఎందరో సీమ రచయితలు తమ ప్రాంతీయ అస్తిత్వాన్ని చాటుకుంటున్నారు. ప్రాంతీయతను ప్రేమిస్తూనే సార్వజనీనమైన మానవ సంబంధాలను గౌరవించిన గొప్ప మేధావి ఆయన.
నిజమైన రచయిత తన కాలానికి సాక్షిగా నిలబడాలని చెప్పడమే కాకుండా, తన రచనల ద్వారా ఆ సాక్ష్యాన్ని చరిత్రకు అందజేసిన ధీశాలి డా. కేతు. నిరంతరం సత్యం కోసం, సామాన్యుడి పక్షాన నిలబడి కలం పట్టిన ఈ ‘మాండలిక కథా వారధి’ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన సాహిత్యం ఎప్పటికీ రాయలసీమ గుండె చప్పుడై వినిపిస్తూనే ఉంటుంది.
– మహాసముద్రం దేవకి
99632 95987












Leave a Reply