గత పాతికేళ్ళ కవిత్వంలో స్త్రీల సమస్యల ప్రస్తావన

ఆధునిక యుగంలోనూ స్త్రీలు ద్వితీయ శ్రేణి పౌరులుగానే మిగిలిపోవడం విచారకరం. శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతి సమాజ దృక్పథాన్ని మార్చలేకపోయింది. విద్య, జనాభా నిష్పత్తిలో అంతులేని అసమానతలు, పురుషాధిక్య అణచివేతలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ ధిక్కరిస్తూ స్త్రీలు కవిత్వ రూపంలో తమ గళాన్ని విప్పుతున్నారు. ప్రేమ, పెళ్లి పేరిట మోసాలు, దాడులు నిత్యకృత్యమయ్యాయి. చట్టాలున్నా నిందితులు శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు.

ఇటీవల ‘ఆయేషా కేసు’లో సాక్ష్యాలు లేవని కేసు కొట్టేయడాన్ని నిరసిస్తూ, మందరపు హైమవతి ‘ఏమీ ఎరగనట్లు’ కవితలో “ఔను ఆధారాలుండవు నిజమే/రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా, ఆడపిల్లల శరీరమే /ఐఎస్ఐ మార్క్ అంగడి సరుకు/మూతి కంటిన నెత్తురును తుడుచుకుంటూ నిష్కమిస్తుంది క్రూర జంతువు/శవానికి నోరుండదు హంతకుని పేరు చెప్పటానికి/మనుషులకు ధైర్యం ఉండదు నిజం చెప్పడానికి/మనుషులు రోబోలుగా మారిన ఏ.ఐ యుగంలో ఎవరి ధనార్జన కోసం పరుగు పందేలు ప్రారంభం ప్రపంచం ముందుకు సాగిపోతూనే ఉంటుంది ఏమీ ఎరగనట్లు” అంటారు.

ఈ దాడుల్లో బాధితులైన స్త్రీలనే సమాజం నిందించడం ఘోరమైన అన్యాయం. స్త్రీకి స్వేచ్ఛ అవసరం లేదన్న మనుధర్మ సూత్రాలు నేటికీ ఆంక్షల రూపంలో కొనసాగుతున్నాయి. దీనిని ఖండిస్తూ, ఆత్మగౌరవంతో నిలబడే నేటి అమ్మాయిని పోర్షియా దేవి ‘ఆమె ఇప్పుడొక శిల్పి’ కవితలో “నిజానికి ఆమెకిప్పుడు స్వేచ్ఛ అంటే ఏమిటో అర్ధం అవుతుంది/ అందుకే తన పరిధిప్పుడు విశాలమయింది/ యుగాలుగా/ ఎవరెవరో ఉలితో చెక్కుతున్న / ఆ ఆకృతిపుడు తనకేమాత్రం నచ్చడం లేదు/అందుకే ఇపుడామె తనను తాను చెక్కుకునే శిల్పి” అంటూ స్త్రీల పక్షాన నిలబడతారు.

మానవుడు అంగారక గ్రహంపై అడుగుపెట్టినా, స్త్రీని కేవలం ఒక భోగ వస్తువుగా చూసే భావన మారలేదు. బాలింత అన్న విచక్షణ లేకుండా భర్త తన శారీరక కోరికలను తీర్చుకునే వేదనను పద్మావతి రాంభక్త ‘నీలి కలలు’ కవితలో ‘నీకు నా దేహమొక క్రీడాస్థలం/ఎప్పుడు పడితే అప్పుడు/నా ప్రమేయం లేకుండానే ఆడుకొని/నువ్వు మాత్రమే గెలిచి/విజయ గర్వంతో నీ నుదుటను మెరిసే/చెమట చుక్కలను తుడుచుకుంటూ/ఠీవీగా నడిచిపోతావు/ నేను నా విరిగిపడిన ముక్కలను ఏరుకుంటూ/నా సలపరించే పచ్చి బాలింత అవయవాలను పోగు చేసుకుంటూ రహస్యంగా కన్నీళ్లు తుడుచుకుంటాను’ అంటూ మహిళల వేదనను కళ్ళకు కడతారు.

గృహకృత్యాల వల్ల, ప్రసవాల వల్ల శరీరానికి జరిగే గాయాలు, సమాజం వేసే అపనిందల వల్ల మనసుకు తగిలే గాయాల గురించి డా. కాళ్ళకూరి శైలజ గారు ‘మచ్చలు’ కవితలో ‘కాన్పు కాన్పుకు ఉబ్బిన దారపు కండె/ ప్రతి పురిటికీ పిగిలి డొల్లయి మిగిలింది/ ఆఖరి బిడ్డ అడ్డు తిరిగినప్పుడు పెట్టిన నిలువు కోత/ఈ మద్దినే తెగ దురద తేరుతుంది/ఇవన్నీ కనిపించే మచ్చలు/ ఇక కనబడని మచ్చలు ఎన్నో వాళ్ళ జీవితాలలో/ఎన్నో మచ్చలు/ పదిమందిలో అపనిందల తూట్లు / ఎన్నని చెప్పాలి?’ అంటూ కాన్పులు సమయంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడతారు.

స్త్రీలు పూజించబడే చోట దేవతలు ఉంటారనే సూక్తి కేవలం మాటలకే పరిమితమైంది. వాస్తవానికి వారిని అంగడి బొమ్మలుగానే చూస్తున్నారంటూ లావణ్యా సైదీశ్వర్ ‘యత్ర నార్యంతు విక్రయంతే’ కవితలో: ‘ఇక్కడ స్త్రీలు పూజింపబడతారు/కాదు కాదు/కాసుల మూసలో కొలచబడతారు/దేహాలపై నల్లని కాటుక పులిమి/నిస్సిగ్గుగా ఆధిపత్యాన్ని చూసే హక్కుదారుల చేతుల్లో వీళ్లు నలిగే కీలుబొమ్మలు/మాటలు మరిచిన అర్ధణాల అంగడి సరుకులు’ అంటూ వ్యవస్థపై నిప్పులు చెరిగారు.

వివాహం స్త్రీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. పుట్టింటి జ్ఞాపకాలను వదిలి, అత్తగారింట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించే స్త్రీ వేదనను గట్టు రాధిక మోహన్ ‘పసుపు పూస్తాంటే/అవ్వ ముఖం అవ పడుతాంది/తెల్ల పిండితో ముగ్గేస్తుంటే నాయన మనస్సు ఎదురు పడ్తాంది /పెట్టిన కుంకుమ బొట్లు ముద్దమందారాల్లున్న అక్క జెల్లెండ్లనయి/ ఆడబతుకంటే/ గడపనుండి గడపకు మారిపోవడమే కద’ అంటూ వ్యక్తమవుతారు.

ఇల్లు స్త్రీ శక్తినంతటినీ హరిస్తుంది. 24 గంటలూ విశ్రాంతి లేకుండా శ్రమించే కన్నతల్లి శ్రమశక్తిని గీతాంజలి గారు ‘అమ్మా.. ఎక్కడివే నీకిన్ని చేతులు?’ కవితలో: ‘వంట చేస్తున్నప్పుడు వేడి నూనె కాలి బొబ్బలెక్కి/ మచ్చలైన చేతులు/నాన్న పోతే కూలీ తట్టయి/ అమాంతం ఇంటిని నెత్తిన మోసిన చేతులు/ఇంటినిలా సాదిన అమ్మా ! ఇంటి నిండా నీ చేతులే కదా! ఎక్కడవే అమ్మా నీకిన్ని చేతులు’ అంటూ అమ్మ ప్రేమను, సంతానం పట్ల బాధ్యతను అద్భుతంగా కొనియాడారు.
_________________

నేడు స్త్రీలు పోలీస్ వంటి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, సమాజం వారిని కేవలం శారీరక దృష్టితోనే చూస్తోంది. ప్రొఫెసర్ సుశీలమ్మ గారు ‘లేడీ కానిస్టేబుల్’ కవితలో: ‘యూనిఫాంలో ఉన్న హుందాతనం మా జీవితాల్లో లేదని తెలిసేసరికి/గుండె కలుక్కుమంటుంది/ పై ఆఫీసర్ కే కాదు/సెల్ లోని ఖైదీకి/మేమంటే చులకనే/చేతిలో లాఠీ ఉన్నా మా ఆడతనమంటే/అందరికీ అలుసే /లేడీ కానిస్టేబుల్ అంటే/అంగడి బొమ్మ కాదని’ తమ వృత్తిలో ఎదురయ్యే చులకన భావాన్ని ఎండగడతారు.
__________________

ఆధునిక యుగంలోనూ వితంతువుల పట్ల చూపే వివక్ష, గాజులు పగలగొట్టి, బొట్టు చెరిపేసే భయంకర ఆచారం విద్యావంతులలోనూ కొనసాగుతోంది. దీనిని వైష్ణవిశ్రీ ‘ఆమె నొసటన ఉదయాలు’ కవితలో: ‘చావు పల్లకీలో ఊరేగుతూ అతను వెళ్ళిపోయాడు/గాజులు, పూవ్వులనిండా రక్తపు మరకలు/ఇంతకూ

గాయపరిచిందెవరో? నుదురు బోసిపోయింది తెలతెలవారుతుండగా/ఆమె నొసటనే ఉదయించాడు సూర్యుడు/ ఆమె విధవని శంకించలేదు’ అని ప్రతిఘటించారు.

పితృస్వామ్య సమాజంలో భాష కూడా వివక్షతో కూడుకుని ఉంది. పురుషాధిక్యతను ధిక్కరించడానికి మగ పదాల అవసరాన్ని సుభాషిణి తోట ‘నాకు కొన్ని మగ పదాలు కావాలి’ కవితలో: ‘వాడిపై బలమైన/అస్త్రం ప్రయోగించాలి అనుకున్నప్పుడు/ సున్నితమైన భాష/ సహజమైన వ్యక్తీకరణలు అదుపు చేయలేనప్పుడు/నేను కొన్ని ఆయుధాలను సమకూర్చుకుంటాను/వాటికై నాకు కొన్ని మగ పదాలు కావాలి’ అంటూ డిమాండ్ చేశారు.

ప్రతి స్త్రీకి బతకడమే ఒక నిరంతర యుద్ధం. పురుషులతో సమానమైన హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం డి. నాగజ్యోతి శేఖర్ ‘అనివార్యం’ కవితలో: ‘యుద్ధం నాకేం కొత్త కాదు కానీ/ భూమి నీదీ నాదీ అయినప్పుడు నేను మాత్రమే మొలకెత్తేందుకు పోరాడటమేమిటి? ఇప్పుడే ‘నిర్భయం’ గా నా ‘దిశ’ ను మార్చుకొంటున్నా/ ఇప్పుడు యుద్ధం ఎవరిదో తేల్చుకో’ అని సమాజానికి సవాల్ విసిరారు.

స్త్రీలపై జరిగే దాడులలో, ముఖ్యంగా దళిత స్త్రీలపై జరిగే అత్యాచారాలను, అణచివేతను ఎం. ఎం. వినోదిని ‘ఇండియన్ పబ్లిక్ టాయిలెట్స్’ కవితలో: ‘మా అశుద్ధ గుంటల్లో నాలుగు వీర్యపు చుక్కలు పోసి పోతారు మీరు/పోతూ పోతూ తిరిగి చూసి పోట్లు పొడుస్తారు/ఈ దేశపు మను వారసులకి మావి ఆడ గుంటలు కానే కాదు/అక్షరాలా అంటరాని కులం గుంటలు/ We are never India’s daughters we are India’s public toilets’ అని అత్యంత పదునైన పదాలతో ఎండగట్టారు.

మనసారా నవ్వడానికి, ఏడవడానికి కూడా స్వేచ్ఛ లేని స్త్రీల జీవన వివక్షను షాజహానా ‘ఆమె నిషేధ స్థలాలు’ కవితలో ప్రతిబింబించారు: ‘అందరి ముందు నవ్వద్దు/ దేన్నైనా దాచుకోవచ్చు/ నవ్వెట్లా ఎవరికీ కనబడకుండా/ ఎన్ని రోజులుగానో/ముఖంలో దాచిపెట్టిన దాది మా నవ్వు.. వాకిట్ల ఏడవకూడదు../గొంతులో గుచ్చుకునే దుఃఖపు ముల్లు / మింగలేక కక్కలేక/మనసారా నవ్వడానికీ’.

ఇలా శీలా సుభద్రాదేవి, అపర్ణ తోట, అరుణ నారదభట్ల, శశిశ్రీ, సుభద్ర జూపాక, మహెజబీన్, బండారు విజయ,మెర్సీ మార్గరెట్, కల్పనా రెంటాల, కె. గీత, విమల, పాలపర్తి ఇంద్రాణి, గీతా వెల్లంకి, రూపా రుక్మిణి, జయశ్రీ మువ్వా వంటి ఎందరో కవయిత్రులు శక్తివంతమైన కవిత్వాన్ని సృష్టిస్తున్నారు. నేటి స్త్రీలు తమ అక్షరాలనే పదునైన ఆయుధాలుగా మార్చి, కవిత్వానికి సరికొత్త వ్యాకరణాన్ని సృష్టిస్తూ పురుషాహంకార సమాజానికి సవాల్ విసురుతున్నారు.

-మందరపు హైమవతి
94410 62732

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *