సరికొత్త దృష్టి కోణం

తెలుగుసాహిత్య చరిత్ర, సంస్కృత సాహిత్య చరిత్ర, తెలంగాణ సాహిత్యచరిత్ర రచించిన విదుషీమణి ముదిగంటి సుజాతారెడ్డి. తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన పలు మౌలికాంశాల మీద ఆమె రాసిన వ్యాసాల సమాహారం ఈ ‘తెలంగాణ సాహిత్య ప్రస్థానం’. తనదయిన దృష్టి కోణం నుంచి తెలంగాణ భాష, సాహిత్యచరిత్రకు సంబంధించిన విభిన్న అంశాల మీద రాసిన వ్యాసాలివి. తెలంగాణ సాహిత్యచరిత్రని మరింత నిశితంగా అధ్యయనం చేయడానికి ఉపకరిస్తాయి. తెలంగాణ భాషకు, సాహిత్యానికి ఉన్న ప్రాశస్త్యాన్ని తెలియజేస్తాయి. దాదాపు రెండువేల సంవత్సరాల కిందటనే తెలంగాణ నేల మీద తెలుగు భాష వర్ధిల్లిన ఆనవాళ్ళకు సంబంధించిన రుజువులు కనిపిస్తాయి. ‘ఆదికవి నన్నయ’ అని ఆంధ్రసాహిత్యకారులు అంటారు గానీ అసలు సిసలు ఆదికవి వేములవాడ భీమకవి అని సోపపత్తికంగా నిరూపిస్తారు. తెలుగులో ‘ఆదికవి వేములవాడ భీమకవి’ అని సాధికారికంగా చెబుతారు. భీమన్న వేములవాడ నివాసి అని చెప్పడానికి గల ఆధారాలను ఉటంకిస్తారు.
___________________
తెలంగాణ సాహిత్యచరిత్రలోని విభిన్న అంశాల గురించి మరింత సూక్ష్మంగా, వివరంగా చెప్పుకోవడం అనివార్యమైన అవసరం. ఎందుకంటే తెలుగు సాహిత్యచరిత్రను రచించిన చాలామంది తెలంగాణ ప్రాంత సాహిత్యాన్ని విస్మరించారు. ఇప్పటికీ తెలంగాణ సాహిత్యం గురించి అల్పమైన భావనతో మాట్లాడుతుంటారు. ఆ భావనల్ని త్రోసిరాజనడానికి సుజాతారెడ్డి ‘తెలుగు సాహిత్యచరిత్ర’ను రచించి 1996లోనే ప్రచురించారు.
____________________

ఆ పుస్తకానికి ముందుమాట రాస్తూ చేకూరి రామారావు అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి -“పూర్వ సాహిత్య చరిత్ర గ్రంథాల్లో తెలంగాణ ఒక అజ్ఞాత ప్రాంతంగా కనిపించేది. సాహిత్య చరిత్ర అంతా తెలంగాణేతర ప్రాంతంలో జరిగిందా? అని (అవసరం కొద్దీ కొంత అతిశయోక్తి వాడినందుకు క్షమించండి) అనుమానం వచ్చేది. సుజాత గారి పుస్తకంతో ఆ లోపం చాలా వరకు తీరింది. పూర్తిగా తీరాలంటే ఇంకా పరిశోధన జరగాల్సి ఉంటుంది” (తెలుగు సాహిత్య చరిత్ర ముదిగంటి సుజాతారెడ్డి పుస్తకానికి చేరా ముందుమాట, పేజీ నెం: 5).
తెలంగాణ ప్రాంతీయ చైతన్యం ఇంకా ఉధృత దశకు చేరుకోని కాలంలోనే తెలంగాణ సాహిత్యం గురించి యోచించి, పరిశోధించి తెలుగు సాహిత్యచరిత్రలో తెలంగాణ ప్రాంతం కంట్రిబ్యూషన్‌ను తెలియజెప్పారు సుజాతారెడ్డి. అయినప్పటికీ ఆ పుస్తకంతోనే ఆమె పరిశోధన ఆగిపోలేదు. తెలుగు సాహిత్యం మీద, ప్రత్యేకించి తెలంగాణ సాహిత్యం మీద ప్రేమతో పలు సందర్భాలలో వ్యాసాలు రచిస్తున్నారు. మరింత అధ్యయనం, పరిశోధన చేస్తూ తెలంగాణ సాహిత్య చరిత్రకు గర్వకారణమైన అనేక అంశాలను గుర్తు చేస్తున్నారు. సుజాతారెడ్డి ‘తెలుగు సాహిత్య చరిత్ర’ వెలువడిన మూడు దశాబ్దాల తరువాత కూడా ఇంకా ‘ఆదికవి నన్నయ’ అని ఆంధ్ర సాహిత్యకారులు చెప్పుకోవడం వైచిత్రి. ఈ వాదనలను పూర్వపక్షం చేయడానికి తెలంగాణ సాహిత్య చరిత్రకు సంబంధించిన పలు వ్యాసాలు రచించారు సుజాతారెడ్డి.

అసలు తెలుగు సాహిత్య చరిత్ర అంటే తెలంగాణ సాహిత్య చరిత్రనే అన్నంత సుసంపన్నత తెలంగాణ సాహిత్యానికి ఉన్నదని ఈ పుస్తకం చదివితే బోధపడుతుంది. రెండువేల సంవత్సరాల తెలుగు సాహిత్య గమనాన్ని నిశితంగా పరిశీలిస్తే ఎన్నో విషయాల్లో తెలంగాణ ప్రాంత కవులు, రచయితలు, సాహితీవేత్తలు ముందువరసలో ఉండటం తెలుస్తుంది. ఇది కాదనలేని సత్యం. చరిత్రను శోధిస్తే కనిపించే వాస్తవం. శాతవాహనుల కాలంలోనే తెలుగు భాష వర్ధిల్లిన సంగతి శాసనాల్లో తెలుగు పదాలు ఉండటాన్ని ప్రస్తావిస్తూ గుర్తు చేస్తారు సుజాతారెడ్డి.

ఈ పుస్తకంలోని వ్యాసాలు చదువుతుంటే గమనించదగ్గ మరో అంశం కనిపిస్తున్నది. తెలంగాణను ఏలిన రాజులు ఎవరయినా సరే భాష, సాహిత్యాలకు పెద్దపీట వేశారు. కవులను, సృజనశీలురను సముచిత రీతిన గౌరవించారు. అనేకమంది రాజులు సాహితీ పోషకులుగా పేరు గడించడమే కాదు, స్వయంగా కావ్యాలు రచించారు. అయితే రాజుల పోషణలోనే కవులంతా సేద తీరలేదు. అవసరమైనపుడు రాజాజ్ఞను ధిక్కరించారు కవులు. తమ కావ్యాలను రాజులకు అంకితమివ్వ నిరాకరించారు. ఈ తిరుగుబాటు తత్వం, ధిక్కార స్వభావం, ఆత్మగౌరవ చైతన్యం తెలంగాణ ప్రాంత కవులకు పూర్వం నుంచి పరంపరానుగతంగా వస్తుందని సుజాతారెడ్డి వ్యాసాలు చదివితే బోధపడుతుంది. మల్లికార్జున పండితారాధ్యుడు, తిక్కన వంటి వారి గురించి చదివితే ఆ కాలంలోనే ప్రభువులను ధిక్కరించిన తెలంగాణ కవుల చైతన్యం తెలుస్తుంది.

ప్రాకృతం, సంస్కృతం ప్రాభవం విలసిల్లుతున్న కాలంలోనే తెలుగు భాషకు ప్రాధాన్యమిచ్చి జనం భాషలో తెలంగాణ కవులు పద్యాలు, కావ్యాలు రచించడం గమనార్హం. ఆ రకంగా ‘దేశీయత’కు పట్టం గట్టిన చరిత్ర తెలంగాణ సృజనశీలురది. ఈ అంశాలని తేటతెల్లంగా నొక్కి చెబుతూ రాసిన ఈ వ్యాసాలు చదువుతుంటే సుజాతారెడ్డి అన్నట్టు ‘మన చరిత్ర సవరించుకోవాలె’. ఎందుకంటే “సాహిత్య చరిత్రలో జైన బౌద్ధ యుగాలను పూర్తిగా చెరిపేసి తెలుగు సాహిత్యకారులు నన్నయతో ఏకంగా తెలుగు సాహిత్య చరిత్రలను ఆరంభించి రాస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సాహిత్య చరిత్రను రాసుకునేటప్పుడు జైన యుగాన్ని చేర్చుకొని రాసుకుంటున్నాం.

విస్మరింపబడిన వైదిక రచనలు భిన్నమైన జైన ధర్మాన్ని చెప్పే సాహిత్య రచనలను మన సాహిత్య చరిత్రకారులు లెక్కచేయకుండా సరైన పరిశోధనలు చేయకుండా సాహిత్య చరిత్రలు రాశారు. దాన్ని ఇప్పుడు మనం సవరించుకుంటున్నాం. కొత్తగా పరిశోధనలతో తెలంగాణ భూమి మీద సృష్టించబడిన సాహిత్య రచనల ప్రాచీనతలను తెలుసుకొని కొత్త అధ్యాయాన్ని రచించుకుంటున్నాం” అంటారు సుజాతారెడ్డి.

కనుక ఇలా రాసుకోవడమే గాక అధ్యయనం చేయడం, తెలంగాణ మాగాణపు సాహిత్య చరిత్రను ముందుతరాల వారికి అందించడం తెలంగాణ నేల మీద ఉన్న వారి కర్తవ్యం. ఇందుకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల సిలబస్ మారాలి. తెలంగాణ సాహిత్య చరిత్ర ఔన్నత్యాన్ని తెలియబరిచేలా కొత్త సిలబస్‌ను రూపొందించుకోవాలి. ఇందుకు అన్నివిధాలుగా ఈ వ్యాసాలు ఉపకరిస్తాయి. ప్రాచీన సాహిత్యం నుంచి మొదలుకొని ఇప్పటివరకు విభిన్న అంశాల్లో తెలంగాణది మొదటి స్థానం ఎలానో సుజాతారెడ్డి చెబుతారు. అందుకు తగిన ఆధారాలు చూపిస్తారు.

“తొలి చంపూ రామాయణం మనదే”
“తెలుగులో తొలి పురాణము తొలి కవయిత్రి”
“తొలి వచనము మనదే”
“మొట్టమొదటి ప్రబంధం మనదే”
“మొదటి అచ్చు తెలుగు కావ్యం మనదే”
“తొలి తెలుగు కథ, తొలి దళిత కథ, తొలి నవల” కూడా తెలంగాణ వారిదే అన్న వాస్తవాన్ని నిరూపిస్తూ రాసిన ఈ వ్యాసాలు తెలంగాణ సాహిత్య మాగాణం విశిష్టతకు తార్కాణం.

నిజానికి ఈ దృష్టితో తెలంగాణ సాహిత్య చరిత్రను మాత్రమే కాదు తెలుగు సాహిత్యచరిత్రను తిరగరాసుకోడం అవసరం. ఈ అవసరాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రచయితలు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు సైతం గుర్తించాలి. తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన వాస్తవాలు ఇంత స్పష్టంగా కనిపిస్తుండగా అసత్యాలతో, అర్ధ సత్యాలతో కూడిన పూర్వ తెలుగు సాహిత్యచరిత్రలను ఇంకా చదువుకోడం అసంగతం, అసంబద్ధం. అందుకని తెలంగాణేతర ప్రాంతాలలోనూ తెలుగు సాహిత్యచరిత్రలను కొత్త దృష్టితో రాసుకోవాలి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా సాహిత్యానికీ, భాషకూ ప్రాంతం ఏమిటి అని కొందరు మాట్లాడుతుంటారు. నిజమే ఆ ఎల్లలు అక్కరలేదు. ప్రాంతంతో నిమిత్తం లేదనే మాటను హృదయపూర్వకంగా చెప్పేవారు నిజాయితీగా మసలుకోవాలి. తెలుగు సాహిత్యచరిత్రను వాస్తవికత ప్రాతిపదికన సరికొత్తగా రచించుకోవాలన్న మాటను అంగీకరించాలి. ఇందుకు అనుగుణంగా సాహిత్య చరిత్రలో తెలంగాణ ప్రాంత ప్రత్యేకతలను, విలక్షణతను గుర్తిస్తూ సరికొత్తగా తెలుగు సాహిత్యచరిత్రను రచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల సిలబస్ లోనూ ప్రవేశపెట్టాలి. ఇప్పటివరకు జరిగిన పొరపాట్లను, తప్పులను సవరించుకోవాలి. అపుడే సాహిత్యానికీ, భాషకీ ప్రాంతం ఏమిటనే వారి మాటకు అర్థం ఉంటుంది. ఇంతకాలంగా తెలిసీ తెలియక చూపిన వివక్షకు పరిహారం చెల్లించినట్టు అవుతుంది. అంతకన్నా ముఖ్యంగా సకల ప్రాంతాల తెలుగువారికి నిజాయితీతో, సత్యనిరూపణలతో కూడిన సాహిత్యచరిత్రను అందించిన ఖ్యాతి దక్కుతుంది. ఈ విషయంలో నిజాయితీగా, చిత్తశుద్ధితో ఆలోచించే ఆంధ్ర సాహిత్యకారులు, విద్యావేత్తలు చొరవ చూపాలి. ఇందుకు వారికి దారి చూపే దీపం సుజాతారెడ్డి రాసిన ఈ గ్రంథం.
____________________
తెలుగు సాహిత్య చరిత్ర పునర్మూల్యాంకనానికీ, సరికొత్త దృష్టితో కూడిన సాహిత్యచరిత్ర రచనకు ఉపకరించే వ్యాసాల సమాహారం ఈ ‘తెలంగాణ సాహిత్య ప్రస్థానం’. అరవైకి పైబడిన ఈ వ్యాసాలలో విభిన్న ప్రక్రియలకు సంబంధించిన విశిష్టతలు ఎన్నో చూస్తాం. వివిధ సాహిత్యోద్యమాల నేపథ్యం, ప్రయాణానికి సంబంధించిన సూక్ష్మమైన విషయాలెన్నిటినో సుజాతారెడ్డి రికార్డు చేశారు.
__________________

ఇదివరలో తాను రచించిన తెలుగు సాహిత్య చరిత్ర, తెలంగాణ సాహిత్య చరిత్రలో ఉటంకించని అంశాలు అనేకం ఈ వ్యాసాలలో కనిపిస్తాయి. కవిత్వం, కథ, నవల, నాటకం, విమర్శ వంటి ప్రక్రియలలో తెలంగాణ వారి నడకను, ఆ నడకలోని వైశిష్ట్యాన్ని సోదాహరణంగా వివరించడం ఈ వ్యాసాల ప్రత్యేకత. కొత్తతరం సాహిత్య విద్యార్థులకు ఈ గ్రంథం ఒక ఉపకరణం. తెలంగాణ సాహిత్యంలోని వైశాల్యాన్నీ, విస్తృతినీ ఆకళింపు చేసుకోడానికి తోడ్పడే వాచకం. తెలంగాణ సాహిత్యాన్ని ఒక పాఠ్యాంశంగా బోధించే వారికి ఉపయోగపడే కరదీపిక. తెలంగాణ సాహిత్యం మీద పరిశోధన చేసేవారిలో, వ్యాసకర్తలలో సరికొత్త ఆలోచనల్ని ప్రోది చేస్తూ, మరింత నిశితమైన అధ్యయనానికి పురిగొల్పడం ఈ గ్రంథం సాఫల్యం.

– గుడిపాటి
98487 87284

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *