వర్తమాన కవిత్వంపై నిశితమైన వ్యాఖ్యానం

ఇవాళ కవిత్వం ఎలా ఉంది? ఎలాంటి కవిత్వం వస్తోంది? కవులు ఎలాంటి వస్తువులను స్వీకరిస్తున్నారు? వస్తువును కవిత్వం చేయడంలో వారి సాఫల్య వైఫల్యాలు ఏమిటి? కవిత్వంలో సాంద్రతను సాధించడంలో చేస్తున్న కృషి ఏమిటి? వైవిధ్యమైన అభివ్యక్తి కోసం చేస్తున్న ప్రయత్నాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? ఈ ప్రశ్నలకు జవాబులు చెబుతుంది ఏనుగు నరసింహారెడ్డి ‘వ్యక్తావ్యక్తం’.
______________________

డెబ్బైకి పైగా వ్యాసాలున్న ఈ పుస్తకంలో ఆరేడు వ్యాసాలు మినహా మిగతావన్నీ దాదాపు దశాబ్దకాలంగా కవిత్వం రాస్తున్న వారి పుస్తకాలపై కేంద్రీకృతమై ఉండటం గమనార్హం. తెలంగాణ సాయుధపోరాట తొలి, మలి దశల కవిత్వం మీద విపులమైన విశ్లేషణతో కూడిన మొదటి వ్యాసం సమగ్రంగా ఉంది. సుంకిరెడ్డి నారాయణరెడ్డి దీర్ఘకవిత ‘దాలి’ మీద ప్రత్యేకమైన వ్యాసం దీర్ఘ కవితల విశ్లేషణకు అందమైన నమూనా. ఒక కవి సమగ్ర కవిత్వాన్ని అంచనా వేసి నిగ్గుదేల్చడానికి ఉదాహరణగా నిలిచిపోయే వ్యాసం నందిని సిధారెడ్డి కవితావలోకనం.
_____________________

అలాగే ఐదు దశాబ్దాల తరబడి కవిత్వమే జీవితంగా చరిస్తున్న నాళేశ్వరం శంకరం సాహిత్య మూర్తిమత్వాన్ని పట్టిచూపే పరిపూర్ణ వ్యాసం ‘మనకాలపు కవుల కవి నాళేశ్వరం శంకరం’. ఈ విధంగా నిరంతర కవితాయానం చేస్తున్న వారిపై రాసిన విపులమైన వ్యాసాలు ఎంతో విశిష్టమైనవి. ఇవి వర్తమాన కవులకు, విమర్శకులకు, పరిశోధకులకు మరింత ఉపయుక్తం. కవిత్వం రాయడం ఓ అసిధారావ్రతం. కవిత్వం గురించి యోచిస్తూ, చదువుతూ, కవిత్వమూ, కవిత్వ విమర్శ రాస్తున్న వారి కవిత్వాన్ని కూడా ఏనుగు నరసింహారెడ్డి ప్రస్తావించారు ఈ పుస్తకంలో. వారి కవితా వైశిష్ట్యాన్ని వివరించారు. కాంచనపల్లి, అన్నవరం దేవేందర్, గోపగాని రవీందర్, దోరవేటి, కొండపల్లి నీహారిణి వంటి వారి కవితాభివ్యక్తి రీతుల్లోని వైవిధ్యాన్ని పట్టిచూపారు. వర్తమాన కవిత్వంలో వారి కవిత్వం ప్రత్యేకంగా నిలబడటానికి గల మూలాల్ని, వారి కళా నైపుణ్యాలను సోదాహరణంగా చర్చించారు.

ఏనుగు నరసింహారెడ్డి స్వయంగా కవి, పరిశోధకులు, విమర్శకులు, అనువాదకులు, ప్రసంగకర్త. ఈ పాత్రలన్నిటినీ ఏకకాలంలో నిర్వహిస్తున్న సృజనశీలి. విద్యార్థిగా ఎం.ఏ. తెలుగు చదివిన ఆయన ఎక్కడున్నా, ఏం చేస్తున్నా నిత్య అధ్యయనశీలి అని చెప్పడానికి ఆయన రాసిన పుస్తకాలే సాక్ష్యం. కవిత్వ ప్రక్రియలో పరిశోధన చేసి ఎం.ఫిల్, పిహెచ్.డి గ్రంథాలు వెలువరించారు. విమర్శకునిగా మూడు పుస్తకాలు తీసుకొచ్చారు. కవిగా ఏడు పుస్తకాల కవిత్వం లోకానికి అందించారు. తన కవితా రచనలోనూ వైవిధ్యం అపారం. వచన కవిత, పద్యం, పాట, రుబాయిలు, శతకం ఉన్నాయి. విభిన్న కవితారూపాలను అధ్యయనం చేయడం, సృజించడం తన సాహిత్య జీవితంలో అంతర్భాగం. ఈ విధంగా పలు మేలిమి అంశాలతో కూడిన నరసింహారెడ్డి సారస్వత వివేచన వర్తమాన కవిత్వం మీద నిశితమైన వ్యాఖ్యానం చేయడానికి, సాధికారికంగా మాట్లాడటానికి మూలం. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషలలోని సాహిత్య అధ్యయనమూ ఆయన రచనా వ్యాసంగానికి విస్తృతినీ, వైశాల్యాన్నీ చేకూర్చింది. స్థలకాలాల స్పృహను అందించింది. సంయమనంతో కూడిన దృక్పథాన్ని అందించింది. ఈ దృష్టి అలవడటానికి మూలం ఆయన చూసిన లోకం, చేసిన ప్రయాణాలు. వృత్తి ఉద్యోగాల నిర్వహణలో భాగంగా గ్రామాలను, పట్టణాలను, నగరాలను దగ్గరగా చూశారు. మాన్యులను, సామాన్యులను, వారి బతుకులను, నైజాలను అతి సమీపంగా దర్శించారు. లోకం భిన్న పోకడల కూడలి అని అర్థం చేసుకున్నారు. సాహిత్య ప్రపంచంలోనూ వాదాలను, వివాదాలను, దృక్పథాలను, సిద్ధాంతాలను, వ్యక్తులను, వారి బలాలను, బలహీనతలను గమనిస్తూ వచ్చారు అసంకల్పితంగా. ఈ క్రమాన కవిత్వ విమర్శలో తనదైన కంఠస్వరాన్ని సంతరించుకున్నారు.

నరసింహారెడ్డి విమర్శనా స్వరంలో కచ్చితత్వం ఉంటుందే తప్ప కాఠిన్యం ఉండదు. చెప్పాలనుకున్నది స్పష్టంగా చెబుతారు. మొహమాటం లేదు. నొప్పింపక ఒప్పించే గొంతుక ఈ చెప్పడంలో దాగుంది. కొందరు కవుల మార్గంలో, అభివ్యక్తిలో, కవిత్వ నిర్మాణంలో రావలసిన మార్పులను గుర్తుచేస్తారు. ఎవరూ పుట్టుకతోనే వస్తుశిల్పాల మీద పట్టు సాధించరు. గొప్పకవులుగా ప్రత్యక్షమవరు. అందునా కొత్తగా రాసే వారు, తొలి పుస్తకంతో మొదలుపెట్టిన వారి ప్రయాణం ఎలా ముందుకు సాగాలో సూచించాలే తప్ప నిరాశపరచకూడదు. ఈ దృష్టికోణం నరసింహారెడ్డికి ఉంది. ఇది ఆయన కవితావిమర్శలో ఓ సానుకూల అంశం. అయితే కవులకు మినహాయింపులు ఇవ్వలేదు. వారి కవిత్వ సాంద్రతను విశ్లేషించడంలో రాజీపడలేదు. వారి కవితా ప్రపంచాన్ని మనం ఎలా చూడాలో, అర్థం చేసుకోవాలో సూచిస్తారు.

మరీ ముఖ్యంగా ఇవాళ రాస్తున్న కవుల ఆలోచనా ప్రపంచాన్ని, లోకాన్ని అర్థం చేసుకుని కవిత్వం చేస్తున్న తీరును అవలోకించడానికి ఈ వ్యాసాలు మార్గనిర్దేశనం చేస్తాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలకు ఇవాళ్టి కవులు ఏవిధంగా స్పందిస్తున్నారో నరసింహారెడ్డి చెబుతారు. అందుకని ఈ వ్యాసాలను, ఈ వ్యాసాలలో ప్రస్తావించిన కవితా సంపుటాలను, సంకలనాలను నిశితంగా అధ్యయనం చేయాలి. కవిత్వ విమర్శ రాసేవారు, పరిశోధనలు చేసేవారు ఈ పని ప్రత్యేకంగా చేయాలి. వారికి అవసరమైన విమర్శనా పరికరాలను, సాధన సంపత్తిని ఈ పుస్తకం అందిస్తుంది. సాహితీవేత్తలకు మాత్రమే కాదు సామాజిక, రాజకీయ పరిశోధనలు చేసేవారికి తగిన ఆకరాలను ఈ వ్యాసాలు అందిస్తాయి. సామాజిక చరిత్రను రికార్డు చేసేవారికి తగిన వనరులు ఈ వ్యాసాలలో దాగున్నాయి.
___________________
కవిత్వం చదవడం ఓ కళ. శ్రద్ధ పెట్టి చదివితే తప్ప కొందరు కవుల అభివ్యక్తి సౌందర్యం బోధపడదు. అలవోకగా కాకుండా మనసు పెట్టి చదివితేనే సరికొత్త వ్యక్తీకరణలను, కవులు సృజించిన భావచిత్రాలను, ప్రతీకల్లోని ముగ్ధత్వాన్ని ఆకళింపు చేసుకోవడం సాధ్యం. కవితా విమర్శ క్రమాన నరసింహారెడ్డి ప్రతి కవిని శ్రద్ధతో చదివారు. వారి వస్తు నిర్వహణ పద్ధతులను, కవితా నిర్మాణంలోని సొబగులను, ఊహాశాలితలోని సౌందర్యాన్ని ప్రస్తావించారు. అదే సమయాన కొందరి పరిమితులను తెలియజేశారు. తమదైన కవితాశిల్పం రూపొందించుకోవడానికి సాధన చేయాల్సిన అవసరాన్ని విస్పష్టంగా చెప్పారు.
_____________________

ఈ పుస్తకం వలన ఒనగూరే మరో మేలు ఏమంటే చాలామంది దృష్టిలోకి రాని మంచి కవిత్వాన్ని పరిచయం చేయడం. ‘నిజం’ లాంటి కవుల మనోహరమైన కవిత్వం ఎందుకు పట్టించుకోవాలో చెప్పడం. ఇవాళ వస్తున్న కవిత్వంలో సాంద్రత, గాఢత తగ్గిపోతుందనే వారి మాటలలో పూర్తి నిజం లేదని తెలియజేయడం. తమదైన అభివ్యక్తితో తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేస్తున్న వారు ఉన్నారని గుర్తుచేయడం. కవుల వయసుతో, పేరుప్రతిష్ఠలతో సంబంధం లేకుండా ప్రతి కవిని వినూత్నదృష్టితో దర్శించే స్వభావాన్ని అలవరచడం. అందుకని ఈ ‘వ్యక్తావ్యక్తం’ వ్యాసాల సంపుటిని ఆహ్వానించాలి. కవుల స్థాయిభేదాలను పట్టించుకోకుండా వాచకమే ప్రమాణంగా విమర్శనా వ్యాసంగం కొనసాగిస్తున్న ఏనుగు నరసింహారెడ్డికి ప్రత్యేక అభినందనలు.

-గుడిపాటి,
98487 87284

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *