జగన్ పయనం ఎటు?

మాజీ సీఎం జగన్ చెబుతున్న మాటలను ప్రజలు నమ్ముతున్నారా అనేది సందేహం కలుగుతున్నది. ఈ 45రోజుల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నదని, వైసీపీ కార్యకర్తలపై దాడులు, హత్యా కాండ జరుగుతున్నదని జగన్ ఆరోపించారు. 36మందిని చంపారని పత్రికా సమావేశంలో ఆరోపించారు. విలేకరులు వారి పేర్లను చెప్పమంటే భోజనం చేయండని మాట దాటవేసారు. అసెంబ్లీలో సీఎం కూడా అదే ప్రశ్న వేసారు. మరి పేర్లు చెప్పలేని పరిస్థితి అయితే ఈ ఆరోపణలపై విశ్వసనీయత ఎంతవరకు ఉంటుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. శ్వేత పత్రాలను విడుదల చేయడం గత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికే అని జగన్ ఆరోపిస్తూ తాము నిజానిజాలు వెల్లడిస్తూ ఫ్యాక్ట్ పత్రాలు విడుదల చేస్తామని చెప్పడం మరో యుద్ధానికి సిద్ధమని చెప్పకనే చెప్పారు. అప్పులు కూటమి చెప్పినంతగా లేవని,కేవలం అభూత కల్పనలేనని ఖండించడం గమనార్హం. అసెంబ్లీలో సీఎం అధికారికంగా చేసిన ప్రకటన తప్పు అనడం కూడా దానిని సమర్దించే సాక్షం తేగలరా అని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ ధర్నాలో సాయి రెడ్డి రాయభారంతో ఇండియాఫ్రంట్ నేతలు హాజరవడం కొంత ఊరడింపు గానే భావించాలి.కాని దీనివలన బీజేపీకి దూరం అవుతారని ఆలోచించారా లేదా అనే ప్రశ్న తలఎత్తుతుంది. కాంగ్రెస్ ధర్నాకు హాజరు కాకపోయినా మిత్రులు హాజరవడం బీజేపీకి ఆగ్రహం తెప్పిస్తుందా అనేది గమనార్హం.ఢిల్లీ ధర్నా తో జగన్ కు కలసి వచ్చేది ఏమిలేకపోయినా రెంటికి చెడ్డ రేవడి అవుతారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన రెండుసార్లు అసెంబ్లీకి హాజరైనారు. ఒకసారి ప్రమాణం, మరోసారి నిరసనకు మాత్రమే. అసెంబ్లీకి హాజరై తన అభిప్రాయాలను, కూటమి ఆరోపణలను ఖండించేలాగా ప్రసంగాలు చేసి తన మద్దతు దారులకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం జగన్ పై ఉంది. జగన్ తనకు 40శాతం ఓటర్ల మద్దతు ఉందని ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. కాని ఇది నిలుపుకోవాలంటే విశ్వసనీయత తన మాటల్లో ప్రతిబింబించాలి. దేశంలో బీజేపీ నెమ్మదిగా డౌన్ అయ్యేలా ఉంది. రాబోయే ఐదేళ్లలో కాంగ్రెస్, ఇండియా ఫ్రంట్ బలపడేపరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు హర్యానాలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ బలపడితే జగన్ కు కష్టమే. రాష్ట్రంలో కాంగ్రెస్ కు మంచిరోజులు వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.జగన్ పార్టీలో ఉన్నవారందరూ కాంగ్రెస్ నుంచి వలసవచ్చినవారే. అందుకు జగన్ అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ ఏమాత్రం పొరబాట్లు జరిగినా జంపింగ్ లు ఆగవు. కాంగ్రెసుకు సమర్ధుడైన నాయకుడు లేకపోవడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణం. పార్టీ పగ్గాలు పట్టుకున్నవారు చిత్తశుద్ధితో కృషి చేస్తే తప్పక పూర్వవైభవం వస్తుంది. కావున జగన్ వేసే ప్రతి అడుగు ఆచీతూచీ వేయాలి. కేవలం కేసీఆర్ ను చూసి చేయి కాల్చుకుని జగన్ ఇంతటి పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇప్షటికైనా పదికాలాలపాటు రాజకీయాల్లో ఉండాలంటే ముందు తాను మారాలి. జాతి వైరం మానుకోవాలి. అందరిని కలుపుకునే వైఖరి అలవర్చుకోవాలి. చుట్టుఉన్న పైరవీకారులను తగ్గించి ప్రజలతో సంబంధాలు నెరపుకోవాలి. గత ఐదేళ్లు చాలా తక్కువసార్లు ప్రజల్లోకి వచ్చారు. అలా కాకుండా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. ఈ ఐదేళ్లు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. ఇప్పటికే కూటమి ఆరుగ్యారెంటీల అమలుకు తడబడుతున్నది. ఏదైనా కూటమి చేసే తప్పులను అంశం వారీగా ఖండిస్తూ తమ విశ్వసనీయతను ప్రజల్లో పెంచుకోవాలి. తాను ఒంటరిగా ఏ కూటమితో పొత్తులేకుండా మనగలగాలంటే విశ్వసనీయతే ఏకైక మార్గం.

(యం.వి.రామారావు,ప్రత్యేక ప్రతినిధి)

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry