“A short story is a love affair; a novel is a Marriage” అన్నది అమెరికన్ రచయిత్రి Lorrie Moore . పెళ్ళిది ఏముంది? ఎవరైనా చేసుకుంటారు. ప్రేమ తోనే వున్నది అసలు సంగతి. చాలా మంది ప్రేమిస్తున్నాము అనే భావాన్ని ప్రేమిస్తారు తప్పిస్తే నిజంగా ప్రేమించరు .ప్రేమించరు అంటే వాళ్లకు నిజంగా ప్రేమించడం తెలియదు. అలాగే కథ కూడా ! చాలా మంది కథలు రాస్తున్నాము అనుకుంటూ కథలని తప్పించి మరేమిటేమిటో రాస్తారు. “ఆలీబాబా అనేక దొంగలు” చదువుతున్నప్పుడు దేశరాజుకి ప్రేమించడం బాగానే తెలుసు అని అర్ధం అయింది. మిగతా రచయితలకు పట్టుపడని కథా ఒడుపు ఏదో దేశరాజు పిడికిలికి చిక్కింది. అందుకనేనేమో తన కథలు చదువుతున్నప్పుడు కథలు చదువుతున్నట్టు కాక కొన్ని నిజ జీవిత దృశ్యాలను చూస్తున్నట్టుగా వుంది. ఏ కథకుడికి అయినా జీవితమే మూల వస్తువు అంటారు కానీ, ఆ జీవితం అందరు కథకులకూ సూక్ష్మ స్థాయిలో బోధ పడదు. మనిషికి అవగాహనలోకి వచ్చే జీవితం, చాలీచాలని దుప్పటి లాంటిది. అది తలను కప్పేస్తే కాళ్ళను వదిలేస్తుంది. కాళ్ళను కప్పేస్తే కళ్ళను వదిలేస్తుంది. జీవితం ఏ కొద్దిమందికో శత సహస్ర దళ వికసిత పద్మమై మనో నేత్రానికి గోచరిస్తుంది.
బహుశా దేశరాజుకి కూడా అలాగే గోచరించి ఉంటుంది. లేకపోతే తాను ‘అవాంఛితం’ లాంటి కథను రాయగలిగి వుండేవాడు కాదు. మనిషి మనసు ఒక మాయల దయ్యం అన్నాడు ఆత్రేయ గుప్పెడు మనసు సినిమాలో. అది లేనిది కోరుతుంది, వున్నది వదిలివేస్తుంది. ఈ కోరుకుని, వదిలివేసే క్రమంలో మనిషి జీవితం దుఃఖభాజనం అవుతుంది. దేనికీ ఎవరినీ నిందించలేని అసహాయ స్థితిలోకి వెళ్ళిపోయి తనను తానే నిందించుకుని, మరీ extreme end లోకి వెళ్ళిపోతూ వుంటారు. బోలెడంత డబ్బు సంపాదించాలి, ఆ డబ్బును వెదజల్లి అధికారంలోకి రావాలి, మళ్ళీ ఆ అధికారాన్ని ఆలంబనగా చేసుకుని డబ్బు సంపాదించాలి లాంటి చాలా పెద్ద కోరికలను పక్కనపెట్టండి, చాలా మందికి చిన్న చిన్న కోరికలే తీరవు.వాటిని పెద్దవి అని బయటకు చెప్పలేము,చిన్నవి అని పక్కన పడేయనూలేము. ఆ తీరని కోరికలు ఒక మూలన అలా పడివుండవు. సమయం దొరికినప్పుడల్లా “నేనున్నాను” అంటూ బయటకు వచ్చి ఆరడి పెడుతూ ఉంటాయి.
‘అవాంఛితం’ కథలో ఆమెది పెద్ద కోరికేమీ కాదు. తనను తాను వివస్త్రను చేసుకుని, తన శరీరంలోని ప్రత్యణువుతోనూ ఏ.సి చల్లదనాన్ని అనుభవించాలన్నది ఆమె కోరిక. నిజానికి ఇది కోరికే కాదు. ఒక చిన్న అనుభూతి కోసం ఎదురు చూడటం. ఆ ఎదురు చూపుకు ఫలశృతి ఎప్పుడు,ఎక్కడ లభిస్తుంది? వయసు వచ్చిన కొత్తలో అటువంటి కోరికలు ఉన్నాయా, అప్పుడు ఇలా అటాచ్డ్ బాత్రూములు అవీ లేవు. హడావిడిగా రెండు చెంబులు పోసుకుని పరుగెత్తి రావలసిందే. ఆ కాస్తలోనే తల్లి ఒకటికి రెండు సార్లు “తొందరగా కానీవే” అంటూ బయటనుండి అరచేది. అద్దాల సంగతి చెప్పనే అక్కరలేదు. తల దువ్వుకోవడానికి, ముస్తాబు అవ్వడానికి ఒక్క చెక్క అద్దం మాత్రమే ఉండేది. ఆ కోరిక అలా నిద్రాణంగా ఆమెలో ఉండి పోయింది. అలా వుండిపోయిన కోరిక అప్పుడప్పుడూ ఆమెను ఆరడి పెట్టడానికి మాత్రం కారణం కచ్చితంగా ఆమె భర్తే. అతడు బెడ్ రూమ్ లో ఉంటే ఆమె గబుక్కున లోపలకు వెళ్లదు. ఎందుకంటే అక్కడ వుండే దృశ్యం ఏమిటో ఆమెకు బాగా తెలుసు. అతడు ఆనందిస్తున్నాడు అని తెలిసినప్పుడల్లా ఆమె అలా వుండలేకపోతుంది అన్న విషయం గుర్తుకు వచ్చి, ఆమెను ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. అతడికి ఉన్న స్వేచ్ఛ తనకెందుకు లేదు అనుకుంటుంది. తానెందుకు తన శరీరాన్ని తనివి తీరా చూసుకోలేక పోతుంది? అది కోరుకునే సున్నితమైన స్పందనలను అందించలేకపోతుంది ?
ఇవి ఆమె ప్రశ్నలు? ఈ ప్రశ్నలకు జవాబులు దొరికాయా? ఆమె కోరిక తీరిందా ? లేదా ?లాంటి ప్రశ్నలు తరువాత. ఈ వస్తువును దేశరాజు కథగా మలచడానికి అతడికి జీవితం తన న్యూనాస్ తో సహా అర్ధం అయితే తప్ప సాధ్యం కాదు. చాలా చిన్నచిన్న కోరికలే తీరకుండా జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంగువ అంటే ఏమిటో తెలియకుండానే పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథానాయకుడు వెళ్ళిపోయినట్టుగా.
“Man is born free but he finds everywhere in chains” అంటాడు తత్వవేత్త రూసో తన సోషల్ కాంట్రాక్ట్ లో. మనిషి స్వచ్ఛందంగా తన చుట్టూ కంచెలని ఎలా వేసుకుంటాడో, తనను తాను శృంఖలాబద్దుడిని చేసుకుంటాడో అతి సహజంగా రెండు పావురాలను నెపంగా చేసుకుని “సహజా సహజం” కథలో చెప్తాడు రచయిత. అసహజం, సహజంగా పరిణమించడాన్ని మించిన విషాదం ఏమున్నది మనిషి జీవితంలో. గాలీ, వెలుతురూ సోకని అపార్టుమెంట్లలో తనను తాను బందీని చేసుకుని, ప్రాకృతిక సౌందర్యలన్నిటికీ దూరమైన, నలుగురు మనుషులున్న కుటుంబానికీ, ఎక్కడినుండో ఎగిరి వచ్చి అపార్ట్మెంట్ సిట్ అవుట్ లోని పూల కుండీలో స్థిర నివాసం ఏర్పరచుకున్న పావురాల జంటకీ నడుమ పెరిగిన అనుబంధం, అపార్ట్మెంట్ బయటి భాగం అంతా నెట్ పెట్టాలని మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంగా కథ నడుపుతూ మనిషి పోగొట్టుకుంటున్నది ఏమిటో లో వాయిస్ లో చెప్తాడు దేశరాజు.
“పెద్దవాళ్ళు ముగ్గురి హృదయాలలోనూ నెట్ వేసినందుకు ఒక వైపు సంతోషం, మరొక వైపు ఏదో తెలియని అసంతృప్తి దోబూచులాడుతున్నాయి. ఇంతకాలం నెట్ వేయించుకోవాలని అనుకున్నారు. తీరా వేసాక, ఏదో తెలియని గిల్టీనెస్ వారిలో చోటు చేసుకుంది. పైకి చెప్పుకోలేకపోతున్నారు కానీ, ఇన్నాళ్లుగా ఏదో మేరకు వారి జీవితాలలో చోటు దక్కించుకున్న పావురాలకు, తమకు మధ్య తెర లేవడంలో వారి మనసులు వలలో పడిన చేపల్లా గిలగిల్లాడుతున్నాయి. తమ చుట్టూ, తమలోని కనిపించని అనేక వలలకి ఈ కనిపించే వల ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది”
మనుషుల మధ్య కనిపించని వలలని ఏర్పరచడంలో రాజ్యం ఎలాంటి పాత్ర వహిస్తుందో “ఆలీబాబా అనేక దొంగలు” కథలో అంతరంగ కథనాల ద్వారా తేటతెల్లం చేస్తాడు దేశరాజు. చాప కింద నీరులా రాజ్యం మనుషుల మధ్య ఎలా తన చోటును వెతుక్కుంటుందో, చోటు చేసుకున్నాక అది మనుషులను ఎలా పొల్యూట్ చేస్తుందో, ఒక మనిషి మీద మరొక మనిషితో ఎలా నిఘా వేయిస్తుందో, అలా నిఘా వేయించే క్రమంలో అదంతా తమ బాగుకోసమే అని మనుషులు ఎలా భ్రమ పడతారో దేశరాజు ప్రతిభావంతంగా కథనం చేశాడు. చాలా కాలం క్రితం గోపీచంద్ రాసిన “గోడ మీద మూడో మనిషి” కథను గుర్తు చేస్తుందీ కథ. ఆలీబాబా ఎవరో, కథ చదువుతున్న ప్రతి పాఠకుడికి తేలికగానే అర్ధం అవుతుంది
“కుదుపు”, “కాసేపు మనిషి” లాంటి కథలు కూడా బావున్నాయి. ఎందుకో తెలియదు కానీ అసంతృప్తిని కలిగించాయి. ప్రస్తుత సమాజానికి కావలసింది ఒక కుదుపు కాదు. ఒక షాక్ ట్రీట్ మెంట్ కాదు. షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని దిగంబర కవులు ప్రయత్నం చేశారు. అది ఫలించలేదు. కవి కూడా అయిన దేశరాజుకు ఆ విషయం కూడా బాగా తెలుసు. ” ఆ పిల్లాడి మరణం ఆ అపార్ట్మెంట్ వాసులనూ, బంధువులనూ ఒక్క కుదుపు కుదిపి వారిలో నిద్రస్తున్న వివేకాన్ని తట్టి లేపింది. స్వీకరించే గుణం ఉంటే, ఆ మార్పు అందరిలోనూ సాధ్యమే ” అంటూ ఒక పాజిటివ్ నోట్ తో కథను ముగించాడు.
కథకుడిగా తన బాధ్యత తీరిపోయింది అనుకున్నాడు. కానీ ఆ కుదుపు ఎంతో సేపు ఉండదు. విపరీత వైరాగ్యం ముగిశాక మనిషి మళ్ళీ తన మామూలు నిత్య నైమిత్తిక జీవన వ్యాపారంలో పడిపోయినట్టు అపార్ట్మెంట్ వాసులు మళ్ళీ మామూలు అపార్ట్మెంట్ వాసులు అయిపోతారు. సెల్ ఫోన్ పక్కన పెట్టిన పెద్దాయన మళ్ళీ ‘యూ ట్యూబ్’ చూసుకుంటూనే రోడ్ మీద నడుస్తాడు. కథానాయకుడు హెల్మెట్ తలకు కాకుండా బండి ముందు భాగంలో పెట్టుకునే బండి నడుపుతాడు. వేడి మీద ఉన్నప్పుడే ఇనుమును తనకు కావలసిన రూపంలోకి మార్చుకుంటాడు కమ్మరి. వేడి తగ్గాక ఇనుము మళ్ళీ మామూలు రూపంలోకి వచ్చేస్తుంది కనుక రూపాంతరం చేయడం కష్టం. మనిషి కూడా ఇనుములాంటివాడే. రచయితగా దేశరాజు వేడి మీద ఉన్న అపార్ట్మెంట్ వాసులలో ఆ మార్పు శాశ్వతం కావడానికి ఏమి చేయవలసిందో ఎక్కడో ఒక చోట సూచన మాత్రంగా అయినా చెప్పివుండవలసింది.
“కాసేపు మనిషి” కథలో కూడా ఒక కుదుపే ప్రధాన పాత్ర వహిస్తుంది. కుదుపులో కథకుడు ఆశావహ దృక్పథాన్ని బలంగా ప్రవచిస్తే, కాసేపు మనిషి కథలో కథానాయకుడు “అవినీతి పులి స్వారీ లాంటిది. ఎక్కకుండానే ఉండాలి. ఒకసారి ఎక్కడం అంటూ జరిగిందా ప్రాణాలతో కిందకు దిగలేం. క్షమించమ్మా ఇది చిన్న మాటే కానీ నాకు తెలుసు నువ్వు క్షమిస్తావని. మీలాంటి వారి క్షమాగుణం వల్లే నేను భార్యా, పిల్లలతో చల్లగా ఉండగలుగుతున్నా. ఈ డబ్బు నీ జీవితాన్ని బాగు చేస్తే నీకు జరిగిన అన్యాయంలో నా వంతు పాపాన్ని కాస్తయినా కడుక్కున్నట్టే ” పెద్దావిడకు చెబుతున్నట్టే తనలో తాను అనుకుంటాడు. ఆ తరువాత కథకుడు జోక్యం చేసుకుని ” కాసేపైనా తనలోని మనిషిని మేల్కొల్పినందుకు ముసలామెకు అతడు మనసులోనే నమస్కరించుకున్నాడు అని కథను ముగిస్తాడు.కుదుపులో కథకుడు ఆశించిన మార్పు సాధ్యమే అన్న పాజిటివ్ నోట్ ఇక్కడ ఎందుకు మిస్ అయింది. ఎందుకంటే మనమంతా “కాసేపు మనుషులం ” తప్పిస్తే నిజంగా మనుషులం కాదని కథకుడికి కూడా బాగా తెలుసు కనుక.
ఓ హెన్త్రీ లాస్ట్ లీఫ్ లాంటి కథ చిలుక, అయితే “అంతా మీ కోసం ” తెలుగు సినిమాలలో చూపించే పల్లెటూళ్ళ మీద చురక లాంటి కథ. కథా రచనలో దేశరాజు బలం ఏమిటంటే “చదివించే గుణం”. కథలు మొదలు పెడితే చాలు ఆపకుండా చదివిస్తాయి. పాత్రలు ఎక్కడా వాటి పరిథి దాటి ప్రవర్తించవు. కథకుడు అక్కడక్కడా జోక్యం చేసుకున్నా పాత్రల మీద తన నియంత్రణ ఏదీ ఉండదు. పాత్రలు వాటి మానాన అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇలా చేయడం వలన కథకుడు ఎక్కడా, ఎవరి మీదా తీర్పులు చెప్పడు. కథ చదివిన తరువాత పాఠకుడే తన మనసులో ఉన్న తులాదండంతో తూకం వేసుకుని ఏ పాత్రకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఆ పాత్రకి ఇచ్చి వాటిని హృదయంలోకి తీసుకోవడమో, హృదయానికి ఆవల ఉంచడమో చేస్తాడు.
ఇది దేశ రాజు రెండవ కథా సంపుటి. తను మరిన్ని కథా సంపుటాలు వెలువరించాలని కోరుకుంటున్నా.

-వంశీకృష్ణ
95734 27422











