ఐదేళ్లలో కోల్పోయిన స్వేచ్ఛను ప్రజలకు అందించాం

ఆంధ్రప్రదేశ్

అంతర్జాతీయ నగరంగా అమరావతి నిర్మాణం
15శాతం వృద్దిరేటు సాధించడమే లక్ష్యం
నదుల అనుసంధానం మా ప్రభుత్వ విధానం
ఉచిత ఇసుక విధానంతో ప్రజలకు మేలు చేసాం
తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదు
స్వాతంత్య్ర ఉత్సవాల్లో సిఎం చంద్రబాబు
సృజనక్రాంతి/విజయవాడ : గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయని అన్నారు. మళ్లీ పరిస్థితిని గాడిన పెట్టి, అభివృద్దిని పట్టాలకు ఎక్కిస్తున్నామని, అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. స్వాతంత్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉంటాం. ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం. 100 రోజుల ప్రణాళిక టార్గెట్‌గా అన్ని శాఖల్లో సవిూక్షలు చేస్తున్నాం. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖల్ని పునరుద్ధరిస్తున్నాం అని వివరించారు. 1857 కంటే ముందే బ్రిటిష్‌ దుర్మార్గపు పాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు.. ఇది చైతన్యం కలిగిన ప్రాంతం. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించాం. అటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించాం. మాకున్న అనుభవం, ప్రజల సహకారంతో కొద్ది కాలంలోనే నిలదొక్కుకున్నాం. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రథమంగా నిలిచాం. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించాం అని వివరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నిర్ధిష్ట నిర్ణయాలతో పాలన సాగించబోతున్నాం. నూతన ఆలోచనలతో 15 శాతం వృద్ధిరేటు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. దేవుడి దయ వల్ల సాగునీటి ప్రాజెక్టులకు జులైలోనే జలకళ వచ్చింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండాయి. సమర్థ నీటి నిర్వహణ ద్వారా అన్ని ప్రాంతాలకు సాగునీరందిస్తాం. రైతు ఆదాయం పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం మా ప్రభుత్వ విధానం. గత ప్రభుత్వ అసమర్థతతో దెబ్బతిన్న పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తాం. యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు సాధిస్తారు. అందుకే నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం. దీంతో మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా చూస్తాం. గత ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. గత ప్రభుత్వ ఇసుక దోపిడీపై సీఐడీ విచారణ జరిపిస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఉచిత ఇసుకపై నిర్ణయం తీసుకున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను ఆర్డర్‌ చేసుకునే వెసులుబాటు కల్పించాం. మరింత పకడ్బందీగా దీన్ని అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగస్వాములు. వాళ్లకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, సూపర్‌ సిక్స్‌తో 6 హావిూలు ఇచ్చాం. రాష్ట్ర పరిస్థితిపై ఏడు అంశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేశాం. పోలవరం, అమరావతి, రాజధాని, విద్యుత్‌ వంటి శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. సహజ వనరుల దోపిడీని బహిర్గతం చేస్తాం. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. నాటి అక్రమాలపై లోతైన దర్యాప్తు చేయిస్తాం. అక్రమార్కులను శిక్షించి తీరుతాం అని చంద్రబాబు తెలిపారు.
ఒక్క ఛాన్స్‌ పేరుతో రాష్ట్రం విధ్వంసం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎప్పుడూ నమ్ముతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. నాడు ఐదేళ్లలో సాగునీటి రంగంపై రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, యజ్ఞం మాదిరిగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులు పరుగులు పెట్టించామన్నారు. 78వ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింని, బాధితులనే నిందితులను చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నియంత పోకడలు, పరదాల పాలనతో రాష్టాన్న్రి రావణకాష్టం చేశారన్నారు. ప్రభుత్వ భూములు, ఆస్తులు దోచుకున్నారని, గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామన్నారు. కొత్తగా 100 ఇండస్టియ్రల్‌ పార్కులు ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. అన్నదాత పథకం కింద ఏడాదికి రూ.20 వేలు అందజేస్తామన్నారు. తమ అనుభవం, ప్రజల సహకారంతో కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నామన్నారు. దేశంలో ఎవరూ ఉహించని విధంగా సంస్కరణలతో 13.5 శాతం వృద్ధి రేటు రాష్ట్రం సాధించిందన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రథమంగా నిలిచిందని, రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించామన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్నామని, దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.ప్రజల సహకారంతో 34 వేల ఎకరాల భూసేకరణ చేశామని, 2014`19 నాటి పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వమే నేరుగా కాలేజీల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమచేస్తుందన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఫీజుల సమస్యలు ఉండవని అన్నారు. బోధనపై దృష్టిపెట్టడం కోసం టీచర్లపై.. అనవసర యాప్‌ల భారం తొలగించామని చెప్పారు. తమ ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులకు తావులేదని, తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని ఆయన స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడి. ప్రజల ఆస్తులను దోచుకున్న వారి నుంచి.. ఆ ఆస్తులు చట్టపరంగా తిరిగి రాబట్టి ప్రజలకు అందేలా చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిలు దశల వారీగా చెల్లింపులు చేస్తామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను అవినీతికి కేంద్రంగా మార్చుకున్న గత ప్రభుత్వం.. రేషన్‌ వ్యవస్థను సర్వనాశనం చేసిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నామని, 1946లో విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడామని, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిరదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగిందని, 1956 నవంబర్‌ 1న ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. 2014లో రాష్ట్ర విభజనతో రెండు రాష్టాల్రు ఏర్పడ్డాయని, విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితుల్లో నాడు పాలన సాగించామని చెప్పారు.