కాళోజీ,కాళన్న,కాళోజీ నారాయణ రావు. ఈ పేరు తల్చుకుంటే చాలు. ఒక కరుణాగ్రహ భార్గవుడు కళ్ళముందు సాక్షాత్కరిస్తాడు. కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి అన్న శ్రీశ్రీ నిర్వచనానికి స్పష్టమైన రూపం గుర్తుకు వస్తుంది.ఆధిపత్యంపై పోరాటం ప్రకటించిన ధిక్కారస్వరం గుర్తుకు వస్తుంది. కపటమెరుగని కారుణ్యమూర్తి కాళోజీ అని అందరిచేతా ప్రస్తుతింప బడిన కాళోజీ.. నిజానికి వృత్తి విప్లవకారుడు.
కాళోజీగా ప్రసిద్ధికెక్కిన కాళోజీ నారాయణరావు అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రాంరాజా కాళోజీ. 1914 సెప్టెంబర్ 9 వ తేదీన బీజాపూర్ జిల్లాలోని రత్తిహళ్లి గ్రామంలో తొలిశ్వాస అందుకున్నాడు. పసితనంలో కొంతకాలం మహారాష్ట్రలోని సాయిరాం గ్రామంలోనూ, తెలంగాణలోని ఇల్లందు తాలూకా కారేపల్లి గ్రామంలోనూ ఉన్నారు.1917 వరకూ హనుమకొండలో ఉండి ఆ తరువాత మడికొండను స్థిర నివాసంగా చేసుకున్నారు. సుప్రసిద్ధ కవి పండితుడు పల్లా దుర్గయ్య గారు, కవి వానమామలై వరదాచార్యుల వారు ఆయనతో చదువుకున్నవాళ్ళే.
ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో ఉండగా శ్వాసకోశ సంబంధమైన క్షయ వ్యాధికి గురైనాడు కాళోజీ. ఏడాదిన్నర పాటు చికిత్స జరిగాక ఒక శ్వాసకోశాన్ని కోల్పోయిన కాళోజీ హాస్పిటల్ లో పక్కవాళ్ళతో అదేపనిగా మాట్లాడుతూ ఉంటే డాక్టర్ భిడే ఆయనను Mr. Narayana Rao, if you talk like this you will die within six months అని హెచ్చరించారు. దానికి కాళోజీ నవ్వి “మీరు నన్ను మాట్లాడనివ్వకపోతే,ఆరు నెలల్లో కాదు, ఆరు రోజుల్లోనే మరణిస్తాను” అని అన్నారట. అది కాళోజీతత్త్వం.అప్పటినుండి తన ఎనభయ్ ఎనిమిదవ ఏట నవంబర్ 13, 2002లో మరణించేంత వరకు ఆయన మాటకు అలుపులేదు.
1939లో మొదటిసారి కాళోజీని అరెస్ట్ చేసి పోలీసులు వరంగల్ జైలులో పెట్టారు. జైల్లో వున్నది మూడు రోజులే. జైలులో కాళోజీని మామూలు నేరస్థుడిలాగే ఒక దొమ్మరివాడితో కలిపి ఉంచారు. తాను రాజకీయ ఖైదీ కనుక తనను మామూలు నేరస్తుడితో కలిపి ఎలా ఉంచుతారు అని తన నైజం వ్యక్తం చేశారు. ఆ తరువాత చాలా కాలానికి తన,నాటి ప్రవర్తన సరి అయినది కాదని గ్రహించి ఆ దొమ్మరివాడికి క్షమాపణ చెప్పాలి అనుకున్నారు. కానీ ఆ అవకాశం ఆయనకు తన జీవితకాలంలో లభించలేదు.
కాళోజీకి గారపాటి రాఘవరెడ్డితో కలిగిన సాహచర్యం వలన కవిత్వం పట్ల ఆసక్తి కలిగింది. రాఘవరెడ్డి కాళోజీకి యతి,ప్రాసల ప్రయోగాలు,మాత్రా ఛందస్సుల గురించి అవగాహన కలిగించారు.నిరంతర అభ్యాసంతో తన కవిత్వ రచనను మెరుగుపరచుకున్నారు కాళోజీ.నిజాం నిరంకుశ పాలనకు విసిగి, ప్రజలు ఎదురుతిరుగుతున్న రోజులలో కాళోజీ కవిగా “నా గొడవ” ప్రకటిస్తూ కష్టజీవుల పక్కన చోటు వెతుక్కున్నాడు. కాళోజీ ‘నా గొడవ’ను నడుస్తున్న చరిత్రకు రన్నింగ్ కామెంటరీ అన్నాడు దాశరథి.
‘కాలమునకే కాదు మహా
కాలునకును ఏ నాడూ
జీ అనలేని కలేజాతో
కాళోజీ అనునది
నాగొడవ అనునది
నాజూకు లేనట్టిది
నఖరాలు కానట్టిది
అక్షరాలా జీవనది
నానా భావన నది
నీ నా భావన లేనిది
నను భావన నది’
అంటూ తన కవిత్వతత్త్వం గురించి తానే చెప్పుకున్న కాళోజీ..జీవితంలో కవిత్వ రచనకు, ఆచరణకు నడుమ అభేదం పాటించారు. జన సంబంధం,జన ప్రయోజనం లేని రాతలన్నీ అకవిత్వమేనంటారు కాళోజీ.
‘నిత్యం దాసానుదాసుడవై
నానా గడ్డీ కరుస్తూ
మోచేతి గంజి తాగుతూ
బాపూ … బాపూ… అన్నా
మావో … మావో.. అన్నా
విప్లవం అన్నా
క్రోధం .. లోభం అన్నా
శాంతి అన్నా … క్రాంతి అన్నా
వట్టి తాలు కన్నా
తేలికయిన రాతలు
అయ్యో రాత
రాతకేం … ఏమైనా రాయొచ్చు’
ఈ గ్రహింపు వున్నవాడు కనుకే కాళోజీ ఆషామాషీ రాతలు అసలే రాయలేదు. గాంధీ రూపం, మార్క్స్ చైతన్యం కాళోజీది అని ఒక విమర్శకుడు అభిప్రాయ పడినాడు. అంతకుముందే దాశరథి,కాళోజీ ‘నా గొడవ’ కు రాసిన ముందుమాటలో “కాళోజీ శాస్త్రజ్ఞుడు. శాస్త్రజ్ఞుడు గర్భితమైన కవి” అన్నాడు.
‘కుటిలమతుల దేబెమొగాలు
జగతిలో రెండే రెండు రకాలు
చతురమతుల విలాసం కొరకు
దేబెల సర్వస్వం ముడి సరుకు
చతురునిదే అన్నింటా పై చేయి
అతడన్న పగలు కూడా రేయి’
అని కాళోజీ అన్నపుడు ‘నా గొడవ’లో మార్క్స్ గుర్తుకు రావడం లేదా? క్రితం క్షణం ఈ క్షణం కాదు అని తాత్త్వికులు అంటారు కానీ మాంధాత కాలం నుండీ ఇప్పటివరకూ మానవ స్వభావములో మార్పు కనిపించనే లేదు. నాగరికతలు విలసిల్లిన నేల మీద కూడా చిత్తశుద్ధితో కూడిన నీతి నిజాయితీ, నిర్మలమయిన మానవ సంబంధాల నిర్వహణ లేనే లేదు అంటారు కాళోజి.
‘ప్రపంచ చరిత్ర సాంతము
ప్రకటించు నొక్క విషయము
మాంధాతల నాటి నుండీ
మార్పు లేదు ఈ జగాన
విషపు నవ్వు వెక్కిరింత
దొంగ నవ్వు దొంగేడుపూ
ముసుగులో గుసగుసలూ
వక్రమార్గ వర్తనల ప్రపంచము
సక్రమ బోధలు సలుపు ప్రపంచము
నీతి రహితమైన నెగడు ప్రపంచము
నీతి నియమములు నేర్పు ప్రపంచము’
_____________
ఇంతకంటే ప్రపంచాన్ని చేతవెన్నముద్దలా కరతలామలకం చేసేదెవరు? ‘ప్రతి చాదస్తం ఒక దేవుడే … ఏదో ఒక రూపంలో గోకుడే’ అన్న కాళోజీ తనది నిత్య నూత్న వికసిత జ్ఞానం అంటాడు. తన ఎనభయి ఎనిమిదేళ్ల జీవితంలో ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించాడు. జాతీయోద్యమం నుండి మానవ హక్కుల ఉద్యమందాకా, నిజాం వ్యతిరేకత నుండి ఎన్ కౌంటర్ మృతుల అప్పగింత దాకా. ఏ ఉద్యమంలో అయినా కాళోజీ కవిత్వం, కాళోజీ ఆచరణ, కదం తొక్కాయి. చైతన్య దీపంలాంటి కాళోజీ రూపం ఉద్యమ కారులకు స్ఫూర్తిని ఇస్తే, కాళోజీ కవిత్వం ఉద్యమకారుల మస్తిష్కానికి స్ఫూర్తిని ఇచ్చింది.
______________
కాళోజీ ఆగ్రహ భార్గవుడే కాదు, సున్నిత మనస్కుడు కూడా. కన్నీటి భాష తెలిసిన వాడు కూడా.
‘వాదాల మునిగి ఆనందాల దేల
వాసనల దీర్చు సువాసనల గ్రోల
జన్మించెదను నేను దేవసర్పమై’ అంటాడు కాళోజీ!
“ఏకో రసః కరుణ ఏవ నిమిత్త భేదాత్ –భిన్నః ప్రుధక్ ప్రుధగి వాశ్రయతే వివర్తాన్ ఆవార్త బుద్బుద తరంగమయాన్ వికారాన్ –అంభో యదా సలిల మేవహి తస్సమగ్రం” అని భవభూతి అన్నట్టుగా కాళోజీ హృదయం కారుణ్యపు కొలను. కాళోజీ కళ్ళు.. లోతును కనుగొన్న కన్నీటి సరస్సులు. అందుకే కాళోజీ:
“కన్నీటిలో ఎన్నెన్నో కలవు
కన్నీటిని గన కన్నులు కలవు
మసిబారిన ఎడదల రుసరుసలు
కసి తీరని పడగల బుసబుసలు
విసుగెత్తిన జీవుల విసవిసలు
పసి గొంతుల నలిగిన పిసపిసలు
రసమూరెడి చూపుల గుసగుసలు” అన్నాడు. ఆమె కన్నులలో అనంతాంబరపు నీలినీడలు కలవు అన్న కృష్ణ శాస్త్రికీ, కాళోజీకి అభేదం చెపితే తప్పేమీ లేదేమో !
జీవన చంద్రునికి ముదిమి నిత్య బహుళ చతుర్దశి అని కాళోజీ అన్నాడు కానీ తన ముదిమిని ఎప్పుడూ బహుళ చతుర్దశిలాగా అనుకోలేదు. కాళోజీ నిలువెత్తు తెలంగాణా సంతకమే కాదు, పరిచయం అక్కరలేని కవి,అసలైన అనువాదకుడు, అచ్చమైన కథకుడు కూడా. ఖలీల్ జిబ్రాన్ ‘ది ప్రాఫెట్’ ను ‘జీవనగీత’ గా అనువదించాడు.ఈ అనువాదానికే కాళోజీ కి అవార్డు వచ్చింది. అయితే ఈ అనువాదాన్ని రా.రా తన సంవేదనలో చీల్చి చెండాడు. రా.రా ది పూర్తిగా సౌందర్య దృష్టి అయితే కాళోజీది సామాజిక దృష్టి.
విభూతి లేక ఫేస్ పౌడర్,మనకు నయం,లంక పునరుద్ధరణంలాంటి కథలు,మహారాష్ట్రలో జానపద సాహిత్యం, భారతీయ సాహిత్యం, మరాఠీ లాంటి వ్యాసాలు, రాష్ట్రపతీ ఏమంటావు ? ఏమంటావు మర్రి చెన్నా? లాంటి కరపత్రాలు పీఠికలు, యాత్రా చరిత్రలు ఇలా సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను తనదైన ముద్రతో పరిమళింపచేసాడు.
ప్రజా తెలంగాణా చూడాలన్న కోరిక తీరకుండానే జీవనోద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు కాళోజీ.
-హర్ష నేత్ర
95734 27422
(సెప్టెంబర్ 9,కాళోజీ 110వ జయంతి)
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad












