ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు కొనసాగాలని, ఇంచార్జ్ మంత్రులు వారానికి రెండు సార్లు జిల్లాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని, పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన 36 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చామని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పని చేసినందుకే వారికి పదవులు ఇచ్చామని, ప్రజల్లో ఉన్న వారికే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవులు ఇవ్వాలని పిసిసికి సూచించారు. బిసి కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ బలమైన ఆలోచన అని, రాహుల్ ఆలోచన మేరకు బిసి కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించామని, బిసిలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే కచ్చితంగా జనాభాను లెక్కించాల్సిందేనన్నారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం (సిఎల్‌పి) సమావేశం ఆదివారం సాయంత్రం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సమావేశానికి టిపిసిసి అధ్యక్షులు బి.మహేష్‌కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ,ఇంచార్జి సెక్రటరీలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు హజరయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ ను పిసిసి అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ సిఎల్‌పి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. నరేంద్ర మోదీని ఓడించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉన్న సమయంలో పిసిసి చీఫ్‌గా మహేష్ గౌడ్ బాధ్యత చేపట్టారని ఈ సందర్భంగా సిఎం అన్నారు. సమావేశంలో రేవంత్‌రెడి మాట్లాడుతూ దేశంపై నాలుగోసారి పట్టు సాధించడానికి మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని, నాలుగో సారి గెలవడం కోసమే ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలు తీసుకువస్తున్నారన్నారు. జమిలీ ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. టిపిసిసి అధ్యక్షుడిగా తన ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం, లోక్ సభ సీట్లు గెలిచామన్నారు. ఎస్‌సి వర్గీకరణ అమలుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశామని, ఈ విషయంపై సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం 27 రోజుల్లో 18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయలేదని, రైతు రుణ విముక్తి కావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకురాబోతున్నామని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు ఇస్తామని, రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అధికారం కోల్పోయిన అసహనంలో ప్రతిపక్ష బిఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, దానిని పార్టీ నాయకత్వం తిప్పికొట్టాలన్నారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీని ముందుకు నడపడంలో సమిష్టి బాధ్యత అవసరమని తాను నమ్ముతున్నానన్నారు. కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటానని, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానన్నారు. కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలన్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రులపై ఎక్కువ బాధ్యత ఉందని, స్థానిక సంస్థ ఎన్నికల్లో 90 శాతం స్థానాలను గెలవాలన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోందని, కార్యకర్తలను సమాయత్తం చేసి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు. తాను, సిఎం రేవంత్ రెడ్డి ఎంతో మమేకమై పనిచేశామని, అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేద్దామన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలను పార్టీ, ప్రజాప్రతినిధులు జనంలోకి తీసుకెళ్లాలన్నారు. కెసిఆర్ అబద్దాలతో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించారని విమర్శించారు. ప్రధాని మోదీ మళ్ళీ గెలవలేమనే భయంతోనే కులం, మతం పేరుతో యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, ఈ విషయాలపై పార్టీ శ్రేణులు ప్రజలను చైతన్యపరచాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. పార్టీ కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకుని ముందుకు వెళ్తానని, రెండోసారీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు.
పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలి















