మడకెద్దులతో మాండలిక కథా సేద్యం

పేరూరు బాలసుబ్రమణ్యం కథల సంపుటి ‘మడకెద్దులు’ దీనికో ట్యాగ్ లైన్ ఇవ్వాలంటే.. ‘పేరూరు కథలు’ అని పెట్టొచ్చు. ఈ కథల సంపుటిలో చాలా వరకు పోటీలలో సాధారణ ప్రచురణలుగానో, బహుమతులు పొందిన కథలు, నేరుగా రాసిన కథలు కలగలిసి ఉన్నాయి. ఇక పేరూరు కథల ప్రపంచంలోకి అడుగు పెట్టగానే మనకు మన’వరాలే’ అన్న కథలో ఆడపిల్ల అనగానే ఎలక్షన్లో నిలబడి డిపాజిట్ దక్కని అభ్యర్థిలా ముఖం మాడ్చుకుని కొడుకును గుడ్లురుమి చూసి విసవిసా ఇంటికెళ్లిపోతుంది తల్లి చాముండేశ్వరి. ఆమెకు పెద్ద మనవరాలు అఖిల. తర్వాత రెండో గర్భంలోనూ ఆడ శిశువేనని తెలుసుకుని లంచమిచ్చి అబార్షన్ చేయిస్తుంది చాముండేశ్వరి. మూడో సారి మగ బిడ్డని అబద్ధం చెప్పి ఆడబిడ్డ పుట్టాక పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేశాడన్న కారణంగా కొడుకు మీద కారాలు మిరియాలు నూరుతుంది నాయనమ్మ. అవ్వ వైఖరిని అఖిల గమనిస్తుంటుంది. ఈ లోపు కూతురు నుంచి ఫోన్ రాగానే తీసి “ఏంటమ్మా నువ్వు గంగ అని పేరు పెట్టుకున్న ఆవు ఆడ దూడను ఈనిందా? పెయ్యదూడ అంటే మహాలక్ష్మి తల్లీ! అది పెద్దదై మీ పశువుల సంతతిని అభివృద్ధి చేస్తుందమ్మా” అని కులుకు పలుకులు పలుకుతుంటే, అఖిల మహిళా జాతికే వకల్తా పుచ్చుకొని చాముండేశ్వరికి ఎలా బుద్ధి చెప్పిందో ఈ కథ చెబుతుంది.

‘ఆటగదరా శివా!’ తెలుగు తల్లి కెనడా బహుమతి పొందిన కథ. సంతానాన్ని కష్టపడి కని పెంచి పెద్ద చేసి చదివిస్తే ఆ తరువాత ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్లిపోవడం వృద్ధులైన తల్లిదండ్రులను చూడడానికి కూడా రాకపోవడం గురించి అమెరికాలోని ఒక సభలో తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘మీ కన్నవారి వద్దకు ఖననం చేయడానికి వెళ్లి కర్మ క్రియలతో వెనక్కొచ్చే పని చేయకండి. మీ తల్లిదండ్రుల వద్దకు అప్పుడప్పుడు పిల్లలతో వెళ్లి గడిపి రండి అదే వారికి వెయ్యేనుగుల బలం’. ఆ మాటలతో జ్ఞానోదయం అయిన ఓ వ్యక్తి భార్య పిల్లలతో బయలుదేరి ఇండియాలోని సొంతింటికి వస్తే ఎదురైన సంఘటన ఏమిటి అనేది ముగింపులో చదివే పాఠకుడు సైతం భరణి గారి పాటలోకి లీనమై పోతారు హృదయాన్ని ద్రవింప జేసే కథ.

‘కొలబద్ద’ తల్లిదండ్రులు పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తే పెద్ద ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతో ర్యాంకులే కొలబద్దగా సాగే నేటి విద్యావ్యవస్థపై రాసిన మంచి కథ ఇది. సెకండ్ లాంగ్వేజ్ గా సంస్కృతం తీసుకుంటే వందశాతం మార్కులేస్తారని మాతృభాషకు ఎంత అపకారం చేస్తున్నామో అంతర్లీనంగా తెలియజేస్తుంది. చదువుకోవాలనే ఇష్టతను, పట్టుదలను పిల్లల్లో కలిగించాలనే ఆలోచనాత్మకమైన కథ ఇది.

‘మునిగోడు’ కథలో ఆకులు కాలాక కాదు…కాలి బూడిదయ్యాక తెలివి తెచ్చుకుంటాడు మునిగోడు. ఏం ప్రయోజనం.. సేద్యాన్ని నమ్ముకుని ఏ అలవాట్లు లేని రోజుల్లో ఊరే కాదు చుట్టుపక్క ఊళ్ళల్లో వ్యవసాయంలో పేరెత్తిన మునిగోడు, తాగుడుకు బానిసై బతుకు మీద రోసి పురుగుల మందు తాగి విగత జీవుడవుతాడు. చివరకు మునిగోడు ఆత్మ- కోరిన కోరికను ఆ దేవుడు నెరవేర్చాడా లేదా తెలుసుకోవాలంటే మునిగోడు కథ చదవాల్సిందే!

‘కోడిగుడ్డు పొరుటు’ చదివి ఆనందించాల్సిన కథ. కథలోని మలుపులు, పాత్రలు, మాటల్లోని సొంపు, ప్రాంతీయత, రాగద్వేషాలు కథకు కొత్త రంగులద్ధాయి. నిజాయితీగా ఉండటంలోని గొప్పతనం పాఠకులకు తెలిసి వస్తుంది. కోడి గుడ్డు పొరుటు తినడం మాత్రం తీరని కోరికగానే మిగిలిపోతుంది కథకుడికి.

వంద గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వానకి గోవిందా… గోవింద..! అన్నట్టు బక్క మామ తెలివైనోడు అంటే, వాడికి మించిన ముదురు అరం చెవులోడు. పల్లెల్లో పశువుల అమ్మకాల్లోని లొసుగులు ఒకరికి మించిన దొంగలు ఒకరు వీళ్లిద్దరు. పల్లె కుటుంబాల్లోని సరస విరసాలు, మాట పట్టింపులు.. వీటిని రాయాలంటే కొంత సృజనాత్మకత, స్థానిక భాషపై గట్టి పట్టు కూడా ఉంటే గాని ఆ మాటల్ని యధాతధంగా సంభాషణలుగా రాయడం సాధ్యం కాదు ‘గాలెమ్మ’ కథ కూడా అలా పేరూరు బాల.. పానకం తాగినంత సులువుగా కథగా మలిచేస్తాడు.

‘మొలక’ కథ రాయాలంటే మట్టి, విత్తనం, మొలకలతో మమేకమై ఉంటే గానీ రాయలేరు. పేరూరుకు వాటితో బంధం చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి ఈ కథ రాయగలిగాడు. కథలో సిద్దయ్య నాయకుడు అతనికి సేద్యం అంటే ప్రాణం రచయిత ఈ పాత్ర ద్వారా వ్యవసాయంపై కొత్తగా రాశాడు. ఒకచోట ‘వరినారు మొలకలు చిగుళ్ళతో తళుక్కున వెన్నెలలో మెరుస్తూ తన వేర్లతో పుడమి తల్లిని పెనవేసుకుని బలపడుతున్నాయి’ అని రాయడం మట్టికి మనిషికి ఉన్న అనుబంధాన్ని అన్యాయపదేశంగా చెప్పినట్లు అనిపిస్తుంది.

‘శిశిర స్వప్నం’ కథ వృద్ధాప్యంలోని రఘురామయ్య వ్యధలు. అతని నలుగురు కొడుకులు మంచి సంపాదనా పరులుగా ఉన్నప్పటికీ ఎవరూ చూడకపోవడంతో నరకం అనుభవిస్తున్న రఘురామయ్యకు ఉన్నట్టుండి ప్రభుత్వం నుండి ఊరట లభిస్తుంది. తల్లిదండ్రులను సరిగా చూడని పిల్లలకు పెద్దల ఆస్తిలో 25 శాతం మాత్రమే మిగిలిన ఆస్తి ప్రభుత్వపరమే అనే వార్త. ఆ వార్త విన్న కొడుకులు కోడళ్లలోని మార్పు. కానీ మనవడు తాత కోసం చేసిన మేలు ఏమైంది! నిజంగా గుండెల్ని పిండేసే కథ ఇది.
______________

ఈ సంపుటిలో టైటిల్ కథ ‘మడకెద్దులు’ మరొక విషాదాంత కథ. పూర్తి మాండలికంతో సాగిన ఈ కథలో కృష్ణయ్య పాత్రను మలిచిన తీరు అద్భుతం. మనుషులకు పశువులకు ఉన్న బంధం కిష్టయ్య తన గిత్తల్ని ‘చిన్నోడు – పెద్దోడు’ అని ఆప్యాయంగా పిలుచుకుంటాడు. కృష్ణయ్య పశువుల్ని, వ్యవసాయాన్ని ఇష్టపడే వారికోసం ఎంతటి సహాయమైనా చేస్తాడు. అలాంటి కిష్టయ్య ఎవరి ద్వారా ఇబ్బంది పడ్డాడు, అందుకు వాళ్లకు అతను వేసిన శిక్ష ఏమిటి! ఈ కథ చదివాక పేరూరు మాండలికంలో పట్టు సాధించాడంటే.. ఒకటి స్వతహాగా వ్యవసాయ కుటుంబంలో పుట్టడం, రెండు ఆ భాషపై పట్టు సాధించడానికి గట్టి అధ్యయనం చేయడం.
______________

‘మల్లి’ కథ భర్త లేని ఇద్దరు ఆడబిడ్డల తల్లి.. పేదరాలు, అందగత్తె. అదే ఆమె పాలిట శాపమా! తనకు ఎదురైన సంఘటనల్ని ఎదురుకోలేక, ఇద్దరి పిల్లలకు విషం పెట్టి తనూ ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న మల్లి, ధైర్యంగా నిలబడిందా! ఓడిపోయిందా! తెలిపే ఈ కథ నేటి సమాజంలో ప్రతి ఒక్క మహిళకు అవసరం.

ఇక ఈ సంపుటిలో మిగిలిన ‘కోల్పోయిన ప్రపంచం’ , ‘అతడు – ఆమె’ కథల ద్వారా నేటి మన కుటుంబ బంధాలు ఎలా ఉన్నాయి అనే కోణంలో రాసిన చక్కటి కథలు.

‘నెత్తుటి మరక’, ‘ఏమీ లేదు’,’గుడిమెట్ల మీద..!’ కథలు మూడు కూడా మనిషి ఆలోచన విధానాన్ని, అపార్ధాల వలన జీవితాలు ఏమవుతాయి మంచి చెడులకు గల వ్యత్యాసాలను కథలుగా వివేచనాత్మకంగా మలిచాడు పేరూరు. మొత్తం మీద సంపుటిలోని కథలన్నీ ప్రచురణా ప్రశంసలు, బహుమతులు పొందినవే కాబట్టి ఈ రచయిత నుండి మరిన్ని మంచి కథల కోసం ఎదురు చూసేలా చేస్తుంది.

-మల్లేశ్వర రావు ఆకుల
79818 72655

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry