టెక్నాలజీ విసిరే మాయావలలను హెచ్చరించే నవలిక

Technology is a useful servant but a dangerous master. – Christian Lous Lange

ఇప్పుడు మనం కృత్రిమ మేధ ( AI ) ప్రపంచంలో వున్నాం. సమస్త విషయ సమాచారం,విశ్లేషణ, ఊహాచిత్రాల సృష్టి, మానవుడి ప్రశ్నలకు, ఆజ్ఞలకు ప్రతిస్పందన ఈ కృత్రిమమేధ ద్వారానే పొందుతున్నాం. స్వీయ-అవగాహన కలిగిన, కృత్రిమ సూపర్ ఇంటెలిజెన్స్ అనేవి కృత్రిమమేధ యొక్క ఊహాత్మక రూపాలు. ఇవి మానవుల కంటే తెలివైనవిగా ఉంటాయని భావిస్తున్నారు. ఇటువంటి సాంకేతిక యుగంలోకి మనం ప్రవేశించాం. అయితే వెల్లువలా వచ్చిపడుతున్న ఈ టెక్నాలజీ మానవ జీవితాలను ఒక పక్క సుఖమయం చేస్తే, మరో పక్క దుఃఖమయం కూడా చేస్తుంది. టెక్నాలజీని మనం మానవ కళ్యాణానికి, నాశనానికి కూడా ఉపయోగించవచ్చు.

అదే విధంగా స్మార్ట్‌ ఫోన్‌ లు వచ్చిన తర్వాత, ఆ టెక్నాలజీ ఎన్ని దైనందిక వస్తువులను మింగేసిందో చూసాం. ఆ కోవలోనే వచ్చిన మరో సాంకేతిక విప్లవం యాప్స్. ఇవి చాలా వరకు ఇంతకు ముందు మనకు అందుబాటులో లేని అనేక విషయాలను, సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి, ఆధునిక మానవ జీవితాన్ని సుఖమయం, సరళమయం చేసాయి. ఫేస్‌ బుక్, వాట్సప్, ఇన్స్‌స్టాగ్రామ్ మొదలయిన యాప్స్ సోషల్ మీడియాగా మానవ జీవన సరళిని పూర్తిగా మార్చేసింది. అటువంటి యాప్స్‌ లో భాగంగా మానవుడి బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి సృష్టించబడినవే డేటింగ్ యాప్స్.

_______________

ఈ డేటింగ్ యాప్స్ మాయలో పడి చిత్తవుతున్న యువత జీవితాలను సోదాహరణగా వివరిస్తూ, ఏఏ యాప్స్ ఎలా పని చేస్తాయో, ఎలా మోసం చేస్తాయో ఆసక్తికరంగా చెప్పిన ఉండవల్లి.యమ్ గారి నవల ‘ఒక మనసు అనేక దేహాలు’. నాకు తెలిసి, డేటింగ్ యాప్స్ మీద వచ్చిన మొట్టమొదటి నవలిక ఇది.ఈ నవలిక జనవరి 2022 లో ముద్రితమైంది. ఈ 2025 నాటికి ఈ యాప్స్ ఇంకా పెచ్చుమీరి వుండవచ్చు.
_________________

నవలిక వస్తువు చిన్నదే గానీ కాన్వాసు పెద్దది. ‘అభి’ వైజాగ్ నుండి హైదరాబాదు రైలులో వస్తుండగా నవలిక ప్రారంభం అవుతుంది. ‘అభి’ అభిరుచులు, వ్యక్తిత్వం పరిచయం చేస్తూ నవలిక ఊపులో పడుతుంది. అభికున్న హాబీ..డేటింగ్ యాప్స్ లో అమ్మాయిలతో చాటింగ్ చేయడం. సెల‌్ ఫోన్ వచ్చిన కొత్తలో పాత కీప్యాడ్ ఫోనుల్లో అన్ని కంపెనీ సిమ్స్ లోనూ 5555, 7333 అనే నంబర్స్ వుండేవి. వాటిలోకి వెళితే చాలా ఆప్షన్లు ఉండేవి. పాటలు, విజ్ఞానం, జ్యోతిష్యం, వినోదంతోపాటు డేటింగ్ కూడా వుండేది. స్మార్ట్‌ ఫోన్‌ లోకి ఎంటరయ్యాక వందల డేటింగ్ యాప్స్‌ తో కనెక్టయ్యాడు. ఒక్కొక్క యాప్ లో ఒక్కొకళ్ళు లేదా అంతకు మించి అమ్మాయిలతో చాటింగ్ చేస్తుండేవాడు.

అయితే రైలులో తన ఎదురుబెర్తులో పరిచయం అయిన అనన్యతో మొదలయిన సంభాషణ అనూహ్య మలుపులు తిరుగుతూ వుంటుంది. తనకు పరిచయం వున్న యాప్స్, పరిచయం వున్న అమ్మాయిలు, వారితో తను చేసిన ఇంటిమేట్ ఛాటింగ్స్ అన్నీ నిజాయితీగా అనన్యకు చెపుతాడు అభి. ఇన్ని రోజులుగా అనేక డేటింగ్ యాప్స్‌లో అమ్మాయిలతో ఛాటింగ్ చేసినా, ఒకసారి డైరెక్టుగా అమ్మాయి దగ్గరకు వెళ్ళినా, వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకోని అభి అంటే సదభిప్రాయం కలుగుతుంది అనన్యకు. మనసులు కలసిన వాళ్ళిద్దరు హైదరాబాదు చేరిన తర్వాత కలిసారా, లేదంటే యాప్స్‌ లో ఛాటింగ్ లా అక్కడితో ముగిసిందా అనేది చెపుతూ నవలిక ముగుస్తుంది.

డేటింగ్ యాప్స్ గురించి రచయిత ఇస్తున్న సమాచారం కేవలం సమాచారంలా కాకుండా కథలో అంతర్భాగంగా వస్తూ ఎక్కడా విసుగు పుట్టించదు.లేదంటే ఈ నవల డేటింగ్ యాప్‌ ల సమాచారాన్ని చక్కగా పేర్చిన వ్యాసం అయేది. ఛాటింగ్స్‌ లో తారసపడే అమ్మాయిల ప్రవర్తనా సరళిని రచయిత ఒక మానసిక శాస్త్రవేత్తలా విశ్లేషించడం అబ్బురపరుస్తుంది. అమ్మాయిల మానసిక అవసరాలను బట్టి, వారితో అనుకూలంగా ఛాటింగ్ చేయడం కథానాయకుడు ‘అభి’ టేలంట్. ఏ దేశపు ఏ ప్రాంతపు స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారు,ఏఏ యాప్‌ లు ఎలా పని చేస్తాయి, ఎక్కడ దేనికి ఎలా సభ్యత్వం తీసుకోవాలి, ఎంతెంత డబ్బు కట్టాలి, డబ్బు కట్టినా కొన్ని యాప్స్‌ లో ఎలా మోసపోతాము, మోసపోయినా బయట పెట్టడానికి పరువు తక్కువయి ఎలా మిన్నకుండిపోతాము లాంటి విషయాలు రాయడం కేవలం పరిశీలనతోనే సాధ్యం కాదు. దానికి రచయితకు గొప్ప పరిశోధన కావాలి. రచనా సామర్థ్యం కావాలి.

డేటింగ్ యాప్స్ వలలో చిక్కుకొని పరువు పోతుందని డబ్బులు వదిలించుకున్న వాళ్ళు చాలామందే వున్నారనేది ఇటీవలి కాలంలో వెలుగు చూసిన నిజం. రచయిత చెప్పినట్టు చదువుకున్న ప్రతి నలుగురిలో ఇద్దరు దీని బారినపడి వున్నారని తెలిసినప్పుడు ఆశ్చర్యం, ఆవేదన, కించిత్ భయం కలుగుతుంది.

అభి, అనన్య సంభాషణలు ఈ నవలికకు ప్రాణం. ఒక పక్క యాప్‌ ల గురించిన సంభాషణ, దానిలో మునిగితేలే అభి అనుభవాల జీవన తాత్విక విశ్లేషణ రచయిత రచనా సామర్ధ్యానికి గీటురాయి.

అభి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలన్న అనన్య జిజ్ఞాస, నవలకు ఆయువుపట్టు. దాని ద్వారా అభిలో దాగివున్న పరస్పర విరుద్ద భావాలు, నిజాయితీ పాఠకులకు తెలిసి, అతని మీద ఒక సదభిప్రాయం ఏర్పడుతుంది. ఇన్ని యాప్స్‌ లో ఇంత మంది అమ్మాయిలు పరిచయం వున్నా, తప్పు చేస్తున్నానేమో అన్న స్పృహ అతనిలో ఉండటం వలన అతనిని ఆ పని చేయకుండా అడ్డుకుంటుంది. ఇది సాధారణంగా అందరిలో వుండదు.

_________________

ఈ డేటింగ్ యాప్స్ యావలో యువత మనోభావాలు యాంత్రికంగా మారిపోవడం, నిష్కల్మష ప్రేమలు ఛాటింగ్ లకు, డేటింగ్ లకు పరిమితమై పెడసబారిపోవడం,ఈ నవలిక మనకు ఇచ్చే ఎరుక. ఆధునిక యాంత్రిక జీవితంలో ప్రతీది ఇన్‌స్టాంట్ గా దొరకాలనే రందితో పరుగులు తీస్తున్న జనం, సహజంగా జనించే మానవ ఉద్వేగాలను, ప్రేమలను, శృంగార భావనలను కూడా డబ్బు పెట్టి పొందవచ్చనే ప్రమాదకర పరిస్థితుల్లోకి జారిపోవడం, మోసపోవడం.
__________________

దానివల్ల వారు తమలో తాము కోల్పోతున్న సున్నిత స్పందనలను, వయసులో వచ్చే స్వాభావిక రసాస్వాదనలను అవేమిటో కూడా తెలుసుకోకుండా, భావోద్వేగాలను నియంత్రించుకోకుండా, దురదృష్టకరమైన జీవితాలను గడిపేస్తున్నారు. సాంకేతికత మనుషులను కూడా యాంత్రికంగా మారుస్తోంది. ఈ ముప్పు నుండి తప్పుకొని, జీవితాన్ని హాయిగా ప్రేమాస్పదంగా జీవించమని చెప్పిన నవల ఇది.

‘డేటింగ్ యాప్స్‌ లో మునిగిపోతూ, అమూల్యమైన యవ్వనాన్ని వృధా చేసుకుంటున్న అభి(యువత) పయనం ఎటువైపు సాగిందో, చివరికి ఎక్కడకు వచ్చి ఆగిందో ఈ నవలిక చదివి తెలుసుకోవాల్సిందే. సరళమైన శైలిలో, పారే జలపాతంలా సాగిన కథనం ఎక్కడా బోర్ కొట్టించదు’ అని ఈ నవలికకు బ్లర్బ్ లో రచయిత్రి కిరణ్ విభావరి రాసిన అభిప్రాయం మెచ్చుకోతగినదే.

నవలికలో మొదటి పేరా ఎపిలోగ్ అవసరం లేదు. అది నవలిక చదివి పాఠకులు తెలుసుకుంటారు. అభి, అనన్య సంభాషణలు అక్కడక్కడా పునరుక్తమయ్యాయి. ఆర్టిస్ట్ ఆనంద్ గారు గీసిన ఈ నవలిక ముఖచిత్రం భావగర్భితంగా వుంది. ఒక మనిషిలో వున్న ద్వంద్వ వ్యక్తిత్వాలను సంకేతిస్తూ ఒక వ్యక్తిని స్వచ్ఛంగానూ, మరొక వ్యక్తిని అనేక స్త్రీల సాంగత్యాలు గల వ్యక్తిగానూ చిత్రించడం, అది నవలికలోని కథానాయకుడి వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తూ ఆసక్తిని కలిగించింది. లోపలి చిత్రాలు కూడా నవలికలోని కథాగమనాన్ని దృశ్యమానం చేసాయి.

విభిన్న వస్తువుని, సంక్లిష్టమైన సమాచారాన్ని, సరళ శైలిలో చెప్పి, ఒప్పించిన ఉండవల్లి గారు అభినందనీయుడు. మొదట నిత్య ఈ-మాసపత్రికలో వచ్చిన ఈ నవలిక, తదుపరి నవ మల్లెతీగ ముద్రణలుగా అందమైన పుస్తక రూపం తీసుకుంది. ఈ నవలిక నేటి ఆధునిక యువతరం ఖచ్చితంగా చదవాల్సిన అవసరం వుంది.

ఒక మనసు అనేక దేహాలు(నవల) పేజీలు:87,వెల : 100/-,మల్లెతీగ ముద్రణలు,ప్రతులకు : ఉండవల్లి.ఎమ్: 94413 47679

 

– పి.శ్రీనివాస్ గౌడ్,
99494 29449