తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సమావేశాల నిర్వాహణ, భద్రతా ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాష్‌ ముదిరాజ్‌ సంబంధిత అధికారులతో సమీక్షించారు. శాసనసభ భవనంలోని స్పీకర్‌ ఛాంబర్‌లో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ లెజిస్లేటివ్‌ సెక్రటరీ డాక్టర్‌ వి.నరసింహా చార్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, జిఎడి సెక్రటరీ రఘనంందన్‌ రావు, అడిషనల్‌ సెక్రటరీ (ఫైనాన్స్‌) రాయ రవి, డైరెక్టర్‌ (ప్రోటోకాల్‌) శివలింగయ్య, హోం శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవి గుప్తా, రాష్ట్ర డిజిపి డాక్టర్‌ జితేందర్‌, ఎడిజి (శాంతిభద్రతలు) మహేష్‌ భగవత్‌, అడిషనల్‌ సిపి విక్రమ్‌ సింగ్‌మాన్‌, సైబరాబాద్‌,రాచకొండ కమిషనర్లు సుధీర్‌ బాబు, అవినాష్‌ మహాంతి, ఇంటెలిజెన్స్‌ ఐజి కార్తికేయ, అసెంబ్లీ ఛీఫ్‌ మార్షల్‌ కరుణాకర్‌, కౌన్సిల్‌ చీఫ్‌ మార్షల్‌ సంజీవ్‌రెడ్డితో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందింలన్నారు. ఉభయ సభల సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలన్నారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం జరుగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే భారీ వర్షాలు కురిసి కొన్ని రూట్లలో రోడ్లు దెబ్బతిన్నాయని, ట్రాఫిక్‌ అధికారులు సమన్వయం చేసుకుని సభ్యులు సరైన సమయానికి సభకు చేరుకునే విధంగా సహకరించాలి. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలని, తద్వారా సమావేశాలు సజావుగా జరుగుతాయన్నారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మాట్లాడుతూ శాసనమండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలి. అవసరమైన నోడల్‌ అధికారులను, లైజనింగ్‌ ఆఫీసర్లను నియమించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలన్నారు. చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు మాట్లాడుతూ సభ సజావుగా జరగడానికి, ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని, అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అవసరమైన అధికారులను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా పదవీకాలం పొడగింపు పొందిన చీఫ్‌ సెక్రటరీ కె.రామకృష్ణారావుకు స్పీకర్‌, చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌లు శుభాకాంక్షలు తెలిపారు.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry