‘చందనుడు నా హృదయనందనుడు ఇతడు ఇందూరు వాడే కాదు, అందరివాడు’ అని సినారె గారిచే, ‘లిఫ్ట్ ద్వారా కాదు, స్వయంకృషితో ఒక్కోమెట్టు నిర్మించుకొని ఒక స్థాయికి వస్తున్నాడ’ని గుంటూరు శేషేంద్ర శర్మ గారితో ‘చందన్ రావు కవిత్వం ఆర్ధ్రతానుభవాన్ని కలిగిస్తుంద’ని రావూరి భరద్వాజ గారితో, ‘ఇందూరు అనగానే నన్ను బంధించిన ఊరు, ఒకప్పుడు చెరసాలలో ఇప్పుడు చందన హృదయశాలలో’ అని దాశరథి గారిచే కీర్తించబడిన ‘ఇందూరు చందనాగ్ని, వి-అంటే వ్యాఖ్యానం,పి-అంటే పోయెట్రీ, వెరసి వి పి చందనం’ అని ఆరుద్ర గారు కీర్తించినా, అది ‘వ్యాఖ్యాన సామ్రాట్’ ఇందూరు సాహితీ దిగ్గజం వి.పి చందన్ రావు గారి గురించే.
_________________
అందరి మనసులను గెలిచినవారు. అందరి సాహితీ బంధువు. ప్రతి అక్షరాన్ని ప్రేమించగల శక్తి గలవారు. అందుకే సాహితీవేత్తలందరికీ, ఆయన ఆత్మబంధువు. ఈయన వ్యాఖ్యానం గురించి, కవిత్వం గురించి తెలియని వారు బహుశా ఎవరూ లేరనే చెప్పవచ్చు. దశాబ్దాల తరబడి సాహిత్యమే తన లోకంగా చేసుకుని యువప్రాయం నుండే కవితా రచనను చేస్తూ, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ఎంతోమంది ఆత్మీయ సాహితీమిత్రులను పొందిన సుమనస్వి వి.పి.చందన్ రావు, ఇందూరు ఆణిముత్యం. ఈయన కలం నుండి జాలువారిన “చందనాగ్ని” ఒక మంచి కవితా సంపుటి.
________________
సుమారు 40 సంవత్సరాల తన సాహితీ ప్రస్థానంలో..మొదలు నుండి నేటి వరకు ఆయన రాసిన కవిత్వం పరిణతి చెందిన విధం, మహాకవి సినారె తో ఆయన అనుబంధం, కొన్ని వందల వ్యాఖ్యానాల గురించి ఈ పుస్తకంలోని ముందుమాటలో అభినందన చందనాలు తెలిపిన వాక్యాలు. ఎన్నేళ్లయినా కవిత్వాన్ని వదలనివాడు ఇందూరు సినారె గా వెలుగొందుతూ ‘వ్యాఖ్యాన కేసరి’గా, ‘వ్యాఖ్యాన సమ్రాట్’ గా ఎన్నో బిరుదులు, ఎంతో కీర్తిని సొంతం చేసుకున్న చందన్ రావు ప్రత్యేకత, వారి చమత్కార భాషణం. సభారంజకమైన చమక్కులనే కాదు, ప్రభావవంతమైన గాఢ అభివ్యక్తులను, తాత్విక చింతనలను చందన్ రావు అందించగలరు. ఈ పుస్తకంలో మనం నాలుగైదు దశాబ్దాల కాలాన్ని ఒకేసారి చూడవచ్చు. అపార అనుభవం సాహిత్యంతో ఎడతెగని బంధం వ్యాఖ్యానాన్ని ఒక కళాస్థాయికి తీసుకెళ్లిన కీర్తి చందన్ రావు గారిది.
‘మేం పిట్టలం/ మా వారసత్వం/
రెక్కాడించి డొక్క నింపుకోవడమే’
అంటూ..మొదటి కవితలో ‘పిట్టపిల్ల’ బతుకును తెలుపుతూ శ్రమజీవన సౌందర్య విలువలను తెలిపారు. రెక్కాడించి డొక్క నింపుకోవడమే..అంటూ చెప్పిన వాక్యాల్లో ఒక ప్రగతిశీలవాదిని మనం చూడవచ్చు.
“బాధని కథలోకి/ గాయాన్ని గజల్లోకి/ దుఃఖాన్ని ఒక సుఖస్వప్నంలోకి/ తర్జుమా చేస్తున్న వాడిని” అంటూ రాసిన “చీకటి దండెం మీద వెలుతురు వస్త్రం” కవిత, ఎన్నో పార్శ్వాలను దర్శనం చేయిస్తుంది. ఒక తాత్వికతను, ప్రగతిశీలతను కలం అనుభవ దృశ్య చిత్రీకరణను మన ముందు ఉంచుతూ, గొప్ప భావాలను పరిచయం చేసి కవిత్వలోకంలోకి చేయి పట్టుకుని తీసుకెళ్తుంది. కవిత్వాన్ని చక్కగా చిక్కగా దట్టంగా చందన్ రావు రాయగలరని ఈ కవిత మనకు చెబుతుంది.
కనిపించని చీకట్ల
కని కట్ల దండెం మీద
కాంతి అస్త్రాన్ని వేయనీయకండి
శాంతి వస్త్రాన్ని ఆరేయనీయండి.
చందన్ రావు అంటే సినారె చే కీర్తించబడిన మానస పుత్రుడు. సినారె అంటే ఆయన ప్రాణం. సినారె కవిత్వం అన్నా, సినారె పేరన్న ఆయనకు అమిత ఇష్టం. ప్రతి సభలోని వ్యాఖ్యానంలోనూ సినారె గురించి చెప్పనిదే ఆ సభ ముందుకు నడవదు. అలాంటి పితృ సమానులైన నారాయణ రెడ్డి గారి గురించి “మా నాయన సినారె” అంటూ ఈ సంపుటిలో గుండె లోతుల్లోంచి ఉప్పొంగి వచ్చిన వాక్యాలు ఎంతో ఆకట్టుకుంటాయి.
‘నీవు కలమెత్తితే, కావ్యావతరణాలు/ గళమెత్తితే, గజలాభిషేకాలు/చమక్కుల చమ్కీలనద్దుతూ/సాగే నీ సభ/ హర్షద్వానాలతో మారుమోగి/ సభ ఆసాంతం/ వయస్కాంత అయస్కాంతమే/ అటు చూస్తే చార్మినారే/ ఇటు ఏ సభ చూసినా నా సినారె.’
నా తెలంగాణ శీర్షికతో రాసిన మినీ కవితలో
1968 ఉద్యమ ఊరేగింపులో
తగిలిన చిప్ప పోలీసు లాఠీ దెబ్బ
మొన్న
2014 జూన్ 2న
నొప్పి మానింది!.
అంటూ..చిన్న చిన్న అక్షరాల్లోనే ఎంతో భావం వచ్చేలా యోగ్యమైన విధంగా చెప్పడం చందన్ రావుకు బాగా అబ్బింది. దశాబ్దాల పోరాట చరిత్రను చూసిన వారిగా, పోరాట సాహిత్య రచనలను చేసిన వారిగా, ఎంతోమంది శిష్యులను సాహితీలోకానికి అందించిన వారిగా, చందన్ రావు ప్రతి మనిషిలో కూడా మంచిని వెతుకుతారు. అభినందిస్తారు. ప్రోత్సహిస్తారు. ఇది ఆయన నైజం. ఆయన గొప్ప వ్యక్తిత్వం.
ఆ విషయాలే మనం “హంస” కవితలో చూడవచ్చు.
“పాలను నీళ్లను వేరు చేసే/హంసను నేను చూడనే లేదు/ ఇప్పటికీ /మనిషి మనిషిలో/ హంసను/వెతుక్కుంటూనే ఉన్నాను.” అంటారు. ఆయన స్నేహం ఆత్మీయత అలాంటిది. మంచి కవిత్వ వాక్యాలు ఎక్కడ కనిపించినా, చందన్ రావు ఆత్మీయ వచనాలు కవి వద్దకు చేరుకుంటాయి. కలానికి ధైర్యాన్ని ఇచ్చి, ముందుకు సాగేలా ప్రోత్సహిస్తాయి.
ఇలా సభాసమ్రాట్, వ్యాఖ్యాన సమ్రాట్ వి.పి చందన్ రావు రాసిన ఈ “చందనాగ్ని” సుమారు నాలుగు దశాబ్దాల తన సాహిత్య కృషికి నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ పుస్తకంలో ‘పిట్టపిల్ల, చీకటి దండెం మీద, ఆత్మహత్య, మా నాయన సినారే, ఒక్కపొద్దు, నా తెలంగాణ, తడి అడుగులు, శిలాపుష్పం, ప్రపంచ కవిత, అగ్నిలో చేతులు, పగలు, కానుక, రెండక్షరాల లక్షణాలు, ఏకవాక్య దండెం మొ. మేటి కవితలతో పాటు 171 కవితలు ఉన్నాయి.
ఇందూరు భారతి నుంచి రవీంద్ర భారతి వరకు ఇందూరు నుంచి ఢిల్లీ వరకు వి.పి. చందన్ రావు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకుని ఎంతోమంది గొప్ప గొప్ప సాహితీవేత్తల మనస్సులను గెలుచుకున్నారు. సాహితీ క్షేత్రంలో గొప్ప సాహితీవేత్తగా అందరి మనసుల్లో నిలిచిపోయారు. వీరి ‘చందనాగ్ని’ కవితా సంపుటిలో నాలుగు దశాబ్దాల తన సాహిత్యాన్ని మనం చూడవచ్చు. ముఖ్యంగా,యువ కవులు ఈ కవితా సంపుటిని చదవాల్సిన అవసరం ఉంది. ప్రతుల కొరకు ఫోన్: 94400 38565లో సంప్రదించవచ్చు.

-సిరిసిల్లా గఫూర్ శిక్షక్
98490 62038











