బాగా కష్టపడి చదువుకుని, మంచి ఉద్యోగం తెచ్చుకుని, చుట్టూ వున్న సమాజంతో తనను తాను సంలీనం చేసుకుంటూ ప్రతి సామాజిక చలనానికీ స్పందిస్తూ, ప్రతి దుఃఖ సందర్భానికీ వెనుక ఉన్న కార్యకారణ సంబంధాలను విశ్లేషిస్తూ, మనసునిండా సమాజం పట్ల ప్రేమ, అనుకంప నింపుకున్న ఒక స్త్రీ పరిణిత దృక్పథంతో కవిత్వం రాస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే నీలకురింజి సముద్రం చదవాలి. ఇటీవల వచ్చిన కవిత్వ సంపుటులలో ఉత్తమ పంక్తిలో నిలిచిన కవిత్వం నీలకురింజి.
నీలకురింజి ఒక అరుదైన అందమైన పూలమొక్క. భారత దేశ పశ్చిమ కనుమలలో పుష్కరానికి ఒకసారి పుష్పించే ఈ మొక్క శాస్త్రీయ నామం Strobilanthes kunthiana. నీల కురింజి వికసించిన సమయంలో పర్వత ప్రాంతాలు నీలంరంగు పుష్పాలతో అద్భుతంగా కనిపిస్తాయి. ఈ దృశ్యం సహజ సౌందర్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. తమిళ సంగం సాహిత్యంలో ‘కురింజి’ పుష్పం ప్రేమకీ, సౌందర్యానికి చిహ్నం. పలియన్ గిరిజనులు ఈ పూలు పూయడాలను ఆధారంగా తమ వయస్సును లెక్కిస్తారు. ‘నేను మూడు నీలకురింజి పూలు పూయడాలు చూశాను’ అంటే 36 సంవత్సరాల వయస్సు వచ్చిందని అర్ధం.
________________
ఈ అద్భుతమైన నీలకురింజి పుష్పాన్ని ఒక సముద్రంగా ఊహించి తన కవిత్వానికి నీలకురింజి సముద్రం అని పేరివ్వడం ఒక అన్యాపదేశంగా కవిత్వంపట్ల, సమాజంపట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రగతి ఎంచుకున్న మార్గం. కథకురాలిగా, ప్రసిద్ధమైన ప్రగతి కవిగా వెలువరించిన తొలి కవిత్వ సంపుటి ఇది. ఈ కవిత్వం చదువుతుంటే మన రోజువారీ సమాజాన్ని త్రీ డైమన్షన్ లో చూసినట్టు ఉంటుంది. మన ప్రస్తుత జీవితాన్ని ఏ అలంకారాల ఆచ్ఛాదనలూ లేకుండా నగ్నంగా చదువుతున్నట్టు ఉంటుంది. ప్రగతికి తాను నివసిస్తున్న సమాజం పట్ల ఉన్న తనకు ఉన్న అవగాహనను అక్షరాలుగా మార్చి పాఠకుడి హృదయంలో ఏదో ఒక రసాయన చర్య చేయడానికి ఉద్యుక్తమవుతున్నట్టు ఉంటుంది.
___________________
“Genuine poetry communicates through feeling and experience before it is fully understood on an intellectual level, creating an immediate emotional and subconscious connection with the reader. Rather than relying on clear, literal explanations” అని టి.ఎస్.ఇలియట్ అన్నప్పుడు అర్ధం కావడమంటే కవిత్వాంశం లేకుండా శుద్ధ వచనం రాయడం అని అర్ధం కాదు. చాలా మంది తేలికగా అర్ధం అయితే అది కవిత్వం కాదు అని అనుకుంటారేమో అనే భ్రమతో కావాలని కవిత్వాన్ని కాంప్లికేట్ చేస్తారు. కానీ ప్రగతి అలా కాదు. మామూలుగా అందరికీ తెలిసిన పదాలకే కొత్త అర్ధాన్ని ఇస్తూ తాననుకున్న భావాలని కవిత్వీకరిస్తారు.
కవిత్వం అంటే ఏమిటి అంటే వంద కవిత్వ సంపుటాలు వెలువరించిన మహా మహా కవులు కూడా కవిత్వం అంటే ఇది అని ఒక కచ్చితమైన నిర్వచనం ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే ఎంత మంది కవులు ఉంటే అన్ని నిర్వచనాలు ఉంటాయి. ప్రగతి కి కూడా కవిత్వమంటే తనదైన నిర్వచనం వున్నది. ఆ నిర్వచనంలోకి వొదగని అక్షరం ఒక్కటి కూడా ఆమె రాయలేదు ఈ సంపుటిలో. ప్రగతి దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
తెలిసిన అక్షరాలను,
చిరపరిచితమైన పదాలను
అడ్డదిడ్డంగా పేర్చి
అర్ధం లేని వాక్యాలుగా మార్చితే
కవిత్వ సృష్టి అయిపోతుందా?
కవిత్వం అంటే అక్షరం కాదు
అనుభూతి భాషను మించిన భావం
నిజానికి మనిషి తన లోపల వున్న భావాలు అన్నిటికీ అక్షర రూపం ఎప్పటికీ ఇవ్వలేడు. అంత పెద్ద గొప్ప గుడిపాటి వెంకటా చలమూ “నా అక్షరాలు కుంటివీ, గుడ్డివీ. అవి నేను అనుకున్న భావాన్ని వెలువరించలేవు” అన్నాడు. ‘Deletion is the aesthetics of language’ అని జోసెఫ్ జాన్సన్ అన్నప్పుడు an aesthetic appreciation of language can be found in its concise and purposeful omissions, or ‘deletions’ of unnecessary words or phrases, which adds to its beauty and efficiency అన్న అర్ధంతో పాటు మరొక అర్ధం కూడా వుండే ఉంటుంది. ఆ మరొక అర్ధాన్ని ప్రగతి అనుభూతి అంటున్నది.
ఆ అనుభూతి కూడా ప్యూపా లాంటి అనుభూతి. ఆ ప్యూపా లాంటి అనుభూతి నుండి అక్షరపు సీతాకోక చిలుక రెక్కవిప్పుకోవడానికి ఎంత ప్రసవ వేదన పడాలి? హృదయపు శాంకవ కుప్పెలో లిప్త పాటో, దీర్ఘకాలమో ఉద్యమ విద్యుత్‌తో, వికిరణ విద్వత్తో యెగదోయాలి. అప్పుడు కవిత్వ రసాయనం రసకందాయంలో పడుతుంది. అలా రసకందాయంలో పడి
అల్లిబిల్లి పదాల పూలను,
సౌరభాల మరువాన్ని
పొందిగ్గా కూర్చితే తయారయ్యే
కొత్త సుగంధం కవిత్వం కావాలి
మరో నాసికాగ్రాన్ని చేరి స్పందన కలిగించే
భావ వారధి కావలి కవిత్వం
అంటున్నది ప్రగతి. ప్రగతి భావాలలో సంక్లిష్టత కానీ, అర్ధం కాని అయోమయతనం కానీ, సిద్ధాంతాల రాద్ధాంతాలు కానీ ఏవీ వుండవు. చాలా సరళంగా, సున్నితంగా, మరింత ప్రగతి శీలంగా ఉంటాయి. ఆ ప్రగతి శీల భావాల వారధి నీలకురింజి సముద్రం.
నిప్పుల గురించి అమ్మకు తెలిసినంతగా
యే శాస్త్ర వేత్తకూ తెలీదేమో!
రాజేయడమూ,ఆర్పడము మటుకే కాదు
నిప్పు కాలకుండా ఎలా పట్టుకోవాలో
అమ్మకు భలే తెలుసు
అని అన్నప్పుడు అర్ధం కాని పదమేమీ లేదు. కానీ ఇచ్చిన భావం మాత్రం అనంతం. ఈ వాక్యాలు బొగ్గుల పొయ్యి అనే కవితలోవి. ఈ కవితనే అనుకుంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు తన సిలబస్ లో చేర్చింది. బొగ్గులపొయ్యి నెపంగా ఈ కవిత శత సహస్ర దళ వికసిత పద్మంలా స్త్రీ విశ్వరూపాన్ని చూపిస్తుంది.
నిప్పును కేవలం నిప్పు అనుకోకుండా జీవితానికి ఒక ప్రతీకగా తీసుకుంటే జీవితాన్ని గెలవడం స్త్రీ కి తెలిసినంతగా పురుషుడికి తెలియదు అనే సత్యాన్ని అలవోకగా తెలియచేస్తుంది. నిజానికి ఒక అపజయం ఎదురు అవగానే పురుషుడు నిరాశోపహతుడు అయితే, స్త్రీ మాత్రం అపజయాన్ని విజయంగా ఎలా మార్చుకోవాలా అని చూస్తుంది.
‘బొగ్గులపొయ్యి’ తో మొదలయి కవిత ఒక ఉద్వేగ ప్రయాణం చేస్తూ అలా పైపైకి వెళ్లి ఒక శిఖరారోహణ చేస్తుంది.ఆ శిఖరం మీద అమ్మ జ్ఞాపకాన్ని మళ్ళీ బొగ్గులపొయ్యి రూపంలో నిలబెడుతుంది. నిజానికి వచనంలో చైతన్య స్రవంతి పద్దతిని నిర్వహించడమే కత్తి మీద సాములాంటి విషయం. కానీ ఒక వచన కవితలో చైతన్య స్రవంతి శిల్పాన్ని అలవోకగా నిర్వహించడం ప్రగతి కవిత్వ రచనా సామర్ధ్యానికి ఒక ఉదాహరణ. ఒక వంటగత్తెగా అమ్మని పరిచయం చేసి, అక్కడనుండి ఒక విద్యావేత్తగా, ఒక అకడమీషియన్ గా, చివరకు ఒక గొప్ప స్కాలర్ గా నిరూపించి మళ్ళీ ప్రారంభించిన బొగ్గులపొయ్యితోనే ఒక జ్ఞాపకంగా అజరామరం చేయడం ప్రగతి కవిత్వ నిర్మాణ చాతుర్యం. కణ కణ మెరుస్తున్న నిప్పులను, బంతిపూలుగా అలంకరించడం లాంటి ఊహలతో పాటుగా పండితమ్మ లాంటి పద ప్రయోగాలు పాఠకుడిని ఆశర్యచకితుడిని చేస్తాయి.
ఇవ్వాళ మనిషి జీవితం మనిషిది కాకుండా పోయింది. వేగం పెరిగి, జీవితంలో నాణ్యత తరిగింది. నాణ్యత తగ్గడం అంటే మనిషిని ప్రభావితం చేసే అన్ని రంగాలలోనూ మానవీయ విలువలు లుప్తం కావడమే. లుప్తమైన విలువలను ఎలాగూ తిరిగి పొందలేము కనుక జీవితానికి కొన్ని కొత్త దారులు వేసుకోవాలి. జీవితానికి కొత్త, కొత్త ఆనుభవిక స్థలాలను పరిచయం చేయాలి. ఒకే దారిలో వెళుతూ ఉంటే జీవితం నిలువ నీటి వాసన వేస్తుంది. జీవితం ఒక మూసలో వొదిగి పోయి జీవించడంలో ఉన్న మాధుర్యం మృగ్యం అవుతుంది. జీవితం వై జంక్షన్ లో నిలిచినప్పుడు రోజూ నడిచే దారి ఒకటి, కొత్తగా మొలిచిన దారి ఒకటి కనిపిస్తే కొత్త దారిలో వెళ్ళమని లోలోపలి శక్తులు ఏవో ప్రేరేపిస్తాయి. మనిషిని ఆవరించుకుని వున్న సందేహాలు వెనక్కు లాగుతాయి. దారి తేల్చుకోలేని సందిగ్ధావస్థలో నడక మందగిస్తుంది. అప్పుడు ప్రగతి అంటుంది కదా:
అయినా ఎప్పుడూ ఒకే దారి విసుగనిపించదూ
అప్పుడప్పుడు కొత్త దారులు
వేయడమే కదా జీవితం
__________________
ఒక వ్యక్తిగా ఒక కొత్త దారిలో నడిచినప్పుడు ఎదురయ్యే దూషణ భూషణలకు భయపడి వెనకడుగు వేస్తే ప్రయాణం ఆదిలోనే ఆగిపోతుంది. వెరవక ముందుకు సాగితే తాను వేసిన కొత్త దారి పదిమందీ నడిచే వెలుగు దారి అవుతుంది. ప్రగతి ఒంటరిగా తనవైన దారులు వేయగలిగిన ధీర.
____________________
ఈ ధీరత్వం, తానున్న సమాజాన్ని తనదయిన ప్రాపంచిక దృక్పథంతో చూడగల దృష్టి వైశిష్ట్యం ఆమెకు తండ్రి నుండి వారసత్వంగా వచ్చివుంటుంది. అందుకేనేమో ఆమె తన తండ్రిని నీలకురింజి సముద్రంతో పోల్చింది. అంతటితో ఆగకుండా తండ్రి హృదయం లోతెంతో తెలియని నీలాల సాగరం అన్నది. ఈ పోలికలతో తండ్రి పట్ల తనకున్న ప్రేమను అద్వితీయంగా వ్యక్తపరచింది. నాన్న ముందు నేనొక నీలలోహిత సుమాన్ని మాత్రమే అని తనను తాను మూల్యాంకనం చేసుకుంది. ఈ కవిత చదివినప్పుడు భలే ముచ్చట వేసింది. ప్రేమను ఇంత సున్నితంగా వ్యక్త పరచవచ్చా? అని రవ్వంత అసూయ కూడా.
నీల కురింజి సముద్రం, నీల లోహిత సముద్రం ఎందుకు నీలం పట్ల ప్రగతికి ఇంత మక్కువ? ఎందుకంటే నీలం రంగు మనసుకు శాంతిని, స్థిరత్వాన్ని,ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక చైతన్యానికి నీలం రంగు ఒక ప్రతీక. జగమెరిగిన వర్జీనియా వూల్ఫ్ తన రచనలో నీలి రంగు సముద్రం, నీలినీలి ఆకాశాన్ని ప్రతీకలుగా తీసుకోవడం ద్వారా ఆధ్యాత్మిక భావనలకు అనంతత్వానికి పట్టం కట్టింది. ‘టు ది లైట్ హౌస్’ నవలలో, మిసెస్ రామ్ సే యొక్క ఆలోచనలు మరియు భావోద్వేగాలు నీలం రంగు ద్వారా ప్రతిబింబిస్తాయి, ఇది ఆమె జీవితంలో శాంతి మరియు లోతైన ఆలోచనలను సూచిస్తుంది.
కొన్ని చిన్ని చిన్ని ఆనందాలు
పిడికిట్లోంచి ఎప్పుడు
జారిపోయాయో తెలియదు
వెనక్కొచ్చి చూసుకుంటే
ఇంకా కాలం అక్కడే మనకోసం
ఆగిపోయి వేచి చూస్తోంది
యెంత సంభ్రమపు ప్రేమో కాలానిది!
అంటుంది ప్రగతి ఒక కవిత్వపు శకలంలో. ఒక గొప్ప సంభ్రమకి గురి చేసే ప్రేమ కాలానిది మాత్రమేనా? ప్రగతి కవిత్వానిది కూడా.
ప్రగతి గారూ మీ కవిత్వం నీలకురింజి పువ్వులా పనెండేళ్లకోసారి కాకుండా ప్రతి ఋతువులోనూ విరబూయాలి.
(ఇది ఛాయ ప్రచురణ. ప్రతుల కొరకు 7093165151లో సంప్రదించవచ్చు)
-వంశీకృష్ణ
95734 27422











