హైదరాబాద్: రిజర్వేషన్లను సాధించేందుకు వివిధ బిసి సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే వివిధ బిసి సంఘాలతో ‘బిసి ఐక్య కార్యాచరణ కమిటీ’(బిసి జెఎసి) ఏర్పడింది. జెఎసి ఛైర్మన్‌గా ఎంపి ఆర్.కృష్ణయ్య, వైస్ ఛైర్మన్‌గా విజిఆర్ నారగోని, వర్కింగ్‌ఛైర్మన్‌గా జాజుల శ్రీనివాస్‌గౌడ్, కో ఛైర్మన్లుగా దాసు సురేశ్, రాజారాం యాదవ్ ఎన్నికయ్యారు. ఈ నెల 13న తలపెట్టిన జాతీయ రహదారుల దిగ్భందనం, 14న రాష్ట్ర బంద్ వాయిదా వేసి, ఈనెల 18వ తేదిన ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో రాష్ట్ర బంద్ చేపట్టాలని జెఎసి నిర్ణయించింది. బిసి జనసభ అధ్యక్షులు రాజారామ్ అధ్యక్షతన హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని అశోక్ హోటల్‌లో వివిధ బిసి సంఘాల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల అమలు, ఉద్యమ ఉధృతం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపైచర్చించారు. అనంతరం బిసి రిజర్వేషన్ల సాధనకు ఐక్య ఉద్యమాల నిమ్మితం ఈ సమావేశంలో ‘బిసి ఐక్య కార్యాచరణ కమిటీ’(బిసి జెఎసి) ఏర్పటు చేశారు. జెఎసి ఛైర్మన్‌గా ఎంపి ఆర్.కృష్ణయ్య, వైస్ చైర్మన్‌గా విజిఆర్ నారగోని, వర్కింగ్ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్‌గౌడ్, కో -చైర్మన్లుగా దాసు సురేశ్, రాజారామ్ యాదవ్, మీడియా కో-ఆర్డినేటర్‌గా గుజ్జ కృష్ణ ఎన్నికయ్యారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బిసిల్లోని ప్రతి కుల సంఘం నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. బిసి ఉద్యమం ఇంతటితో ఆగదని, బిసిలను చట్టసభల్లో కూర్చోబెట్టేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర బంద్ విజయవంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని తమ వాటా దక్కే వరకు పోరాడుతామని చెప్పారు.జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిసిలకు రావాల్సిన నోటికాడిముద్దను పిడికేడు శాతం లేని, రిజర్వేషన్ల వ్యతిరేకులు అడ్డుకున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ వ్యతిరేకులకు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సెగ పుట్టించేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బిసి నేతలు గుజ్జ సత్యం, నీలం వెంకటేశ్, అనంతయ్య, నందగోపాల్, కుందారం గణేశ్‌చారి, కుల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్‌గౌడ్,శ్యాంకుర్మ తదితరులు పాల్గొన్నారు.
‘బిసి’ జెఎసి ఏర్పాటు















