బిజెపికి నరనరాన బిసి వ్యతిరేకత

తెలంగాణ

టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
హైదరాబాద్‌ : బిజెపి నరనరాన బిసి వ్యతిరేక పార్టీ అని టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి డ్రామాలో బిఆర్‌ఎస్‌ కూడా తోడైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్దారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిసి రిజర్వేషన్‌ల కోసం సుప్రీంకోర్టు కువెళ్తామన్నారు. బిసి కోటాపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్నకుట్రలకు తాము భయపడమని తేల్చిచెప్పారు. బిసి రిజర్వేషన్‌ల పెంపుపై తమ చిత్తశుద్ది ప్రజలకు తెలుసు అన్నారు. బిల్లులు గవర్నర్‌ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రధాని దగ్గరికి వెళ్లి బిజెపి నాయకులు ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. బిసి సంఘాలు బంద్‌కు పిలుపునిస్తే మద్దతు ఇస్తామని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు. బిసి సంఘాలు ధర్నా చేసినప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ తీసుకొచ్చిన గొప్ప చట్టాలకు ఎన్‌డిఏ ప్రభుత్వం తూట్లు పొడిచిందని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు. యుపిఏ హయాంలో చారిత్రాత్మక చట్టాలు అమల్లోకి వచ్చాయన్నారు. దూరదృష్టితో యుపిఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిందన్నారు. ప్రతి పౌరుడు ప్రశ్నించే హక్కును కల్పించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. కీలక చట్టాలను బిజెపి నిర్వీర్యం చేసిందని విమర్శించారు. అంబానీ, అదానీ కోసం ఆర్‌టిఐ చట్టానికి తూట్లు పొడుస్తోందని దుయ్యబట్టారు. ఆర్‌టిఐ చట్టానికి సవరణలు చేసి, దాని స్వతంత్రతను బలహీన పరిచారని విమర్శించారు. ఆర్‌టిఐని నీరు గార్చేందుకు కమిషనర్‌ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. కేంద్రంలో 11 మంది ఆర్‌టిఐ కమిషనర్లు ఉండాల్సిన చోట ఇద్దరే ఉన్నారని తెలిపారు. ఆర్‌టిఐ తీసుకొచ్చి 25 ఏళ్లయిన సందర్భంగా దాని గొప్పతనం తెలియచేయాలని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కోరారు. కేంద్రంలోని బిజెపి సర్కార్‌ ప్రజలను వంచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఫాసిస్టు బిజెపి ప్రభుత్వ అవినీతిని బహిర్గతం చేసే వ్యక్తులు రక్షణ లేకుండా దాడులు, వేధిం పులకు గురవుతున్నారని మహేశకుమార్‌ గౌడ్‌ అన్నారు.