సి.పి. బ్రౌన్ (Charles Philip Brown) తెలుగు జాతికి, తెలుగు సాహిత్యానికి, నిఘంటు నిర్మాణానికి చేసిన అపారమైన సేవలను గురించి, తను గతించిన నూట నలభై సంవత్సరాల తరువాత కూడా తెలుగు జాతి మాట్లాడుకుంటున్నదంటేనే బ్రౌన్ దొర తెలుగు సాహిత్యానికి అరవై వసంతాలు పాటు చేసిన సేవ ఎంత గొప్పదో తెలుస్తుంది.
దాదాపు 34 సంవత్సరాలు తెలుగు నేలపై పనిచేసిన బ్రౌన్, కేవలం ఈస్టిండియా కంపెనీ ఉద్యోగి మాత్రమే కాదు, తెలుగు భాషా సంరక్షకుడుగా చిరస్మరణీయులు. ఆయన తెలుగు భాషా సాహిత్యానికి అపారమైన సేవ చేసిన మహా పండితుడు, పునరుద్ధరణకర్త. తెలుగు సాహిత్యం యొక్క చరిత్రలో ఆయన కృషి ఒక మైలురాయిగా నిలిచింది.
బ్రౌన్ ఉద్యోగంలో చేరేనాటికి ముద్రణా సౌకర్యం లేక, తాళపత్రాల రూపంలో ఉండి, కనుమరుగవుతున్న తెలుగు సాహిత్యాన్ని రక్షించాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తించి, వేలాది తాళపత్ర గ్రంథాలను సేకరించి, వాటిని నకలు చేయించి, ముద్రణా యోగ్యంగా పరిష్కరింపజేశారు. బ్రౌన్ చేసిన అత్యంత ముఖ్యమైన సేవల్లో ప్రాచీన తెలుగు గ్రంథాల సంరక్షణ, పరిశోధన మరియు తన స్వంత ఖర్చుతో ప్రచురణ ముఖ్యమైనవి.
ఈ ప్రక్రియ వల్ల పోతన భాగవతం, వేమన పద్యాలు, సుమతీ శతకం, వసుచరిత్ర వంటి అమూల్య గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోకుండా, బ్రౌన్ చొరవతో ముద్రణకు నోచుకున్నాయి. బ్రౌన్ స్థానిక పండితుల సహాయంతో బహుళ ప్రతులను పోల్చి, గ్రంథాలకు శుద్ధమైన, విశ్వసనీయమైన పాఠ్యాన్ని నిర్ణయించారు. ఈ శాస్త్రీయ పరిష్కరణ పద్ధతి ఆధునిక పరిశోధనకు పునాది వేయడమేగాక, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన కృషి చేశారు. వేమన పద్యాల ప్రచురణ ఈ కోవకు చెందిందే. 1829లో వేమన పద్యాల తొలి ప్రచురణ 693 పద్యాలు, అవి ఆంగ్లానువాదంతో వచ్చాయి. ప్రాచీన కావ్యాలు ప్రజలకు అర్థం కావడానికి వీలుగా, వాటికి వివరమైన వ్యాఖ్యానాలు కూడా (అర్థాలు, తాత్పర్యాలు) రాయించి ప్రచురించారు.
బ్రౌన్ పరిష్కరించి వ్యాఖ్యానాలతో ప్రచురించిన తొలి కావ్యాలలో రాఘవుని నలకథ (1841), గౌరన మంత్రి హరిశ్చంద్ర కావ్యాలు (1842) ఉన్నాయి. తర్వాత నన్నయ ఆదిపర్వం (1843), వసుచరిత్ర (1844), మనుచరిత్ర (1851) ప్రచురించబడ్డాయి. ఈ గ్రంథాలకు జూలూరు అప్పయ్య శాస్త్రి వంటి పండితులతో సులభంగా అర్థమయ్యే వ్యాఖ్యానాలు రాయించారు.
సి.పి. బ్రౌన్ తన జీతంలో నుంచి ఖర్చు చేసి ఎన్నో గ్రంథాలు ప్రచురించినా, తన గ్రంథాల ద్వారా ఒక్క పైసా కూడా సంపాదించకపోయినా, ఆయన సంతృప్తి చెందారు. “నా పుస్తకాల వలన నాకు డబ్బు రాలేదు, కానీ ఈ ఫలితం కోసమే నేను చూశాను, కాబట్టి నేను సంతృప్తి చెందాను,” అని ఆయన రాసుకున్నారు.
***
ఆయన మూడు ముఖ్యమైన నిఘంటువులను “బ్రౌన్ నిఘంటువులు” (Brown’s Dictionaries) పేరిట రూపొందించారు. తెలుగు-ఇంగ్లీష్ (Telugu-English Dictionary) తెలుగు పదాలకు ఆంగ్లంలో అర్థాలను ఇచ్చే సమగ్ర నిఘంటువు. అలాగే, ఇంగ్లీష్-తెలుగు (English-Telugu Dictionary) ఆంగ్ల పదాలకు తెలుగు అర్థాలను ఇచ్చే నిఘంటువు. మిశ్రమ నిఘంటువు (A Dictionary of the Mixed Dialects and Foreign Words in Telugu). తెలుగులో కలిసిపోయిన సంస్కృతం, అరబిక్, పర్షియన్ వంటి ఇతర భాషా పదాలకు సంబంధించిన నిఘంటువు. ఈ నిఘంటువులలో ఆయన కేవలం పదాలను మాత్రమే కాకుండా, వాటి వ్యుత్పత్తి, వివిధ అర్థాలు, సందర్భాన్ని బట్టి మారే ప్రయోగాలు, జాతీయాలు మరియు సామెతలను కూడా నిఘంటువుల్లో పొందుపరిచారు. ఇది తెలుగు భాష యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.
ఆయన నిఘంటువులు 1854లో వెలువడ్డాయి. “బ్రౌణ్య ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు”, 1853లో వెలువడింది. దీని పునర్ముద్రణలను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1974,1983లోను మరియు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1990,1997, 2000లోను వెలువరించింది. ఇవన్నీ 1853 నాడు శ్రీ బ్రౌన్ ముద్రించిన ప్రచురణకు పునర్ముద్రణలే. బ్రౌన్ గారి కృషిలో తెలుగు నిఘంటు నిర్మాణం ఒక అపూర్వమైన అధ్యాయం. ఆయన రూపొందించిన నిఘంటువులు నేటికీ ప్రామాణికంగా పరిగణించబడుతున్నాయి.
‘సాంబ నిఘంటువు’ మొదలుకొని ‘శబ్దరత్నాకరం’ వరకు పండితులకూ, సాహిత్యవేత్తలకూ ఉపకరించే నిఘంటువులు అనేకం ఉన్నాయి. కానీ బ్రౌణ్య ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువులు ప్రామాణికమైనవిగా గుర్తింపు పొందాయి.
“తెలుగు భాషా సాహిత్యాల వికాసాభ్యుదయాలకోసం విశేష సేవలందించిన పాశ్చాత్య పండితుల్లో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ప్రథమ గణ్యులుగా నిలుస్తారు. అనేక ప్రాచీన గ్రంథాలను వెలుగులోకి తీసుకురావటమే కాకుండా ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువులను కూడా రూపొందించారు. నిఘంటువుల్లో ప్రయోగాలకు స్థానం కల్పించే ప్రక్రియను బ్రౌను ప్రవేశపెట్టారు” అని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ గారు ఇంగ్లీషు-తెలుగు నిఘంటువుకు ముందుమాటలో (2016)వ్యాఖ్యానించడం గమనించతగినది.
***
తెలుగును సులభంగా నేర్చుకోవడానికి వీలుగా ఆయన “Telugu Reader” (తెలుగు పాఠ్యాలు), “Grammar of the Telugu Language” (తెలుగు వ్యాకరణం) వంటి గ్రంథాలను 1940లో రచించి, ప్రచురించి తెలుగును నేర్చుకునే వారికి మార్గదర్శి అయ్యారు. బ్రౌన్ దొర, సామెతలు (Proverbs) మరియు కథలు వంటి మౌఖిక సంప్రదాయానికి సంబంధించిన వాటిని కూడా సేకరించి ముద్రించి, మౌఖిక సంప్రదాయానికి పట్టం గట్టారు.
1855లో అనారోగ్య కారణాల వల్ల ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లిన బ్రౌన్, అక్కడ కూడా తెలుగుపై తన అధ్యయనాన్ని కొనసాగించారు. 1865లో లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేశారు.
కొన్ని వర్గాలు బ్రౌన్ వంటి వలసవాద పండితుల కృషి వెనుక వారి వ్యక్తిగత ప్రేరణలు ఉండేవని ప్రశ్నించినా, తెలుగు మేధావులకు, బ్రిటిష్ వారికి మధ్య జరిగిన నిర్ణయాత్మక సంభాషణ వల్లే ఈ సాంస్కృతిక సేవ సాధ్యమైందని మరో వర్గం వాదిస్తుంది.
బ్రౌన్ తెలుగు ప్రజలను “ఐరోపాలోని ఎవరికైనా తీసిపోని నాగరికత కలవారు” అని వర్ణించారు. ఆయన తన సొంత దేశస్థుల అసూయ, అవినీతి మధ్య కూడా తన తెలుగు అధ్యయనాన్ని కొనసాగించారు. “విశ్రాంతి లేకపోవడం అనేది ఉదాసీనత లేకపోవడాన్ని సూచిస్తుంది. నాకు ఎప్పుడూ విశ్రాంతి దొరికింది” అని తన డైరీలో రాసుకున్నారు.
ఆయన స్వయంగా వేతనం చెల్లించి స్థానిక తెలుగు పండితులను నియమించుకున్నారు. వారి సహాయంతోనే తాళపత్ర గ్రంథాలను నకలు చేయించడం, అర్థాలు రాయించడం వంటి పనులను చేయించారు. తద్వారా ఎందరో తెలుగు పండితులకు ఉపాధి కల్పించి, వారిని ప్రోత్సహించారు.
“తెలుగు సాహిత్యం అంతరించిపోతోంది; ఆ దీపం నూనె తగ్గి ఆరిపోయే తరుణాన ఉంది.” – 19వ శతాబ్దపు తొలి దశకంలో సి.పి. బ్రౌన్ వ్యక్తం చేసిన ఆవేదన ఇది. 800 ఏళ్ల తెలుగు సాహిత్య వారసత్వం, తాళపత్ర గ్రంథాల రూపంలో కనుమరుగవుతున్న ఆ సమయంలో, దానిని పునరుద్ధరించాలని సంకల్పించిన ఒక ఆంగ్లేయ అధికారి కథ ఇది. బ్రౌన్ కృషిని సమీక్షించిన బిషప్ కాల్డ్వెల్ ఆయనను “అవిశ్రాంత పండితుడు” (Restless Pandit) అని వర్ణించారు. ఆ పండితుడి అవిశ్రాంత సేవలే నేడు మన సాహిత్యానికి శాశ్వత పునాది అయ్యాయి.
ఆయన సేవ కేవలం చారిత్రకమే కాదు, తెలుగు జాతికి దాని సాంస్కృతిక గుర్తింపును తిరిగి అందించడం. అందుకే, ప్రొఫెసర్ జి.ఎన్. రెడ్డి అన్నట్లు, “తెలుగు దేశ చరిత్రలో ఏ ఒక్క వ్యక్తి కూడా భాషాభివృద్ధి కోసం ఇంత కాలం, ఇంత ఎక్కువగా కృషి చేయలేదు.” తెలుగు సాహిత్యాభిమానులు సి.పి. బ్రౌన్‌ను తెలుగు పునరుజ్జీవన పితామహుడిగా స్మరించుకుంటారు.
సి.పి. బ్రౌన్ గారి కృషి వల్ల తెలుగు భాష కేవలం ఒక ప్రాంతీయ భాషగా కాకుండా, సమగ్ర సాహిత్యం, వ్యాకరణం, మరియు నిఘంటు సంపద కలిగిన ఒక శక్తివంతమైన భాషగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆయన్ని నేటికీ తెలుగువారు “బ్రౌన్ దొర” అని ఆప్యాయంగా స్మరించుకోవడం అంటే బ్రౌన్ దొర తెలుగు జాతికి చేసిన సేవ చిరస్మరణీయమైనది గనుకనే.

# విల్సన్ రావు కొమ్మవరపు
(నేడు బ్రౌన్ జయంతి)











