సాంస్కృతిక సామాజిక చరిత్ర – తూర్పున వాలిన సూర్యుడు

“ఒకజాతి సంస్కృతిని తెలుసుకోవటానికి నవల అత్యుత్తమ సాధనం. ఆ కాలంలో ప్రజలజీవన గమనం, సమాజంలో ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పులు, సామాజిక,చారిత్రకలో సంఘటనలను సాహిత్యం ప్రతిబింబించిన తీరు అవగతమౌతాయి.” అంటారు ప్రముఖ విమర్శకులు కడియాల రామ్మోహన్ రాయ్ గారు.
ఓరియంటల్ కాలేజీ నేపథ్యంలో వచ్చిన మొదటి నవలగా ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి నవల “తూర్పున వాలిన సూర్యుడు”ని గుర్తించాలి.
శ్రీకాంతశర్మ గారికి కాలేజీలో సీనియర్ అయిన బేతవోలు రామబ్రహ్మంగారి మాటల ప్రకారం కథాకాలం 1960-67 అయితే రచనాకాలం 1974. ఆదివారం అనుబంధంలో ధారావాహికంగా ఈనవల ప్రచురితమైంది.

_____________________

ఏ నవల అయినా ఒక జీవితాన్ని ఒక పరిమితకాలంలో పాఠకుల ముందు ప్రదర్శితమౌతుంది. ఆ సందర్భంలో ఆ కాలపరిణామాలను, సామాజిక పరిస్థితులను, కథాకాలంనాటి మానవ మనస్తత్వాలను, ఆలోచనలనూ కూడా చరిత్రాత్మకంగా పాత్రలతోపాటూ ఒకసారి అంతర్లీనంగా మరోసారి స్ఫుటంగా పాఠకులకు అవగతమౌతూనే ఉంటుంది. అయితే రచయిత రాసిన సంఘటనల్ని, సంఘర్షణల్ని కాలస్పృహతోనే చదివినపుడే మరింత బాగా అవగాహనౌతుంది.
__________________

వృత్తిపరమైన అంశాలతో కూడిన మెడిసన్, ఇంజనీరింగ్, న్యాయవాదం వంటి కోర్సులు చదివే విద్యాసంస్థల్లో విద్యార్థులకూ, ఓరియంటల్ కాలేజీ విద్యార్ధులకూ చాలా వైరుధ్యం వుంటుంది. నిజానికి వేద విద్యాపీఠంలో చేరటానికి కూడా ఎంట్రన్స్ పరీక్ష వుంటుంది. ఇది కూడా వృత్తి విద్యకు చెందినదే. ఓరియంటల్ కాలేజీలో చేరేవారందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారని చెప్పటానికి వీలు లేదు. ఇందులో ఇతర కుల, మతాలకు చెందిన విద్యార్థుల పాత్రలు ఉన్నాయి. ఎక్కువగా పేద బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన విద్యార్ధులు ఉంటారు. కొందరు యాయవారానికి వెళ్ళి తెచ్చిన బియ్యం వండుకుని తిని సత్రంలాంటి హాస్టల్లో వుంటారు. వచ్చిన డబ్బుని ఇతర అవసరాలకు వాడుకుంటారు.

1960-75ల కాలంలో సమాజాన్ని ఆర్థిక మాంద్యం పీడించి చుట్టుముట్టేసినకాలం. మధ్యతరగతి శాతం చాలా ఎక్కువగా వుండేది. ఆ ఆర్థిక పీడనలో ఎక్కువగా చిక్కుకున్నవారు మధ్యతరగతి వారే. చదువు, వుద్యోగాలకే కాక వచ్చిన ఆదాయం సరిపోక తిండికి కూడా వెతుక్కునే పరిస్థితుల్లో గౌరవప్రదంగా కనపడాలని మిధ్యా ప్రపంచాన్ని తమ చుట్టూ పరిధిగా నిర్మించుకొని ఆత్మగౌరవాన్ని నిలుపుకునే ప్రయత్నంతో సతమతమౌతుంటారు.

“తూర్పునవాలిన సూర్యుడు” నవలా నాయకుడు రమాపతి విద్యాపీఠంలో చేరిన కొత్త రోజులు, విద్యార్థులు నెలకొల్పిన వినాయక నిమజ్జనాన్ని దర్శించటంతో మొదలుపెట్టి, రమాపతి చదువు ముగించుకున్న సమయంలో విద్యార్థులు నెలకొల్పిన వినాయక నిమజ్జనం చూడటమే కాక, కల కనటంతో ముగుస్తుంది.

కథానాయకుడు రమాపతి అయినా మరోపాత్ర సత్యమూర్తికి సంబంధించిన సంఘటనలు, సంభాషణలు రచయిత చిత్రించిన విధానం చదివినప్పుడు సత్యమూర్తే అసలు కథా నాయకుడుగా పాఠకులకు గోచరిస్తాడు. ఎందుకంటే సత్యమూర్తి నిర్భయత్వం, తాను నమ్మిన విషయాలపై ఎటువంటి సందర్భంలోనూ నిశ్చలనతో వ్యవహరించటం, నిజాయితీగా వుండవలసినప్పుడు ప్రిన్సిపాల్ తో సైతం వాదనకు దిగటం, తన వివాహ విషయంలోనూ మరొక మతానికి చెందిన అమ్మాయితో సిద్ధపడటం హేతువాద దృక్పథం మొదలైనవి సత్యమూర్తిని కూడా నాయకుడిగా స్థిరపరుస్తాయి. సత్యమూర్తి ప్రభావం నవలలో అడుగడుగునా రమాపతిపై వుంటుంది.

ఈనవలలో అనేక సంఘటనలే కాక పాత్రలు కూడా సజీవమైనవి కావటం వలన ‘తూర్పున వాలిన సూర్యుడు’ నవలని శ్రీకాంతశర్మగారి ఆత్మకథాత్మక నవలగానే సాహిత్యరంగం నిర్ధారించటం జరిగింది. ఇందుకు బేతవోలు రామబ్రహ్మం గారు ఈ నవలకు రాసిన ముందుమాట కూడా కారణమే.

రమాపతి శ్రీకాంతశర్మ అనేది, రమాపతి ప్రేమించి కుటుంబసభ్యులను ఎదిరించిమరీ వివాహం చేసుకున్న మైథిలే జానకీ బాల అని కూడా రామబ్రహ్మంగారు ముందు మాటలో చెప్పేసారు.

సుమారు అరవై ఏళ్ళక్రితం గోదావరి సమీపంలో కొవ్వూరులోని వేదపీఠంలో విద్యార్థులు నీరుకావి బట్టలవాళ్ళూ, గుళ్ళతో, పిలకలతో, విభూతి పిండికట్లవాళ్లూ, తద్దినాల భోజనాలకి వెళ్ళేవాళ్ళూ, కట్టుకోనుగుడ్డ, తినతిండి సరిగా లేనివాళ్ళు, పిన్నవయనులోనే ఠింగణా మెట్టవేదాంతం వల్లించేవాళ్ళు వుంటారని శత సహస్ర అభిప్రాయాలు రమాపతికే కాదు పాఠకులకూ అర్థమౌతుంది.

రమాపతి లెక్కలు, ఫిజిక్స్ తో మార్చి, సెప్టెంబర్ లు చూసి చివరికి తండ్రి చెప్పినట్లు ఓరియంటల్ కాలేజీ ఎంట్రన్స్ రాసి పాసౌతాడు. రమాపతి పెద్ద అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. పెద్దలకు చెప్పి వాళ్ళను ఎదిరించి, పెళ్ళిచేసుకునే ధైర్యం ఇద్దరికీ లేక తండ్రి చూసిన సంబంధం చేసుకుంటాడు. ఆ రోజుల్లో మగపిల్లలు కూడా చదువుకైనా పెళ్ళికైనా తండ్రి మాటకి ఎదురు చెప్పలేరనేది తెలుస్తోంది.

సాధారణంగా కాలేజీలలో వుండేలాగానే వోరియంటల్ కాలేజీలోనూ విద్యార్ధుల మధ్య గొడవలు, ఆధిపత్యభావనలు, కొట్టుకోడాలు, నిరసనలు ఉంటాయి.

విద్యాపీఠం అన్నందుకు అందులో విద్యార్ధులందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారే ఉంటారేమోననే అపోహ అక్కర్లేదు. ఇమాన్యుయెల్, రామిరెడ్డి, స్వామి నాయుడు,చౌదరి, జె.ఎన్. శాస్త్రి, వెంకట శాస్త్రి, చయనులతో పాటూ కనకదుర్గ, మీరా, ప్రభావతి వంటి అమ్మాయిలు కూడా చదువుతుంటారు.

ఒక సందర్భంలో సత్యమూర్తి సంస్కృత కాలేజీ అని రిక్షావాళ్ళ దగ్గర నుండి విద్యారుల వరకూ అందరికీ అలవాటు చేయాలంటాడు. లేకపోతే సంస్కృతం చదువంటే తద్దినం మంత్రాల చదువనే దురభిప్రాయం పోగొట్టాలంటాడు. యూనివర్శిటీలానే అయిదేళ్ళ చదువుచెప్పే కాలేజీని పీఠం అనటమేమిటంటాడు. దీనికీ సిలబస్, పరపతీ ఉందని తెలియజేయాలంటాడు.

వేదపీఠం అనే పేరు వుండటం వలన ఇందులో చదివే విద్యార్ధులకు సమాజంలో గౌరవం వుండటం లేదని, అందుచేత ఓరియంటల్ కాలేజీగా పేరు మార్చాలని సత్యమూర్తి విద్యార్థులను కూడగట్టి ఆందోళన చేపట్టి విజయం సాధిస్తాడు. అంతేకాక విద్యార్థులు ఆహార్యం పంచె, చొక్కా ధరించమనటాన్ని కూడా రమాపతి, సత్యమూర్తి వ్యతిరేకిస్తారు.

సంస్కృత కాలేజీలో చదివేవాళ్ళు తప్పనిసరిగా తెల్లటి పంచె, లాల్చీ వేసుకోవాలనే నియమాన్ని నిరసిస్తూ విదార్థులు ధర్నాలు చేసినా ప్రిన్సిపాల్ విననప్పుడు రమాపతి విద్యార్థుల ప్రతినిధిగా వెళ్ళి పంచెలు కట్టుకోవటం ముసలివేషంగా ఉంటుందని. ఫేంటు, పైజామా ఏదైనా తెల్లవి మాత్రమే వేసుకునేలా సవరణ చేయమని విన్నవిస్తాడు.

ఒక ఇంట్లో వారాలు చేసుకునే శాస్త్రి ఆ యింటి అమ్మాయిని ప్రేమించి భంగపడటంగాని, ఇమ్మాన్యూల్ ఒక అమ్మాయిని ప్రేమిస్తే తీరా ఆ అమ్మాయి మరొకరితో పెళ్ళైనా ప్రేమ నీతోనే అనటంతో ఇమ్మాన్యూల్ భరించలేక ఆత్మహత్య చేసుకోవడం గానీ ఈనాటి కాలేజీలలోని వ్యవహారంలాగే తోస్తుంది.

రమాపతికి అన్న సుబ్రమణ్యం పని చేసే వూళ్ళో మాష్టారుగారి అమ్మాయి మైథిలితో స్నేహం,ప్రేమా ఏర్పడుతుంది. రమాపతి, మైథిలీల ప్రేమవ్యవహారం చాలా అపురూపంగా నడుస్తుంది రమాపతి తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించకపోయినా మైథిలి చేయి వదలడు రమాపతి.

పూర్వ విద్యార్థి అయిన రామానుజరావు తార్కికశక్తి, స్నేహహృదయం ఉన్నవాడు. ఆయనను ప్రస్తుత ప్రిన్సిపాల్ సింహాద్రి రప్పించి విద్యార్థి వసతిగృహ బాధ్యతలు అప్పగిస్తారు. ఆయన రమాపతి, సత్యమూర్తితో కలసి ఆ పీఠంలో అనేక సంస్కరణలు చేసి విద్వార్థుల మెప్పుపొందుతారు.

ఈ నవలలోని నాయకులు రమాపతి, సత్యమూర్తి ఆధునిక భావాలు వున్నవారు. నవల కథాకాలం సనాతనానికి ఆధునికతకు మధ్య సంధికాలం. నాయకులు సనాతనానికి ఎదురు నిల్చినవారు అనేది నవలాక్రమంలో అవగాహనమౌతుంది.

సూర్యుడు తూర్పున ఉదయించి ఛండ ప్రఛండుడిగా పయనించి పడమర కుంగుతాడు. కానీ ఈ నవలకు పేరు తూర్పున వాలిన సూర్యుడు అని పెట్టటంలో ఆధునిక దృక్కోణం కలిగివుండి ఆధునికంవైపు పయనిస్తున్న యువతరం మంచి చెడులను అవగాహన చేసుకుంటూ ప్రయాణించాలి. తూర్పున ఉదయించిన సూర్యుడు చండప్రచండుడిగా వెలిగినట్లుగానే పాత కొత్తల మధ్య అంతరాల్ని తెలుసుకోవాలని రచయిత అంతరంగం కావచ్చు.
___________________

నవల ప్రారంభించిన దగ్గరనుండి పాఠకుల్ని పేజీల వెంట పరుగు తీయిస్తుంది. మధ్యమధ్యన ఆనాటి రాజకీయ పరిస్థితులను ‘విశాఖ ఉక్కు ఆంధ్రులహక్కు’ ఉద్యమం, ఆనాటి సినిమాలు, ప్రభుత్వం విద్యార్థులకు కల్పించిన ఉపకారవేతనం వంటివి కార్యక్రమాన్ని తెలియజేస్తుంటాయి.
___________________

నవల చదువుతున్నంతసేపూ విశ్వనాథగారి సినిమానో, బాపుగారి చిత్రాన్నో చూస్తున్నట్లు పాఠకుల కళ్ళముందు నవలంతా పాత్రలూ, సంఘటనలూ కంటితెరమీద దృశ్యమానమౌతూనే వుంటాయి.

“తూర్పున వాలిన సూర్యుడు” లోని కథానాయకుడు తాను నిలబడ్డ గీత మీద సూర్యుడిని నిలబెట్టి, అస్తమించే చారిత్రకతను కథారూపంలో తెలియపరిచే క్రమం ఆధునికతను సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన చరిత్ర, ఒక ప్రవాహానికి చెందిన చరిత్రగా అభివర్ణించింది ఇంద్రగంటి కిరణ్మయి.

అది అర్థం చేసుకుంటూనే ఈ నవలని చదవాల్సి వుంటుంది.

 

 

-శీలా సుభద్రాదేవి
81068 83099

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry