ముప్పై ముప్పై ఐదు ఏండ్ల సిద్ధార్థ అనే యువకుడు మరో ఇద్ధరు మిత్రులతో కలిసి ఇరవై ఐదవ ఏట ‘జస్ట్ ఇంటెలిజెన్స్’ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించి, దశాబ్ధకాలంలో దానిని ప్రపంచస్థాయి సంస్థగా అభివృద్ధి చేస్తాడు. వేల కోట్లు ఆర్జిస్తాడు. అంతర్జాతీయంగా పేరు మోసిన కంపెనీలను ఢీ కొట్టే స్థాయికి చేరుకుంటాడు. గెలుపు రుచి మరిగిన అతను అటువంటి స్టార్ట్ అప్ సంస్థలకు పెట్టుబడి పెట్టే ఓవ్యక్తి చేతిలో దారుణంగా వంచించబడతాడు. అనూహ్యంగా అతనికి ఎనభైశాతం షేర్లతో పాటు సి.ఇ.ఒ. పొజీషన్ కూడా కోల్పోతాడు. అదే సమయంలో తండ్రిని కూడా కోల్పోతాడు. ఈ కోల్పోవడం అనేది అతనికి పుట్టకతోనే తల్లిని కోల్పోవడంతో మొదలవుతుంది.
కంపెనీని, పొజిషన్ని కోల్పోయిన సిద్ధార్థ వత్తిడిని తట్టుకోలేక మైల్డ్ స్ట్రోక్ తో ఆస్పత్రి పాలవుతాడు. కొన్నాళ్లపాటు ప్రపంచంతో అన్నిరకాల సంబంధాలు తెంచుకొని ఆస్పత్రి నుండే బేపతగా నేపాల్ లోని అన్నపూర్ణ సర్కిట్ ఎక్కాలని బయలుదేరిపోతాడు.
అతని మొట్టమొదటి మజిలీ అయిన ‘బుజ్ బలే’ తోరాంగ్ లా లోని హోటల్. ఆ హోటల్ యజమాని ఆధీప సిద్ధార్థకి సంక్లిష్టమైన ప్రయాణంలో ఓ హైకర్ పాటించాల్సిన ఐదు సూత్రాలను తెలియజేస్తాడు. అవి
(1)హైకర్ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు, చీకటి పడకముందే టీ హౌస్ వెతికి పట్టుకొని సెటిల్ అవ్వాలి. (2)పొద్దున ఏడు గంటలలోపు బ్రేక్ ఫాస్ట్ చేసి కొండ ఎక్కడం మొదలు పెట్టాలి. (3)ప్రతిరోజు సాయంత్రం ఏ టీహౌస్ కు వెళ్ళినా వెంటనే షవర్ చేసుకోవాలి. (4)హైకింగ్ దారిపొడవునా సాయంత్రం ఏడు ఎడున్నరకల్లా డిన్నర్ చేసి వెంటనే నిద్రపోవాలి. (5)హైకింగ్ లో డిన్నర్ టైమ్ అనేది షోయలైజింగ్ టైమ్. జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనది మనిషికి – మనిషికి మధ్య సంబంధం, కలుపుగోలుతనం. వాటిని సాధించడానికి డిన్నర్ ని మించిన టైమ్ మరొకటి లేదు.
ప్రపంచ శాంతికి, అభివృద్ధికి పంచశీల ఎటువంటిదో, ప్రతి పర్వతారోహకుడికి ఈ ఐదు సూత్రాలు అటువంటివి. వీటిని పాటించడమంటే తను ఎన్నుకున్న గమ్యం చేరుకోవడంలో సగభాగం కృతకృత్యుడైనట్టే.
ఒక మజిలీలో లూసీ అనే అమెరికన్ అమ్మాయి సిద్ధార్థకి కలుస్తుంది. ఆవిడ మాటల్లో సిద్ధార్థ అంటే ‘తను అనుకున్న పనిని పూర్తిచేసే, అనుకున్న లక్ష్యాన్ని తప్పక చేరే మహాసాధకుడు’ అంటూ ఆ పేరుకున్న స్ఫూర్తిని వివరిస్తుంది. ఈ వివరణతో పాఠకుడికి గౌతమ బుద్దుడు ఏమిటో పూర్తిగా అర్ధమవుతుంది.
__________________
సాధారణంగా ప్రతి రచయిత తన కథను లేదా నవలను ఒక సంఘటనకు మరో సంఘటనను ముడివేస్తూ రచనను ముందుకు నడిపిస్తుంటాడు. కానీ, ఈ నవలా రచయిత సతీశ్ చప్పరికె మాత్రం కథలోని ప్రతి మలుపు దగ్గర గతించిపోయిన ఒక సంఘటనకు వర్తమానంలో నడుస్తున్న సంఘటనను జోడిస్తూ కథను ముందుకు నడిపించడం చాలా కొత్తగా అన్పిస్తుటుంది.
__________________
మరోచోట “కార్పొరేట్ లోకంలో వుండే కృరమైన వాస్తవాలముందు మిగతా భావాలన్నీ వ్యర్థమే. ఉదాహరణకు ఒకానొక చోట ఒక ఇల్లు కట్టిన నాన్నే దాన్ని వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కడుపున పుట్టిన పిల్లలే సామ్రాట్టుల్లా మారాలని కలలు కంటారు. ఆ కలల మధ్య వేరెవడో వచ్చి దాన్ని తన్నుకుపోతాడు. చివరికి ఆ సామ్రాజ్యమే చేజారిపోతుంది. ఇదంతా మత్స్యన్యాయం” అంటూ నేటి ఆధునిక కార్పోరేట్ వ్యవస్థ నగ్న స్వరూపాన్ని నవలాకారుడు రెండు ముక్కల్లో అద్భుతంగా వివరిస్తాడు.
ఒక సందర్భంలో సిద్ధార్ధ ప్రమాదానికిలోనై లోయలో పడిపోతాడు. అక్కడ అతన్ని సోఫియా అనే హైకర్ ఆవిడ సహాయకుడు సోనమ్ లు కాపాడతారు.
ఇక్కడో విషయం చెప్పాలి. పర్వతారోహకులు పర్వతాలను ఎక్కుతూ, దిగుతూ వుండే సమయంలో వారు తప్పకుండా కాపాడవలసిన అలిఖిత శాసనం ఒకటి అమలుతో వుంటుంది. దాని ప్రకారం ఆ దారిలో వెళ్ళేవారు ఎవరయినా సరే ఎటువంటి ఇబ్బందికిలోనైనా వారిని వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఆ సూత్రానికి కట్టుబడే సోఫియా, సోనమ్ లు సిద్ధార్థను ప్రాణాపాయం నుండి కాపాడుతారు.
ఆ తరువాత సిద్ధార్థ, సోఫియాలు కలిసే మిగిలిన ట్రెక్ పూర్తి చేస్తారు. ఆ ట్రెక్ చేస్తున్న సందర్భంలోనే వారు ఒకరిని గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుంటారు. సోఫియా జీవితాన్ని, ఆ జీవితంలో జరిగిన అనేక భయంకర సంఘటనలను తెలుసుకున్న సిద్ధార్థ విభ్రాంతికి లోనవుతాడు. క్రమంగా వాళ్ళిద్దరి మధ్య ఆంతరంగిక సామీప్యతతోపాటు శారీరక సామీప్యత కూడా ఏర్పడుతుంది.
ఆ ఇద్దరి జీవితాలు చివరికి ఏ మలుపు తీసుకున్నాయో? క్షణక్షణం పాఠకుల్లో ఎటువంటి ఆసక్తిని నెలకొల్పుతూ నవల కొనసాగింది? తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ నవల చదివితేనె బావుంటుంది.
‘ఘాంద్రూక్’ అంటే అన్నపూర్ణ సర్క్యూట్ లో వచ్చే ఓ నేపాలీ గ్రామం పేరు. ఆ గ్రామం వారి యాత్రలో ప్రత్యేకమైనది.
నవల పొడవునా పర్వతారోహకులకు ఎదురయ్యే అత్యంత క్లిష్టమైన ప్రాంతాలన్నిటినీ ఈ నవల మూల రచయిత సతీశ్ చప్పరికే స్వయంగా పర్యటించాడు. ఆ ప్రాణాంతక దారుల్లో ఎదురయ్యే ప్రతి అనుభవాన్నీ ట్రావెలాగ్ ఫార్మాట్ లో కాకుండా నవలా ఫార్మాట్ లో పొదిగించి ఉత్కంఠ భరితంగా చివరి పేజీ వరకు పాఠకుణ్ణి అక్షరాల వెంట పరుగులు పెట్టించే విధంగా రాయడంతో కృతకృత్యుడయ్యాడనే చెప్పవచ్చు.
నవల ఎంతగొప్పదైనా నాకు కొట్టొచ్చినట్టు కనిపించిన లోపం౼ఈ నవల సామాన్య పాఠకులను దృష్టిలో వుంచుకుని వ్రాయలేదని చెప్పుకోవచ్చు. నవలంతా కార్పొరేట్ స్థాయి లేదా ఆ పైస్థాయి మనుషులకు సంబంధించిన వ్యవహారంగా అన్పిస్తుంది. ఈ నవలలో సామాన్యులంటే సర్క్యూట్ దారి పొడవునా ఎదురయ్యే హోటల్స్, వాటిల్లో పనిచేసే వ్యక్తులు మాత్రమే.
మా దంపతులం కరోనాకు ముందు చేసిన నేపాల్ యాత్రలో భాగంగా నవల్లో పదే పదే ప్రస్తావన కొచ్చే అన్నపూర్ణ గుడిని దర్శించుకున్నాము. ఆ గుడి ముందు నిలబడి సూర్యోదయవేళలో మంచుతో నిండివున్న అన్నపూర్ణ పర్వతశ్రేణుల మీద తొలిపొద్దు వెలుగురేఖలు పడి పసిడివర్ణంతో మిల మిల మెరిసిపోతూ చూపరులను తన్మయత్వానికి లోనుచేస్తాయి. అటువంటి తన్మయత్వానికి లోనయ్యే భాగ్యానికి మాదంపతులం కూడా నోచుకున్నాము. ఈ నవల కారణంగా ఆ దృశ్యం మరోమారు మా మనోనేత్రాల ముందుకొచ్చి పులకరింజేసింది.
అదే విధంగా దాదాపు పన్నెండు గంటల పాటు మినీ బస్సులో ఒక పక్కన కాలా గండకి నది గలగలలు, మరోపక్క వందల అడుగుల లోతు లోయల్లో దుముకుతున్న జలపాతాల ధ్వనులను వింటూ ప్రాణాలు ఉగ్గబట్టుకుని వెళ్ళి, ఒకరోజు రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుని మరునాడు ఉదయమే ముక్తినాథ్ మందిరాన్ని దర్శించడం మాకో జీవితకాల అనుభవం. ఆ విధంగా ఈ నవలలో మేము ముఖ్యంగా నేను మమేకమైపోయాము.
కొత్త తరహా సాహిత్యాన్ని ఆస్వాదించే పాఠకులకు ఇదో గొప్ప నవలని ఖచ్చితంగా చెప్పొచ్చు.
ఇక అనువాదకురాలు నాగిని అప్పసాని గారి అనువాదం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్పిస్తుంది. ఆ కొండలు, లోయలు, పల్లెలు, వాళ్ళ సేవాభావం, కొండలు, లోయలు, సరస్సులకు సంబంధించిన అనేక పదాలను మన తెలుగు పాఠకులు అర్ధం చేసుకునేలా హృద్యంగా అనువదించారు. అందుకు వారు ఎంతైనా అభినందనీయులు.
ఇది ఛాయా పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు: 376 ; వెల: రూ.425/-లు. పుస్తకం కోసం సంప్రదించాల్సిన సెల్ నెం. 70931 65151.

-శిరంశెట్టి కాంతారావు.
98498 90322











