మంచు తెరల మధ్య మనిషి అన్వేషణ – ‘మెరుపు’ నవల

సాహిత్యంలో నోబెల్ బహుమతి అంటేనే ఒక ప్రత్యేకత. కానీ నార్వేజియన్ రచయిత యున్ ఫొస్సా శైలి అంతకంటే విలక్షణమైనది. అతి తక్కువ పదాలతో, అత్యంత లోతైన తాత్వికతను పండించడం ఆయన ప్రత్యేకత. ఆయన ‘మెరుపు’ నవలలో మనం చూసే ‘విరుపు’ (minimalism) తన ప్రతి రచనలోనూ ఒక సంతకంలా కనిపిస్తుంది.

ఆయన రాసిన ‘ఎ షైనింగ్’ (A Shining) నవల ఇప్పుడు ‘మెరుపు’ పేరుతో తెలుగులోకి రావడం మన పాఠకులకు ఒక అపురూపమైన అనుభవం. ఆకాశంలో మెరుపు క్షణకాలమే ఉన్నా కళ్లను ఎలా మిరిమిట్లు గొలుపుతుందో, ఈ చిన్ని నవల కూడా పాఠకుడి మదిలో అలాంటి ఒక శాశ్వత ముద్రను వేస్తుంది.

____________________

మూడు సంవత్సరాల క్రితం (2023లో) సాహిత్య నోబెల్ పురస్కారం అందుకున్న ఈ యున్ ఫొస్సా..నార్వే దేశస్తుడు. తను ఎన్నో నవలలు, నాటకాలు, కవితలు, పిల్లల పుస్తకాలు, వ్యాసాలు రాశాడు. ఉపాధ్యాయుడిగా, అనువాదకుడిగా కూడా పనిచేశాడు. నార్వేజియన్ స్థానిక భాషలో కూడా అనేక పుస్తకాలు వెలువరించాడు.
____________________

యున్ ఫొస్సా తన మాతృభాషలో రాసిన A Shining నవలను డేమియన్ సెరల్స్ ఆంగ్లంలోకి అనువదించగా, దానిని కుమార్ ఎస్. తెలుగులోకి ‘మెరుపు’ పేరుతో అనువాదం చేశారు. ఛాయా పబ్లికేషన్స్ వారు వెలుగులోకి తెచ్చి తెలుగు పాఠకులకు అందించారు. సంక్లిష్టమైన రచనా శైలిలో రాయబడిన ఈ నవలను కుమార్ ఎస్. ఎంతో ఇష్టంగా అనువాదం చేసిన ఆనవాళ్లు మనకు అడుగడుగునా కనబడుతుంటాయి.

పుస్తకం 1/8 క్రౌన్ సైజులో, 75 పేజీలు మాత్రమే ఉంటుంది. వేగంగా చదివే అలవాటున్న పాఠకులు ఓ అరగంటలో చదవగలరని అనుకుంటున్నాను. ఒక పాఠకుడిగా నేను కూడా ఇప్పటివరకు చాలా పుస్తకాలే చదివి ఉంటాను. ఆ పుస్తకాలన్నింటిలోనూ ఆయా రచయితలు తాము ఎంచుకున్న వస్తువుకు అనుకూలమైన ఏదో ఒక రచనా శైలిని అనుసరిస్తూ సంభాషణలు, సంభాషణలుగానో లేదా పేరాలు పేరాలుగానో, మరికొన్ని విధాలుగానో పదాలను పొందుపరుస్తూ తమ రచనలను కొనసాగించి, ముగిస్తుంటారు.

ఈ పుస్తకం అందుకు పూర్తి భిన్నంగా మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు ఎక్కడా పేరా బ్రేక్ లేకుండా, కేవలం కామాలు, ఫుల్ స్టాప్‌లను మాత్రమే ఉపయోగిస్తూ ఆద్యంతం ఒకే పేరాగా రాయబడింది. కథనంలో ‘చైతన్య స్రవంతి’ (Stream of Consciousness) పోలికలు కనబడినప్పటికీ, అది పూర్తిగా ఆ శైలిలోనే రాయబడిందని కూడా చెప్పలేము. కాకపోతే ఒక అంతర్జాతీయ స్థాయి పుస్తకాన్ని అరగంటలో చదివేశామన్న సంతృప్తిని మాత్రం పాఠకులకు తప్పకుండా మిగుల్చుతుంది. కథనం వలలో పడిపోయిన పాఠకుడు, అసలు ఇందులో కథ ఏమిటన్న సందిగ్ధతకు లోనుకాకుండానే చదివేయడమనేది నా స్వీయానుభవంలోకి వచ్చిన విశేషాంశంగా చెప్తున్నాను.

నేటి ఆధునికానంతరవాద శకంలో మనుషులు తోటి మనుషుల సాంగత్యం కన్నా ఒంటరి జీవితాలను గడుపుతూ లాంగ్ డ్రైవ్‌ల పేరిట వందల, వేల కిలోమీటర్ల దూరం ప్రయాణాలు చేస్తూ ఆస్వాదిస్తుండడం మన ఎరుకలోనిదే కదా?! ఈ నవలలో ఏకాంకి, ఏకపాత్రాభినయం మాదిరిగా ఒకే ఒక పాత్ర ఉంటుంది. నవల మొత్తం ఉత్తమ పురుష (First Person) కథన పద్ధతిలో కొనసాగుతుంది.

కథలోకి వెళ్తే.. కథానాయకుడు తన కారు తీసుకుని ఎంతో దూరం వెళ్తాడు. కారు అలా వెళ్ళీ వెళ్ళీ చివరికి ఓ దట్టమైన అడవిలో ఇరుక్కుపోయి ఇక ఏమాత్రమూ ముందుకు వెళ్లలేక ఆగిపోతుంది. దాంతో కారును అక్కడి నుండి రివర్స్ గేర్‌లో వెనక్కి తీసుకురావడం తప్ప, కుడికో, ఎడమకో తిప్పుకుని వెనక్కొచ్చే వీలులేనంత దట్టమైన అడవిలోపలికి వెళ్ళిపోతుంది.

క్రమక్రమంగా చీకటి అలుముకుంటుంది, మంచు కురుస్తుంటుంది. అడవి సవ్వడి కూడా వినిపించని స్థితిలో ఆ వ్యక్తి ఓ భ్రమాజనిత స్థితిలోకి (Hallucination) వెళ్లిపోతాడు. ఆ స్థితిలో తనకి ఎప్పుడో గతించిపోయిన తన తల్లిదండ్రులు అస్పష్టంగా కనిపిస్తూ పలకరిస్తారు, మాట్లాడుతారు. అదంతా ఓ మార్మిక అనుభవం (Mystical Experience) తాలూకు ఛాయ. ఆ అనుభవాన్ని ఆస్వాదించడమే తప్ప వ్యక్తీకరించలేనిది. అటువంటి మరో లోకపు అనుభూతిని పాఠకుడికి పరిచయం చేసిన కొత్త తరహా నవల ‘మెరుపు’.

ఈ నవల చదువుతున్నంత సేపు నాకో వింత అనుభూతి కలిగింది. సాధారణంగా ఏ కథకైనా ఒక ముగింపునో, ఒక స్పష్టమైన అర్థాన్నో ఆశిస్తాం. కానీ ‘మెరుపు’ అలా కాదు; ఇది అర్థం చేసుకోవడం కంటే అనుభవించాల్సిన నవల. ఆ దట్టమైన అడవిలో కారు ఆగిపోయినప్పుడు, మంచు కురుస్తున్నప్పుడు కలిగే ఆ చలి, ఆ ఒంటరితనం పాఠకుడికి కూడా సోకుతుంది. బహుశా ఆ అడవి మన ‘జీవితం’ అనుకుంటే..అందులో చిక్కుకుపోయిన కారు మన ‘శరీరం’. ఆ మంచు తెరల మధ్య కనిపించే రూపాలు మన అంతరాత్మలోని జ్ఞాపకాలు కావచ్చు. చీకటిని చూసి భయపడే మనిషికి, ఆ చీకటిలోనే ఒక అద్భుతమైన ‘మెరుపు’ లాంటి వెలుగు కనిపిస్తుందన్న తాత్వికత నన్ను బాగా కదిలించింది.

మనం ఎక్కడి నుండి వచ్చాం? ఎక్కడికి వెళ్తాం? అనే ప్రశ్నలకు రచయిత సమాధానాలు చెప్పలేదు, కానీ ఆ ప్రశ్నల చుట్టూ ఒక అందమైన మార్మిక వలయాన్ని సృష్టించారు. ఈ నవల చదువుతుంటే.. నాకు మహాభారతంలోని ఒక సన్నివేశం గుర్తొచ్చింది. యుద్ధానంతరం భర్తలను కోల్పోయిన భార్యలు పలువురు వ్యాసుని దగ్గరకు వెళ్లి ఒక్కసారి మా భర్తలను మాకు చూపించమని అభ్యర్థించారట. వారి అభ్యర్థనను మన్నించిన వ్యాసుడు ఓ రోజు గంగానదీ ప్రవాహ మధ్యంలోకి మృత వీరులందరినీ సజీవులుగా రప్పిస్తాడట. సూర్యాస్తమయం తరువాత వారంతా తమ తమ స్త్రీలతో సహా అంతర్థానమైపోతారు. దానికి కొనసాగింపా అన్నట్టు నేటికీ బెంగాల్ ప్రాంతంలో కొన్ని చోట్ల, వితంతు స్త్రీలు ఓ ప్రత్యేకమైన రోజున నావల్లో గంగానదీ మధ్యలోకి వెళ్లి నీటిలో దూకి ఆత్మార్పణం చేసుకుంటారట.

ఆవలి ప్రపంచపు అస్పష్ట దర్శనం అనే ఒక సంప్రదాయానికి సంబంధించి, స్థల కాలాలకు అతీతమైన విషయాన్ని ఎక్కడో నార్వే దేశంలోని మారుమూల ప్రాంతాల్లో, అక్కడి వారి స్థానిక భాషల్లో అనుశ్రుతంగా వస్తున్న జానపద గాథలను పరిశోధించిన అనుభవంతో రచయిత యున్ ఫొస్సా ఈ ‘మెరుపు’ ను కల్పన చేసి పాఠకులకు అందించాడేమో అనిపించింది. దానికి అనుబంధంగా మహాభారత గాథలో ఉన్న సారూప్య సన్నివేశం నాకు గుర్తుకొచ్చి జోడించాను.

చిన్నదైనా చాలాకాలం పాటు పాఠకులకు గుర్తుండిపోయే నవల ‘మెరుపు’. నూతన ఒరవడిలో రచనలు సాగించాలనుకునే రచయితలకు ఇదొక విలువైన పుస్తకం.

ఫొస్సా రచనలలోని అభివ్యక్తి సౌందర్యం: ఆయన ఇతర ప్రముఖ రచనలలో పదాల కంటే ఎక్కువగా ‘నిశ్శబ్దానికి’ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన నాటకాల్లో పాత్రలు చాలా తక్కువగా మాట్లాడతాయి. ఆగి ఆగి మాట్లాడటం (Pauses), ఒకే మాటను పదే పదే అనడం ద్వారా…మనుషుల మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్‌ని, చెప్పలేకపోయే భావాలను (The Unsayable) అద్భుతంగా పట్టుకుంటారు. అందుకు ఒక ఉదాహరణ ‘సెప్టాలజీ’ (Septology). ఇది ఆయన మాస్టర్ పీస్ అని చెప్పవచ్చు. ఏడు భాగాలుగా ఉన్న ఈ సుదీర్ఘ నవలలో ఒక్కటంటే ఒక్క ‘ఫుల్ స్టాప్’ కూడా ఉండదు. కథ మొత్తం ఒక నిరంతర ప్రవాహంలా (Stream of Consciousness) సాగుతుంది. ‘అస్లే’ అనే చిత్రకారుడి జీవితం చుట్టూ తిరిగే ఈ కథలో..లౌకిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక లోకానికి మధ్య ఉండే అస్పష్టమైన రేఖను ఆయన తన శైలితో ఆవిష్కరించారు.

ఆయన వాక్యాలు ఒక మంత్రంలా రిథమిక్‌గా ఉంటాయి. ఒకే వాక్యాన్ని కొంచెం మార్చి మళ్ళీ మళ్ళీ రాయడం ఆయన అలవాటు. ఇది చదువుతున్నప్పుడు పాఠకుడిని ఒక రకమైన హిప్నాసిస్ (Hypnosis) లేదా ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తుంది. ఉదాహరణకు ఆయన ‘ట్రిలోజీ’ (Trilogy) లో పేదరికం, ప్రేమ, మరణం వంటి అంశాలను ఈ శైలిలోనే చర్చించారు.

____________________

చాలావరకు ఆయన రచనల్లో పాత్రలకు పేర్లు ఉండవు. “అతడు”, “ఆమె”, “ముసలివాడు” అని మాత్రమే సంబోధిస్తారు. దీనివల్ల ఆ కథ కేవలం ఒక వ్యక్తిది మాత్రమే కాక, అది అందరి కథగా (Universal experience) మారిపోతుంది. ఆయన రచనల్లో తరచుగా వెలుగు-చీకటి, సముద్రం, వర్షం వంటి ప్రతీకలు కనిపిస్తాయి. ‘మార్నింగ్ అండ్ ఈవెనింగ్’ (Morning and Evening) వంటి నవలల్లో మనిషి జననం నుండి మరణం వరకు ఉండే ప్రయాణాన్ని అతి సామాన్యమైన రోజువారీ పనుల ద్వారానే ఎంతో లోతుగా చూపిస్తారు.
____________________

మొత్తంగా చెప్పాలంటే, ఫొస్సా రచనలలోని అభివ్యక్తి మనల్ని కథలో ఉన్న సంఘటనల కంటే, ఆ పాత్రల ‘అంతరంగ మథనం’ లోకి ఎక్కువగా లాగుతుంది.

(ప్రచురణ: ఛాయా పబ్లికేషన్స్ ,పేజీలు: 75, వెల: రూ. 150/-. పుస్తకం కోసం 98480 23384లో సంప్రదించవచ్చు

 

 

-శిరంశెట్టి కాంతారావు
98498 90322