కె. సభా తనదైన ఆలోచనా ధోరణితో, సామాజిక స్పృహతో కూడిన రచనల ద్వారా సాహిత్య వేదికపై ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రచయిత. ఆయన రచనల్లో వ్యక్తి జీవితంలోని సూక్ష్మ భావోద్వేగాలు, సమాజంలోని అంతర్లీన సమస్యలు సహజంగా మిళితమై కనిపిస్తాయి. అతిశయోక్తులు లేకుండా, నిగ్రహంతో కూడిన భాషలో విషయాన్ని ఆవిష్కరించడం సభా రచనా శైలికి ముఖ్య లక్షణం. కథ, వ్యాసం, విమర్శ—ఏ రూపాన్ని ఎంచుకున్నా, ఆ రచన పాఠకుడిని ఆలోచింపజేసే శక్తి కలిగి ఉంటుంది. ప్రాంతీయ జీవనానుభవాలను, కాలానుగుణమైన ప్రశ్నలను సాహిత్య రూపంలో మలచగలిగిన రచయితగా సభా సమకాలీన సాహిత్యంలో గమనించదగిన స్థానం సంపాదించారు. రాయలసీమ సాహిత్య ప్రస్థానంలో కె. సభా పేరు ఒక వ్యక్తిగత గుర్తింపుకే పరిమితం కాదు. అది ఒక ప్రాంతపు సామాజిక అనుభవానికి, రైతాంగ వేదనకు, ఉద్యమాత్మక చైతన్యానికి ప్రతీక.
_____________________
ముందుతరం రాయలసీమ రచయితలలో నాకు పరిచయమైన తొలి బాలసాహితీవేత్త కె. సభా. ఆయనది ప్రత్యేక స్వరం. ఆర్భాటం లేని వ్యక్తిత్వం, నేలమీద నిలబడ్డ చూపు, మాటకన్నా మౌనానికే విలువిచ్చే స్వభావం. ఇవన్నీ ఆయన సహజ రచనా ధోరణికి మూలాధారాలు. సమాజాన్ని దూరం నుంచి వీక్షించే రచయిత కాదు సభా. దగ్గరకు వెళ్లి, లోపలికి తొంగిచూసి, అనుభవాన్ని అక్షరాలుగా మార్చిన సజీవ రచయిత.
______________________
1923 జూలై 1న చిత్తూరు జిల్లా కొట్రకోన గ్రామంలో చెంగల్వరాయుడు, పార్వతమ్మ దంపతులకు జన్మించిన సభా, బాల్య దశ నుంచే గ్రామీణ జీవన సత్యాలను ఎదుర్కొన్నారు. వీధి బడులు నిర్వహించిన తండ్రి ప్రభావంతో విద్య పట్ల ఆసక్తి పెరిగింది. ఎనిమిదో తరగతి వరకే చదివినా, ఆపై ఉపాధ్యాయ శిక్షణ పొంది, కేవలం 16 ఏళ్ల వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు విద్యాభ్యాసాన్ని కొనసాగించి బి. ఏ పూర్తి చేశారు.
ఉపాధ్యాయుడిగా గ్రామీణ సమాజంతో ఏర్పడిన అనుబంధమే ఆయన రచనలకు జీవాత్మగా మారింది. సభా చుట్టూ ఉన్న రైతు కూలీలు, పేద రైతులు, గ్రామీణ వృత్తులవారు, దళితులు, స్త్రీలు, పిల్లలు అనుభవిస్తున్న కష్టాలు ఆయనను తీవ్రంగా కలచివేశాయి. 1947లో శివగిరిలో నిర్వహించిన రైతాంగ విద్యాలయం ద్వారా రైతుల జీవన సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన ఏర్పడింది. స్వయంగా కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసి, పంటల్ని పండించిన అనుభవం రైతు కష్టాలను కేవలం కథల విషయంగా కాకుండా వ్యక్తిగత అనుభూతిగా మలిచింది. మద్యనిషేధం ఎత్తివేతతో దళిత జీవితం ఛిన్నాభిన్నమవడం, దళిత స్త్రీల యాతనలు, భూగర్భజలాలు అంతరించటం, ప్రకృతి విధ్వంసంతో పాటు కుప్ప కూలిపోయిన వ్యవసాయం, ఉపాధి కోల్పోయిన వృత్తులు – ఈ సమస్త పరిణామాలు స్వాతంత్య్రానంతర సమాజ సంక్షోభంగా సభా రచనల్లో ప్రతిఫలించాయి.
1940లో రచనా జీవితాన్ని ప్రారంభించిన సభా, మొదట కథా ప్రక్రియలో అడుగుపెట్టి, అలంకారాల్లేని సరళమైన శైలితో పాఠకులను ఆకర్షించారు. కథ చెప్పడమే కాకుండా, కథ ద్వారా సమాజాన్ని ప్రశ్నించడమే ఆయన రచనా లక్ష్యం. ఆయన చిత్త శుద్ధితో సహజత్వాన్ని రంగరించి సుమారు 300 కథలు, 7 నవలలు, పిల్లలు–పెద్దల కోసం అనేక గేయాలు, నాటకాలు రాసారు. ఎనలేని ఆయన సాహిత్య సంపదలో బంగారు, పాతాళగంగ, నీటిదీపాలు వంటి కథా సంకలనాలు; భిక్షుకి, మొగిలి, దేవాంతకులు వంటి నవలలు ఆయన రచనా వైశాల్యాన్ని చాటుతాయి.
బాలసాహిత్యంలో సభా చేసిన కృషి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అరగొండ కథలు, సీసాచరిత్ర, ఐకమత్యం, చిలకమ్మ, బొంగరం, ప్రాచీన భారతి, విప్లవగాథలు వంటి కథా సంకలనాలు; మత్స్యకన్యలు, సూర్యం, చంద్రం, పసిహృదయాలు, బుజ్జి బుజ్జి పావురాలు వంటి పిల్లల నవలలు పిల్లల మనసులకు దగ్గరగా రాసినవి. ఆయన రాసిన బాలల నాటకాలు, బుర్రకథలు కూడా సామాజిక చైతన్యంతో నిండి ఉన్నాయి.
‘పిచ్చిదంపతులు’ కథ సమాజానికి ప్రేమగల మనుషుల అవసరాన్ని హృదయ విదారకంగా గుర్తు చేస్తుంది. ‘అంబా’ కథ రాయలసీమ కరువు నేపథ్యంతో రాసిన విషాదాంత గాథగా పాఠకుణ్ణి వెంటాడుతుంది. ‘అంతరంగం’ కథ గ్రామీణ జీవితం, రైతుల కడగండ్లు, కవుల కృతక కావ్యరచనపై పదునైన వ్యంగ్య విమర్శ. ‘చుక్కలవరాలు’ కథలో అచ్చమైన దేశీయత స్పష్టంగా దర్శనమిస్తుంది. సభా కథల్లో ఆదర్శ వాస్తవికత, కఠిన విమర్శనా వాస్తవికత, ప్రజాస్వామ్య వ్యవస్థలోని లోపాలపై స్పష్టమైన అవగాహన కనిపిస్తుంది.
సభా రచయితగా మాత్రమే కాదు, సాహిత్య సంస్థల నిర్మాణ కర్తగా కూడా విశేష పాత్ర పోషించారు. శ్రీరమణ పబ్లికేషన్స్‌ను స్థాపించి ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించారు. శారదాపీఠం ద్వారా కళాకారులకు అండగా నిలిచారు. చిత్తూరు జిల్లా రచయితల సంఘం, రచయితల సహకార ప్రచురణ సంఘం, కళాపరిషత్తు వంటి సంస్థలను స్థాపించి జిల్లాలో సాహిత్య–సాంస్కృతిక వాతావరణాన్ని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా పనిచేశారు. 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రభుత్వ సత్కారం పొందారు.
____________________
అలంకారభరితమైన భాషకు దూరంగా, వాస్తవాన్ని తడిమే సరళమైన సహజ శైలి సభా రచనల ప్రధాన బలము. కథనంలో చెక్కుచెదరని దేశీయత, పాత్రల చిత్రణలో నిబద్ధత, వాతావరణ నిర్మాణంలో సహజత్వం ఆయన రచనలకు దీర్ఘకాలిక విలువను అందించాయి. గాంధేయ జాతీయవాద స్ఫూర్తి ఆయన రచనల అంతర్లీన ప్రవాహంగా కొనసాగింది. రాయలసీమ పల్లెపట్టుల బాధలు, రైతుల కన్నీళ్లు, దళితుల జీవన సంఘర్షణలను అక్షరాలుగా మలిచిన రచయితగా కె. సభా కృషి అనన్యసామాన్యం. ఒక ప్రాంతపు సామాజిక చరిత్రను సాహిత్యంగా మలిచిన రచయితగా ఆయన స్థానం అచంచలమైనది. అందుకే కె. సభా – రాయలసీమ రైతాంగ సాహిత్య వైతాళికుడు.
_____________________
సభా రచనల్లో కనిపించే ఈ ఇతివృత్తాలు కేవలం ప్రాంతీయ పరిమితుల్లోనే నిలిచిపోవు; అవి సమకాలీన భారత సమాజం ఎదుర్కొంటున్న విస్తృత సమస్యలకు ప్రతిబింబాలుగా మారతాయి. పాత్రల చిత్రణలో ఆయన చూపిన మానవీయ స్పర్శ, సంఘర్షణలను అతి లేకుండా ఆవిష్కరించే ధోరణి పాఠకుణ్ణి కథలో భాగస్వామిని చేస్తుంది. సంఘటనల క్రమం సహజంగా సాగుతూనే, ఆలోచనలకు తావిచ్చే విధంగా కథలు ముందుకు సాగుతాయి. సభా కథనంలో భావోద్వేగం నేరుగా హృదయాన్ని తాకుతుంది; అదే సమయంలో చైతన్యాన్ని రగిలించే ప్రశ్నలను మౌనంగా ముందుంచుతుంది. అందుకే ఆయన రచనలు వినోదం మాత్రమే కాదు, సామాజిక బాధ్యతను గుర్తుచేసే సాహిత్యంగా నిలుస్తాయి. దేశీయతతో కూడిన శిల్పం, సామాజిక బాధ్యత, నిజాయితీగల స్వరం ఆయనను తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిపాయి.

-మహాసముద్రం దేవకి
99632 95997











