సాధారణంగా ఏదైనా సినిమా విడుదలవుతుందంటే టీజర్, ట్రైలర్ల కోసం ఎదురుచూడటం మనకు తెలుసు. కానీ, ఏ విధమైన ప్రచార ఆర్భాటాలు అక్కర్లేకుండానే, శనివారం వస్తోందంటే చాలు ‘విశాలాంధ్ర’లో వచ్చే ‘చక్రవాకం’ కాలమ్ కోసం వేలమంది పాఠకులు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అక్షరానికి ఉన్న శక్తి అటువంటిది.
సాధారణంగా ఒక వ్యక్తి సమూహంలో కలిసిపోవడం సహజం. కానీ, ఒక సమూహం మొత్తాన్ని ఒక వ్యక్తిగా భావించి, వారిని చేరదీసి, హితవు చెప్పడం ఆధునిక సాహిత్యం చేయాల్సిన ప్రధానమైన పని. ఒకవేళ సాహిత్యం ఆ పని చేయకపోతే, ఎవరో ఒక నిర్దేశకుడు తాను నమ్మిన సిద్ధాంతాన్ని చెబితే అదే నిజమని మనం భ్రమపడే ప్రమాదం ఉంది. అప్పుడు మనం కేవలం ఉద్వేగాల ఉచ్చులో చిక్కుకుంటాం. సమాచారమే మన బలం కావాలి కానీ, అది ఏకపక్షంగా ఉంటే మాత్రం అసమంజసమవుతుంది.
చక్రధర్ గారి వ్యాసాలు వ్యక్తి-సమూహం, క్రీడ-సినిమా, పుస్తకం-సామాజిక సేవ వంటి ఏ అంశాన్ని తీసుకున్నా, దానిని గతంతోనూ, వర్తమానంతోనూ అనుసంధానిస్తూ కూలంకషంగా వివరిస్తాయి. ఆయన అక్షర విన్యాసం ఒక మాయాజాలంలా సాగుతుంది. వ్యాసంలోని శీర్షిక నుండి ముగింపు వరకు పాఠకుడిని కదిలించేలా, ఏకబిగిన చదివించే ‘రీడబిలిటీ’ (Readability) ఇందులో ఉంటుంది. ఆ వాక్యాలు భావోద్వేగాలతో నాట్యం చేస్తాయి. అందులోని ప్రశ్నలు పాఠకుడి మేధస్సును సవాలు చేస్తాయి. వారమంతా పని ఒత్తిడిలో నలిగిపోయి, పై అధికారులు ఏం చెప్పినా తలలూపే వారికి ఈ వ్యాసాలు ఒక ‘ఎనర్జీ బూస్టర్’ లా పని చేస్తాయి. వృద్ధులను గౌరవించండి, పిల్లలను జాగ్రత్తగా పెంచండి వంటి పాతకాలపు నీతి సూత్రాలు ఇందులో ఉండవు. నేటి ఇరవై ఐదేళ్ల యువత కూడా ప్రతి వాక్యాన్ని ఆస్వాదించేలా ఈ వ్యాసాల శైలి ఉంటుంది.
____________________
నిజానికి సాహిత్య వ్యాసాల్లో వస్తువు, సంవిధానం, శైలి, నేపథ్యం, సామాజిక స్పృహ మరియు వైయక్తిక అనుభూతి ఉండాలని ఒక లెక్క ఉంది. చక్రధర్ గారి వ్యాసాల్లో వీటన్నిటితో పాటు సాక్ష్యాధారాలు, ఖచ్చితమైన తేదీలు, యథాతథ సంభాషణలు మరియు పాత వార్తాపత్రికల శీర్షికలు కూడా పాఠకుల ముందు ప్రత్యక్షమవుతాయి. ఆయన అద్భుతమైన జ్ఞాపకశక్తి, రిలేటబిలిటీ పాఠకులను ఆశ్చర్యపరుస్తాయి. ఆయన రాసిన ఈ కాలమ్స్ కేవలం వార్తాపత్రిక ముక్కలుగా మిగిలిపోకుండా గొప్ప సాహిత్య వ్యాసాలుగా ఎందుకు మారాయో పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
__________________
చక్రధర్ గారు తన ప్రతి వ్యాసంలోనూ కనీసం ఇద్దరు తెలుగు రచయితలను, ముగ్గురు విదేశీ రచయితలను ఉదాహరిస్తారు. వారి రచనల్లోని అత్యుత్తమ వాక్యాలను హాల్‌మార్క్ ముద్రలా వ్యాసంలో పొందుపరుస్తారు.
. ఏదైనా కవిత్వం లేదా సినిమా గురించి రాసేటప్పుడు కేవలం కొటేషన్లు ఇచ్చి వదిలేయకుండా, ఆ రచయిత జీవిత ప్రయాణం, సామాజిక నేపథ్యం మరియు ఆ రచన యొక్క ఆవశ్యకతను వివరిస్తారు. ఉదాహరణకు, తెలంగాణ ఆధునిక కథా వైతాళికుడు అల్లం రాజయ్య గారి గురించి చెబుతూ.. ఆయన బెర్టాల్ట్ బ్రెచ్ట్ లాగా చీకటి రోజుల గురించి గానం చేస్తారని, మాక్సిమ్ గోర్కీ లాగా విచ్ఛిన్నమవుతున్న మానవ వ్యక్తిత్వం గురించి వర్ణిస్తారని పోలుస్తారు. మనిషి మరియు సమాజం కలిసి ప్రయాణిస్తూ ఒకరినొకరు ఎంతగా గాయపరుచుకున్నారో ఈ కథకుడు వివరిస్తాడని చక్రధర్ గారు విశ్లేషించిన తీరు చూస్తే, ఆయన అల్లం రాజయ్య గారి సమగ్ర రచనలను ఎంతగా పరిశీలించారో అర్థమవుతుంది.
. ప్రజల కోసం ఎవరినైనా ఎదిరించిన బాలగోపాల్, త్రిపురనేని శ్రీనివాస్ వంటి వారిని ఆయన ఆధునిక సాహితీ విప్లవ వీరులుగా కొనియాడతారు. త్రిపురనేని శ్రీనివాస్‌ను ‘కవిత్వ కార్యకర్త’ అని, వరవరరావు గారిని ప్రపంచ స్థాయి నాయకుడని సంబోధిస్తారు. బమ్మిడి జగదీశ్వరరావు నగరం (కాంక్రీట్ జంగిల్) లో ఉంటూ కూడా అమ్మ మాటల్లోని ఆర్తిని జీవమున్న కథలుగా మలిచారని చెబుతారు. ప్రజా కవి గద్దర్ గురించి చెబుతూ, అందరూ డబ్బు వెనకేసుకునే కాలంలో ఆయన తన ఒంట్లోకి నాలుగు బుల్లెట్లను వెనకేసుకున్న ఏకైక వాగ్గేయకారుడని అద్భుతంగా వర్ణిస్తారు.
అలాగే బి.వి.వి. ప్రసాద్ కవితల్లో మార్మికత కంటే జీవన తాత్వికత ఎక్కువగా ఉంటుందని గుర్తిస్తారు. ఎండ్లూరి సుధాకర్ గారి గురించి చెబుతూ, ఆయన తన జీవధర్మాన్ని అనుసరించి వెళ్ళిపోయినా, ఆయన కవిత్వం మాత్రం ‘నల్ల ద్రాక్ష పందిరి’ నీడలో ఆచంద్రతారార్కం నిలిచిపోతుందని భావుకతతో రాస్తారు. ఆత్మకథా ప్రక్రియలో దళిత జీవితాలను అద్భుతంగా చిత్రించి ఆయన ఒక మల్లెమొగ్గల గొడుగు అయ్యారని ప్రశంసిస్తారు. ఇటువంటి పోలికలు కేవలం గుండె లోతుల్లోంచి మాత్రమే కాదు, మేధస్సులోని లోపలి పొరల్లో నిరంతరం సాగే సౌందర్యారాధన మరియు సత్యశోధన వల్లనే సాధ్యమవుతాయి. ఈ వాక్యాల చిక్కదనం పాఠకుడిని ఒక కుదుపుకు గురిచేసి, మంచి సాహిత్యం కోసం అన్వేషించేలా ప్రేరేపిస్తుంది. ఇదే నిజమైన సాహిత్య వ్యాసం చేసే పని.
. కొన్ని వ్యాసాలను ఆయన నెగిటివ్ వాక్యాలతో ప్రారంభించి పాఠకుడిని ఆకర్షిస్తారు. కాశీభట్ల వేణుగోపాల్ గారిని పరిచయం చేస్తూ ‘శాపగ్రస్త జన్మ, తెలుగు లోగిలిలో పుట్టుక’ అని రాయడం దీనికి ఉదాహరణ. ఫ్రెంచ్ రచయిత్రి అనీ ఎర్నాక్స్ రచనల్లోని ధైర్యానికి నోబెల్ బహుమతి వస్తే, యూరప్ దేశాలు స్వర్గతుల్యమని భావించే పర్యాటకులకు ఆమె తన రచనల ద్వారా ‘మీరు చూసే లోకం వేరు, వాస్తవ లోకం వేరు’ అని హెచ్చరించారని చక్రధర్ గారు పేర్కొంటారు.
విమల మోర్తల గారి కవిత్వం గురించి విశ్లేషిస్తూ, స్త్రీ శరీరాన్ని కేవలం కొలతలతో చూసే పురుషుల ఆలోచనా ధోరణిని తన వాక్యాలతో నిలదీస్తారు. కె.ఎన్.వై. పతంజలి గారిని ‘మెదడులో పెన్నులతో పుట్టినవాడు’ అని నిర్వచిస్తూ, ఆయనను సాహిత్యబ్రహ్మగా అభివర్ణిస్తారు. ఒక జాకీర్ హుస్సేన్ అయినా, గుల్జార్ అయినా వారితో తనకున్న అనుబంధాన్ని ఎంతో అందంగా మలుస్తారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారిని ఉత్తరాంధ్ర ప్రజలు ‘ఛాత్రి బాబు’ అని పిలుచుకునేవారని, ఆయన న్యాయవాదిగా గిరిజనులకు ఎలా అండగా ఉండేవారో వివరిస్తారు. ఇలా రాయడం వల్ల పాఠకులకు ఆయా రచయితల అంతరంగం మరియు వారి సిద్ధాంతాలు సులభంగా అర్థమవుతాయి.
స్త్రీవాద కవిత్వ సంకలనం ‘నీలి మేఘాలు’ గురించి రాస్తూ, ఆ పుస్తకం తెలుగు సాహిత్యాన్ని ఎంతగా కుదిపిందో వివరిస్తారు. “ఎటు నిలబడతావో చెప్పు” అంటూ ఆ పుస్తకం తెలుగు సమాజాన్ని కాలర్ పట్టుకుని అడిగిందని, ఆ కాలంలో మహిళలు కాలర్లు ఉన్న చొక్కాలు వేసుకునేవారు కాదు కాబట్టి, ఆ కాలర్లన్నీ పురుషులవేనని ఆయన చేసే చమత్కారం ఆలోచింపజేస్తుంది. అలాగే చిత్రకారుడు తల్లావఝ్జుల శివాజీ, కథకుడు ఖదీర్ బాబుల గురించి చెబుతూ, వారు మహానగరంలో ఉన్నప్పటికీ వారిలో ఇంకా నిష్కల్మషమైన పసి హృదయ వాసనలు ఉన్నాయని ఆవిష్కరిస్తారు.
_____________________
పత్రికల్లో వచ్చే సాధారణ కాలమ్స్ కు భిన్నంగా, నాస్టాల్జియాను మరియు పాఠకులకు అవసరమైన హెచ్చరికలను జారీ చేయగల పదునైన కలం చక్రధర్ గారిది. ఈ వ్యాసాలను చదవకపోతే, చక్రధర్ గారి ‘మూడో కన్ను’ ద్వారా మనం చూడగలిగే ప్రపంచ స్వరూపాన్ని కోల్పోతాం. వారం వారం పత్రికలో చదవలేకపోయినా, ఇప్పుడు పుస్తక రూపంలో వచ్చిన ఈ సంపుటిని తప్పక చదవాలి. ఇది యువతకు ఒక గొప్ప బహుమతి కూడా.
____________________
చక్రధర్ గారు గతంలో జర్నలిస్టుగా కూడా పనిచేయడం వల్ల, ఈ వ్యాసాల్లో కేవలం పొగడ్తలు కాకుండా వాస్తవాలు కనిపిస్తాయి. భాషకు అలంకారాలైన ఉపమ, ఉత్ప్రేక్షల కంటే వాస్తవ చిత్రణకే ఆయన ప్రాధాన్యతనిచ్చారు. నేటి కాలంలో డీప్ ఫేక్, కృత్రిమ మేధ (AI) సృష్టిస్తున్న అసహజ రచనల మధ్య, ఏది కవి మనసులోంచి వచ్చిందో తెలియని అయోమయం నెలకొంది. ఇటువంటి సమయంలో నిఖార్సైన సాహిత్యాన్ని, జీవితంలోని ఎండలను, చలిని అర్థం చేసుకోవడానికి ఈ ‘మూడో కన్ను’ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉంది.

డా౹౹ కాళ్లకూరి శైలజ
98854 01882











