శరీరమంతా కవిత్వమే తానై.. విమర్శే ఊపిరిగా జీవిస్తున్న అరుదైన సృజనకారుడు రాధేయ. పుస్తకాలకు పటిష్టమైన ముందుమాటలు రాసే ప్రక్రియలో రాధేయది ఒక ప్రత్యేకమైన శైలి. నిజానికి ఒక పుస్తకానికి పీఠిక రాయడానికి కావాల్సిన అసలైన పనిముట్టు ఏమిటో నాకు సరిగ్గా తెలియదు కానీ, రాధేయ మాత్రం తన తాజా విమర్శా గ్రంథం “అలజడి మా జీవితం” కోసం నాదైన ఒక మాట ఉండాలని కోరారు. చేరా (చేకూరి రామారావు) గురించి గతంలో ఎవరో అన్నట్లు, రాధేయ ఏం రాసినా, ఎప్పుడు రాసినా అది ఆరిన మంచి గంధపు పూత మీద చందన చర్చ చేసినట్లే ఎంతో సుగంధభరితంగా ఉంటుంది. అలజడి రేగినప్పుడు మాత్రం రాధేయ కవిత్వం అనంత వీధిలో ఒక కవి అశ్రు ప్రవాహమై తనని తాను మండించుకుంటూ పాఠకుడిని మేల్కొలుపుతుంది. మనిషిని కలిసినట్లుండే కవిత్వం రాసే రాధేయ, అంతే ఆర్ద్రతతో విమర్శ కూడా రాస్తారు.
___________________
జీవితంలో స్తబ్దత ఏర్పడినప్పుడో, జడత్వం ఆవరించినప్పుడో, జనజీవనంలో అలజడి ఆందోళనలు కమ్ముకున్నప్పుడో మనల్ని నిస్తేజం నుండి కాపాడేది కవిత్వమే. అడవులు ఎండిపోయి, మనుషులు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక వాన జల్లులా, ఒక కొండవాగులా జలజలా ప్రవహించే శక్తి కవిత్వానికి ఉంది. కవిత్వం అనేది కవుల హృదయోదరాల్లో రేగే బడబానలం. ఆ బడబానలం లాంటి కవిత్వం మొదట కలిగించేది అలజడే.
______________________
అగమ్యగోచరమైన పరిస్థితుల్లోంచి, అగ్నిపర్వతం నుంచి వెలువడే లావాలా ఉబికి ఉబికి వచ్చేదే కవిత్వం. అదొక అగ్నిధార, అదొక సూటి ప్రశ్న, అదొక తీవ్రమైన ధిక్కారం. ఈ ప్రశ్నలు, ధిక్కారాలు కలిగించేది కూడా అంతిమంగా ఒక సామాజిక అలజడే.
అవిశ్రాంతంగా రాస్తున్న కవుల జీవితాల్లో అలజడి లేకుండా ఉండదు. ‘అలజడి మా జీవితం’ అంటున్న కవుల కవిత్వాన్ని విమర్శించడానికి పూనుకున్న విమర్శకుడి జీవితంలో కూడా అలజడి ఉండటం సహజం. విమర్శకుడు, కవి అయిన రాధేయ జీవితంలో విధి రేపిన అలజడులు అనేకం. ఆయన రాసిన కవిత్వ సంపుటాలెన్నో, ఆయన జీవిత ప్రస్థానంలో తగిలిన ఎదురుదెబ్బలు కూడా అన్ని ఉన్నాయి. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, లోకం కోసం పరిమళించే నిత్యం రగిలే ఒక కవితాగ్ని రాధేయ. కవిత్వంలో జ్వలించే సత్యాలను ఇప్పటికే ఎనిమిది విమర్శనా గ్రంథాలుగా అందించినా, ఆ తపన చల్లారకపోవడం వల్లనే ఇప్పుడు తన తొమ్మిదో విమర్శనా పుస్తకాన్ని మన ముందుకు తెస్తున్నారు.
సృజనాత్మక కళ అయిన కవిత్వానికి విమర్శ ఒక దారిదీపం. కవుల కవితా ప్రపంచం వెనుక దాగి ఉన్న అదృశ్య సత్యాలను చదువరులు దర్శించేటట్లు చేసే కళే విమర్శ. కవికి కలిగే బాహ్య ప్రపంచపు అలజడిని, కవి లోపలి ప్రశాంతతతో అనుసంధానించే ఒక వంతెన విమర్శకుడు. అటువంటి విమర్శకులు మన సాహిత్యంలో కొందరే ఉన్నారు. ఆ కొందరిలో అవిశ్రాంత కవి రాధేయ ఒకరు. కాళ్ల కింద నలుగుతున్న ఎండుటాకుల చప్పుళ్లను మాత్రమే కాదు, నిరంతరం ప్రకంపించే రుద్రవీణ తీగలు తెగిన చప్పుళ్లను కూడా వినగల సునిశిత దృష్టి ఆయనది. తన జీవితంలో విధి రేపిన అలజడులకు అనుగుణంగా మానవీయ వీణను ఎలా శృతి చేశారో, అలాగే రాయలసీమ కవుల కవిత్వ విశ్లేషణ వీణను కూడా ఈ గ్రంథంలో ఎంతో నేర్పుగా మీటారు.
కొందరు సీమ కవుల కవితల్లో దాగి ఉన్న అంతరార్థాలను వెతకడం, ఆ కవితల్లోని పదబంధాలను, ఎత్తుగడలోని వైచిత్రిని పసిగట్టి చెప్పడం రాధేయ ఈ పుస్తకంలో చేశారు. కవుల జీవితాన్ని అవసరమైన విషయాలతో తడుముతూనే, వారి కవిత్వపు మెరుపులను పాఠకులకు పరిచయం చేశారు. తన ప్రతిపాదనలకు బలాన్ని చేకూర్చడానికి సందర్భోచితంగా ఇతర ప్రముఖ కవులను ఉటంకించడం ఆయన శైలి. రాధేయ చేసే విమర్శ కవిని తన్మయత్వానికి గురిచేస్తుంది. కవిత్వ పాదాల సౌందర్యానికి, శిల్ప చమత్కారానికి తానూ మైమరిచి, మనల్ని కూడా మురిపించేటట్లు రాస్తారు. ఇది విమర్శకుడిగా కొంత సానుకూల బలహీనతే అయినా, కొత్తగా రాస్తున్న కవులను మళ్లీ మళ్లీ రాయడానికి ఇది గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంది. చదువరుల విమర్శనా శక్తిని, వారిలో సరైన అభిరుచిని పెంచే అదనపు బాధ్యతను కూడా రాధేయ విమర్శ నెరవేరుస్తోంది.
ఈ పుస్తకంలో సడ్లపల్లి, లోసారి సుధాకర్, మల్లెల నరసింహమూర్తి, ఎస్.జి.డి, ప్రగతి, కొత్తపల్లి సురేష్, యాములపల్లి నర్సిరెడ్డి, రాఘవేంద్ర, గండికోట వారిజ వంటి ప్రసిద్ధ కవుల గురించి లోతైన విశ్లేషణలు ఉన్నాయి. అలాగే స్వయంప్రభ, కాశీవరపు వెంకట సుబ్బయ్య, మధురశ్రీ, ముకుందాపురం పెద్దన్న లాంటి కవులతో పాటు; అంతగా లబ్దప్రతిష్ఠులు కాని చిన్నికృష్ణ, టి.వి. రెడ్డి, రామకృష్ణ లాంటి వారి కవిత్వాన్ని కూడా సమాన గౌరవంతో విశ్లేషించారు. మొత్తం ఇరవై రెండు మంది కవుల కవిత్వాన్ని పూర్తి సీరియస్ పఠనంతో చదివి రాసిన వ్యాసాల సమాహారమే ఈ “అలజడి మా జీవితం”.
అయితే, రాధేయలోని సానుకూల దృక్పథం వల్ల కవుల కవిత్వంలో కనిపించే అవసరానికి మించిన సెంటిమెంటాలిటీని, పాతకాలపు కాల్పనిక ధోరణులను ఆయన కఠినంగా విమర్శించలేకపోయారు. బహుశా ఆయనలోని మంచితనం, కవిత్వం.. విమర్శకుడిలోని కరకుదనాన్ని మింగేసిందేమో అనిపిస్తుంది.
రాధేయకు కవిత్వంతో పాటు విమర్శలోనూ అపారమైన అనుభవం ఉంది. ప్రతి ఏటా ఉత్తమ కవిత్వానికి అవార్డులు ఇస్తూ, సాహిత్య సాగులో నిరంతరం పాల్గొంటున్నారు. ఈ అనుభవ సారంలోంచి కవిత్వాన్ని వడగట్టగల నేర్పు ఆయనకు అబ్బింది. లోసారి సుధాకర్ వంటి కవుల గురించి విపులంగా, రాఘవేంద్ర వంటి వారిపై సంక్షిప్తంగా రాసినా, ఎక్కడా తన విమర్శనాత్మకతను వదులుకోలేదు. విమర్శా వ్యాసానికి కవితాత్మక శీర్షికను ఉంచడం రాధేయలోని కవికి నిదర్శనం. ఆ శీర్షికతోనే సదరు కవి కవిత్వ లక్ష్యం చదువరికి స్ఫురిస్తుంది. “సీమ కవిత్వ చైతన్యమే జలగండం” అనే వ్యాసం ఈ పుస్తకానికే ఒక పరిమళం లాంటిది. రాధేయ కవిత్వపు ఊపిరిలోని వెచ్చదనం ఈ వ్యాసంలో కనిపిస్తుంది.
రాధేయ విమర్శకు ఉన్న మరో లక్షణం సరళత. అవసరమైన చోట ప్రశంసతో పాటు సున్నితమైన చురక లాంటి హెచ్చరిక కూడా చేస్తారు. విమర్శను కూడా ఒక సృజనాత్మక కళగా భావించే తత్వం ఆయనది. ఇది వస్త్వాశ్రయ విమర్శ (Objective Criticism) కంటే కూడా సహృదయ విమర్శ. కవిత్వం చదవగానే పాఠకుడిలో కలిగే అనుభూతుల స్వభావాన్ని ఆయన చక్కగా వ్యక్తం చేస్తారు. వచన కవిత్వ ఆరాధకుడైనప్పటికీ, పద్య కవిత్వం రాసిన ఆమళ్ళదిన్నె వెంకటరమణ ప్రసాద్, ఒంటెద్దు రామలింగారెడ్డి వంటి వారి గురించి రాస్తూ తన వినయాన్ని ప్రదర్శించారు. తనకు తెలియని విషయాన్ని నిక్కచ్చిగా ఒప్పుకోగల ధైర్యం ఆయనకుంది.
కొత్త గాలులను ఆహ్వానించే సహృదయ ఔదార్యం రాధేయ విమర్శ తత్వం.
___________________
సిద్ధాంతాల చట్రంలో కవిత్వాన్ని బంధించకుండా, భావుకత్వంతో పాటూ వివేచనా శక్తిని కూడా జోడించి ఆయన కవుల నాడిని పట్టుకున్నారు. లోసారి సుధాకర్ అంతరంగంలోని దుఃఖాన్ని, స్వయంప్రభ కవిత్వంలోని అయస్కాంత శక్తిని, మల్లెల భావుకత్వాన్ని, ప్రగతిలోని ప్రగతిశీలతను, మధురశ్రీ సరళతను, గండికోట వారిజ అనుభూతిని ఆయన పాఠకులకు స్పష్టంగా దర్శింపజేశారు. కొత్త పాత కవుల కవిత్వపు లోతుల్ని ఆయన ముద్దాడి నిలబడి చూశారు.
___________________
రాధేయ ప్రత్యేకత ఏమిటంటే, ఈ పుస్తకంలోని కవుల గురించి గతంలో రాచపాళెం, వెంకట కృష్ణ వంటి వారు రాసిన అభిప్రాయాలతో పోలికలు లేకుండా తనదైన కోణంలో రాయడం. నిరంతర అధ్యయనం రాధేయలో ఇగిరిపోని పరిమళంలా కొనసాగాలని కోరుకుంటున్నాను. శరీరమంతా కవిత్వమైన రాధేయ విమర్శకు మీకు మధ్యవున్న నేను నిష్క్రమిస్తూ.. ఈ అక్షర సేద్యంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
(అనంతపురంలో నేడు ఆవిష్కృతమవుతున్న ‘అలజడి మా జీవితం’ ముందుమాటలోని కొంత భాగమిది)

– రాజారామ్ తూముచర్ల,
అనంతపురం,90000 89436











