నవలా రచనకు మార్గదర్శనం ‘డాబా హోటల్’

శిరంశెట్టి కాంతారావు గారి కలం నుండి వెలువడే రచనలు సమాజానికి కుడియెడమలుగా మారిన దర్పణమై నిలుస్తాయి. సమాజంలోకి ఇంకిపోయి, ఇమిడిపోయి, అన్యుల కలానికి అందని, అన్యులు సులభంగా అందుకోలేని వస్తువును సాహిత్యీకరణ చేయడం శిరంశెట్టి గారి కలం ప్రత్యేకత. ప్రత్యేక పరిశీలనా దృక్పథం వారి విశిష్టత. అందుకే శిరంశెట్టి గారి రచనలకు తెలుగు పాఠక లోకంలో అంతటి సాధికారిత, విలువ.

__________________

ఏదేని రచన పాఠకులకు చేరువ కావాలంటే వస్తువు నూతనమైనదై ఉండాలి, లేదా వస్తువును నూతన దృష్టితో, నూతన స్పృహతో పాఠకులకు అందించగలదై ఉండాలి. అలాంటి రచనల కోసం పాఠకలోకం కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తుంటుంది. ఈ అంశాన్ని క్షుణ్ణంగా గమనించినవాడై కలాన్ని యజ్ఞంలా నడిపే సమాజ హితైషి శిరంశెట్టి గారు. అందుకే వారి కలం నుండి వెలువడిన అనేక రచనలు సాహితీ మిత్రులు అందించే అనేక అవార్డులను దక్కించుకున్నాయి.
___________________

స్థూలంగా శిరంశెట్టి గారి కలం నుండి వెలువడిన “డాబా హోటల్” నవల కథాకమామీషు ఇది. మారుతల్లి పెట్టే ఆరళ్లకు బలైన, ఒంటరైన పసితనపు బాలుడిని సమాజం ఆదరిస్తుందా? ఎలాంటి సమాజం ఆదరిస్తుంది? అనే ప్రశ్నలతో ఈ నవల పాఠకుల ముందుకు వస్తుంది. ఆ ప్రశ్నలతో ముడిపడిన మరిన్ని ప్రశ్నలు నవల మొదట్లోనే పాఠకుల మస్తిష్కాల్లోకి చొరబడిపోతాయి.

ఈ పోటీ ప్రపంచంలో చదువు లేకపోతే బతుకు ఉండదా? చదువే ఉద్యోగాన్ని సంపాదించి పెడుతుందా? వెతికితే ఉద్యోగం దొరుకుతుందా? ఉద్యోగం ఇంటికొస్తుందా? మనిషి ఇంట్లోనే మిగిలితే మింటిని అందుకోగలడా? ఇంట్లోంచి బయటపడ్డ మనిషికి కొత్త జీవనదారులు గోచరిస్తాయా? జీవన విధానం నూతనమైతే నూతన జీవన మాధుర్యం దొరుకుతుందా? లాంటి అనేక ప్రశ్నలకు ‘డాబా హోటల్’ నవలలో సమాధానాలు దొరుకుతాయి. కాకపోతే తోడుకున్న వారికి తోడుకున్నంత.

ఇంట్లో జీవించలేక కొట్టుమిట్టాడే పసితనపు బాలుడు బిచ్చం. ఆ బాలుడికీ ఓ జీవిక దొరుకుతుంది. ఆ జీవికలో సిక్కు (శిఖ్) జీవన విధానం తోడవుతుంది. ఆ విధానం అతడిని అక్కున చేర్చుకుంటుంది, ఆశీర్వదిస్తుంది. తనూ అందులో ఒక్కడైపోతాడు. హరిభజన్ సింగ్‌గా మారిన బిచ్చం ఎందరికో దారి చూపుతాడు. మతం మారమని సూచించడు. దారి చూపి నిలబెట్టినందుకు ప్రతిఫలం ఆశించడు. మానవుడు ఉన్నతుడు కావడం ఎలాగో దారి చూపుతాడు. స్థూలంగా ఇంతే కథ. ఇంత చిన్న కథలో ఎన్ని దృశ్యాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని సన్నివేశాలు, మనుషుల్లో ఎంతటి అవలక్షణాలు, ఎన్ని సుగుణాల గంధాలో! అన్నింటినీ కలిపి అందించిన మధుర గానం ఈ ‘డాబా హోటల్’.

నవల మొదటి పేజీలోనే ఓ దృశ్యాన్ని కళ్లముందు పరుస్తాడు రచయిత. బ్రెయిలీ లిపిలో నవలను చదివిన వ్యక్తి కూడా ఈ దృశ్యాన్ని ఊహించుకుని దర్శిస్తాడు. ‘ఆ ప్రళయ బీభత్సానికి తారాసింగ్ బాయి తండా మొత్తం బెంబేలెత్తిపోసాగింది. ఆ సమయంలోనే హరిదాస్ భార్య పికీ బాయికి పురుటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే అతడు గూడచాపను చుట్టుకుని చుట్టుపక్కల ఇళ్లకు వెళ్లి విషయాన్ని వివరించి రమ్మంటూ ఆడవాళ్లను అభ్యర్థించాడు… పికీ జర ఓర్చుకో ఓర్చుకో… అంటూ ఆడవాళ్లు సముదాయించసాగారు… కుండపోతగా కురుస్తున్న వర్షానికి తోడు ఉరుములు, మెరుపులు జతకూడడంతో భయపడుతున్న పిల్లలకు తల్లి రోదనలు మరింత భయాన్ని కలగజేస్తుంటే, తండ్రి కాళ్లకు చుట్టుకొని బేర్ బేర్మంటూ ఏడవసాగారు… అంతలో ఇంటిముందున్న తాటిచెట్టు మీద పెళపెళమంటూ పిడుగుపడి చెట్టు నిలువునా మండిపోయింది.’

ఒక వ్యక్తి ఆకారాన్ని వర్ణించడంలోనూ ఓ దృశ్యం ప్రకటితమవుతుంది. ‘మౌనీ బాబాను చూడడంతోనే ఆయన ముఖంలో తొణికిసలాడుతున్న ప్రశాంతత, ఆయన కన్నుల నుండి వర్షిస్తున్న కరుణ, పెదవుల పైన ఎల్లప్పుడూ పారిజాత పువ్వుల్లా విచ్చుకుని ఉండే సన్నని నవ్వులకు తన్మయుడైపోయిన బిచ్చం, ఒక నిజమైన గురూజీని చూస్తున్నప్పుడు ఒక సాధారణ శిష్యుడు ఎటువంటి అనుభూతికి లోనవుతాడో సరిగ్గా అలాంటి అనుభూతికే లోనైపోయి క్షణాల్లో బాహ్యస్మృతిని కోల్పోయాడు.’

ఒక వ్యక్తి తనది కాని జీవన విధానంలోకి మారి పునర్జన్మ పొందే సన్నివేశం ఇలా దృశ్యమానమవుతుంది. ‘ఆ రోజు గురుపూర్ణిమ. బిచ్చం సిక్కు ధర్మంలోకి మారిపోయే రోజు… కుటుంబ సభ్యులను గోదావరి నదిలో స్నానాలు చేయించుకుని గురుద్వారాకు చేరుకున్నాడు బిచ్చం… గురుద్వారాలో ఉండే ఐదుగురు గ్రంథీలు వచ్చి తఖత్ ముందు గుండ్రంగా కూర్చున్నారు. ఓ చిన్న గుండిగలో పావు వంతు నీళ్లు తీసుకుని వచ్చి వాళ్ల మధ్యలో ఉంచారు. ఆ గుండిగలోకి పంచదారతో చేసిన బతాషాలను వేసి, పంచలోహాలతో తయారు చేసిన రెండంచుల పదునున్న కృపాణంతో ఆ బతాషాలను రాకుతూ నెమ్మదిగా అరగదీయసాగారు. అట్లా అరగదీసేటప్పుడు… మొదటి గురువు గురునానక్ రచించిన ‘జపజీ సాహెబ్’ అమృతబాణి పఠించసాగాడు. రెండో గురువు గురుగోవింద్ సింగ్ రచించిన ‘జాప్ సాహెబ్’ అమృతబాణి పఠించసాగాడు. మూడో గురువు గురుగోవింద్ సింగ్ రచించిన ‘త్వా ప్రసాద్ సవయ్యే’ అమృతబాణి పఠించసాగాడు. నాలుగో గురువు గురు అమర్ దాస్ రచించిన ‘ఆనంద్ సాహెబ్’ అమృతబాణి పఠించసాగాడు. ఐదో గురువు గురు గోవింద్ సింగ్ రచించిన ‘చౌపాయ్’ అమృతబాణి పఠించసాగాడు.’

నవలలో ఇలా దృశ్యమానమయ్యే సన్నివేశాలెన్నెన్నో. ఇవే కాక ‘నేనెక్కడుంటే అదే నా ఊరు’ లాంటి జీవిత సత్యాలు చెప్పే మాటలెన్నో. అచ్చ తెలంగాణ బంజారా జాతుల పదాలు, నుడికారాలు, సామెతలు ఎన్నెన్నో. ఇన్ని దృశ్య అందాలు, భాషా అందాలు ఇముడ్చుకున్నందుకే ‘డాబా హోటల్’ నవల ఉషా-వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.

– వంకిరెడ్డి రెడ్డెప్పరెడ్డి
కథా, నవలా రచయిత
94400 44922

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *