ఎన్నెన్ని యుద్ధాల ఆనవాళ్ళో ‘అఫ్సర్ కవిత్వం’లో

“కాకరూ సజనీ ఆయే నా బాలమూ” అనే పాట పదేపదే గుర్తొస్తుంది అఫ్సర్ కొత్త కవిత్వం చదువుతున్నప్పుడు- దానికి కొంచెం కొనసాగింపుగా ఈ మాట కూడా అనాలనిపిస్తోంది.

అతను రానే రాడని తెలిశాక కూడా
అతని పాట నా లోపల
నేను రాసుకోలేని ఉత్తరాలను
రాసి పెడుతూనే ఉంది.

అఫ్సర్ రాసిన అక్షరాల వెంటబడి పోతూ ఉంటే, పాటలై పద్యాలై మనలోకి చొరబడుతూనే ఉంటాయి. ఎక్కడో తెలుసా? ఇదిగో సరికొత్తగా రాసిన “యుద్ధం మధ్యలో నువ్వు” కవితా సంపుటిలో. ఎక్కడో చదివిన గుర్తు, “SOUND OF RAIN NEED NOT TO TRANSLATE IN ANY LANGUAGE”

ఇక్కడ పేజీల మధ్య కురిసే మానవీయత వర్షాలకు తడిసి ముద్దయి కూడా ఇంకా లోపలికి లోలోపలికి నడుస్తూనే ఉంటాం. మామూలుగా చదువుకొని పోయే వచన కవితలకు భిన్నంగా రూపంలోనూ, కూర్పులోనూ తనదైన శైలిలో అఫ్సర్ చల్లటి నీళ్ళలా మనలోకి దుమికేస్తారు. “యుద్ధం మధ్యలో నేను” అని తన గురించి చెప్పాడా లేక మూడు భాగాలుగా మనకు అనేక యుద్ధాలను రాసి ఇచ్చి మధ్యలో మనలను నిలబెట్టాడా?

టెన్నిస్ కోర్టులో రిఫరీలా మనం ఒక భాగంలో నుంచి ఇంకొక భాగంలోకి ఎగసిపడే వైయక్తిక, సామూహిక వేదనల సంవేదనల భావాల బంతులను సంధిస్తున్న రచయితను తదేకంగా చదువుతూనే ఉంటాం.
__________________

కత్తి అంచు మీద నిలబడి చెప్పినా, ఆరు కాలాలు మాయమైన చోట నిలబడి ఆశ్చర్యపోయినా, పంజరాలను ఓడించిన పక్షిలా, మనలను ఖండాంతరాలకు వలస తీసుకువెళ్లినా అఫ్సర్ శిల్పం ప్రత్యేకమే. పాఠకుడి పక్కన నిలబడి మాట్లాడుతున్నట్టు, సాయంకాలం పూట అమెజాన్ నది ఒడ్డున తను, మనము కూర్చుని అరి కాళ్లకు నీటి చెక్కిలి ఆనుతూ ఉంటే “జియే తో జియే కైసే…. హాయ్… బిన్ ఆప్ కే” అని కుమార్ సానుని వింటున్నట్టు అనిపిస్తాయి.
____________________

కొన్ని కవితలు, లేఖలు అవేవో అతడు మనకే రాసినట్టు. ఒట్టు చదవండి అలా అనిపిస్తుందని నేను గ్యారెంటీ. “ఈ ఒక్క క్షణమే మొదలు చివర తరువాత ఇంకేమీ అక్కర్లేదు నేను వాడు ఈ నగరము అనుకుని ఛలో ఏక్ బార్ ఫిర్ సే” అనుకుని తీరుతాం.

లోపల బయట అని చిన్నప్పుడు నేస్తులం ఆడినట్టు- నేల బండ అని స్నేహితురాళ్ళతో కలిసి రాయి మీద నుంచి నేల మీదికి, నేల మీద నుంచి రాయి మీదకు, గెంతినట్టు ఈ సంపుటి నిండా లోపలివి, బయటవి ఎన్నెన్ని యుద్ధాల ఆనవాళ్లు, ఎన్నెన్ని గాయాల సలపరింతలో ఎన్ని జ్ఞాపకాల పూత మందులో.

“అప్పుడు అనిపిస్తుంది
చూపులు అలసిపోయే
ఈ మొండి క్షణంలో
చిన్నప్పటి ఊరు
అక్కడి కొన్ని వివర్ణ ముఖాలు
తలుచుకుంటావు
గది లోపలికి కొంచమైనా
ఎండ వాలకూడదని
అదిగో అప్పుడే అనుకుంటావు”

యుద్ధాలు దేశాల మధ్యే కాదు, మనుషుల మధ్య, వారి మనసుల మధ్య జరుగుతూనే ఉంటాయి. మరీ ఇద్దరి మధ్య జరిగే యుద్ధాలైతే జున్ను ముక్క తెగినంత మెత్తగానే గాయాలు చేస్తూ ఉంటాయి. “ఇద్దరికీ ఇద్దరము” అనే కవితలో “కొంత దూరం నడిచాక తెలుస్తుంది/అడుగులు తప్పు పడ్డాయని/అయినా దాటిపోయిన అడుగులని చెరిపేయలేను/ కొన్ని మాటలు గడిచాక తెలుస్తుంది/మాటలన్నింటికీ గోడ మాత్రమే శ్రోత అని” అయినా ఒకే ఆటలో తీరికలేని ఆటగాళ్ళం కదూ!

అందుకే కాస్తంత తీరిక దొరకపుచ్చుకొని కూర్చుని మాట్లాడుకో వలసిన వైనాన్ని కవిత్వం చేసి వినిపించాడు అఫ్సర్. నొప్పి లోపలిదో బయటదో ఏదైతేనేం, శారీరకం మానసికం ఏదైతేనేం? అనుభవించాల్సింది మనిషే. ప్రేమకి ద్వేషానికి మధ్య లోలకమై తిరిగే మనుషులు ఉన్న లోకంలో “నొప్పి ఇక యూనివర్సల్, కవిత్వం దానికి పెయిన్ కిల్లర్” అనేలా నొప్పి మీద రాసిన పద్యాలు మన చేతే స్వగతంగా అనిపిస్తాయి.

నిద్ర మనిషికి సుఖమా?. తెలియదు, ఎందుకంటే నిద్రపోయాక మనకేమీ తెలియదు కదా. కానీ నిద్రరానితనం మాత్రం చాలా ఇబ్బంది. వేటాడే మృగంలా వెంటపడుతుంది. రేయింబవళ్లు పనికి బానిస అయినా, ఆమెని అఫ్సర్ గొప్పగా అక్షరీకరించారు.

“కాసిని హోమ్ లెస్ పద్యాలు” పేరుతో..
నిద్రకేమీ కొలమానాలు లేవు
కాలమానాలు లేవు
ఉందల్లా ఇంకాసేపు నిద్రపోవాలన్న
తీవ్రమైన కోరిక తప్ప..అంటూ ఇంకాసేపు ఇం…కా…సేపు అని చెప్పే చోట ‘ఇం’ నుంచి ‘కా’ దాకా, ‘కా’ నుంచి ‘సేపు’ దాకా పేర్చిన చుక్కల మధ్యన నిదుర పేదను చదివి నిప్పుల మీది కంకిలా అవుతుంది మనసు. ఇలా స్వగతం, గతం మనలను మబ్బుల్లా కమ్మేసిన క్షణాలనుంచి, “ఆరు కాలాలు మాయమైన చోట” నిలబెట్టి “నేను అడుగుపెట్టిన చోటల్లా నీ భూమి కుంచించుకుపోతుంది. నీకు ధ్వంసం చేయడమే తెలుసేమో గాని నాకు ప్రతి మట్టి బెడ్డా కూడ తీసుకొని, నాకంటూ ఇంకో నీలాకాశం, ఇంకో ఆకుపచ్చని నేల అల్లుకోవడం ఎలాగో తెలుసు” అని పచ్చని తీగలా మారి ధ్వంసించడమే అలవాటుగా మారిన వాడి మెడకు ఊపిరి ఆడనివ్వనంత బలంగా అల్లుకోమంటాడు.

యుద్ధం ఎక్కడ జరగడం లేదు? అని మనల్ని మనం ప్రశ్నించుకునేలా అనేక యుద్ధ సందర్భాలను కళ్ళ ముందు నిలబెడతారు అఫ్సర్. నల్లమ్మ గురించి రాస్తూ ‘ఇవాళ ఆ వెలివాడ ప్రతి ఇంటికి వెళ్లి ఒక్క నల్లమ్మకి అలాయి బలాయి ఇచ్చి వద్దాం’ రమ్మని పిలిచి GEORGE FLOYDని, అతడి తల్లిని, అతడి పిల్లల తల్లిని, తలుచుకుంటూ “నీకు వాల్కనో ని తాకితే ఎలా ఉంటుందో చూపిస్తా రా” అని అంటాడు. ఇప్పుడు చెప్పండి యుద్ధం ఎక్కడ లేదు? ఏ ఖండంలో లేదు? రూపాలు, పేర్లు, పాత్రలు వాటి లక్ష్యాలు మారుతాయి అంతే. షార్ట్ మెమొరీని, ఎలిజీలను, అసిఫా భానుని, అసమ్మతి వాచకాలను, ఇది అని చెప్పలేని చాలా వాటిని కవితలుగా చెప్పి చూపించాడు అఫ్సర్.
___________________

ఈ సంపుటిలో అస్తిత్వ పోరాటాల యుద్ధరీతులను,అలవాటైన ప్రయాణాలను, ఒకటేమిటి ఎన్నిటినో పంజరాలను ఓడించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ గా ఇచ్చాడు. కొట్టుకు చస్తున్న అనేకమంది నల్లవాళ్ళ కోసం మొద్దు పొద్దును ఆవిష్కరించి “నా కొడకల్లారా కాసేపు నిద్రపోనివ్వండ్రా” అంటూ కలవరించాడు. ఇది ఏ నల్లవాళ్ల కోసమో “వెతుక్కున్నోడికి వెతుక్కున్నంత, తడుముకున్నోనికి తడుముకున్నంత”.
_____________________

ఒకటేమిటిలే ఈ సంపుటి నిండా కథల్లా వెంటపడి, కలవరపరిచే కవిత్వమే.

తనవే నాలుగు మాటలు :
“ఎక్కడ ఆగిపోయావని కాదు
మళ్ళీ ఎలా మొదలు పెట్టావు
అన్నది కావాలి నాకు.
చెప్పానా మొదటి వాక్యం ఎప్పుడూ కష్టమే
ఒకసారి ఆగిపోయి మళ్లీ మొదలయ్యే వాక్యం
ఇంకా కష్టమే కానీ
ఒకసారి మొదలయ్యావా
చివరి వాక్యంతో ఇంకా పని ఏమీ లేదు
అలా చదువుతూ చదువుతూ మనమూ
అతని వెంట యుద్ధాల మధ్యలోకి నడవడమే.

ఆఖరి పంక్తి మీద మనకు ఒక పాట వినిపిస్తుంది ఎక్కడి నుంచో. “కాకరూ సజిని ఆయేనా బాలమూ” కవి కోసం వెతుకుతూ ఉంటాం.

 

 

-దాపల రవికుమార్ కోసూరి
94913 36488

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry