“మండుతున్నంత కాలమే నిప్పు నిప్పుగా ఉంటుంది. తిరుగుతున్నంత కాలమే భూమి భూమిగా ఉంటుంది. పోరాడుతున్నంత కాలమే మనిషి మనిషిగా ఉంటాడు.”
ఈ మాటలు తన డెబ్బై మూడేళ్ళ వయసులో, 2025వ సంవత్సరానికి గాను జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎన్నికైన వైరముత్తు రచించిన “మూండ్రామ్ ఉలగపోర్” (Moondram Ulaga Por) అన్న పుస్తకంలోనివి. మూండ్రామ్ ఉలగపోర్ అంటే ‘మూడవ ప్రపంచ యుద్ధం’ అని అర్థం. ఈ నవల ప్రధానంగా భూతాపం (Global Warming) చుట్టూ, ప్రపంచీకరణ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల చుట్టూ తిరుగుతుంది. ఈ నవలలో ప్రకృతికి, మనిషికి మధ్య జరిగే సంఘర్షణను వైరముత్తు అద్భుతంగా చిత్రించారు. రాబోయే యుద్ధం దేశాల మధ్య కాదు, మనిషికి, ప్రకృతికి మధ్య జరుగుతుందని ఆయన హెచ్చరించారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల వ్యవసాయం ఎలా దెబ్బతింటుందో, ఒక రైతు తన భూమిని ప్రాణం కంటే మిన్నగా ఎలా ప్రేమిస్తాడో, కార్పొరేట్ శక్తుల వల్ల అతను ఎలా అనాథగా మారుతున్నాడో ఈ నవల కళ్లకు కడుతుంది. నిరంతరం శ్రమించే తత్వాన్ని, పోరాట పటిమను నొక్కిచెప్పే ఈ వాక్యాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. నిజానికి ఈ వాక్యాలే వైరముత్తు సాహిత్య తాత్విక భూమికలు అన్నా అతిశయోక్తి లేదు.
_____________________
అఖిలన్, జయకాంతన్ ల తరువాత జ్ఞానపీఠ్ పొందిన మూడవ తమిళ సృజనకారుడిగా రికార్డులకెక్కిన వైరముత్తు, సామాన్య జనబాహుళ్యానికి అత్యంత ప్రజాదరణ పొందిన సినీ గీత రచయితగా మాత్రమే తెలుసు. కానీ ఆయన కవి, కథకుడు, నవలా రచయిత మరియు గొప్ప విమర్శకుడు కూడా.
______________________
జులై 13, 1953న అప్పటి మధురై, ఇప్పటి తేని జిల్లాలోని వడుగపట్టిలో వైరముత్తు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రామసామి తేవార్, అంగమ్మాళ్ వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. వైరముత్తుకు నాలుగేళ్ళ వయసున్నప్పుడు, అక్కడి వైగై నదిపై ఆనకట్ట కట్టడం కోసం వడుగపట్టితో పాటు మరికొన్ని గ్రామాలను తమిళనాడు ప్రభుత్వం ఖాళీ చేయించింది. ఆ విస్థాపన గాయాలు వైరముత్తును తీవ్రంగా వేధించాయి. ఆ తదుపరి కాలంలో ఆ అనుభవాలను వైరముత్తు ‘కలిక్కట్టు ఇతిహాసం’ నవలలో చాలా గాఢంగా అక్షరీకరించారు. ఈ నవలకే 2003లో ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. సామాన్య ప్రజానీకానికి వైరముత్తు అనగానే సినిమా పాటలు ఎలా గుర్తుకు వస్తాయో, సీరియస్ సాహిత్య పాఠకులకు వైరముత్తు అనగానే ‘కలిక్కట్టు ఇతిహాసం’ గుర్తుకువస్తుంది.
చిన్నతనం నుండే వైరముత్తుకు కవిత్వం అంటే అసాధారణ ఆసక్తి ఉండేది. పదేళ్ల వయసుకే ఆయన కవితలు రాయడం ప్రారంభించారు. పాఠశాల దశలోనే ప్రతిభావంతుడైన వక్తగా, యువ కవిగా గుర్తింపు పొందారు. ప్రాచీన కవి తిరువళ్లువర్ రచించిన “తిరుక్కురల్” స్ఫూర్తితో, యుక్త వయసులోనే సాంప్రదాయ కవితా రూపాలతో ప్రయోగాలు చేశారు. 1960ల నాటి సామాజిక-రాజకీయ వాతావరణం కూడా ఆయన మేధో వికాసాన్ని ప్రభావితం చేసింది. సామాజిక న్యాయం, హేతువాదం, భాష వంటి అంశాలపై ద్రవిడ ఉద్యమం చూపిన ప్రభావం ఆయన ప్రపంచ దృక్పథాన్ని మలిచింది. పెరియార్ ఇ.వి. రామసామి, సి.ఎన్. అన్నాదురై, ఎం. కరుణానిధి, సుబ్రమణ్య భారతి, భారతీదాసన్, కణ్ణదాసన్ వంటి నాయకులు, రచయితలు ఆయన ఆలోచనలను లోతుగా ప్రభావితం చేశారు. సాహిత్యాన్ని సామాజిక పరివర్తనకు సాధనంగా చూడాలని వారు ఆయనను ప్రోత్సహించారు.
పందొమ్మిదేళ్ళ వయసులో తన మొదటి కవిత్వ సంపుటి “వైకరై మేఘంగళ్” (తెల్లవారుజాము మేఘాలు) ప్రచురించారు. ఆ కవిత్వ సంపుటిలోని భావాలు తమిళులను విపరీతంగా ఆకర్షించాయి. మద్రాసు పచ్చయ్యప్పన్ కళాశాలలో ఆయన చదువుతున్నప్పుడే “వైకరై మేఘంగళ్” ను పాఠ్యాంశంగా తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. 1979లో ఆయన తన రెండవ సంపుటి “తిరుత్తి ఎళుదియ తీర్పుకళ్” (సవరించిన మరియు తిరిగి రాసిన తీర్పులు) ప్రచురించారు. ఈ కవిత్వ సంపుటి తమిళ కవిత్వంలో ఒక ‘గేమ్ ఛేంజర్’ అయింది. తెలుగు నాట అభ్యుదయ కవిత్వ ఉద్యమం లాగా తమిళంలో వచ్చిన ‘పుదుక్కవితై’ (వచన కవిత్వం)లో ఈ కవిత్వ సంపుటి ఒక మైలురాయిలా నిలిచింది. తమిళ కవిత్వాన్ని సాంప్రదాయ శృంగార వస్తువు నుండి సామాజిక చైతన్యం వైపు నడిపించింది. కవిత్వ శీర్షికలోని ‘తీర్పులు’ అనాదిగా అణగారిన వర్గాలపై రుద్దబడిన, విధించబడిన ఆధిపత్య భావజాలాలకు ప్రతీకలు.
1980లో భారతీరాజా దర్శకత్వంలో, ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన “నిళల్‌గళ్” చిత్రంలోని “పొన్ మాలై పొళుడు” పాటతో ఆయన తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తరువాత వెనుతిరిగి చూడకుండా 7500లకు పైగా పాటలు రాశారు. తమిళ సినిమాలో క్లాసిక్ చిత్రాలైన రోజా, బొంబాయి, పడయప్పా, రోబో వంటి చిత్రాలను తన పాటల కవిత్వ సొబగులతో వెలిగించారు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. ఏకంగా ఏడు సార్లు ఉత్తమ గీత రచయితగా జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు.
మరో ప్రధాన రచన “కరువాచ్చి కావ్యం”. ఇది గ్రామీణ పేదరికంలోని లింగ వివక్షను ఒక ధైర్యవంతురాలైన పల్లెటూరి మహిళ ‘కరువాచ్చి’ కథ ద్వారా వివరిస్తుంది. కరువాచ్చి గృహ హింసను, పేదరికాన్ని, సామాజిక దొంతరల్లోని కుల వివక్షను ఎదుర్కొంటుంది. ఈ నవల గొప్పతనం ఏమిటంటే, కథానాయికను కేవలం బాధితురాలిగా కాకుండా సహనానికి, స్వాభిమానానికి, సాధికారతకు మరియు గౌరవానికి చిహ్నంగా చూపుతుంది. సృజనాత్మక రచనలతో పాటు, వైరముత్తు సాహిత్య విమర్శలో కూడా తనదైన ముద్ర వేశారు.
“Tamizhāṟṟuppaṭai” లోని ఆయన వ్యాసాలు, సంగం యుగం నుండి ఆధునిక కాలం వరకు ఉన్న తమిళ సాహిత్య సుదీర్ఘ చరిత్రను స్థాలీపులాక న్యాయంగా పరిశీలిస్తాయి. ప్రాచీన సాహిత్యాన్ని గడిచిన కాలపు అవశేషంగా పరిగణించకుండా, సమకాలీన నైతిక ప్రశ్నలను ప్రకాశవంతం చేయగల సజీవ సంప్రదాయంగా వైరముత్తు తన పుస్తకంలో వివరించారు.
వైరముత్తు రచనల తాత్విక సారాంశం, ఆయన తరచుగా ఉటంకించే “మండుతున్నంత కాలమే అగ్ని అగ్నిగా ఉంటుంది; తిరుగుతున్నంత కాలమే భూమి భూమిగానే ఉంటుంది; పోరాడుతున్నంత కాలం మాత్రమే మానవుడు మానవుడిగా ఉంటాడు.” అనే వాక్యాలలో ఉత్తమంగా వ్యక్తమవుతుంది. ఈ సూత్రీకరణ గుర్తింపును ఒక స్థిరమైన స్థితిగా కాకుండా, ఒక గతిశీల ప్రక్రియగా నిర్వచిస్తుంది. అగ్ని దహనం ద్వారా, భూమి చలనం ద్వారా, మనిషి తన అస్తిత్వ పోరాటం ద్వారా ఉనికిలో ఉంటారు. తద్వారా కవి ప్రతికూలతను మానవ గౌరవానికి ఒక నిర్వచనాత్మక అంశంగా మారుస్తారు.
ఈ భావన ఆయన కవిత్వమంతటా ప్రవహిస్తుంది. నదులు ప్రవహిస్తున్నంత కాలం నదులుగా ఉంటాయి, చెట్లు పరిమళాలను, ఫలాలను ఇస్తున్నంత కాలం చెట్లుగా ఉంటాయి, పండితులు నేర్చుకుంటున్నంత కాలం పండితులుగా ఉంటారు. ఇటువంటి రూపకాలు హోదా కంటే కార్యాచరణకే ప్రాధాన్యతనిస్తాయి. నేర్చుకోవడం మానేసిన పండితుడు, కేవలం పాతబడిపోయిన జ్ఞానానికి భాండాగారంగా మిగిలిపోతాడని వైరముత్తు సూచిస్తారు. ఈ కోణంలో, ఉనికిని ఒక స్థిరమైన స్థితిగా కాకుండా, నిరంతర పరిణామంగా అర్థం చేసుకునే తాత్విక సంప్రదాయాలను వైరముత్తు ప్రతిధ్వనింపజేస్తారు. శిల్పి ఉలిని తట్టుకున్నప్పుడే రాయి విగ్రహంగా మారుతుంది; కొలిమిలో కాల్చిన తర్వాతే బంగారం ఆభరణంగా మారుతుంది; అణచివేతను ఎదిరించినప్పుడే కార్మికుడు ఒక శక్తిగా ఎదుగుతాడు. బాధను అర్థరహితమైనదిగా చిత్రించకుండా, రూపం మరియు విలువ సృష్టించబడే మాధ్యమంగా వైరముత్తు దానిని వ్యాఖ్యానిస్తారు. ఈ పదబంధాలు, రూపకాలు అన్నీ వైరముత్తు సాహిత్య రచనలలో తరచుగా కనిపించే శ్రమ, అణచివేత వంటి సామాజిక వాస్తవాలతో బలంగా ప్రతిధ్వనిస్తాయి.
సినిమా పాటలలో వైరముత్తు ఎన్నెన్ని సున్నితమైన భావాలను పలికించారో తలచుకుంటే చాలు హృదయం ఉప్పొంగుతుంది.
ఒక సినిమాలో ప్రియుడు తన ప్రేయసి కళ్ళను ఎలా వర్ణిస్తున్నాడో చూడండి:
“అలల్లేని సముద్రపు రంగు/మేఘాలు లేని ఆకాశపు రంగు/నెమలి మెడలో మెరిసే రంగు/కువలయ పుష్పంలో ఇమిడి ఉన్న రంగు/ఊదా పూవులో నిండిన రంగు/ఇవన్నీ కలిసి నీ కళ్ళలో మెరుస్తున్నాయి”. దీనికి ఇంకా వ్యాఖ్యానం అవసరమా?
‘కడలి’ చిత్రంలోని ఈ పాట చూడండి:
“నేను నిన్ను నా హృదయపు తంత్రులతో బంధించాను/కానీ నా జీవితం ఏ దిశగా సాగుతుందో అని ఆలోచిస్తున్నాను!/నువ్వు నావైపు విసిరిన ఆ అమాయకపు చూపుతో/నా సున్నితమైన గుండెను నీటి మరకలు పడ్డ అద్దంలా మార్చేశావు/నీ కుడి చేతికి ఉన్న ఆ గడియారం తప్ప నీకు వేరే అలంకరణ లేదు/కానీ నీ గంభీరమైన నడక పులిని సైతం నిలువరించగలదు/నువ్వు వెళ్ళిపోయినా—నీ నీడ మాత్రం ఇక్కడే ఉండిపోయింది/అది నా హృదయపు లోతుల్లో నిలిచిపోయింది/నీ రూపాన్ని గుండెల్లో మోస్తున్నా నేను ఎక్కడా తలవంచలేదు/విప్పిన గొడుగు కర్రల్లా నా గుండె ఇంకా నిటారుగానే నిలబడింది/పక్షులన్నీ నిద్రపోయాయి, పాలు కూడా పెరుగుగా తోడుకున్నాయి/ఆ ‘ఇచ్చి’ (Ichi) చెట్టు ఆకులు కూడా నిద్రకు జారుకున్నాయి/క్షయ వ్యాధితో బాధపడేవారు కూడా చివరికి నిద్రలోకి జారుకున్నారు/కానీ మనసు గాయపడిన నాకు మాత్రం రెప్పవాల్చే క్షణం కూడా దొరకదు/ముద్ద మెతుకు ముట్టలేదు, చుక్క నీరు తాగలేదు/గడచిన ఏడెనిమిది రోజులుగా తినేందుకు ఏమీ తోచలేదు/
నేను తన మనసును వ్యక్తపరచలేని ఒక పేద పిల్లను/రబ్బరు గాజులు చప్పుడు చేసే భాగ్యానికి నోచుకోవు కదా!”.
ఇక్కడ రబ్బరు గాజులు అన్నచోట కదా వైరముత్తు తన మెరుపు మెరిపిస్తారు. రబ్బరు గాజులు చప్పుడు చేయవు. గాజుల చప్పుడు స్త్రీ ఆనందానికి ప్రతీక. గాజులు చప్పుడు చేయడం లేదు అంటే ఆమె మౌనంగా ఉన్నట్టు, నిరాశతోనో, నిస్పృహతోనో ఉన్నట్టు. రబ్బరు గాజులు పేదరికానికి కూడా సూచనే.
‘కడలి’ సినిమా చూసిన వారు ఎవరికైనా ఆ మెటాఫర్ (రూపకం) ఏమిటో తేలికగా అర్థం అవుతుంది.
సాహిత్యం ఏకకాలంలో సౌందర్య సృష్టిగా, చారిత్రక సాక్ష్యంగా మరియు నైతిక సాక్షిగా పనిచేయగలదని ఆయన రచనలు పాఠకులకు గుర్తుచేస్తాయి. అలా చేయడం ద్వారా, ఆయన మానవ పోరాటపు శాశ్వతమైన గౌరవాన్ని ధృవీకరిస్తూనే, తమిళ సాహిత్య కల్పనా ప్రపంచాన్ని విస్తరించారు.
2025 సంవత్సరానికి గాను 60వ ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ తమిళ కవి, సినీ గేయ రచయిత ఆర్. వైరముత్తు ఎనిమిది వేలకు పైగా పాటలు, అనేక జాతీయ పురస్కారాలతో తమిళ సాహితీ రంగంలో “కవిపెరరసు” గా ప్రసిద్దిపొందారు. తమిళ కవిత్వానికి జ్ఞానపీఠ్ రావడం ఇదే ప్రధమం.
-ఎ. మేఘన











