‘సప్తవర్ణ సింగిడి!’ కవిత-ఒక విశ్లేషణ

డా౹౹ పసునూరి రవీందర్ నాకు చాలా కాలంగా తెలుసు. అత్యంత సన్నిహితుడు. మా పత్రికకు(సృజనక్రాంతి) అప్పుడప్పుడు వ్యాసాలు ఇచ్చి సహకరిస్తూ ఉంటాడు. మంచి సాహిత్యాన్ని వెలువరిస్తూ సాహిత్య పాఠకులనే కాకుండా,సామాన్య ప్రజలను కూడా తన ఆట-పాటతో ఆకట్టుకోగల బహు నేర్పరి. కవిత్వం,కథ, విమర్శ, వ్యాసాలు రాస్తూ.. నిత్యం జనం గుండెల్లో వుండే సాహిత్యకారుడు. సామాజిక కార్యకర్త. ప్రత్యేక తెలంగాణ సాధనకోసం ఉద్యమించి,ఆట-పాటతో ఆకట్టుకున్న సృజనాత్మక కళాకారుడు కూడా.

ఇదంతా ఎందుకు చెప్పవలసివచ్చిందంటే..నవ తెలంగాణ దినపత్రిక సాహిత్య పేజీ ‘దర్వాజ’ లో జూన్ 16,2025వ తేదీన ‘సప్తవర్ణ సింగిడి!’ శీర్షికతో ప్రచురితమైన ఒక కవిత నన్నాకర్షించి, నా మనో నేత్రంపై ఒక తీపి గుర్తును ముద్రించింది. ఈ కవితను రాసింది డా౹౹ పసునూరి రవీందర్. నన్ను ఇంతగా ఆకర్షించిన ఈ కవితను ‘నాకు తెలిసిన రీతిలో విశ్లేషించాల’ని ఉంది అని తనకు మేసేజ్ చేస్తే.. సరే ..అన్నాడు. ఈ కవిత,దీనిపై విశ్లేషణ ఈ క్రింద చదవండి.
__________________________
కవితా శీర్షిక: ‘సప్తవర్ణ సింగిడి!’

కని పాలివ్వని తల్లి మీద
కొడుకు తిరగబడ్డట్టు
ఈ నేల మీద ఎల్లకాలం కొట్లాటే!(1)

దక్కాల్సిన బుక్క కోసం
నాలుగు బాటల కాడ
గుండెదరువే సాటింపు!

పేగుబంధం ఎడబాస్తున్నప్పుడో
బతుకలేక దేశం పోతున్నప్పుడో
ఉరిపోసుకోలేక ఊరు ఇడుస్తున్నప్పుడో(2)
లోపటంత ఒక నిశ్శబ్ద యుద్ధం(3)

పచ్చిగాయాల పల్లేరుముల్లు
కలత నిద్రల కలవరింత
కండ్లు ఊటసెలిమలు
పిలిస్తే పలికే కన్నీటి వరద
కలలు ఒలికిపోయినపుడు
ఏ దీపం వెలుగులో వెతుక్కుంటాం(4)

ఇది చిట్టచివరి మనుషుల ఆరాటం
వేరుకు పాదు చేసి
జీవిగంజిపోసినట్టు అరుదైన దృశ్యం!

పొద్దుగూకిన ఆకాశం నుదుటన
ఒకే ఒక్క వర్ణం
బతుకును గెలిచే సాహసికునికి(5)
కొండలు, నదులు…
అన్నీ బాల్యస్నేహితులే

మట్టిని ముద్దాడు(6)
మన్నులో మన్నుగా జీవించు
గొప్ప జ్ఞానం కాకపోయినా
అన్నమైనా లభిస్తుంది

రెక్కలు చాచిన
నేలపొత్తిల్లలో
పసిపిల్లాడిలా ఎప్పటికీ ఒదిగిపో!

సప్తవర్ణాల సింగిడి
నేల మీదికి
ఉత్తకాళ్లతో దిగివస్తుంది…
తప్పిపోయి దొరికినోడిని చూసినట్టు
ఒక ఆత్మీయ ఆలింగనంతో అల్లుకుంటుంది(7)
పచ్చిపచ్చిగా నిన్ను నీకే
మళ్లీ కొత్తగా పరిచయం చేస్తుంది!

–డా.పసునూరి రవీందర్

____________________________
విశ్లేషణ:

“సప్తవర్ణాల సింగిడి” – ఇక్కడ సప్తవర్ణం అంటే ప్రకృతిలోని అన్ని రంగులు,జీవగమ్యం, జీవన పరిపూర్ణతలకు ప్రతీక.

(1) కని పాలివ్వని తల్లి మీద
కొడుకు తిరగబడ్డట్టు
ఈ నేల మీద ఎల్లకాలం కొట్లాటే!”

ఈ వాక్యం భూమిని “తల్లి”గా చూడటం — ప్రాంతీయ స్థితిగతులకు అత్యంత సాంప్రదాయిక స్వరూపం. కానీ వలస పాలన తర్వాత వచ్చిన మార్పులు, ఆత్మవిశ్వాస హీనత, తమ భూమి మీద తమకే స్వేచ్ఛ లేకుండా పోవడం వంటి పరిస్థితులు — స్థానికులే భూమి కోసం పోరాడే స్థితికి రావడం — ఈ వాక్యంలో సంకేతాత్మకంగా కనిపిస్తుంది. ఇది postcolonial guilt, shame, and alienation ని ప్రతిబింబిస్తుంది.

(2)పేగుబంధం ఎడబాస్తున్నప్పుడో
బతుకలేక దేశం పోతున్నప్పుడో
ఉరిపోసుకోలేక ఊరు ఇడుస్తున్నప్పుడో”

ఈ వాక్యంలో రాష్ట్రం, ఊరు, బంధాలు అన్నీ విభజనకు గురైన జీవరేఖలుగా దర్శింపబడుతున్నాయి. వలస పాలనల వల్ల ఏర్పడిన నిరాశ, కుటుంబాలకు కుటుంబాలే వలసలకు గురైనస్థితి, forced dislocation, migration, exile – ఇవన్నీ postcolonial literature లోని ప్రధానాంశాలు.

(3) “లోపటంత ఒక నిశ్శబ్ద యుద్ధం” అనే వాక్యం మనసును కలచివేస్తుంది – ఇది Sigmund Freud భావజాలంలో “అవచేతన ఆవేశం” (unconscious turbulence) గా చూడవచ్చు. కవిత మొత్తం మానవుని అంతర్లీన యుద్ధం (inner conflict), సమాజంలోని అన్యాయాలు, పరిణామశీల వేదనల చుట్టూ పరిభ్రమించింది. దీనిని ఈ కవితలోని భావ గాఢత – (Psychological Depth)గా చూడవచ్చు.

(4) “కలలు ఒలికిపోవడం” అనేది Sylvia Plath కవితల్లోని విరహ, విఫలత చిహ్నాలకు దగ్గరగా ఉంది.ఈ కవితలో ‘మట్టిని ముద్దాడు’ వంటి భావాలు జాన్ కీట్స్ (John Keats) యొక్క “Ode to a Grecian Urn” వంటి కవితలో “Truth is beauty – beauty is truth” భావంతో సరిసమానంగా కనిపిస్తుంది.ఈ కవితలో దీనిని మనం అంతర్భాషా మూలకత (Intertextuality)గా గుర్తించవచ్చు.

(5) “ఒకే ఒక్క వర్ణం బతుకును గెలిచే సాహసికునికి” – అనే వాక్యంలో జీవితం ఒక రంగు మాత్రమే ఇచ్చినా, దాన్ని అనుభూతి చెందే వ్యక్తే నిజమైన విజేత అనే సంకేతాన్ని ఇస్తుంది. దీనిని ఒక ప్రతీకగా,రూపకంగా (Imagery & Symbolism) మనం పరిగణించవచ్చు.

(6)”మట్టిని ముద్దాడు
మన్నులో మన్నుగా జీవించు
గొప్ప జ్ఞానం కాకపోయినా
అన్నమైనా లభిస్తుంది”

ఇది స్వరాష్ట్ర ఆత్మగౌరవానికి పిలుపుగా నిలుస్తుంది. రైతు, దేశీయ జీవన విధానాల పట్ల గౌరవాన్ని పునరుద్ధరించే ప్రయత్నం. వలస పాలకుల ఆర్ధిక విధానాల వలన తల్లిదండ్రులు భూములను కోల్పోయిన దుస్థితి, తిరిగి తమ భూమిని తాము స్వంతం చేసుకోవాలన్న కోరిక, ఆత్మాభిమానాన్ని అలవరచే ఆత్మోద్దీపనగా కనిపిస్తుంది.

(7)తప్పిపోయి దొరికినోడిని చూసినట్టు
ఒక ఆత్మీయ ఆలింగనంతో అల్లుకుంటుంది”

ఇది పరాధ్యాత్మిక భావన మాత్రమే కాదు, తన చరిత్రతో, తన భూమితో, తన వారసత్వంతో మళ్లీ కలిసిపోవాలనే అంతఃశక్తి. ఇది postcolonial re-identification, reclaiming native consciousness అనే భావనకు తెరతీసిన ప్రతీక.

శైలీ(Style and Structure) పరంగా ఈ కవితలో ప్రభావవంతమైన భాషను ఉపయోగిస్తూ..చాలా శక్తిమంతమైన భావచిత్రాలతో నిండి ఉంది. ప్రతి పాదంలో ఒక బలమైన దృశ్యం (visual image) తోనూ, పాఠకుడికి కదిలించే శక్తిని కలిగి ఉన్నది.

నిరాశ,ఆశల మధ్య సంభాషణ: “కలలు ఒలికిపోయినపుడు ఏ దీపం వెలుగులో వెతుక్కుంటాం?” – ఈ ప్రశ్నలో నిరాశ ఉంది. కానీ చివరికి “సప్తవర్ణాల సింగిడి” అనే ప్రతీకాత్మక దృశ్యం ద్వారా మళ్లీ ఆశ, పునఃజన్మ వంటి భావనను ఏర్పరుస్తుంది. ఇది ఆధునిక కాలంలో అస్తిత్వవాదానికి (existentialism) దగ్గరగా ఉంటుంది.

“సప్తవర్ణ సింగిడి” – కవిత ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక శక్తి:

ఈ ప్రతీక భూమినే కాదు, ఉపేక్షించబడిన, రంగురంగుల, శక్తివంతమైన స్థానిక సంస్కృతిని సూచిస్తుంది. ఇది వలస పాలనలో అణచివేతకు గురైన విలువలను పునఃస్థాపించడమే కాదు, అవి తిరిగి ఒక కొత్త మార్గం చూపగలవనే ఆశాజ్యోతిని చూపిస్తుంది.

ఆధునిక జీవిత సత్యాలను బలంగా ఆవిష్కరించిన కవిత ఇది. ఒక పల్లెటూరి వ్యక్తి నుంచి వచ్చిన జీవన గాథ కాదు, మనిషిగా మిగిలిపోవాలని తపించే ప్రతి మానవుని జీవగాథ. ఈ కవితను చదివిన ప్రతిఒక్కరూ.. తమలోకి తాము ప్రయాణం చేసిన అనుభూతిని తప్పక పొందుతారు.

ఏ కవికైనా తన బలాబలాలు ఏమిటో తనకు తెలుసు.ఈ కవితలో లోపాలు ఏమీ లేవా అంటే,దానికి ఈ కవి మాత్రమే సమాధానం చెప్పాలి. ఏ కవికైనా/ కవయిత్రికైనా కొన్ని పదాలపట్ల,కొన్ని వాక్యాలపట్ల లౌల్యం తప్పక వుంటుంది. అలాంటి లౌల్యం ఈ కవికి కూడా ఉందనే చెప్పాలి. ఏ కవి రాసే కవితలైనా బాగుంటాయి, బాగోవు అని చెబటం చాలా తేలిక. కానీ ఒక కవిత రాయడానికి కవి పడే వేదన అంతా ఇంతా కాదు. అది ప్రతి కవికీ తెలిసిన విషయమే.విమర్శకులు/విశ్లేషకులు కొన్నిసార్లు కవియొక్క దృష్టి కోణంలోంచి కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. కవి కంటే విమర్శకులు కొంత ఎక్కువ చదివి, ఎక్కువ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి.తప్పదు. అప్పుడే మంచి విశ్లేషణ చేయగలరు అనే భావాన్ని నేను గౌరవిస్తూ.. డా౹౹పసునూరి రవీందర్ కు శుభాకాంక్షలు.

# విల్సన్ రావు కొమ్మవరపు