“లేపాక్షి బసవయ్య నిజంగానే గొప్ప శిల్పం. తెలుగు పౌరుషానికి అది ప్రతీక. ఎంతో హుందాగా, నిండుగా ఒంటినిండా ఆభరణాలతో, అద్భుతమైన చెక్కడపు పనితనంతో వీరభద్ర ఆలయానికి అల్లంత దూరంలో ఊరి మధ్య ఠీవీగా కూర్చుని ఉన్న ఆ ఏకశిలానంది విగ్రహం దానికదేసాటి. బెంగళూరులోని బసవనగుడి నందికన్న, ఆ దగ్గరలోని నందీహిల్స్ పైన ఉన్న నంది కన్న లేపాక్షి నంది బహుశా పెద్దది కావచ్చు” అంటారు శీలావీర్రాజు గారు తన లేపాక్షి అన్న వ్యాసంలో. 1968లో అనంతపురం చేరి తరువాత లేపాక్షి చేరుకుని లేపాక్షి శిల్పాల స్కెచ్ లు ఎన్నో గీశారు.
శీలా వీర్రాజు గారు 1939లో జన్మించారు. దామెర్ల రామారావు చిత్రకళాకేంద్రలో తొలి చిత్రకళాపాఠాలు నేర్చుకున్నారు. చిన్ననాటి నుండి బొమ్మలు వేయడం వీరికి అలవాటు. చదువు పూర్తయిన తరువాత కృష్ణా పత్రికలో ఆర్టిస్ట్ కం సబ్ ఎడిటర్ గా రెండు సంవత్సరాలు పనిచేశారు. తరువాత రాష్ట్ర ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖలో అనువాదకునిగా చేరి 1990లో వాలంటరీ రిటైర్మెంట్ పొందారు.
______
శీలావీర్రాజగారి చిత్రాల గురించి మనకు తెలిపే పుస్తకాలు మూడు. అవి “శిల్పరేఖ (లేపాక్షి స్కెచ్ బుక్) ఈ పుస్తకం 1990 ఆక్టోబరులో ప్రధమ ముద్రణ, అలాగే అక్టోబర్, 2006లో రెండవ ముద్రణ పొందింది. రెండవ పుస్తకం “శీలా వీర్రాజు చిత్రకారీయం” ఈ పుస్తకం 2009లో ముద్రించబడింది. మూడవ పుస్తకం – “కుంచె ముద్రలు” (వర్ణచిత్రాలు, రేఖాచిత్రాలు) ఈ పుస్తకం 2016లో ముద్రించబడింది.
_______
శిల్పరేఖ పుస్తకం – లేపాక్షి శిల్ప సంపదను స్కెచ్ లుగా పెన్సిల్ తో గీచిన చిత్రాలు. ఈ చిత్రాలు అన్నీ కూడా ఆయా శిల్పాల ముందు నిలబడి లేదా కూర్చుని అప్పటికప్పుడు నేరుగా గీసుకున్న చిత్రాలే. స్పాట్ స్కెచ్ లు అందుకే వీటిలో దిద్దుబాట్లు, తుడిపివేతలు కనబడవు. శీలా వీర్రాజు గారు లేపాక్షి ఆలయములో రెండు రోజులు ఉన్న సమయములో వేసుకున్న యాభై స్కెచ్ లతో ఈ శిల్పరేఖ వెలువడింది. ఈ చిత్రాలు 1968 జులైలో బెంగళూరులోని చిత్రకళా పరిషత్ లో ప్రదర్శించబడినాయి. 1969 ఏప్రిల్ లో హైదరాబాదులోని కళాభవన్ లో ప్రదర్శించబడినాయి. 1970 జనవరిలో అప్పటి పశ్చిమ జర్మనీ గోటింజెన్ నగరంలో ప్రదర్శించబడినాయి. ఈ చిత్రాలన్నీ కలిపి,
కొన్ని వ్యాసాలతోనూ అంట్యాకుల పైడిరాజు గారి ముందుమాటలో 1990 అక్టోబర్ లో పుస్తక రూపంలో వచ్చాయి.
2009లో వెలువడిన “చిత్రకారీయం” శీలావీర్రాజుగారి రెండవ చిత్రకళాపుస్తకం. ఈ పుస్తకం వారి అమ్మా,నాన్నలకు అంకితం ఇచ్చారు. ఈ పుస్తకానికి ముందుమాట కాండ్రేగుల నాగేశ్వరరావు గారు రచించారు. ఈ పుస్తకంలో స్కెచ్ లు , నలుపు తెలుపు చిత్రాలు, నీటి రంగుల చిత్రాలు, తైలవర్ణ చిత్రాలు చూడవచ్చు. సాంప్రదాయశైలి చిత్రాలతో పాటు ఆధునిక శైలిచిత్రాలు కూడా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఈ పుస్తకంలో అట్టమీద బొమ్మలు కలుపుకొని మొత్తంగా 80కి పైగానే చిత్రాలున్నాయి. 1960లో చిత్రించిన “గుడికి” అన్న నీటి రంగుల చిత్రం జానపదశైలి చిత్రంగా చెప్పవచ్చు. ఆనాటి చిత్రకారులు ఈ శైలి చిత్రాలు ఎక్కువగా వేస్తుండేవారు.
1975నాటి మహాకవి పోతన చిత్రం, వీరశైవ ప్రవక్త శ్రీపతి పండితుడు తైలవర్ణచిత్రాలు తెలుగు సాహితీ లోకానికి అందిన అద్భుతాలు, 1990 నాటి ఏటికెదురు. పళ్ళమార్కెట్, 1995 నాటి శ్రమజీవులు, బతుకు తెరువు సంత నుంచి 2008 నాటి వంట చెరకు సేకరణ, ఊరిచెరువు కాడ మేదరుల వృత్తిజీవనం ఈ చిత్రాలు తెలుగువారి వృత్తి జీవితాలకు ప్రతిబింబాలు.
ఈ పుస్తకంలో ఆధునిక శైలిని అనుసరిస్తూ చిత్రించిన చిత్రాలు ఉన్నాయి. 1995 నాటి అలసిన వేళ – నీటి రంగుల చిత్రం – పికాసో చిత్రంను పోలి ఉంటుంది. 1977లో చిత్రించిన రంగుల రాగాలు (నీటిరంగుల చిత్రం) పూర్తిగా ఆధునిక శైలి సింబాలిక్ చిత్రంగా చెప్పవచ్చు.
రంగుల రాగాల చిత్రంలో – సప్తవర్ణాలలో దాగిన సప్తస్వరాల ఆలాపన వినిపిస్తూంటుంది. ఇదే పుస్తకంలో – కోణార్క్, భువనేశ్వర్, రామప్ప, ఎల్లోరా దౌలతాబాద్ సందర్శించినపుడు వీర్రాజు గారు గీసుకున్న స్కెచ్ లు ఇందులో పొందుపరచారు.
మన ప్రాంతాలు ఉష్ణప్రాంతాలు, సూర్యుని వెలుగు నలుదిశలా పడుతూ వర్ణాలు సుస్పష్టంగా కనబడుతుంటాయి. అందువల్లనే వీర్రాజుగారి చిత్రాల్లో కూడా ముదురు రంగు మనుష్యులపై బడిన కాంతి పుంజం మెరుస్తూ మనలను మైమరపిస్తుంది.
2008 చిత్రించిన “చేనేత కుటుంబం” తైలవర్ణ చిత్రంలో మూడు తరాల జీవితాలకు ప్రతిబింబం. ఒక మహాకావ్యంకు కావాల్సినంత విషయం ఆ చిత్రంలో గమనించగలం. అలాగే మరో తైలవర్ణ చిత్రం – “బస్సు కోసం నిరీక్షణ”. ఈ చిత్రంలో కూడా అద్భుత కథ దాగి ఉంది.
ఎందరో సాహితీ, కళాకారులు లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. ఆనాడు లేపాక్షి సందర్శించే వారికి కల్లూరు సుబ్బారావు గారి ప్రేరణతో సందర్శించినట్లు తెలుస్తుంది. శీలా వీర్రాజుగారు కూడా కల్లూరి సుబ్బారావు గారి ఆతిధ్యం స్వీకరించినవారే.
వీర్రాజు గారి చిత్రాలలో రంగుల రాగాలు, రంగుల మిశ్రణం అద్భుతంగా కనిపిస్తుంది. సన్నని గీతల్లో, లేదు.. మందపు గీతల్లో చిత్రం గీసినా, అదొక అద్భుత సుందర చిత్రంగానే దర్శనమిస్తుంది.
2016లో వచ్చిన “కుంచె ముద్రలు” (వర్ణచిత్రాలు, రేఖాచిత్రాలు)లో దాదాపు వంద చిత్రాలు ఇందులో ఉన్నాయి. నలుపు, తెలుపు పెన్సిల్ స్కెచ్ చిత్రాలు – అన్నీ కూడా ఆయా సందర్భాలలో ఆయా ప్రదేశాలకు వెళ్ళినపుడు వేసుకున్న స్పీడ్ ఆర్ట్స్ ఉన్నాయి. నీటిరంగులు, తైలవర్ణ చిత్రాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అన్నీ కూడా ప్రజల వృత్తి సంబంధమైనవి. సంప్రదాయ శైలి, ప్రకృతి చిత్రాలు, నిశ్చల చిత్రాలు, ఆధునిక శైలి చిత్రాలు ఉన్నాయి. 1973లో వేసుకున్న సెల్ఫ్ పోట్రేట్ (స్వీయ చిత్రం) కూడా ఇందులో ఉంది.
ఈ చిత్రాలన్నిట బలమైన రేఖలతో, ముదురు వర్ణాలతో, చిత్రాలు చూడచక్కగా ఉన్నాయి. మానవ సంబంధ ఇతివృత్తాలు, పల్లె వాతావరణం, ముఖాలలో ప్రసన్న వదనం, నిజాయితీ నిండిన అమాయకపు మట్టిమనుషులు ప్రతి చిత్రంలోనూ ఉంటారు. వారిచుట్టూ ఆయా సందర్భానుసారమైన పల్లె సంబంధ జీవిత చిత్రణ పంచుకొని ఉంటుంది.
ఇలా “కుంచెముద్రలు” పుస్తకంలో తనదైన ముద్ర వేసుకున్న చిత్రాలు మనకందించారు. వీరు కళలోనూ, అంతే ప్రతిభతో సాహిత్యంలోనూ కృషి చేశారు. కలం కుంచెలతో అద్భుతాలు సృష్టించారు. చిత్రకళలోని అన్ని మాధ్యమాలలోనూ చిత్రాలు చిత్రించారు. అదేవిధంగా సాహిత్యంలో కథ, కవిత, నవల, వంటి అన్ని సాహితీప్రక్రియలలోనూ తన ప్రతిభ చూపి చదువరులను, కళాప్రేమికుల మనస్సు గెలుచుకున్నారు.
-ఎల్. ఆర్.వెంకటరమణ,
చిత్రకారుడు, చిత్రకళా విమర్శకుడు
సెల్: 98661 58908











