చిరంజీవికి విశిష్ట గౌరవం

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు..
హైదరాబాద్‌: నాలుగు దశాబ్దాలకుపైగా సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గానూ ఇటీవల పద్మవిభూషణ్‌ అవార్డును సొంతం చేసుకున్న ఆయన తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్‌ బుక్‌ వరల్‌ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు, బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్‌, కోదండరామిరెడ్డి, గుణశేఖర్‌, బాబీతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్‌, అశ్వనీదత్‌, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, సురేశ్‌ బాబు, జెమిని కిరణ్‌, మైత్రి రవిశంకర్‌, తమ్మారెడ్డి భరద్వాజ, కెఎస్‌ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ‘పునాదిరాళ్ళు’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చిరంజీవి. కెరీర్‌ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని.. స్టార్‌ హీరోగా ఎదిగారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన, డ్యాన్సులతో యువతను ఉర్రూతలూగించారు. బాక్సాఫీస్‌ రికార్డులు క్రియేట్‌ చేశారు. 9 ఫిలింఫేర్‌, 3 నంది అవార్డులతోపాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలు గుర్తించిన ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్‌, 2024లో పద్మవిభూషణ్‌ అందించి గౌరవించింది. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ’విశ్వంభర’ కోసం వర్క్‌ చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry