సియోల్ (దక్షిణ కొరియా): ప్యాసింజర్ విమానం ఒకటి దక్షిణ కొరియాలోని మువాన్ పట్టణం విమానాశ్రయం వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 179 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ప్రమాదం జరిగినప్పుడు విమాన సిబ్బందిసహా మొత్తం 181 మంది ఉన్నారు. సిబ్బందిలో ఇద్దరు మినహా మిగతా అందరూ ప్రాణాలు కోల్పోయారు. అధికారిక ప్రకటనను అనుసరించి, స్థానిక కాలమానం ప్రకారం, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి దక్షిణ కొరియా వస్తున్న జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆదివారం ఉదయం 9 గంటలకు, సియోల్‌కు సుమారు 290 కిలోమీటర్ల దూరంలోని ముయాన్ విమానాశ్రయం సమీపంలో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల చక్రం తెరచుకోలేదని, ఫలితంగా విమానం రన్‌వేను రాసుకుంటూ ముందుకు వెళ్లి, కాంక్రీట్ గోడను బలంగా ఢీకొందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గోడను ఢీ కొట్టడంతో ఇంధనం ఒక్కసారిగా మండిందని, ఫలితంగా మంటలు వ్యాపించాయని అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 32 అగ్మిమాపక ట్రక్కులు, హెలికాప్టర్ల సాయంతో మంటలను అదుపు చేసినట్టు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇద్దరు మినహా విమానంలో ఉన్నవారంతా మృతి చెందారని తెలిపింది. ఇలావుంటే, ప్రమాదానికి గురికాకముందు విమానాన్ని ల్యాండ్ చేయడానికి పైలట్లు చేసిన మొదటి ప్రయత్నం విఫలమైందని విమానాశ్రయం అధికారులు అంటున్నారు. రెండోసారి ప్రయత్నం చేసినప్పుడు ఈ ఘోరం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇలావుంటే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెలుగు చూడలేదు. విమానం ముందు చక్రాలు తెరుచుకోకపోవడానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్టు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రకటించింది. పక్షుల గుంపు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని కొంత మంది అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పలు దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
