గ్రహాంతర వ్యవసాయంపై మానవుడి కన్ను

చంద్ర,అంగారక గ్రహాలు కొంత అనుకూలం

మానవుడు సృష్టిలోని గ్రహాలను కనుగొనడం తోపాటు వాటిలో కొన్నింటిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఇప్పటికే భూమండలాన్ని నివాసయోగ్యంతో పాటు వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. వ్యవసాయం ద్వారా ఆహారం పండిస్తున్నారు.భూమి సారాన్ని పూర్తిగా ఎక్సప్లాయిట్ చేయడం జరిగింది.ఒక్క భూగోళాంలోని జనాభాకు 1.7 భూగోళాల సరిపడినంత వనరులను ఉపయోగిస్తున్నారని ఒకసర్వేలోతేలింది. ఇదే కొనసాగితే 2050 నాటికి మూడుగోళాలకు సరిపడా వనరులు అవసరమవుతాయని ఒక అంచనా.భూమిపుట్టినప్పటినుంచి వైపరీత్యాల వల్ల ఐదుసార్లు జనాభా అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ప్రస్తుతం మానవుడు ప్రకృతిని ధ్వంసం చేసి తాను సౌకర్యాలను పెంచుకుంటున్నారు. అది తాత్కాలికమేనని శాస్త్ర వేత్తలు భావిస్తున్నారు. ఏ సమయంలోనైనా ప్రకృతి ప్రకోపించి భూమి మీద జీవరాసులు అంతరించిపోయే అవకాశం ఉంది.అది ఒక మహమ్మారి కావచ్చు.గ్రహశకలం భూమిని ఢీకొనడంవల్ల కావచ్చు.వాతావరణ మార్పులు వల్ల కావచ్చని శాస్త్రవేత్త లు అంచనా వేస్తున్నారు.అందుకని ఈ విపత్తు సంభవించే ముందే కొత్త ఆవాసం వెతుక్కునే పనిలో మానవుడు పడ్డాడు.దానికోసం పరిశోధనలను ముమ్మరం చేసాడు.చంద్రగ్రహం,ఆంగారకగ్రహాల్లో కొద్దిపాటి మార్పులు చేసుకుని నివసించే ఏర్పాట్లు చేసుకోవాలని పరిశోధనలు ప్రారంభించారు. ఆవాసం దొరికితే చాలదు కదా.ఆహారం కావాలి కదా.అందుకు అక్కడ కావలసిన పంటలు పండించడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలను శీర్ఘతరం చేస్తున్నారు.1969వ సంవత్సరంలో అమెరికా అంతరిక్ష కేంద్రం చంద్రుని మీదకు ఉపగ్రహాన్ని పంపింది.ముగ్గురు వోమ్యగాములు విజయవంతంగా చంద్రుని మీద అడుగిడి భూమిమీదకు సురక్షితంగా తిరిగి వచ్చారు.అప్పటినుంచి అనేక దేశాలు చంద్రునిపై కి ఉపగ్రహాలను పంపడం,అక్కడి వాతావరణం పై పరిశోధనలు ప్రారంభించారు. భారత్ కూడా చంద్రుని మీద ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది.అమెరికా,చైనా,భారత్ లు గ్రహాంతర వ్యవసాయంపై దృష్టి పెట్టాయి.ఇటీవల అంగారక(మార్స్)గ్రహం పైకూడా మానవ ఆవాసం యోగ్యమైనదా కాదా అనే అంశంపై పరిశోధనలు ఊపందుకున్నాయి. ఒకసారి ఈ రెండు గ్రహాలు ఎంతవరకూ వ్యవసాయ యోగ్యమైనవనే అంశం పరిశీలిద్దాం
చంద్రుడిపై భూమిపై లాగా గాలి మండలం ఉండదు.అక్కడి ఉష్ణోగ్రతపై నియంత్రణ ఉండదు.పగలు 127 డిగ్రీలు,రాత్రి మైనస్ 173 డిగ్రీల వరకూ ఉంటుంది.అలాగే పంటలు పండించాలంటే నీరు అత్యంత ముఖ్యం.అక్కడ మంచు ఉందని కనుగొన్నారు.ఈ మంచును నీరుగా మార్చే అవకాశం ఉంది.చంద్రునినేల భూమిలోని నేలలా సారవంతం కాదు.దానిలో పోషకాలు లేవు.ఈ నేల మొక్కలకు హానికరమైన సూక్ష్మ కణాలతో నిండి ఉంది.అలాగే గురుత్వాకర్షణ తక్కువగా ఉంది.భూమితో పోలిస్తే1\6 వంతు మాత్రమే.
చంద్రునిపై గాలి,నీరు,తగిన ఉష్ణోగ్రతలు నియంత్రించగల డోమ్ లను నిర్మించడం ద్వారా మొక్కలను పెంచే అవకాశం ఉంది.భూమి లేకుండానే నీటిలో హైడ్రో ఫోనిక్స్,గాలిలో ఏరోపోనిక్స్ ద్వారా మొక్కలను పెంచుకోవచ్చు.అధిక ఉష్ణోగ్రతలు,తక్కువ నీటిని ఉపయోగించి విత్తనాలను రూపొందించి ఫలితాలను సాధించే అవకాశాలు ఉన్నాయి.భూమి నుంచి హ్యూమస్, మైక్రోబ్స్ తీసుకు వెళ్లి చంద్రుని నేలలో కలిపితే వ్యవసాయం చేసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.నాసా,చైనా అంతరిక్ష సంస్థలు మొక్కలు పెంచే ప్రయోగాలు ప్రారంభించారు.చైనా మిషన్ పత్తి మొక్కను మొలిపించింది.కాని ఎక్కువ కాలం బతకలేదు.అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో భవిష్యత్తు లో చంద్రునిపై సాగు సాధ్యం అయ్యి పంటలు పండే అవకాశం ఉంది.దాంతో పాటు అక్కడి స్ధిర నివాసం, అంతరిక్ష యానాలు అవసరమవుతాయి.
చంద్రునిపై వాతావరణం,అంగారకుడిపై వాతావరణం కొంచెం భిన్నంగా ఉన్నా గ్రహాంతర వ్యవసాయానికి తీసుకునే చర్యల్లో సారూప్య ముండే అవకాశం ఉంది.అంగారకుడిపై ఉష్ణోగ్రత తక్కువ, చలి వాతావరణం ఎక్కువ.సరాసరి ఉష్ణోగ్రత మైనస్ 63 డిగ్రీలు,చలికాలం మైనస్ 125 డిగ్రీల వరకూ ఉంటుంది.గాలి కూడా తక్కువ.గాలిలో 95 శాతం కార్బన్ డయాక్సైడ్ ఉంది.మానవులకు,మొక్కలకు కావలసిన గాలి అందుబాటులో ఉండదు.మంచు ఉన్నా కరిగించాలి.అలాగే మట్టిలో పోషకలేమి, గురుత్వాకర్షణ భూమితో పోల్చితే 38 శాతం మాత్రమే ఉంది.చంద్రుని వలె ఇక్కడ మొక్కలు పెంపకానికి పరిశోధనలు జరుగుతున్నాయి. చంద్రుడు,అంగారకుడిపై వ్యవసాయం కోసం చేసే పరిశోధనలు భూమికి కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి.అవి ఫలిస్తే ఎడారి ప్రదేశాలలో కూడా పంటలు పండే అవకాశాలు మెరుగవుతాయి.
గ్రహాంతర వ్యవసాయంలో భారత్ కూడా ముందడుగు వేసింది.తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం రూపొందించిన క్రాప్స్ అనే చిన్న పెట్టెలో అలచందగింజలు ఉంచి సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో రెండు ఆకులు దశవరకూ పెంచారు.అమిటీ విశ్వవిద్యాలయం స్పేస్ పేలోడ్ లో పాలకూర కణజాలం అభివృద్ధి చేసారు.ఈ రెండు ప్రయోగాలు విజయవంతమవడంతో భారతీయ గ్రహంతర వ్యవసాయానికి మైలురాయిగా నిలిచాయి. మరికొన్ని దేశాలు క్యాబేజీ,ఆవాలు కూడా పెంచారు.ఇప్పటికే భారత్ వ్యవసాయానికి ఉపయోగపడేలా ఇన్సాట్,రీసాట్ ఉపగ్రహాలనుప్రయోగించారు.అవి అనేక రకాల సమాచారాన్ని అందిస్తున్నాయి.భూమిమీద వ్యవసాయ ప్రాంతాన్ని కవర్ చేయడానికి రెండు ఉపగ్రహాలు అవసరమవుతాయని ఇస్రో చైర్మన్ చెప్పడం గమనార్హం.ఏదిఏమైనా భవిష్యత్తు లో గ్రహాంతర వ్యవసాయం వాస్తవరూపంలోకి రావడం ఖాయం.అక్కడ వ్యవసాయంతో పాటు ఆవాసానికి రెడీ అయ్యే రోజు అతి దగ్గరలో ఉంది.అంత మాత్రాన భూమిని నిర్లక్ష్యం చేయరాదు.భూమిని రక్షించుకుంటూ గ్రహాంతర వ్యవసాయం చేయడం మానవుడి జీవితంలో మైలురాయి అవుతుంది.అందుకోసం మన భావి తరాలను పరిశోధనా బాట పట్టిద్దాం.

(యం.వి.రామారావు, ప్రత్యేక ప్రతినిధి)

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry