తెలంగాణ అమ్మ గా ప్రకటించుకున్న కవిత
“ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది”. దేవులపల్లి గీతం అక్షరాల నిజమని పించింది.రెండేళ్లు సమయం ఉండగానే ఎన్నికల ప్రచారం ముందుగానే ప్రారంభించింది కేసీఆర్ కుమార్తె,కల్వకుంట కవిత. తనను తాను తెలంగాణ అమ్మ గా ప్రకటించుకుంది.తండ్రితో విభేదించి సొంత పార్టీ పెట్టుకుంది.పేరుకూడా పాత అర్ధం వచ్చేలా పెట్టుకుంది.ఇది ఒకరకంగా బీఆర్ ఎస్ కు ఊహించిన షాక్ అయినా పేరు టీఆర్ ఎస్ గా పెట్టడం గట్టి షాక్. కేసీఆర్ 2000 సంవత్సరంలో టీఆర్ఎస్( తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ పెట్టి 2014 లో తెలంగాణ సాధించి అధికారం చేపట్టారు.పదేళ్ల పాలనలో ఆయన చేసిన పొరబాట్లను భూతద్దంలో చూపి ఆయనను జీరో చేసి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాడు. ప్రజలతరుఫున ప్రతిపక్ష నేతగా పోరాడాల్సిన కేసీఆర్ ఆ బాధ్యతను కేసీఆర్, హరీష్ లకు అప్పజెప్పి ఫాం హౌస్ కు పరిమితం అయ్యారు. ఎన్నికల ముందు పార్టీపేరు బీఆర్ఎస్ గా మార్చడం కూడా ఓటమికి ఒక కారణంగా నాయకులు,కేడర్ భావిస్తున్నారు.త్వరలో మళ్లీపేరుమార్చాలని ఆలోచనలో పడింది. టీఆర్ ఎస్ పేరు కు ఉన్న క్రేజ్ ను గ్రహించిన కేసీఆర్ కుమార్తె ముందుగానే తన పార్టీ పేరు టీ ఆర్ ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) గా మార్చి తండ్రికి షాక్ ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో తామే అధికారంలోకి రానున్నామని, తనను తెలంగాణ అమ్మగా ప్రకటించుకుంది. తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చే అమ్మగా అవతరిస్తానని చెప్పుకొచ్చింది. తమిళనాడులో జయలలిత స్థాయిలో ఘనంగా భావిస్తున్నది. పార్టీ పెట్టిన మొదటిరోజే హామీలు కుమ్మరించింది. తాము అధికారంలోకీ రాగానే విద్య, వైద్యం ఉచితంగా ఇస్తానని ప్రకటించింది. ఇది మంచి హామీని గాని ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం అంత వీజీ కాదు.ప్రైవేట్ విద్యాలయాల్లో చదివేవారి ఫీజులు చెల్లిస్తామని హామీ ఇచ్చింది.వైద్యం కూడా ప్రైవేట్ వైద్యశాలలో అయినా ఓకే అన్నట్లు పేర్కొంది.ఇప్పటి ప్రభుత్వాలు కార్పొరేట్ హస్పటల్స్ కు చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించలేకుంది. కవిత తెలంగాణా ప్రజలందరికీ ఉచిత వైద్యం ఇస్తానంటోంది. ఇది ఎంతవరకూ అనేది అనుమానమే. మూడు హామీ రైతు రాజు అంటూ రైతు ఇంటి ముంగిట ఎరువులు సరఫరా చేస్తానంది. నాలుగోది ఉపాధి రూపంలో భారీగా రుణ సదుపాయం రూ.2 లక్షల నుంచి 2 కోట్ల వరకూ కల్పిస్తామంది. తొలిఏడాదిలోనే నాలుగులక్షల ఉద్యోగాలు కల్పిస్తామంది. ఐదోహామీ సాంఘిక న్యాయం కల్పిస్తామన్నారు చెప్పింది.
తన తండ్రి ఉద్యమకారులకు న్యాయం చేయలేదని, తాను కొన్నాళ్లు ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం వల్ల క్షమాపణలు చెప్పుతున్నానంది. ఇప్పుడు కర్కొటకుడి (రేవంత్) రాజ్యం నడుస్తున్నది కాంగ్రెస్ ను విమర్శించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలని కాదని కవితకు తెలంగాణ ప్రజలు పట్టం కడతారా? ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. అయినా ముందే కూసిన ఈ కోయిల ఆటుపోట్లను తట్టుకుని నిలబడాలి.
యం.వి.రామారావు















