నాటక సాహిత్యానికి అపురూప రంగుల చిత్రం ‘నాగరాజు గంధం’

నాటకం అంటే మూడు అక్షరాల పదం మాత్రమే కాదు… మానవజాతి మనుగడకు నాలుగు దిక్కులు కలిసి, అఖండమైన ఒక దిక్కుగా మారితే, అదే నాటకమవుతుంది. ఒక పరిపూర్ణమైన తీరానికి మనిషి జీవితాన్ని చేర్చటానికి సిద్ధంగా ఉంచిన ఒక అద్భుతమైన నౌకా నిర్మాణమే నాటకం. మామూలు మనిషిని మహనీయుడిగా, మహనీయుడిని మహాత్మునిగా తీర్చిదిద్దటానికి సకల శాస్త్రాల సారం బడి గంటగా మ్రోగితే, ఆ శబ్దానికి కేంద్రమైన పాఠశాల పేరే నాటకం. నాటకమంటే సమాజ అస్తిత్వ రక్షణ బాధ్యత నాదేనంటూ రాసిచ్చిన ఒక హామీ పత్రం. అలాంటి నాటకానికి ఓ అందమైన సంతకం రచయిత ‘నాగరాజు గంధం’.

నాటక రచయిత నాగరాజు తన 14వ ఏటనే ‘ప్రెసిడెంట్ పేరయ్య’ అనే నాటికను రాసి హైస్కూలు నందు ప్రదర్శించారు. ఆ పునాది మీద అద్భుతమైన నాటక సాహిత్యాన్ని నిర్మిస్తూ తన జీవిత కాలంలో తొమ్మిది నాటికలు, నాలుగు నాటకాలను రచించారు. నాటక సాహిత్యంలో ఆయన భాష్యం చాలా గొప్పది. అతడి రచనా శైలి అనితర సాధ్యమైనది. సమాజ ప్రయోజనాన్ని తలకట్టులుగా కలిగిన అక్షరాలను తన రచనలో వాడుకునేవాడు. తక్కువ కాలంలో ఎక్కువ నాటికలు, నాటకాలు రాసిన నాటక రచయిత నాగరాజు గంధం. ఆయన కలం నుంచి వెలువడిన ‘దివ్యధాత్రి’, ‘మిథ్యాబింబం’, ‘వలస’, ‘రంగులరాట్నం’ అనే నాలుగు నాటకాలతో “నాగరాజు గంధం – నాటక సాహిత్యం” అనే గ్రంథం వెలువడింది.

నాలుగు నాటకాలు కలిగిన ఈ పుస్తకాన్ని తెరిస్తే అందులో అక్షరాలు లేవు. ఉన్నవన్నీ జీవితాలే. ఇందులోని పాత్రల సంభాషణల్ని మనం చదవనక్కరలేదు. వాటిని తాకితే చాలు అవి శబ్దాలై, నాదాలై, శోకాలై, గుండె సవ్వడులై, నిప్పు కణాల వేడి సెగలై, నిలువునా ముక్కలైపోయిన మనిషి అవయవాల అవశేషాలై, ఆడదాని శీలం మగవాడి ఆనందమనే ఉరితాడుకు వేలాడుతున్న శవాలై, మానవ సంబంధాల మీద స్వారీ చేసే ఆర్థిక సంబంధాల వికృత రూపాలై, చివరకు మానవత్వం ఆత్మను కోల్పోయి మసిగా మారిన దృశ్యాలై మనల్ని చేరుతాయి, పలకరిస్తాయి, సమాధానాలు చెప్పమని నిలదీస్తాయి. అవి చలిస్తూ, మనల్ని చలింపజేస్తాయి. కదులుతూ మనల్ని కదలమంటాయి. మనసుంటే సమాజం కోరే మార్పు కోసం మనిషిగా ఒక్క అడుగు ముందుకు వేయమని ప్రార్థిస్తాయి. కొన్ని సందర్భాల్లో శాసిస్తాయి కూడా. ప్రపంచ మానవాళి ముక్తకంఠంతో గొంతెత్తి అరిచే మాట ఏమిటంటే హింస భయంకరమైనది. విశ్వంలో హింసకు తెర వేయవలసిందే; హింస ఏదైనా, ఏ రూపంలో ఉన్నా, ఎవరు కోరుకున్నా సరే ఆ హింసను వ్యతిరేకించవలసిందే… ఇదే నినాదం ‘దివ్యధాత్రి’ నాటకం నిండా ప్రతిధ్వనిస్తుంది.

ఈ నాటకాలలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఎత్తుగడ, ముగింపులు అద్భుతంగా ఉంటాయి. నాటకంలోని ప్రారంభ సన్నివేశాలు మొత్తం ప్రేక్షకులను తన గుప్పిట్లోకి తీసుకుంటాయి. ఇక నాటకం ముగింపు ప్రేక్షకులను విశ్రాంతి తీసుకోనివ్వదు. తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ‘దివ్యధాత్రి’ నాటకంలో ప్రారంభ సన్నివేశం ఒక ఆశ్రమం. తెర తీయగానే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ‘జయ, జయ, జయ, ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి’ గీతంతో నాటకం ప్రారంభమవుతుంది. ఈ నాటకంలో అనేక సన్నివేశాలలో హింసకు వ్యతిరేకంగా కొన్ని పాత్రలు పలికిన మాటలు, సాక్షాత్తు రచయిత మనసులోని మాటలే. తాను నమ్మిన సిద్ధాంతాన్ని చాలా బలంగా కొన్ని పాత్రల ద్వారా వ్యక్తపరుస్తారాయన. ఒకచోట ‘తిరగబడటమంటే నిర్మూలన కాదు, నిలబెట్టటం, సంస్కరించటం..’ అంటారాయన.

అటు నక్సలైట్ల ఉద్యమాలకు, ఇటు పోలీసుల దాడుల మధ్య కోడి పిల్లల్లా బలైపోయిన యువతను, ఆ పేద కుటుంబాల దీన వ్యధలను బలమైన సన్నివేశాలతో ఈ నాటకాన్ని నడిపిస్తారు రచయిత. డబ్బు చేస్తున్న ఇంద్రజాల, మహేంద్రజాలంలో మనిషి తన వికృత రూపాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాడో తెలియజేసే నాటకం ‘మిథ్యాబింబం’.
____________________

‘డబ్బు కంటే విలువైనవి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. గడిచిపోయిన కాలాన్ని, వెలకట్టలేని అనుభూతుల్ని, అమ్మ ప్రేమను, నాన్న కష్టాన్ని ఎంత డబ్బు పోసినా వాటిని కొనలేం. ప్రపంచంలోని మొత్తం డబ్బు మనిషి కోసం కావచ్చు. కానీ మనిషి మాత్రం ఏనాడు డబ్బు కోసం బ్రతకకూడదు…’ అని చెబుతుంది ఈ నాటకం. ఫాంటసీ ప్రక్రియలో ఈ నాటకాన్ని రచయిత రచించారు. వాస్తవిక ప్రపంచంలో పునాదులు లేని ఫాంటసీని నాటకంలో ప్రవేశపెట్టాలంటే రచయితకు చాలా నేర్పు అవసరం. పుట్టుకతోనే ఆ నేర్పు తన సొంతమని ఈ నాటకం ద్వారా రచయిత నిరూపించుకున్నారు.
___________________

ఈ నాటకంలో డబ్బు అహంకారంతో విర్రవీగే ధనవంతుడు కె.కె. కష్టపడకుండా కోట్లు సంపాదించాలనే ఆలోచన కలిగిన సామాన్యుడు నవ్యసాచి. వీళ్లిద్దరి మధ్య ప్రధానంగా నాటకం జరుగుతుంది. ఒకానొక సందర్భంలో కొన్ని ఒప్పందాల మధ్య ఒకరిలోకి మరొకరు పరకాయ ప్రవేశం చేస్తారు. అక్కడి నుంచి నాటకం చాలా గమ్మత్తుగా ఊహకు అందని స్థాయిలో సాగిపోతుంది. ప్రపంచంలో డబ్బుకంటే విలువైన మానవతా విలువలు ఎన్నో ఉన్నాయన్న ఒక ఉదాత్తమైన సందేశాన్ని ఈ ప్రపంచ మానవాళికి అందించి ఈ నాటకం ముగుస్తుంది.

ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో తలెత్తే సవాళ్లను, సమస్యలను, వివిధ రాజకీయ నాయకుల విరుద్ధ పోకడలను, కుటిల రాజకీయాలను, ప్రజలను పావులుగా వాడుకునే సందర్భాలను, వ్యవసాయం ఎదుర్కొనే నీటి ఇక్కట్లను చాలా సమర్థవంతంగా, సజీవంగా నాగరాజు గంధం “వలస” నాటకంలో చిత్రీకరించారు.

వరద బీభత్స దృశ్యంతో ఈ నాటకం ప్రారంభమవుతుంది. ఇందులో జాలయ్యది అద్భుతమైన పాత్ర. రెండు వర్గాల మధ్య తీవ్రంగా ఏర్పడిన సమస్యను తన జీవిత అనుభవంతో పటాపంచలు చేసి, చివరకు ప్రజల కోసం, రైతుల నీటి దాహం తీర్చటం కోసం, ఒక శాశ్వత జలనిధి కోసం తన ప్రాణాలనే అర్పిస్తాడు. కేవలం ప్రజలు మాత్రమే కాదు, పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి పార్టీ నాయకులు చూసి తీరవలసిన నాటకం ఇది. రచయిత రాసిన సంభాషణలు ఎంత అర్థవంతంగా ఉంటాయో, ఎంత బలంగా ప్రేక్షకుల హృదయాలలో నాటుకుపోతాయో చెప్పటానికి ఈ నాటకంలో చాలా సన్నివేశాలున్నాయి.

“తల్లి కడుపున పుట్టిన ప్రతి బిడ్డ తన తల్లి ఎవరో గుర్తు చేసుకుని ఆనందిస్తారు. మేమూ ఒక తల్లి కడుపున పుట్టినవాళ్లమే… కానీ మా తల్లి ఎవరో గుర్తు చేసుకోలేని దౌర్భాగ్యులం మేము…” ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు, గుండె పగిలితే ఆ ముక్కల చాటు నుంచి తొంగిచూస్తున్న నిర్భాగ్యులైన రికార్డు డ్యాన్సర్లు. వాళ్లు కార్చిన కన్నీటి చుక్కల శబ్ద తరంగాలను అక్షరాలుగా మార్చి నాగరాజు గంధం రాసిన నాటకమే ‘రంగులరాట్నం’.

ఇందులో రంగులు లేవు.. అన్నీ వేదనలే. ఇక్కడ తిరుగుతున్నది రాట్నం కాదు, హృదయవేదనతో సాగుతున్న జీవితాలు. అవమానాల అంగవస్త్రాలను ధరించి, అసహ్యం అనే నిప్పుల మీద ఊరూర వేదికల సాక్షిగా ఒకప్పుడు రికార్డు డ్యాన్సులు చేస్తూ, దయనీయంగా బ్రతికిన స్త్రీల జీవితాలను ఈ నాటకంలో మనం దర్శించవచ్చు.

‘సీసాకి మూత ఉంటుంది కానీ మనిషికి మాత్రం నీతి ఉండదు…’ అంటూ ఈ నాటకం ఒక గొప్ప మాటతో ప్రారంభమవుతుంది. పతాక సన్నివేశంలో అర్ధనగ్న నృత్యాలను చూసేందుకు గోల చేస్తున్న జనం ముందుకు ఒళ్లంతా రక్తం కారుతూ కుమారి అనే పాత్ర వచ్చి… ‘అరవండి. మరింత పూనకాలు వచ్చి ఈ మండపం కూలిపోయేలా అరవండి. ఒంటి మీదనున్న ఒక్కొక్క బట్టను మేము విప్పుతూ ఉంటే ఆకాశం కుంగిపోయేలా అరవండి. మీ అరుపులకు ఏకంగా ఆ దేవుడి గుడి ముక్కలైపోయేలా అరవండి. పవిత్రమైన భగవంతుడి ఉత్సవాన్ని చూసిన మీ కళ్ళతో అంతకు మించిన పుణ్యాలు ఇంకా మాలో ఏం చూద్దామని ఇక్కడికి వందల సంఖ్యలో మీరంతా వచ్చారు. మీ ఇంట్లో ఆడవాళ్లకు లేనిది, మాలో ఉన్నవి ఏమున్నాయని చూడ్డానికి వచ్చారు. మీ అక్క, చెల్లికి, మీ తల్లి, కూతుళ్ళకి ఇవ్వనివి కొత్తగా మాకేమీ దేవుడు ఇవ్వలేదు. కావాలంటే చూడండి…’ అంటూ ఎదపై పైటను తొలగించి తన బాధను ఆవేశంగా వ్యక్తంచేస్తుంది కుమారి. సినిమా పాటలకు స్టేజీల మీద డ్యాన్సులు చేస్తూ బ్రతికిన జనం బాధల్ని మొదటిసారిగా నాటకంగా మలిచిన గొప్ప నాటక రచయిత నాగరాజు గంధం.

ఈయన నాటక రచన గొప్పగా నిలవటానికి మూడు కారణాలు. ఒకటి… తీసుకున్న వస్తువులో వైవిధ్యముండటం. రెండు… నాటక ప్రదర్శనలో నూతనత్వాన్ని చూపించటానికి తన రచన సహకరించటం. మూడు… నాటక రచన నడకలో శిల్పం ప్రాధాన్యతను ఆయన గుర్తించి, నాటక రచన మొత్తాన్ని ఒక అద్భుతమైన శిల్పంగా మలచటం. నాటక సాహిత్యాన్ని తన శ్వాసగా మార్చుకున్న నాగరాజు గంధం, 2011లో 44 సంవత్సరాల వయసులోనే ఈ లోకాన్ని వీడి తెలుగు నాటకరంగాన్ని తీవ్రమైన విషాదంలో ముంచివేశారు. భౌతికంగా ఆయన దూరమైనా, మంచి రచయితగా, మిత్రుడిగా, మానవతావాదిగా శాశ్వతంగా మన మధ్య జీవించే ఉంటారు.

 

-సాహిత్య ప్రపూర్ణ డాక్టర్ కె.జి. వేణు
98480 70084