​‘ఖాళీసీసాలు’ వెనుక దాగి ఉన్న విలక్షణ కవి స్మైల్

తెలుగు సాహిత్యంలో మౌలికత (Originality) మరియు పరిశీలనా దృష్టికి మారుపేరుగా నిలిచిన రచయిత స్మైల్. ఈయన అసలు పేరు ఇస్మాయిల్. ఒకవైపు వాణిజ్యపన్నుల శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తూనే, మరోవైపు తన అంతర్ముఖత్వంతో కూడిన సాహిత్య సృష్టిని కొనసాగించారు. ​ ‘కథకుడిగా’ ఆయన పేరు చిరస్మరణీయం. ముఖ్యంగా సామాజిక వాస్తవికతను, దిగువ మధ్యతరగతి జీవన సంఘర్షణను, మరియు మానవ సంబంధాలలోని సంక్లిష్టతను తన కథల్లో పొందుపరిచారు. ఆయన కథా సంపుటి ‘ఖాళీసీసాలు’ తెలుగు కథా చరిత్రలో ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది.

1960 -80ల మధ్యలో మంచి కథలు, కవిత్వం, నాటకం, అనువాదాలు, లేఖా సాహిత్యం, సంపాదకత్వం,సమీక్షలు రాసి సాహితీప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప సాహితీవేత్త. రాసిన ప్రతిపదంలోనూ పరిపూర్ణత ఉండాలని తపనపడే కొద్దిమంది రచయితలలో స్మైల్ ఒకరు. ‘చాలా నిదానంగా రాసే రచయితను నేను’ అని చెప్పుకున్న స్మైల్ కవిత్వంలో అజంతా లా, కథల్లో త్రిపుర లా ‘పరిపూర్ణత’ కోసం ప్రయత్నించిన ఉత్తమ రచయిత.
________________

స్మైల్ సమాజంలోని పేదరికాన్ని, ఆవేదనలను, ఆవేశాలను,మానవీయ విలువలకు జరుగుతున్న విఘాతాన్ని, ఆర్తిని, దగాను తన కథలో ప్రతిఫలింపజేశాడు. సమకాలీన సమాజంలోని అస్తవ్యస్త, అసంబద్ధ పరిస్థితుల గురించి, అందుకు మూలకారణమైన ఆర్థిక సామాజికత గురించి ఆలోచింపచేసే ‘ఖాళీసీసాలు, వల, కంబళి, సిగరెట్, ఇదీవరస, పృథ్వి, సముద్రం, నిద్ర, గొడుగు’ వంటి కథలు రాశాడు.
_________________

కొన్ని సందర్భాల్లో సెక్స్ పరమైన కోరికలు చేసే అలజడికి అక్షర రూపం కనిపిస్తుంది. ఇలా ఏ నేపథ్యంలో కథలు రాసినా, కథ వెనుక గల తాత్విక భావపు ఆవిష్కరణ కంటే పాత్రల హృదయపు లయ స్పష్టంగా వినపడాలనే తపన ఆయనలో కనిపిస్తుంది. ఖాళీసీసాలు కథ ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ కథ పేరు మీదే ‘ఖాళీసీసాలు’పుస్తకం ముద్రణ అయ్యింది.

ఖాళీసీసాలు కథలో పేదరికం, తల్లిని బ్రతికించుకోలేని ఒక దీనుడు, ధర్మాసుపత్రులలో పరిశుభ్రతలేమి, వ్యభిచారం మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. వ్యక్తి అంత:సంఘర్షణ ఈ కథలో కనిపిస్తుంది. “అతను కేజీ హాస్పిటల్ వరండాలో నడుస్తున్నాడు-బయటికి రావడానికి గేటు దగ్గరికి అతను మొహం పాత బ్రౌన్ పేపర్ లా ఉంది. అతని చొక్కా పాలిపోయిన నీలిరంగులు అతనిది కానట్టుగా ఉంది. పైజామాలా ఉన్న ప్యాంటు ఇస్త్రీ మడతలు పోయి మోకాళ్ళ ముందు అసహ్యంగా ఉబ్బి వుంది. హాస్పిటల్ వరండాలో నుంచి అతను బయటికి వచ్చి గేటు దగ్గర నిలబడ్డాడు. అతని వెనుక నిస్తేజంగా రోగిలా ఉంది హాస్పిటల్”. ఇలా ఆ వ్యక్తికి ఆసుపత్రి ఒక రోగిలా కనీసం తన తల్లికి డాక్టర్ గారు రాసి ఇచ్చిన మందును పోసుకోవడానికి ఖాళీసీసాను కొనడానికైనా జేబులో చిల్లి గవ్వలేని వాడిగా అతని దీన పరిస్థితి కనిపిస్తుంది.

ఇంకా ఈ కథలో కొంచెం అందంగా చూపరులను ఆకట్టుకునేలా కట్టు, బొట్టూ ఉన్న పైడి, వృద్ధాప్యంలో అందచందాలు లేని నూకాలమ్మ వీరిద్దరి మధ్య ఖాళీసీసాను అమ్మే విషయంలో జరిగిన సంఘర్షణ చివరికి పైడి వెళ్లి బస్సు కింద పడి చనిపోవడం, ఈ కథలోని వివిధ సంఘటనలు పాఠకలోక గుండెల్ని కదిలిస్తాయి. “పైడి ఏటే నంజకా! నూకాలమ్మా! సీసా నేనమ్మనిదాన్ని! నువ్వమ్మేదాన్వటే! బేడకిచ్చేసినాది ఓయబ్బ ఈ అన్నపూర్ణ! నా కాడికొస్తాన్నవాణ్ణి బేడని ఆశచూపి సీసా అమ్మేశావే నీతి లేని నంజ”. ఇలా కథ ముగింపు అయ్యేవరకు వారి దీన పరిస్థితులు చిన్న ఖాళీసీసా కోసం మొదలైన సంఘర్షణ చివరికి చిలికి చిలికి గాలి వానై నూకాలమ్మ పైడి బట్టలు లాగేయడం పైడి సిగ్గుతో వెళ్లే బస్సు కిందపడి చనిపోవడంతో ఈ కథ దుఃఖాంతమవుతుంది.

స్మైల్ తన వచన కవిత్వాన్ని హరివిల్లు, నిరీక్షణలో నిద్ర (1963) కవితలతో ప్రారంభించాడు. తన కవిత్వంలో అనేక ప్రయోగాలు చేసిన గొప్ప రచయిత. ప్రయోగాలు స్మైల్ విశిష్ట వ్యక్తిత్వానికి, భాషలో తనదైన శైలిని అన్వేషించడానికి పడిన తపనకు ప్రతిబింబాలు.

స్మైల్ హరివిల్లు కవితలో ఇంద్రధనస్సును వర్ణించిన తీరు అద్భుతం. వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత ఒక్కొక్కసారి ఆకాశంలోని హరివిల్లు విరిసినప్పుడు ఆ దృశ్యం చూపరులకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఆ సమయంలో హరివిల్లును వర్ణిస్తూ “నీలాకాశం/ నీ రెండు/ టెరిలిన్ వాన తుప్పర/ హరివిల్లు” అని స్మైల్ అంటాడు. అలాగే ఇదే హరివిల్లును తారు రోడ్డు మీద చిత్రీకరించి ప్రయోగాత్మకంగా పాఠక లోకానికి చెప్పాడు. “తారురోడ్డు/ పాత చీరమీద/ కొత్త అతుకుల్లాగ/ బతుకుల్లో వాన నీళ్ళు”. చెడిపోయిన లారీలోంచి ఒలికిపోయిన డీజిల్ ఆయిల్ నీటిలో కలిసిన దృశ్యాన్ని ‘హరివిల్లు’గా భావిస్తూ “దారిలో చెడి ఆగిపోయిన లారీ/ ఒలికిపోయిన ఇంకులా/ డీజిల్ ఆయిల్/ నీటి మీద అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ /పికాసో బొమ్మలు/ కలైడో స్కోప్ లోని రంగులు/ డీజిల్ ఆయిల్ నీటిలో కలిపిన/ రోడ్డు మీద గతుకులలో/ లారీ ప్రక్కన/ హరివిల్లు రంగురంగుల ముక్కలుగా విరిగిపడి/ మెరిసింది” అంటాడు. డీజిల్ ఆయిల్ మీద వర్షం పడ్డాక ఎండవస్తే ఆవిరి వలన సప్తవర్ణాల ఆ దృశ్యం అందంగా కనిపిస్తుంది” అంటూ ఆ దృశ్యాన్ని చిత్రీకరించాడు.

నేటి సమాజంలో పెడత్రోవ పట్టే యువతరానికి స్మైల్ రాసిన ‘కటితప్పు’ కవిత చెంపపెట్టు లాంటిది. ఈ కవితలో పెళ్లికాని యువతులు చీకట్లో చేసే ‘కామ’ తప్పుల్ని ఘాటుగా విమర్శిస్తూ… “అప్పుడు/ ఆలోచించని/ ఐదు నిమిషాలు” అంటూ ఆ సమయంలో ఆలోచించిన ఐదు నిమిషాల వల్ల కలిగే గర్భాన్ని కడుపులోనే శిలువ వేస్తున్నారని “ఇప్పుడు/ కడుపులో క్రీస్తుకు/శిలువ వేస్తున్న వేషాలు” అంటూ ఆవేదన పడతాడు స్మైల్. అనైతిక సంబంధాల వల్ల లైంగిక స్వేచ్ఛ మితిమీరడం వల్ల కలిగే పర్యవసనాన్ని, చేసిన తప్పు లోకానికి తెలియకుండా ఉండటం కోసం కడుపులోనే పిండాల్ని చంపేస్తున్నారనే వాస్తవికతను స్మైల్ ఈ కవిత ద్వారా యువతకు తన అమూల్యమైన సందేశం ఇచ్చాడు.

నవ్యత, మరియు ఆధునిక భావాలతో కూడిన ప్రయోగాలు చేసిన ‘నవీన కవి’ స్మైల్. తెలుగు వచన కవిత్వంలో ఆయన ప్రయోగాలు, భావ వ్యక్తీకరణకు కొత్త మార్గాలను చూపాయి.

స్వయం కృషితో అపారమైన సాహిత్య అధ్యయనం చేసిన ఆయన, విమర్శకుడిగా కూడా సుప్రసిద్ధులు. తెలుగు సాహిత్యానికి తనదైన ముద్ర వేసిన ఈ విలక్షణ రచయిత, ఇప్పటికీ సాహిత్య పరిశోధకులకు ఒక ఆసక్తికరమైన అంశం.
________________

ఆధునిక విమర్శకులలో విలక్షణమైన వ్యక్తిత్వం గలవాడు స్మైల్. మహత్తరమైన ప్రతిభ కలిగిన స్మైల్ తన సాహిత్య విమర్శ వ్యాసాల్లో కూడా గొప్ప భావుకతను నిర్మించాడు. అంతర్జాతీయ కవి సల్మాన్ రష్డి ‘సైతాన్ గీతాల’ పుస్తకంపై స్మైల్ ఆవేదన చెందుతూ జులై 12, 1985 భారతి పత్రికలో చేసిన విమర్శ సాహిత్యలోకం ఎప్పటికీ మర్చిపోదు.
__________________

ఆధునిక తెలుగు సాహిత్యంలో స్మైల్ కేవలం ఒక ప్రక్రియ మీదనే కాకుండా అనేక ప్రక్రియలలో రచనలు చేసి సమాజంలోని వాస్తవ స్థితిగతులను పాఠక లోకానికి అందించిన విలక్షణ కవి. అపురూపమైన వెంటాడే కథలు రాసిన అక్షరశిల్పి. స్మైల్ రచనలు అస్తవ్యస్త సమాజానికి మార్పు.

(డిసెంబర్ 5, స్మైల్ వర్ధంతి)

 

 

-డా౹౹ మద్దాల పెద్దిరాజు
83092 13457

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry