ఏపీ ప్రభుత్వం ముందు నుయ్యి , గొయ్యి

హోమ్

(యం.వి.రామారావు,ప్రత్యేక ప్రతినిధి)
ఒకటో తారీకు వస్తున్నదంటే ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి దడ పుడుతున్నది.మరో మూడురోజుల్లో చెల్లించాలంటే తగిన నిధులు లేవని ఆర్ధిక శాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఫించన్లు,జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలనూ ఎలా అమలు చేస్తారో విశ్లేషకులు,కార్యకర్తలకు అర్ధంకావడంలేదు. 67లక్షల మందికి సామాజిక ఫించన్లు,ఉద్యోగుల జీతాలు,రిటైర్ అయిన వారి పింఛన్లకు1వ తేదీన చెల్లించాలి. గత నెలలో రిజర్వ్ లో ఉన్న రూ.ఏడువేల కోట్లు ఉపయోగపడ్డాయి. ఆగస్టు నెల సామాజిక పింఛన్లకు ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్ద సెక్యూరిటీల మీద రుణాలు సేకరిస్తున్నారు. ఇవి సామాజిక ఫించన్లకు, ఉద్యోగులజీతాలు ,రిటైర్ ఉద్యోగుల ఫించన్లులకు చెల్లించాల్సిన 5వేల కోట్లకు కూడా సరిపడా వస్తాయని భావిస్తున్నారు.
అధికారంలోకి వచ్చి 50 రోజులైనా గ్యారెంటీలు అమలు పై ఇంకా నిర్ణయం కాలేదు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెబుతున్నది. ఆర్టీసీ కొత్త బస్సులు కావాలంటోంది. ఈ పథకానికి ప్రతి నెలా ఆర్టీసీకీ రూ.250కోట్లు చెల్లించాల్సి ఉందని అంచనా.ఇక అన్న క్యాంటిన్లు అన్నీ ఆగస్టు 15 నాటికి సిద్ధం కాలేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. 183 క్యాంటిన్ 100 మాత్రమే సిద్ధమవుతాయని తెలుస్తున్నది.
సమగ్ర భూ సర్వేలో జగన్ ఫోటో ఉన్న 77లక్షల రాళ్లను తొలగించాలంటే రూ.15కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తేల్చడం గమనార్హం. ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సాధ్యంకాదు. ఫోటో పిచ్చితో రూ.700కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిందని అంచనా.ఇది కాక విశాఖలో 500కోట్లతో రుషికొండపై కట్టిన రాజభవనం వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అయింది. ఇవి కాక విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు తాకట్టు పెట్టి జగన్ హయాంలో అప్పులు చేసారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వైసీపీ హయాంలో జరిగినతప్పులు, అవకతవకలు, ప్రజా ధనం స్వాహ వెలికితీయడానికే సమయం సరిపోవటంలేదు. రోజుకో కుంభకోణం బయట పడుతోంది. మరో పక్క ఆ ప్రభుత్వం చేసిన అప్పులతోనే సతమతమవుతోంది. కొత్త అప్పులు ఎలా చేయాలో అర్ధం కావడం లేదు.కేంద్రం మీద పూర్తిగా ఆధారపడలేదుగా.రోజువారీ ఖర్చులతో పాటు గ్యారెంటీల అమలు చేయాలంటే అప్పుచేయక తప్పదు. అభివృద్ధి చూపించి ఆ ఫలాలతో హామీలు నెరవేర్చుతామని ఎన్నికలలో చెప్పింది. అభివృద్ధి వెంటనే అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదుకదా. అది కనపడాలంటే ముందు పనులు జరగాలి. రాజధాని నిర్మాణం కావాలి. పోలవరం పూర్తి కావాలి. పరిశ్రమలు రావాలి. పెట్టు బడులు రావాలి. ఇప్పుడే బాలారీష్టాలు దాటటం కష్టంగా ఉన్న కూటమికి ఇవన్నీ ఎప్పటికీ సాధించాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. వచ్చే నెలలో అమ్మ ఒడి,రైతు భరోసా చెల్లించాల్సి ఉంది.స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. వరినాట్లు కూడా మొదలయ్యాయి.ముఖ్యంగా రైతు రుణాలు మంజూరు చేయించాలి.కౌలు రైతులకూ రుణాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిఉంది.మరి ప్రభుత్వం నిధులు ఎలా సమకూర్చు కుంటారో చూడాలి. దీనికి తోడు గోదావరి వరదలు కోనసీమను కుదిపేస్తున్నాయి.లక్షలాది మంది విరాశ్రయులైనారు. కూటమి ప్రభుత్వంలో నిధులులేక మంత్రులు సమీక్షలతో కాలం గడుపుతున్నారని తెలుస్తున్నది. ప్రభుత్వ కార్యకలాపాలు సక్రమంగా జరగాలంటే, గ్యారెంటీలూ అమలు కావాలంటే ఎదో విచిత్రం జరగదు. కానీ నిధుల సమీకరణకు ప్రణాళికలు యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాల్సి ఉంది.